కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/98 పేజీలు 3-6
  • యజమాని ఆస్తుల్ని జాగ్రత్తగా చూసుకోవడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యజమాని ఆస్తుల్ని జాగ్రత్తగా చూసుకోవడం
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవ గృహనిర్వాహకత్వం
  • ‘నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడు’
  • విధానంలో మార్పు
  • మారిన సంస్థానుగతమైన అవసరాలు
  • మదింపు చేయాల్సిన కారకాలు
  • ఆస్తుల్ని పరిరక్షించడం
  • నిషేధాజ్ఞల క్రింద బైబిలు సాహిత్యాన్ని ముద్రించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మీరు నమ్మకమైన గృహనిర్వాహకులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మీకు తెలుసా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • దేవుని మహిమార్థమై బైబిలు సాహిత్యాలను తయారు చేస్తున్నారు
    యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు
మన రాజ్య పరిచర్య—1998
km 6/98 పేజీలు 3-6

యజమాని ఆస్తుల్ని జాగ్రత్తగా చూసుకోవడం

1 బైబిలు కాలాల్లో గృహనిర్వాహకుడు నమ్మకమైన గొప్ప స్థానాన్ని కల్గివుండేవాడు. తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను చూసే పనిని అబ్రాహాము తన గృహనిర్వాహకునికి అప్పగించాడు. (ఆది. 24:1-4) నిజానికి, అబ్రాహాము వంశం నిరాటంకంగా కొనసాగడాన్ని రూఢిపర్చుకోవాల్సిన బాధ్యత ఆ గృహనిర్వాహకునికి ఉంది. ఎంత బరువైన బాధ్యత! “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము” అని అపొస్తలుడైన పౌలు చెప్పడంలో ఆశ్చర్యమేమీలేదు.—1 కొరిం. 4:2.

క్రైస్తవ గృహనిర్వాహకత్వం

2 బైబిల్లో, క్రైస్తవ పరిచర్యలోని కొన్ని రంగాలు గృహనిర్వాహకత్వానికి పోల్చబడ్డాయి. ఉదాహరణకు, “మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును [“గృహనిర్వాహకత్వమును,” అధస్సూచి చూడండి] గురించి మీరు వినియున్నారు” అని ఎఫెసీయులతో అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. (ఎఫె. 3:2; కొలొ. 1:25) అన్యజనులకు సువార్తను ప్రకటించే తన నియామకాన్ని ఆయన తాను నమ్మకంగా నిర్వర్తించాల్సిన ఓ గృహనిర్వాహకత్వంగా దృష్టించాడు. (అపొ. 9:15; 22:21) “సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి” అని అపొస్తలుడైన పేతురు తన అభిషిక్త సహోదరులకు రాశాడు. (1 పేతు. 4:9, 10; హెబ్రీ. 13:16) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు వస్తుదాయకంగా వేటిని కల్గివున్నా వాటిని వాళ్లు యెహోవా దేవుని కృపనుబట్టే కల్గివున్నారు. కాబట్టి, వాళ్లు వాటికి గృహనిర్వాహకులై ఉన్నారు, వాటిని క్రైస్తవ విధానంలో ఉపయోగించాల్సిన అవసరం ఉంది.

3 నేడు, యెహోవాసాక్షులకు కూడా అలాంటి దృక్పథమే ఉంది. యెహోవా దేవునికి తమను తాము వాళ్లు సమర్పించుకొన్నారు, తత్ఫలితంగా తమకున్న వాటినన్నింటినీ అంటే తమ జీవితాల్నీ, తమ శారీరక శక్తినీ, తమకున్న ఆస్తుల్నీ “దేవుని నానావిధమైన కృపవిషయమై[న]” ఫలాలుగా దృష్టిస్తారు. మంచి గృహనిర్వాహకులుగా, తాము వాటిని ఎలా ఉపయోగిస్తామనే విషయంలో యెహోవా దేవునికి లెక్కనప్పగించాల్సి ఉందని వాళ్లు భావిస్తారు. అంతేగాక, వారికి సువార్తను గూర్చిన జ్ఞానం ఇవ్వబడింది. ఇది, యెహోవా నామాన్ని ఘనపర్చేందుకూ, సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇతరులకు సహాయపడేందుకూ సాధ్యమైనంతమేరకు శ్రేష్ఠమైన రీతిలో ఉపయోగించాలని వాళ్లభిలషించే ఓ నమ్మకమైన బాధ్యతయై ఉంది.—మత్త. 28:19, 20; 1 తిమో. 2:3, 4; 2 తిమో. 1:13, 14.

4 గృహనిర్వాహకులుగా తమ బాధ్యతల్ని యెహోవాసాక్షులు ఎలా నిర్వర్తిస్తున్నారు? గత సంవత్సరంలోనే, వాళ్లు “రాజ్య సువార్త”ను ప్రకటించడంలో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకన్నా ఎక్కువ గంటల్ని వెచ్చించారనీ, ఆసక్తివున్న వ్యక్తులతో 45,00,000లకన్నా ఎక్కువ బైబిలు పఠనాల్ని నిర్వహించారనీ వార్షిక నివేదిక చూపిస్తోంది. (మత్త. 24:14) ప్రపంచవ్యాప్తంగా జరిగే పని కోసమూ, స్థానిక రాజ్యమందిరాలకు మద్దతునివ్వడానికి ఉదారమైన విరాళాలను ఇవ్వడం ద్వారా, ప్రయాణ పైవిచారణకర్తలకూ, మరితరులకూ ఆతిథ్యాన్ని ఇవ్వడం ద్వారా, ఎంతో అవసరంలో ఉన్న వారి ఎడల ఉదాహరణకు సాయుధ పోరాటాల బాధితుల ఎడల అసాధారణమైన దయను చూపించడం ద్వారా వాళ్లు యెహోవా దేవుని గృహనిర్వాహకులుగా తమ నమ్మకాన్ని చూపించారు. ఒక గుంపుగా నిజ క్రైస్తవులు, తమ యజమాని ఆస్తిని జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు.

‘నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడు’

5 గృహనిర్వాహకత్వమనేది వ్యక్తిగత స్థాయిలో మాత్రమేగాక సంస్థానుగతమైన స్థాయిలో కూడా ఉంది. భూమిపై ఉన్న అభిషిక్త క్రైస్తవ సంఘాన్ని ‘నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడని’ యేసు పిలిచాడు. (లూకా 12:42) ఈ ‘నమ్మకమైన గృహనిర్వాహకుని’ బాధ్యత ఏమిటంటే ‘ఆహారాన్ని’ పెట్టి, సువార్తను అంతర్జాతీయంగా ప్రకటించడంలో నాయకత్వాన్ని తీసుకోవడమే. (ప్రక. 12:17) దానికి సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా జరిగే పని కోసం వచ్చిన ఆర్థిక సంబంధమైన విరాళాలు ఉపయోగించబడే విధానానికి పరిపాలక సభ ద్వారా ప్రాతినిధ్యం వహించబడిన నమ్మకమైన గృహనిర్వాహక తరగతి బాధ్యత వహిస్తుంది. అలాంటి విరాళాలన్నీ నమ్మకంపై ఆధారపడి ఇచ్చినవే, మరి అవి ఉద్దేశించబడిన సంకల్పం కోసం ఉపయోగించబడ్డాయనీ, జ్ఞానయుక్తంగానూ, పొదుపుగానూ, ప్రభావవంతంగానూ వినియోగించబడ్డాయనీ రూఢిపర్చుకోవాల్సిన బాధ్యత ‘నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకునిదే.’

6 ఉదారంగా ఇవ్వబడిన విరాళాల్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించడానికొక ఉదాహరణ, ఈ 20వ శతాబ్ద కాలంలో యెహోవాసాక్షుల ముద్రణా కార్యకలాపాల్లో వచ్చిన పురోభివృద్ధిలో కనబడింది. బైబిళ్లనూ, బైబిలు సాహిత్యాల్నీ అంటే పత్రికల్నీ, పుస్తకాల్నీ, బ్రోషూర్లనూ, చిన్న పుస్తకాల్నీ, కరపత్రాల్నీ, రాజ్యవార్తనూ పంచిపెట్టడం, ఈ “అంత్యదినములలో” “సువార్త”ను వ్యాపింపచేయడంలో ఓ ప్రధానమైన పాత్రను నిర్వహించింది. (మార్కు 13:10; 2 తిమో. 3:1) కావలికోట పత్రిక, ‘దేవుని యింటివారికీ,’ వారి సహవాసులైన ‘వేరే గొఱ్ఱెలకు’ చెందిన ‘గొప్ప సమూహానికీ’ “తగినవేళ అన్నము”ను పెట్టడంలో ఒక ప్రధానమైన ఉపకరణంగా ఉంది.—ఎఫె. 2:19; మత్త. 24:45; యోహా. 10:16; ప్రక. 7:9.

7 మొదట్లో, యెహోవాసాక్షుల ప్రచురణలన్నీ వాణిజ్యపరమైన ప్రింటింగ్‌ ప్రెస్సుల్లో ముద్రించబడేవి. కానీ యెహోవా సేవకులు తమ ప్రచురణల్ని తామే ముద్రించుకుంటే ప్రచురణలు మరింత నాణ్యంగానూ, చౌకగానూ తయారౌతాయని 1920ల కాలంలో నిర్ణయాన్ని తీసుకొన్నారు. 1920వ సంవత్సరంలో ముద్రణాపని చిన్నగా ప్రారంభమై, ఎంతో విస్తృతమైనదిగా వృద్ధిచెందేంతవరకూ అది బ్రూక్లిన్‌, న్యూయార్క్‌లలో క్రమేణా పెరుగుతూ వచ్చింది. 1967 నాటికి ముద్రణా సౌకర్యాలు దాదాపు 28 ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించేంతగా వ్యాపించాయి. ముద్రణాపనిని ఇతర దేశాల్లో కూడా చేపట్టడం జరిగింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం మూలంగా దానికి అంతరాయం ఏర్పడింది.

8 అమెరికాలో ముద్రణా ప్రక్రియ వృద్ధిచెందినా, ప్రపంచమంతటికీ సప్లయ్‌ చేసేంతగా వృద్ధిచెందలేదు. కాబట్టి, యుద్ధానంతర సంవత్సరాల్లో, ఇంగ్లండ్‌, కెనడా, గ్రీస్‌, దక్షిణాఫ్రికా, పశ్చిమజర్మనీ, డెన్మార్క్‌, స్విట్జర్లాండ్‌లతో పాటూ అనేక ఇతర దేశాల్లో ముద్రణాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి లేదా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 1970ల తొలి సంవత్సరాల నాటికి, ఆస్ట్రేలియా, ఘానా, జపాన్‌, ఫిన్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌, బ్రెజిల్‌, నైజీరియాలు ఆ జాబితాలో చేర్చబడ్డాయి. ఈ దేశాల్లో కొన్ని బైండ్‌ పుస్తకాల్ని కూడా తయారు చేశాయి. అంతేగాక 1970ల తొలి సంవత్సరాల్లో, ముద్రణా నైపుణ్యాల్లో గిలియడ్‌ మిషనరీలు తర్ఫీదును పొందారు. వారిని, స్థానికంగా ఉన్న సహోదరులకు ముద్రణాపనిలో సహాయపడేందుకు ఆ దేశాలలోని కొన్నింటికి పంపించారు.

9 పందొమ్మిదివందల ఎనభైలలో, పత్రికలను ముద్రిస్తున్న దేశాల సంఖ్య 51కి చేరుకున్నాయి.a ఇదంతా కూడా చూపిస్తున్నట్లు, యజమానికి చెందిన ఆస్తులు ఎంత చక్కగా ఉపయోగించబడుతున్నాయో కదా! రాజ్యపని పురోభివృద్ధిని గూర్చి ఎంత దృఢమైన సాక్ష్యమో కదా! ‘తమ విలువైనవాటితో యెహోవాను ఘనపరచిన’ లక్షలాదిమంది యెహోవాసాక్షుల ఉదారమైన మద్దతుకిదెంత శక్తివంతమైన సాక్ష్యమో కదా! (సామె. 3:9, NW) యెహోవా తమను వేర్వేరు విధాలుగా ఆశీర్వదించడం మూలంగా సమకూడిన ఆస్తికి శ్రేష్ఠమైన గృహనిర్వాహకులుగా తమను తాము వాళ్లు ఆ విధంగా రుజువు చేసుకొన్నారు.

విధానంలో మార్పు

10 పందొమ్మిదివందల డెబ్బైలలో, 1980ల తొలి సంవత్సరాల్లో ముద్రణాపరమైన సాంకేతిక పరిజ్ఞానంలో గొప్ప పురోభివృద్ధి జరిగింది, యెహోవాసాక్షులు ఆ క్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించారు. ఇంతకు మునుపు, వాళ్లు సాంప్రదాయిక లెటర్‌ ప్రెస్‌ ముద్రణా విధానాన్ని ఉపయోగించేవారు. వాళ్లు అధునాతన ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌ను ఉపయోగించడం మొదలుపెట్టగా అది క్రమేణా కనుమరుగైపోయింది. తత్ఫలితంగా, రెండు రంగుల (నలుపు, మరొక రంగు) చిత్రాలకు అంటే పాత లెటర్‌ప్రెస్‌పై మాత్రమే ముద్రించడానికి వీలయ్యే రెండు రంగుల చిత్రాలకు బదులుగా నాలుగు రంగుల చిత్రాలతో అందమైన ప్రచురణలు తయారయ్యాయి. అంతేగాక, ప్రీప్రెస్‌ ఆపరేషన్‌ (ముద్రణకు ముందు జరిగే పని) అంతటినీ కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానం మార్చివేసింది. మల్టీలాంగ్వేజ్‌ ఎలక్ట్రానిక్‌ ఫోటోటైప్‌సెట్టింగ్‌ సిస్టమ్‌ (MEPS) అనే ఒక కంప్యూటర్‌ సిస్టమ్‌ను యెహోవాసాక్షులు తయారు చేశారు. అది 370 కన్నా ఎక్కువ భాషల్లో ముద్రణ జరగడానికి ఇప్పుడు సహాయపడుతోంది. అన్ని భాషల్లో పనిచేసే దాని సామర్థ్యానికి మరే ఇతర కమర్షియల్‌ ప్రోగ్రామ్‌ కూడా సాటిరాదు.

11 మెప్స్‌ కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతోనూ, ఎలక్ట్రానిక్‌ మెయిల్‌ వంటి మరితర క్రొత్త పరికల్పనలను ఉపయోగించడంతోనూ, తగినవేళకు ఆధ్యాత్మికాహారాన్ని తయారుచేయడంలో మరొక గొప్ప పురోభివృద్ధి సాధించబడింది. ఇంతకు మునుపు, పాత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఆంగ్లభాషేతర పత్రికలు తత్సంబంధిత ఆంగ్ల పత్రిక ముద్రించబడిన కొన్ని నెలల తర్వాతగానీ, లేదా ఓ సంవత్సరం తర్వాతగానీ లభ్యమయ్యేవికావు. ఇప్పుడు, కావలికోట 115 భాషల్లోనూ, తేజరిల్లు! 62 భాషల్లోనూ ఏకకాలంలో ముద్రించబడుతున్నాయి. వారం వారం జరిగే యెహోవా సాక్షుల కావలికోట పఠనానికి ప్రపంచవ్యాప్తంగా హాజరౌతున్నవారిలో 95 శాతంకన్నా ఎక్కువమంది ఒకే విధమైన సమాచారాన్ని ఏకకాలంలో పరిశీలిస్తున్నారని దీనర్థం. ఇదెంత ఆశీర్వాదకరమో కదా! ఆ క్రొత్త సాంకేతిక పరిజ్ఞానమంతటిపైనా పెట్టుబడి పెట్టడం యజమాని ఆస్తులను ఖచ్చితంగా శ్రేష్ఠమైన రీతిలో ఉపయోగించడమే అవుతుంది!

మారిన సంస్థానుగతమైన అవసరాలు

12 ఈ క్రొత్త ముద్రణా పద్ధతులు, యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త ముద్రణా కార్యకలాపాల సంస్థానుగత అవసరాల్ని మార్చివేశాయి. పాత లెటర్‌ప్రెస్‌ల కన్నా వెబ్‌ ఆఫ్‌సెట్‌ ప్రెస్‌లు ఎంతో వేగంగా పనిచేస్తాయి, కానీ వాటి ఖరీదు కూడా చాలా ఎక్కువే. రచనలు చేయడంలో, అనువాదంలో, ఆర్ట్‌లో, గ్రాఫిక్స్‌లో మరలాంటి సంబంధిత పనుల్లో సహాయపడే కంప్యూటర్‌ సిస్టమ్‌లు పాత సిస్టమ్‌లకన్నా ఎంతో మెరుగైన సేవల్ని అందిస్తున్నప్పటికీ, అవి కూడా ఎంతో ఖరీదైనవే. 51 దేశాల్లో పత్రికల్ని ముద్రించడమనేది ఇక ఎంతమాత్రం పొదుపుగా ఉన్నట్టు కనబడలేదు. అందుకే, 1990లలో, ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ పరిస్థితిని పునఃపరిశీలించాడు. దాని పర్యవసానం ఏమిటి?

13 ముద్రణాపనిని ఏకీకరణ చేస్తే, యెహోవాసాక్షులూ, వారి స్నేహితులూ ఉదారంగా ఇచ్చిన ‘విలువైన వాటిని’ మరింత ప్రభావవంతంగా ఉపయోగించ వచ్చని అధ్యయనాలు సూచించాయి. అందుకని ముద్రణాపనిని చేపట్టిన బ్రాంచ్‌ల సంఖ్య క్రమేణా తగ్గించబడింది. గతంలో తమ సొంత ముద్రణాలయాల్లో ముద్రణను నిర్వహించిన తూర్పు పశ్చిమ యూరప్‌లలోని కొన్ని దేశాలతోపాటుగా ఆ ఖండంలోని అనేక దేశాల కొరకు పత్రికల్నీ సాహిత్యాల్నీ ముద్రించే పనిని జర్మనీ చేపట్టింది. గ్రీస్‌, అల్బేనియాలతోపాటుగా ఆఫ్రికాలోని, ఆగ్నేయ యూరప్‌లోని కొన్ని ప్రాంతాలకు ఇటలీ సరఫరా చేస్తోంది. ఆఫ్రికాలో, పత్రికా ముద్రణ అనేది నైజీరియా, దక్షిణ ఆఫ్రికాలకు పరిమితం చేయబడింది. ముద్రణా సంబంధంగా అలాంటి ఏకీకరణే ప్రపంచవ్యాప్తంగా జరిగింది.

మదింపు చేయాల్సిన కారకాలు

14 జూలై 1998నాటికి ఆస్ట్రేలియా, గ్రీస్‌, నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాలతో పాటుగా యూరప్‌లోని అనేక దేశాల్లో పత్రికల ముద్రణాపని నిలిచిపోతుంది. యూరప్‌ దేశాలలోని ముద్రణాపని భారం ఇటలీ, జర్మనీ, ఫిన్‌లాండ్‌, బ్రిటన్‌, స్పెయిన్‌, స్వీడన్‌ దేశాలపై పడుతుంది. ఏ దేశాలు ముద్రణా పనిని కొనసాగిస్తాయి, ఏవి నిలిపివేస్తాయి అనే విషయం ఎలా నిర్ణయించబడింది? యజమాని ఆస్తుల్ని జ్ఞానయుక్తంగా చూసుకోవాలనే ఆదేశాన్ని మనస్సులో ఉంచుకొని, ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ ముద్రణాపనిని నిర్వహించే ప్రతీ దేశంలోనూ దానికయ్యే ఖర్చునూ, అలాగే దాని సంబంధిత పంపిణీ ఖర్చుల్నీ జాగ్రత్తగా మదింపు చేశాడు. చట్టపరంగా అత్యంత అనుకూలమైన పరిస్థితుల మధ్య ఏయే దేశాల్లో సాహిత్యాల్ని ముద్రించి, పంచిపెట్టవచ్చుననే విషయాన్ని తెలుసుకొనేందుకు అన్ని దేశాలకు చెందిన చట్టాలనూ మదింపు చేశాడు.

15 ముద్రణాపనిని కొన్ని దేశాల్లో నిలిపివేసి వాటిని ఇతర దేశాల్లో ఏకీకరణ చేయడానికిగల బలమైన కారణం ఆచరణాత్మకతే. ఒక దేశం అనేక దేశాల కోసం సాహిత్యాల్ని ముద్రించడమనేది ఎంతో అనుకూలంగా ఉంటుంది, మరి అలా చేయడం మూలంగా ఖరీదైన పరికరాలు వీలైనంత బాగా ఉపయోగించబడతాయి. ఖర్చులు తక్కువగా అయ్యే, ముద్రణా సంబంధిత మెటీరియల్స్‌ దొరికే, రవాణా (షిప్పింగ్‌) సదుపాయాలు బాగా ఉండే దేశాల్లో ఇప్పుడు ముద్రణాపని జరుగుతోంది. ఆ విధంగా, యజమాని ఆస్తులు సక్రమంగా ఉపయోగించబడుతున్నాయి. ఒక దేశంలో ముద్రణాపనిని నిలిపివేయడమంటే ఆ దేశంలో ప్రకటనాపనిని ఆపివేయడమని అర్థంకాదు. అక్కడ ముద్రణా సాహిత్యాలు ఇంకా సమృద్ధికరంగా లభ్యమౌతాయి, ఆ దేశాల్లో ఉన్న వేలాదిమంది యెహోవాసాక్షులు “సమాధాన సువార్తను” తమ పొరుగువారికి ఆసక్తిదాయకంగా తెలియజేస్తూనే ఉంటారు. (ఎఫె. 2:17) అంతేగాక, ఆర్థికసంబంధ ప్రయోజనాలనేగాక ఈ పునర్వ్యవస్థీకరణ ఏర్పాట్లు ఇతర ప్రయోజనాల్ని కూడా తీసుకొచ్చాయి.

16 పేర్కొనడానికొక ప్రయోజనం: గ్రీస్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్లలో ఉన్న అధునాతన ప్రింటింగ్‌ ప్రెస్సుల్లో అనేకం నైజీరియా, ఫిలిప్పీన్స్‌ దేశాలకు పంపించబడ్డాయి. ప్రెస్సులతోపాటూ వెళ్లి, ఆ ప్రెస్సుల్ని ఉపయోగించడంలో స్థానిక ఆపరేటర్లకు తర్ఫీదును ఇవ్వమన్న ఆహ్వానాన్ని యూరప్‌ దేశాల్లోని నిపుణులైన ప్రెస్‌ ఆపరేటర్లు అంగీకరించారు. అందుకే, ఆ దేశాలు ఇతర దేశాల్లాగానే ఇప్పుడు ఉన్నతశ్రేణి నాణ్యతగల పత్రికల్ని పొందుతున్నాయి.

17 మరో ప్రయోజనాన్ని పరిశీలించండి: పత్రికల్ని ముద్రించడానికయ్యే ఖర్చు కొన్ని దేశాలపై అంటే ముద్రణాపని ఏయే దేశాల్లో కొనసాగుతుందో ఆయా దేశాలపై ఇప్పుడు పడిపోయింది. తత్ఫలితంగా, ముద్రణాపని నిలిపివేయబడిన దేశాల్లోని వనరులు ఇప్పుడు మరితర ప్రయోజనాల కోసం అంటే రాజ్యమందిరాల్ని నిర్మించడమూ, బీద దేశాల్లో ఉన్న మన సహోదరుల అవసరాలను తీర్చడానికి సహాయపడడమూ వంటి ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి వీలైంది. ఆ విధంగా, యజమాని ఆస్తుల్ని జాగ్రత్తగా ఉపయోగించడమంటే కొరింథీయులకు అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటల్ని అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రభావవంతంగా అన్వయించడమే: “ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదుగాని . . . అందరికి సమానముగా ఉండు నిమిత్తము, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలె[ను].”—2 కొరిం. 8:13, 14, 15.

18 ఈ ముద్రణా ఏకీకరణ ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఇంతకు మునుపెన్నటికన్నా ఇప్పుడు మరింత సన్నిహితంగా అనుసంధానం చేయబడ్డారు. ఒకప్పుడు తమ పత్రికల్ని తాము ముద్రించుకోగల్గినప్పటికీ, ఇప్పుడవి జర్మనీలో ముద్రించబడడం డెన్మార్క్‌లో ఉన్న మన సహోదరులకు ఎంతమాత్రం ఒక సమస్యకాదు. జర్మన్‌ సహోదరులు తమ కోసం చేస్తున్న సేవనుబట్టి వారు కృతజ్ఞులై ఉన్నారు. డెన్మార్క్‌ కొరకూ—లేదా రష్యా, యుక్రేయిన్‌ల కొరకూ, మరితర దేశాల కొరకూ బైబిలు సాహిత్యాల్ని అందించడానికి తమ విరాళాలు ఉపయోగించబడుతున్నాయనే విషయాన్నిబట్టి జర్మనీలో ఉన్న యెహోవాసాక్షులు అయిష్టాన్ని వ్యక్తపరుస్తారా? ఎంతమాత్రంకాదు! ఆ దేశాల్లోని తమ సహోదరులు ఇచ్చిన విరాళాలు మరితర అత్యావశ్యక ప్రయోజనాల కోసం ఇప్పుడు ఉపయోగించబడతాయని తెలుసుకొనేందుకు వాళ్లు సంతోషిస్తున్నారు.

ఆస్తుల్ని పరిరక్షించడం

19 ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షుల ప్రతీ రాజ్యమందిరంలో “సొసైటీ ప్రపంచవ్యాప్త పని కొరకైన చందాలు—మత్తయి 24:14” అని రాయబడిన ఓ చందా బాక్స్‌ ఉంటుంది. ఆ బాక్సుల్లో వేసిన విరాళాలు, అవసరత ఉన్న చోట వాటిని ఉపయోగించడానికి లభ్యమౌతాయి. అవసరమైన పని కొరకు ఉపయోగించడానికి ఇచ్చే ఆ విరాళాలను ఎలా ఉపయోగించాలనే విషయాన్ని ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ నిర్ణయిస్తాడు. అందుకే, ఒక సంఘంలోని చందా బాక్స్‌లో వేసిన డబ్బు, బహుశ ఆ సంఘానికి వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో సంఘంలోని యెహోవాసాక్షుల కార్యకలాపాలకు మద్దతునివ్వడానికి ఉపయోగపడవచ్చు. తుపాన్లు, గాలివానలు భూకంపాలు, అంతర్యుద్ధాలు వంటి వాటి మూలంగా బాధల్ని అనుభవిస్తున్న తోటి విశ్వాసులకు అత్యవసర సహాయాన్ని అందించేందుకు చందాలు ఉపయోగించబడ్డాయి. మరి అలాంటి చందాలు దేశమందంతటా ప్రత్యేక పూర్తికాల సేవలో ఉన్న వారికి మద్దతునిచ్చేందుకు ఉపయోగించబడుతున్నాయి.

20 యెహోవాసాక్షుల సంఘాల్లో, సర్వసామాన్యంగా నెలకొక్కసారి మాత్రమే ఆర్థికపరమైన విషయాలు ప్రస్తావించబడతాయి—అదీ కొన్ని నిమిషాలు మాత్రమే. రాజ్యమందిరాల్లోగానీ, సమావేశాల్లోగానీ చందాలు పట్టబడవు. చందాల కొరకైన విజ్ఞాపనాపత్రాలు వ్యక్తులకు పంపబడవు. నిధులను సమకూర్చడానికి వ్యక్తుల్ని కూలికి తెచ్చుకోవడమనేది ఉండదు. సాధారణంగా, ప్రపంచవ్యాప్త పనికి మద్దతునిచ్చేందుకు Watch Tower Bible and Tract Societyకి చందాలను ఇవ్వాలను కొనేవాళ్లు ఎలా ఇవ్వవచ్చో వివరించే శీర్షిక కావలికోటలో కేవలం సంవత్సరానికి ఒకటి మాత్రం ఉంటుంది. తేజరిల్లు!లో సొసైటీ ఆర్థికపరమైన విషయాల్ని గూర్చిన క్రమమైన ప్రస్తావనేమీ ఉండదు. మరయితే, ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించే విస్తృతమైన పనీ, అవసరమైన రాజ్యమందిరాల్ని నిర్మించడమూ, ప్రత్యేక పూర్తికాల సేవలో ఉన్న వారికి మద్దతునివ్వడమూ, అవసరతలో ఉన్న క్రైస్తవులకు సహాయం చేయడమూ ఎలా నెరవేర్చబడుతున్నాయి? ఉదారంగా ఇచ్చే స్ఫూర్తితో యెహోవా తన ప్రజల్ని ఒక అద్భుతకరమైన రీతిలో ఆశీర్వదించాడు. (2 కొరిం. 8:2) ఈ సందర్భంగా ‘తమ విలువైన వాటితో యెహోవాను ఘనపరచడంలో’ ఓ భాగాన్ని కల్గివున్న వారందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ యజమాని ఆస్తులకు ఎడతెగకుండా కావలి కాస్తూనే ఉంటాడనే విషయంలో వాళ్లు దృఢ నిశ్చయతతో ఉండవచ్చు. ప్రపంచవ్యాప్త పనిని విస్తృతపర్చేందుకు చేయబడిన ఏర్పాట్లన్నింటినీ యెహోవా ఆశీర్వదించడంలో కొనసాగుతాడని మనం ప్రార్థిద్దాం.

[అధస్సూచి]

a ఈ దేశాల్లోని ఏడింటిలో, ముద్రణాపనిని వాణిజ్య సంస్థలు నిర్వహించేవి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి