క్రమ పయినీరు సేవలో ఇంకా ఎక్కువమంది సహోదరులు కావాలి
1 ‘ప్రభువు కార్యాభివృద్ధిలో ఎప్పటికిని ఆసక్తులై’ ఉండమని పౌలు మనలను ఉద్బోధించాడు. (1 కొరిం. 15:58) అనేకమందికి దీనర్థం క్రమ పయినీరు సేవను చేపట్టడమనే. ఇండియాలో ప్రతిసంవత్సరం, దాదాపు 100 మంది వ్యక్తులు క్రమ పయినీరు శ్రేణుల్లో చేరుతున్నారు!
2 ప్రస్తుతం, ఈ దేశంలో క్రమ పయినీర్లుగా సేవ చేస్తున్న వారిలో మూడింట రెండు వంతులమంది సహోదరీలే. (కీర్త. 68:11) ఎక్కువమంది సహోదరులు పూర్తికాల సేవకుల శ్రేణుల్లో చేరగలిగితే సంఘానికి ఎంత ఆనందదాయకంగా ఉంటుందో! (కీర్త. 110:3) అనేకమంది సహోదరులు భారమైన లౌకిక బాధ్యతలను, కుటుంబ బాధ్యతలను మోయాలన్న విషయం అర్థం చేసుకోగలిగినదే. సంఘం యొక్క ఆత్మీయ అవసరతల ఎడల శ్రద్ధ వహించడానికి ఇతరులు కూడా కష్టించి పనిచేస్తారు. రాజ్యం కొరకు ప్రయాసపడే ఈ మనుష్యులను మనం ప్రశంసిస్తున్నాము.—1 తిమో. 4:10.
3 అయినా, సహోదరులైన మీలో ఎక్కువమంది క్రమ పయినీరు సేవను చేపట్టగలరా? మీ భార్య పయినీరు చేస్తుంటే, మీరు ఆమెతో చేరగలరా? మీరు ఉద్యోగ విరమణ చేసినట్లైతే, మీ సమయాన్ని పూర్తికాల పరిచర్యలో గడపడం కంటే సంతృప్తికరమైన మార్గం ఇక లేదని మీరు ఒప్పుకోరా? మీరొకవేళ ఇప్పుడే పాఠశాల విద్య ముగిస్తున్నట్లైతే, అదనపు సేవాధిక్యతలకు ఒక మెట్టుగా క్రమ పయినీరు సేవను చేపట్టడానికి మీరు గంభీరమైన, ప్రార్థనాపూర్వకమైన తలంపును ఇచ్చారా?—ఎఫె. 5:15-17.
4 ఒక క్రమ పయినీరుగా సేవ చేయగలిగేలా వర్ధిల్లుతున్న వ్యాపారాన్ని ఒక సహోదరుడు అమ్మివేసి, స్వల్పకాలిక పనిని చేపట్టాడు. చక్కని ఆయన నాయకత్వంతో, ఆయన నలుగురు పిల్లలలో ముగ్గురు పాఠశాల విద్య ముగించిన వెంటనే క్రమ పయినీర్లు అయ్యారు. నాలుగవ బిడ్డ వారితో చేరాలని ఉత్సుకతను చూపించాడు. ఈ సహోదరుడు, ఈయన కుటుంబము బహుగా ఆశీర్వదించబడింది!
5 ఒక పెద్ద ద్వారం తెరిచి ఉంది: క్రమ పయినీరు సేవ, “కార్యకలాపానికి నడిపించే పెద్ద ద్వారము”ను తెరువగలదు. (1 కొరిం. 16:9, NW) క్రమ పయినీర్లు అయిన సహోదరులను సంఘంలో విస్తారంగా ఉపయోగించుకోవచ్చు. ఉత్సాహపూరిత ప్రాంతీయ సేవ వారి ఆత్మీయ ఉన్నతికి జతచేరి, వారి దైవపరిపాలన అభివృద్ధికి దోహదం చేయగలదు. క్రమ పయినీరింగు అదనపు సేవాధిక్యతలకు మార్గాన్ని తెరువగలదు. పయినీరింగు చేసిన మొదటి సంవత్సరం తరువాత, పయినీరు సేవా పాఠశాలకు హాజరయ్యే ఆశీర్వాదం ఉంది. ఒంటరి పరిచర్య సేవకులు, పెద్దలు పరిచర్య శిక్షణ పాఠశాలకు హాజరవ్వాలనే లక్ష్యాన్ని వెంబడించవచ్చు. సహోదరులు చివరికి ప్రయాణ పనికి అర్హతను పొందవచ్చు. అవును, క్రమ పయినీరు సేవ యెహోవా సంస్థలో ఈ గొప్ప సేవాధిక్యతలకు ద్వారాన్ని తెరుస్తుంది.
6 క్రమ పయినీరు సేవలో పాల్గొనేందుకు తమ వ్యవహారాలను చక్కదిద్దుకోగల సహోదరులు అధికంగా ఇవ్వడం ద్వారా వచ్చే ఆనందాన్ని అనుభవించవచ్చు.—అపొ. 20:35.