కూటాల్లో వ్యాఖ్యానాలు చేస్తూ ఒకరినొకరు అభివృద్ధిపర్చుకోండి
1 హెబ్రీయులు 10:24లో, మనం ‘ప్రేమచూపేందుకూ, సత్కార్యములు చేసేందుకూ ఒకరినొకరు పురికొల్పుకోవాలని’ మనకు ఉద్బోధించబడుతుంది. ఇందులో సంఘ కూటాల్లో అర్థవంతమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఒకరికొకరు అభివృద్ధికి తోడ్పడడం ఇమిడి ఉంది. మనమెందుకు వ్యాఖ్యానం చేయాలి? మనమెలా చేయవచ్చు? దానివల్ల ప్రయోజనం పొందేదెవరు?
2 మీ అవగాహనను పెంచేటువంటి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచేటువంటి ఇతరులు చేసిన సరళమైన స్పష్టమైన వ్యక్తీకరణలు వినడం వల్ల మీరు ప్రయోజనం పొందిన అనేక పర్యాయాలను గురించి తలంచండి. ఇతరుల కోసం మీరు కూడా అలాగే చేసే ఆధిక్యత మీకుంది. మీరు అలా పాల్గొన్నప్పుడు, హాజరైనవారికందరికి ప్రోత్సాహమిచ్చేందుకు, ‘ఆత్మసంబంధమైన కృపావరమేదైనా ఇవ్వాలన్న’ మీ కోరికను మీరు ప్రకటించినవారౌతారు.—రోమా. 1:11, 12.
3 మంచి వ్యాఖ్యానాలను చేయడమెలాగంటే: పేరాలోని ప్రతి తలంపునూ చేర్చిన పొడవైన వ్యాఖ్యానాలు చేయకండి. చాలా పొడవైన వ్యాఖ్యానాలు చేస్తే, సాధారణంగా, నిర్దిష్ట జవాబేదో స్పష్టమూ కాదు, ఇతరులు పాల్గొనలేకపోయి నిరుత్సాహపడనూ వచ్చు. పేరాలో నుండి ఇచ్చే మొదటి వ్యాఖ్యానం క్లుప్తంగాను, ముద్రిత ప్రశ్నకు సూటైన జవాబుగానూ ఉండాలి. అదనపు వ్యాఖ్యానాలు ఇచ్చేవాళ్ళు ఆ సమాచారపు ఆచరణాత్మక అన్వయింపును చెప్పవచ్చు లేదా లేఖనాలు ఎలా అన్వయిస్తాయో చెప్పవచ్చు. పాఠశాల నిర్దేశక పుస్తకము 90-2 పేజీలను (ఆంగ్లం) చూడండి.
4 వ్యాఖ్యానం చేయాలన్న తలంపే మీకు కాస్త ఆదుర్దాను కలిగిస్తున్నట్లయితే, క్లుప్త వ్యాఖ్యానాన్ని ముందుగానే సిద్ధం చేసుకుని, ఆ పేరాలో మిమ్మల్ని అడగమని నిర్వాహకుడిని మీరు కోరవచ్చు. కొన్ని కూటాల వరకు అలా చేసిన తర్వాత, పాల్గొనడం సులభమౌతుంది. మోషే, యిర్మీయాలు బహిరంగంగా మాట్లాడే తమ సామర్థ్యం విషయంలో తమకు ఆత్మవిశ్వాసం లేదని ప్రకటించారని గుర్తుంచుకోండి. (నిర్గ. 4:10; యిర్మీ. 1:6) కాని తన పక్షాన మాట్లాడేందుకు యెహోవా వారికి సహాయపడ్డాడు. ఆయన మీకు కూడా సహాయపడతాడు.
5 మీ వ్యాఖ్యానాల నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు? మీరే ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే, మీ వ్యాఖ్యానాలు సత్యాన్ని మీ మనస్సుపైనా హృదయంపైనా మరింత గాఢంగా ముద్రించి, మీరు ఆ సమాచారాన్ని తర్వాత గుర్తుచేసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తాయి. అలాగే, అభివృద్ధిని కలుగజేసే మీ వ్యక్తీకరణలను వినే ఇతరులు కూడా ప్రయోజనం పొందుతారు. అందరూ, అనుభవజ్ఞులైనా, పిన్నవారైనా, బెరుగ్గా ఉండేవారైనా, లేదా క్రొత్తవారైనా సంఘ కూటాల్లో తమ విశ్వాసాన్ని వ్యక్తీకరించే ప్రయత్నాలు చేసినప్పుడు మనం ప్రోత్సహించబడతాం.
6 వ్యాఖ్యానాలను కూటాల్లో ఒకరికొకరు అభివృద్ధికి తోడ్పడేలా ఉపయోగించినప్పుడు “సమయోచితమైన మాట యెంత మనోహరము!” అని అనుకుంటామన్నది ఖచ్చితమే!—సామె. 15:23.