వేసవికాలం కొరకు మీ పథకాలు ఏమిటి?
1 మనకు లభ్యమౌతున్న సమయాన్ని మనం జ్ఞానయుక్తంగా షెడ్యూల్ వేసుకున్నప్పుడు, ఆమోదయోగ్యమైన మన లక్ష్యాల్ని మనం చేరుకొనే సాధ్యత ఎక్కువగా ఉంటుందనే విషయం వాస్తవం కాదంటారా? దైవపరిపాలనా ఆసక్తుల్ని పెంపొందించేందుకు వేసవికాలం వివిధ అవకాశాల్ని మనకు అందిస్తుంది. (సామె. 21:5) ఈ అవకాశాల్లో కొన్ని ఏవి?
2 వేసవికాలంలో మీ ప్రాంతీయ సేవా కార్యకలాపాన్ని విస్తృతపర్చుకోవడానికి ఎందుకు ప్రణాళిక వేసుకోకూడదు? సుదీర్ఘమైన పగటివేళలూ, పొడి వాతావరణమూ, మీరు ప్రకటనాపనిలో మరింత ఎక్కువ సమయాన్ని గడపడానికి వీలు కల్గించవచ్చు. వేసవికాలపు నెలల్లో ఏదొక నెలలోనో లేక అంతకన్నా ఎక్కువ నెలల్లోనో పిల్లలు సహాయ పయినీరు సేవ చేసే అవకాశాన్ని స్కూలు సెలవులు కలుగజేస్తాయి. ఐదు పూర్తి వారాంతాలు ఉండే ఆగస్టు నెలలో సహాయ పయినీరుసేవ చేసేందుకు ఇతరులు కూడా ముందుగానే ప్రణాళిక వేసుకోవచ్చు. మన సేవా సంవత్సరం ముగిసిపోతుండగా, ప్రతీ ఒక్కరూ పరిచర్యలో సాధ్యమైనంత పూర్తిస్థాయిలో పాల్గొనేందుకు ఈ ఆగస్టులో విశేషకృషి చేయబడుతుంది.
3 తమ టెరిటరీని పూర్తి చేయడంలో సహాయం అవసరమైన పొరుగు సంఘానికి మద్దతునిచ్చేందుకు మీరు ప్రణాళిక వేసుకుంటారా? మీ ప్రాంతంలో ఉన్న అవసరాల్ని గురించి ప్రాంతీయ పైవిచారణకర్త పెద్దలకు తెలియజేయగలడు. లేక, మీరు అర్హులైవుండి, అంతగా పనిచేయని లేక నియమించబడని (ఎసైన్చేయబడని) టెరిటరీని పూర్తి చేసేందుకు సొసైటీకి అప్లై చేయాలని మీరు అనుకొంటే, ఆ సాధ్యతల్ని గురించి మీ పెద్దలతో మాట్లాడండి. మీరు సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటుంటే, ఆ వెళ్లబోయే ప్రాంతంలో ఉన్న సంఘ కూటాలకు హాజరవడానికీ, అక్కడ ప్రాంతీయ సేవలో పాల్గొనడానికీ మీరు పథకం వేసుకోండి. యెహోవాసాక్షులుకాని బంధువుల్ని చూడ్డానికి మీరు వెళితే, వారితో సత్యాన్ని పంచుకొనే మార్గాల్ని గురించి ముందుగానే సిద్ధపడండి.
4 “దైవిక జీవిత మార్గము” అనే సమావేశము, మనమంతా మన ప్రణాళికల్లో చేర్చుకోవాల్సిన ఒక సంఘటనయై ఉంది. సమావేశం జరిగే మూడు రోజులూ తప్పిపోకుండా హాజరయ్యేలా ముందుగానే మీరు ఉద్యోగానికి లేక స్కూలుకి సెలవులు పెట్టుకోండి. మీరుండబోయే వసతి సౌకర్యాల విషయంలో రిజర్వేషన్లు చేసుకోండి, మీ ప్రయాణానికి ఏర్పాట్లు వీలైనంత త్వరగా చేసుకోండి.
5 వేసవి కొరకు మీ పథకాలేమిటి? నిస్సందేహంగా మీరు భౌతికంగా ఉపశమనం పొందాలని కోరుకుంటారు. కానీ మీ జీవితంలో రాజ్యాన్ని ముందుంచడంలో కొనసాగడం ద్వారా మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా శక్తిమంతుల్ని చేసుకునేందుకు ఉన్న అతి ప్రాముఖ్యమైన అవకాశాల్ని అలక్ష్యం చేయకండి.—మత్త. 6:33; ఎఫె. 5:15, 16.