ప్రశ్నాభాగం
◼ సంఘకూటాల్లో ఎవరు ప్రార్థన చేయాలి?
మన ఆరాధనలో సంఘంలో చేసే ప్రార్థనకు ప్రముఖపాత్ర ఉంది. యెహోవా ఎదుట ఇతరులకు ప్రాతినిధ్యం వహించడం ఒక ప్రశస్తమైన ఆధిక్యత, గంభీరమైన బాధ్యత. దానికున్న ప్రాముఖ్యం దృష్ట్యా, కూటాల్లో ఏ సహోదరులు ప్రార్థన చేయాలో నిర్ణయించడానికి పెద్దలు సరైన వివేచనను ఉపయోగించడం అవసరం. సంఘానికి ప్రాతినిధ్యం వహించే బాప్తిస్మం తీసుకున్న సహోదరులు, మంచి మాదిరికరమైన వారిగా పేరుపొంది సంఘ గౌరవాన్ని సంపాదించుకున్న పరిణతి చెందిన క్రైస్తవ ప్రచారకులై ఉండాలి. వారు చేసే భక్తిపూర్వకమైన, గౌరవప్రదమైన ప్రార్థనలు యెహోవా దేవునితో వారికున్న మంచి సంబంధాన్ని బయల్పరచాలి. “ఇతరుల ఎదుట వినయ హృదయంతో ప్రార్థించుట” అనే మే 15, 1986 కావలికోట (ఆంగ్లం) శీర్షికలో ప్రత్యేకంగా సంఘం తరపున బహిరంగంగా ప్రార్థించే వారికి సహాయకరంగా ఉండే ప్రాముఖ్యమైన సూత్రాలను స్థూలంగా చెప్తుంది.
అనుమానాస్పదమైన లేక చెడు ప్రవర్తనగలవాడనే పేరున్న సహోదరుడిని పెద్దలు ప్రార్థించనివ్వరు. ఎప్పుడూ అసంతృప్తిపడుతూ ఉండే సహోదరుడినైనా లేక బహిరంగ ప్రార్థనలో వ్యక్తిగత విభేదాలను గూర్చి ప్రస్తావించే సహోదరుడినైనా ఎంపికచేయరు. (1 తిమో. 2:8) చిన్న వయస్కుడైన ఒక సహోదరుడు బాప్తిస్మం తీసుకున్నప్పటికీ, సంఘం తరపున ప్రార్థించేంత ఆధ్యాత్మిక పరిణతి ఆయనకు ఉందా లేదా అన్న విషయాన్ని పెద్దలు నిర్ణయించాలి.—అపొ. 16:1, 2.
ఎప్పుడైనా, క్షేత్రసేవ కొరకైన కూటంలో అక్కడున్న గుంపుకు ప్రాతినిధ్యం వహించేందుకు అర్హుడైన సహోదరుడు లేకపోతే బాప్తిస్మం తీసుకున్న సహోదరి ప్రార్థించవలసిన అవసరం ఏర్పడవచ్చు. అప్పుడు ఆమె సరైనవిధంగా తలమీద ముసుగు వేసుకోవలసి ఉంటుంది. క్షేత్రసేవ కొరకైన అలాంటి కొన్ని కూటాలకు అర్హతగల సహోదరుడు రాలేకపోవచ్చు అని తెలిస్తే, పెద్దలు అర్హతగల సహోదరిని నడిపింపునిచ్చేందుకు నియమించాలి.
సాధారణంగా బహిరంగ కూటాన్ని, ఛైర్మన్ ప్రార్థనతో ప్రారంభిస్తాడు. మిగిలిన సంఘకూటాల్లో, అర్హతగల సహోదరులు అనేకమంది ఉన్నప్పుడు, ప్రారంభ మరియు ముగింపు ప్రార్థనలు చేసేందుకు, కూటంలో మొదటిభాగాన్నీ ఆఖరిభాగాన్నీ నిర్వహిస్తున్న సహోదరులనుకాక ఇతర సహోదరులను ఆహ్వానించవచ్చు. ఏదేమైనప్పటికీ, సంఘకూటాల్లో ప్రార్థన చేయడానికి పిలువబడే వ్యక్తికి ముందుగానే తెలియజేయాలి, అప్పుడు ఏ విషయాల గురించి ప్రార్థన చేయాలనేది ఆయన ఆలోచించగలుగుతాడు. అప్పుడాయన ఆ నిర్దిష్టమైన కూటానికి సంగతమైన విధంగానూ హృదయపూర్వకంగానూ ప్రార్థన చేయగల్గుతాడు.
అలాంటి ప్రార్థనలు సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరంలేదు. సాధారణంగా ఒక సహోదరుడు బహిరంగంగా ప్రార్థించేటప్పుడు, లేచి నిలబడి సరైన స్వరంతో స్పష్టంగా మాట్లాడితే అందరికీ చక్కగా అర్థమౌతుంది. అలాగయితే, అక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరూ ఆ ప్రార్థనను విని, ఆఖరిన హృదయపూర్వకంగా “ఆమేన్!” అని చెప్పగలుగుతారు.—1 దిన. 16:36; 1 కొరిం. 14:16.