బైబిలు—సత్యం దొరికే నమ్మదగిన పుస్తకం
చరిత్రంతటిలో, వేర్వేరు నేపథ్యాలకు చెందిన ప్రజలు సత్యానికి సంబంధించి సరైన సమాచారం బైబిల్లో ఉందని నమ్మారు. నేడు లక్షలమంది దానిలో ఉన్న విషయాల్ని పాటిస్తున్నారు. కానీ, ఇతరులు మాత్రం బైబిల్లో ఉన్న సమాచారం మన కాలానికి సరిపోదని, అందులో కట్టుకథలే ఉన్నాయని అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? బైబిల్లో సత్యం కనుక్కోవడం సాధ్యమేనా?
మీరు బైబిల్ని ఎందుకు నమ్మవచ్చు?
బైబిల్ని నమ్మవచ్చని మీరు దేన్నిబట్టి నిర్ణయించుకోగలరు? ఇలా ఊహించుకోండి, ఎన్నో సంవత్సరాలుగా మీ స్నేహితుడు మీతో ఎప్పుడూ నిజమే మాట్లాడుతుంటే, మీరు ఆయనను నమ్మదగినవాడిగా చూస్తారు కదా. అయితే, బైబిలు కూడా ఒక నమ్మదగిన స్నేహితునిలా ఎప్పుడూ నిజమే చెప్తూ వచ్చిందా? కొన్ని ఉదాహరణలు గమనించండి.
నిజాయితీపరులైన రచయితలు
బైబిలు రచయితలు ఎంతో నిజాయితీపరులు. వాళ్లు తమ తప్పులు, లోపాల గురించి ఏమీ దాచకుండా రాశారు. ఉదాహరణకు, ఒక బైబిలు రచయిత అయిన యోనా, తాను ఒక సందర్భంలో దేవుని మాట వినలేదని స్వయంగా రాశాడు. (యోనా 1:1-3) యోనా తన పుస్తకం ముగింపులో దేవుడు తనను ఎలా గద్దించాడో రాశాడే గానీ, తన ఆలోచనా తీరును ఎలా మార్చుకున్నాడో రాసి తనను తాను గొప్ప చేసుకోలేదు. (యోనా 4:1, 4, 10, 11) బైబిలు రచయితలందరూ చూపించిన నిజాయితీని బట్టి వాళ్లు సత్యాన్ని ఎంతో ప్రాముఖ్యంగా ఎంచారని అర్థమౌతుంది.
పాటించదగిన సలహాలు
అన్ని విషయాల్లో ఉపయోగపడే సలహాలు బైబిల్లో ఉన్నాయా? ఖచ్చితంగా! ఉదాహరణకు, ఇతరులతో మంచి సంబంధాలు కాపాడుకోవడానికి సహాయపడే ఎలాంటి సలహాలు బైబిల్లో ఉన్నాయో చూడండి: “కాబట్టి ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించాలి.” (మత్తయి 7:12) “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.” (సామెతలు 15:1) నిజమే, బైబిలు సత్యాలు అవి రాయబడిన కాలం నుండి మనకాలం వరకు ఉపయోగపడేవిగా ఉన్నాయి.
చరిత్రపరంగా ఖచ్చితంగా ఉంది
సంవత్సరాలపాటు చేసిన తవ్వకాల్లో బయటపడిన ఆధారాల్ని బట్టి, బైబిల్లో చెప్పబడిన వేర్వేరు ప్రజలు, ప్రాంతాలు అలాగే అందులో ఉన్న సంఘటనలు నిజమేనని రుజువైంది. ఉదాహరణకు, ఒక చిన్న విషయానికి సంబంధించి దొరికిన ఆధారాన్ని పరిశీలించండి. దాదాపు 2,400 సంవత్సరాల క్రితం జీవించిన బైబిలు రచయిత అయిన నెహెమ్యా, యెరూషలేములో నివసిస్తున్న తూరు దేశస్థులు (తూరు నుండి వచ్చిన ఫేనీకే దేశస్థులు) ‘చేపల్ని, అన్నిరకాల సరుకుల్ని’ తీసుకొస్తున్నారని చెప్పాడు.—నెహెమ్యా 13:16, NW.
బైబిల్లో ఉన్న ఆ మాటలు నిజమనడానికి ఏదైనా ఆధారం ఉందా? ఉంది. పురావస్తుశాస్త్రజ్ఞులు, ఇశ్రాయేలు ప్రాంతంలో ఫేనీకేకి సంబంధించిన కొన్ని వస్తువుల్ని కనుగొన్నారు. దాన్నిబట్టి ఇశ్రాయేలు, ఫేనీకే దేశాల మధ్య వ్యాపారం జరిగిందని స్పష్టమౌతుంది. అంతేకాదు మధ్యధరా సముద్రపు చేపలు కొన్ని, యెరూషలేములో చేసిన తవ్వకాల్లో దొరికాయి. ఎంతో దూరంలో ఉన్న ఆ సముద్రం నుండి వ్యాపారస్థులే ఈ చేపల్ని తెచ్చి ఉంటారని పురావస్తుశాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. ఒక పండితుడు ఆ ఆధారాల్ని పరిశీలించాక, “తూరు దేశస్థులు యెరూషలేములో చేపల్ని అమ్మారని నెహె[మ్యా] 13:16లో చెప్పబడిన మాటలు నమ్మదగినవి” అని అన్నాడు.
సైన్స్‌పరంగా ఖచ్ఛితంగా ఉంది
బైబిల్లో ముఖ్యంగా దేవునికి సంబంధించిన విషయాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అయితే, సైన్స్‌కు సంబంధించి బైబిలు ఏమైనా చెప్తే అది ఖచ్చితంగానే ఉంటుంది. ఒక ఉదాహరణ చూడండి.
భూమి “శూన్యముపై” వేలాడుతోందని 3,500 సంవత్సరాల క్రితమే బైబిలు చెప్పింది. (యోబు 26:7) కానీ దానికి పూర్తి భిన్నంగా భూమి గురించి ఎన్నో కట్టు కథలు ఉండేవి. అంటే అది నీళ్ల మీద తేలుతుందని, ఒక పెద్ద తాబేలు దాన్ని మోస్తుందని ప్రజలు నమ్మేవాళ్లు. యోబు పుస్తకం రాయబడిన దాదాపు 1,100 సంవత్సరాల తర్వాత కూడా భూమి ఊరికే గాలిలో వేలాడడం అసాధ్యమని, దానికి ఖచ్చితంగా ఒక ఆధారం ఉండాల్సిందే అని ప్రజలు నమ్ముతూ వచ్చారు. దాదాపు 300 సంవత్సరాల క్రితం, అంటే 1687లో ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) గురించి తాను చేసిన పరిశోధనల్ని చెప్తున్నప్పుడు, కనిపించని అలాంటి శక్తుల వల్ల భూమి దాని కక్ష్యలో తిరుగుతుందని వివరించాడు. బైబిల్లో 3,000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితమే రాసిన మాటల్ని ఆయన పరిశోధనలు నిజమని నిరూపించాయి!
నెరవేరిన ప్రవచనాలు
బైబిల్లో ఉన్న ప్రవచనాలుa ఎంత ఖచ్చితంగా నెరవేరాయి? ఉదాహరణకు, బబులోను నగరం నాశనం గురించి యెషయా చెప్పిన ప్రవచనాన్ని గమనించండి.
ప్రవచనం: దాదాపు 2,800 సంవత్సరాల క్రితం, యెషయా అనే ఒక బైబిలు రచయిత బబులోను నాశనం అవుతుందని, చివరికి ఆ నగరం ఎవరూ నివసించని ప్రాంతంగా మారుతుందని చెప్పాడు. ఆ మాటలు చెప్పిన కొంతకాలం తర్వాతే బబులోను ఒక పెద్ద సామ్రాజ్యానికి రాజధాని అయ్యింది. (యెషయా 13:17-20) ఆ నగరాన్ని నాశనం చేసే రాజు పేరు కోరెషు అని కూడా యెషయా చెప్పాడు. ఆ నగరాన్ని కోరెషు ఎలా నాశనం చేస్తాడో కూడా చెప్తూ ‘నదులు ఎండిపోతాయి’ అని యెషయా రాశాడు. అలాగే, నగర తలుపులు తెరిచే ఉంటాయి అని ముందే చెప్పాడు.—యెషయా 44:27–45:1.
ఎలా నెరవేరింది? యెషయా ఆ మాటల్ని రాసిన 200 సంవత్సరాల తర్వాత, ఒక పర్షియా రాజు బబులోనుపై దాడి చేశాడు. ఆయన పేరు? కోరెషు. బలమైన ప్రాకారాలతో ఉన్న బబులోను నగరంలోకి ప్రవేశించడం చాలా కష్టం. కాబట్టి, కోరెషు ఆ నగరం గుండా అలాగే దాని చుట్టూ ప్రవహిస్తున్న యూఫ్రటీసు నదిని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. ఆయన తన మనుషుల చేత ఒక కాలువను తవ్వించి, నదిలోని నీళ్లను మళ్లించాడు. దానివల్ల నీళ్లు తగ్గిపోయాయి. అప్పుడు మోకాళ్లకు కాస్తపై దాకా ఉన్న నీళ్లలో కోరెషు, ఆయన సైన్యం నడుచుకుంటూ వెళ్లారు. ఆశ్చర్యకరంగా, నదికి ఎదురుగా ఉన్న పెద్ద తలుపుల్ని బబులోనీయులు తెరిచే ఉంచారు! దాంతో కోరెషు సైన్యం బబులోనులోకి ప్రవేశించి, దాన్ని ఓడించారు.
అయితే బబులోను ఎవరూ నివసించని ప్రాంతంగా మారుతుందని కూడా యెషయా రాశాడు. మరి, అది నెరవేరిందా? ఆ నగరాన్ని ఓడించాక వందల సంవత్సరాల వరకు ప్రజలు అక్కడే నివసించారు. కానీ ఇప్పుడు ఇరాక్ దేశంలోని బాగ్దాద్ దగ్గర్లో ఉన్న బబులోను, పాడుబడ్డ స్థితిలో ఉంది. దాన్ని చూస్తే ఆ ప్రవచనంలోని అన్ని వివరాలు నెరవేరాయని అర్థమౌతుంది. అవును, భవిష్యత్తు సంఘటనల గురించి బైబిలు చెప్పేది మనం నమ్మవచ్చు.
a ప్రవచనం అంటే దేవుని నుండి వచ్చే సందేశం. అది భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి చెప్తుంది. బైబిల్లో ఉన్న చాలా ప్రవచనాలు ఇప్పటికే నెరవేరాయి, కొన్ని ఇప్పుడు నెరవేరుతున్నాయి, ఇంకొన్ని భవిష్యత్తులో నెరవేరతాయి.