“మరి యెక్కువగా” కూటాలకు హాజరవ్వండి
1 కలిసి సమకూడడమనేది యెహోవా ప్రజలకు ఎల్లప్పుడూ ఎంతో ప్రాముఖ్యమైన విషయమైవుంది. సత్యారాధనకూ, దైవిక విద్యాభ్యాసానికీ, ఆనందమయ సహవాసానికీ కేంద్రాలుగా దేవాలయాన్నీ, సమాజ మందిరాల్నీ ఇశ్రాయేలీయులు కల్గివుండేవారు. అదేవిధంగా తొలి క్రైస్తవులు సమకూడడాన్ని మానుకోలేదు. ఈ క్లిష్టమైన అంత్యదినాల్లో ఒత్తిళ్లూ, శ్రమలూ పెరుగుతుండగా, మన సంఘకూటాలు అందించే ఆధ్యాత్మిక బలాన్ని పొందాల్సిన అవసరత మనకు కూడా ఉంది. అది మనకు “మరి యెక్కువగా” అవసరం. (హెబ్రీ. 10:24) మనం కూటాలకు ఎందుకు హాజరౌతామనడానికి గల మూడు కారణాల్ని గమనించండి.
2 సహవాసం నిమిత్తం: “యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగు జేయుడి” అని లేఖనాలు మనకు ఉద్బోధిస్తున్నాయి. (1 థెస్స. 5:11) దైవిక సహవాసం మన మనస్సుల్ని క్షేమాభివృద్ధికరమైన ఆలోచనలతో నింపి, మంచి పనులు చేసేలా మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ మనల్ని మనం వేరుగా ఉంచుకుంటే, మూర్ఖమైన, స్వార్థపూరితమైన, లేక చివరికి అనైతిక ఆలోచనల్ని కల్గివుండడానికి మనం మొగ్గుచూపుతాం.—సామె. 18:1.
3 ఉపదేశం పొందు నిమిత్తం: మన హృదయాల్లో దేవుని ప్రేమను సజీవంగా ఉంచడానికి రూపొందించబడ్డ నిరంతర బైబిలు ఉపదేశ కార్యక్రమాన్ని క్రైస్తవ కూటాలు అందిస్తాయి. అవి “దేవుని సంకల్పమంతయు [“సలహాలన్నింటినీ,” NW]” అన్వయించుకోవడంలో అభ్యాససిద్ధమైన నడిపింపును ఇస్తాయి. (అపొ. 20:27) బైబిలు సత్యాన్ని అంగీకరించబోయే వారిని కనుగొని వారికి సహాయపడే చెప్పనలవికాని ఆనందాన్ని అనుభవించడానికి ఇప్పుడు మరి యెక్కువగా అవసరమైన నైపుణ్యాలైన సువార్తను ప్రకటించి, బోధించే కళలో కూటాలు మనకు శిక్షణను ఇస్తాయి.
4 కాపుదల నిమిత్తం: ఈ దుష్ట ప్రపంచంలో, సంఘమొక నిజమైన ఆధ్యాత్మిక శరణాలయం అంటే ప్రేమా, శాంతులు తులతూగే ఆశ్రయం. మనం సంఘకూటాలకు హాజరైనప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” అనే ఫలాల్ని ఉత్పన్నం చేస్తూ, మనపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. (గల. 5:22, 23) కూటాలు విశ్వాసమందు స్థిరంగా నిలబడి దృఢంగా ఉండేలా మనల్ని బలపరుస్తాయి. రానైవున్న శ్రమల కొరకు సిద్ధపడేందుకు అవి మనల్ని సంసిద్ధుల్ని చేస్తాయి.
5 క్రమంగా కూటాలకు హాజరవ్వడం ద్వారా, కీర్తన 133:1, 3 వచనాల్లో కీర్తనల గ్రంథకర్త వర్ణించిన దీన్ని మనం అనుభవిస్తాం: “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” నేడు దేవుని ప్రజలు ఎక్కడ సేవచేసినా, ఎక్కడ కూడుకున్నా సరే, “ఆశీర్వాదమును శాశ్వత జీవమును . . . అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు.”