ప్రశ్నాభాగం
◼ మనకిప్పుడున్న నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంతో ఒక గృహ బైబిలు పఠనాన్ని ఎంతకాలం నిర్వహించాలి?
క్రొత్తగా ఆసక్తిగల వారితో రెండు పుస్తకాలను పఠించేంత వరకు ఒక గృహ బైబిలు పఠనాన్ని కొనసాగించాలని గత కాలాల్లో సిఫారసు చేయబడింది. ఇప్పుడు మనకు జ్ఞానము అనే పుస్తకముంది, కావలికోట జనవరి 15, 1996 సంచికలోని 13, 14 పేజీల్లో ఇవ్వబడినట్లు ఈ పద్ధతిలో సవరింపు చేసుకోవడం యుక్తమైనదిగా కనిపిస్తుంది.
“నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వారు యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం పొందడానికి తాము ఎరిగి ఉండవలసినదానిని నేర్చుకోవడానికి వారికి సహాయం చేసేందుకు జ్ఞానము అనే పుస్తకం తయారు చేయబడింది. (అపొ. 13:48) కనుక, ఈ క్రొత్త పుస్తకాన్ని పూర్తి చేసిన తరువాత, అదే విద్యార్థితో రెండవ పుస్తకాన్ని పఠించవలసిన అవసరం లేదు. మీ బైబిలు విద్యార్థులు సత్యాన్ని హత్తుకోవడం మొదలుపెట్టినప్పుడు, యెహోవాసాక్షుల కూటాలకు హాజరు కావడం ద్వారా, అలాగే బైబిలును, వివిధ క్రైస్తవ ప్రచురణలను చదవడం ద్వారా వారు తమ జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకునేందుకు మీరు వారిని క్రమముగా ప్రోత్సహించవచ్చు.
మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకంలోని 175 నుండి 218 వరకున్న పేజీల్లోని ప్రశ్నలు మీకు బాగా పరిచయమున్నట్లయితే, అది సహాయకరంగా ఉండవచ్చు. మీరు ఈ ప్రశ్నలను మీ బైబిలు విద్యార్థికి సూచించకపోయినప్పటికీ, లేదా అతనితో పునఃసమీక్ష చేయకపోయినప్పటికీ, జ్ఞానము అనే పుస్తకంలో ఆ పాయింట్లను నొక్కిచెబితే బాగుంటుంది, పెద్దలు బాప్తిస్మ అభ్యర్థులతో ప్రశ్నలను పునఃసమీక్షించేటప్పుడు ప్రాథమిక బైబిలు సూత్రాలను గూర్చిన సరైన అవగాహనను వ్యక్తం చేసేందుకు విద్యార్థికి అది తోడ్పడుతుంది.
బైబిలు బోధలను బలపరచేందుకు, అబద్ధ సిద్ధాంతాలను ఖండించేందుకు జ్ఞానము అనే పుస్తకంలో ఉన్న సమాచారానికి అదనంగా వేరే సమాచారాన్ని తీసుకురావడం గాని, అదనపు వాదనలను చేయడం గానీ అవసరం లేదు. కేవలం పఠనం ఎక్కువ సమయానికి పొడిగించేందుకే ఇది సహాయపడుతుంది. బదులుగా, ఈ పుస్తకాన్ని చాలా త్వరగా, దాదాపు ఆరు నెలల్లోనే పూర్తి చేయవచ్చని ఆశించబడుతుంది. సమాచారాన్ని మనం ముందుగానే బాగా పఠించవలసిన అవసరతను ఇది నొక్కి చెబుతుంది, అలా మనం సమాచారాన్ని స్పష్టంగా, సంగ్రహంగా అందించగలుగుతాము. అలాగే విద్యార్థి కూడా ముందుగానే పఠించి, ఇవ్వబడిన లేఖనాలను చూసి, ప్రతి అధ్యాయంలోను పుస్తకం బోధిస్తున్నదేమిటో స్పష్టంగా గ్రహించేందుకు కృషి సల్పేలా అతనిని పురికొల్పాలి.
యెహోవాసాక్షులు కొద్ది కాల వ్యవధిలోనే ఫలవంతమైన అనేక బైబిలు పఠనాలను నిర్వహించవలసిన అవసరతను కావలికోట నొక్కి చెప్పింది. (యెష. 60:22 చూడండి.) జ్ఞానము అనే పుస్తకాన్ని ఫలవంతంగా ఉపయోగించడమనేది నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని సంపాదించేందుకు, దాని ప్రకారం చర్యను గైకొనేందుకు క్రొత్తవారికి సహాయపడుతుంది.—యోహా. 17:3.