పూర్తికాల సేవలోని ఆనందాలు
1 ఒక యౌవనస్థుడిగా/యౌవనస్థురాలిగా మీరు మీ భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ఆలోచించే ఉంటారు. “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు” అని సామెతలు 21:5 మనకు చెబుతోంది. జీవితంలో మీ లక్ష్యాల గురించి గంభీరంగా ఆలోచించడం మీకు లాభకరం. మీరు మీ భవిష్యత్తు కొరకు పథకాలు వేసుకొంటుండగా, పూర్తికాల సేవ చేపట్టడం గురించి ఆలోచించండి. ఎందుకు అలా ఆలోచించాలి?
2 తమ యౌవనకాలంలో పయినీరు సేవ చేసిన కొంతమంది వయోజనుల అభిప్రాయాలను తెలుసుకోండి. వారందరూ తప్పకుండా ఒకే విషయం చెబుతారు: “అవి నా జీవితంలోని అత్యుత్తమమైన సంవత్సరాలు!” తన యౌవనం నుండే పూర్తికాల సేవలోని ఆనందాలను అనుభవించిన ఒక సహోదరుడు, తన తర్వాతి జీవితంలో ఇలా అన్నాడు: “నా యౌవన కాలం గురించి ఆలోచించి, ‘నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము’ అన్న జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని నేను లక్ష్యపెట్టాను అని చెప్పగలగడం గాఢమైన సంతృప్తికి మూలంగా ఉంది.” (ప్రసం. 12:1, 2) మీరు యౌవనస్థురాలిగా లేదా యౌవనస్థుడిగా ఉన్నప్పుడు ఇటువంటి ఆనందం అనుభవించడానికి వీలుగా మార్గాన్ని సుగమం చేసుకోవడానికి మీరు, మీ తల్లిదండ్రులు ఇప్పుడే జాగ్రత్తగా పథకం వేసుకోవాల్సిన అవసరముంది.
3 తల్లిదండ్రులారా, పూర్తికాల సేవను ప్రోత్సహించండి: శ్రద్ధగల తండ్రిగా యెహోవా, మీరు ఖచ్చితంగా ఏ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలో మీకు చూపిస్తాడు. (యెష. 30:21) ఇలాంటి ప్రేమపూర్వకమైన నడిపింపును అందించడంలో, క్రైస్తవ తల్లిదండ్రులైన మీకు తాను ఒక చక్కని మాదిరిని ఉంచుతాడు. తమకు ఏది మంచి మార్గమో ఎంపిక చేసుకోవడాన్ని మీ పిల్లలకే వదిలేసే బదులు, ఏ మార్గంలో వెళ్తే వారు యెహోవా ఆశీర్వాదాలు పొందుతారో ఆ మార్గంలో వెళ్ళేలా వారికి జ్ఞానయుక్తంగా శిక్షణనివ్వడం మంచిది. అప్పుడు, వారు పెరిగి పెద్దవారై నప్పుడు, “మేలు కీడులను వివేచించుటకు” మీ శిక్షణ వారికి సహాయపడుతుంది. (హెబ్రీ. 5:14) తమ సొంత వివేచనను నమ్మలేమని పెద్దవారు తమ అనుభవం ద్వారా తెలుసుకొన్నారు; తమ మార్గాలను సరాళము చేసుకోవడానికి వారు యెహోవా మీద ఆధారపడాలి. (సామె. 3:5, 6) జీవితంలో అంత అనుభవంలేని వారైన యౌవనస్థులకు ఈ అవసరం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
4 తల్లిదండ్రులారా, మీ పిల్లలు యౌవనస్థులవుతుండగా, లేదా అంతకంటే ముందే, వారి జీవితలక్ష్యాల గురించి వారితో ఆచరణాత్మకంగా మాట్లాడండి. పాఠశాల సలహాదారులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, వారిని లోకసంబంధమైన వస్తుదాయకమైన లక్ష్యాలను ఎంపిక చేసుకొనేలా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. రాజ్యాసక్తులను త్యజించకుండానే తమ నిత్యావసరాలను తీర్చుకోవడానికి ఉపయోగపడే ఆచరణాత్మకమైన శిక్షణను ఇచ్చే కోర్సులను ఎంపిక చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడండి. (1 తిమో. 6:6-11) చాలా సందర్భాల్లో, క్రమ పయినీరు పరిచర్య మొదలుపెట్టే ముందు తమ అవసరాల గురించి చక్కగా శ్రద్ధ తీసుకోవడానికి ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఆచరణాత్మకమైన శిక్షణను పొందడం లేదా ఏదైనా వృత్తిని నేర్చుకోవడం సరిపోవచ్చు.
5 అవివాహితులుగా ఉండడమనే బహుమానం కోసం పాటుపడమని యౌవనస్థులను ప్రోత్సహించండి. ఒకవేళ కొంతకాలం తర్వాత పెళ్ళి చేసుకోవాలని వారు నిర్ణయించుకుంటే, అప్పుడు వారు బరువైన వివాహ బాధ్యతలను స్వీకరించడానికి మరింత సంసిద్ధంగా ఉంటారు. పయినీరు సేవ గురించి, అవసరం ఎక్కువగా ఉన్న చోట సేవ చేయడం గురించి, బేతేలు సేవ గురించి అనుకూల దృక్పథంతో మాట్లాడడం ద్వారా, యౌవనస్థులలో చిన్నప్పటి నుంచే తమ జీవితాలను యెహోవాకు ఇష్టమైన విధంగా, ఇతరులకు ప్రయోజనకరమైన విధంగా, తమకు ఆనందాన్ని తెచ్చే విధంగా ఉపయోగించుకోవాలనే కోరికను పెంపొందింపజేయండి.
6 యౌవనస్థులారా, పూర్తికాల సేవను ముందుంచండి: యౌవనస్థులారా, పయినీరు సేవ ఎలా ఉంటుందోనని మీరు కంగారుపడనవసరం లేదు. విద్యా సంవత్సరమంతటిలో, అలాగే సెలవుల్లో వీలైనప్పుడల్లా సహాయ పయినీరు సేవను పార్ట్-టైమ్ ప్రాతిపదికన చేసి చూడవచ్చు. అప్పుడు, పయినీరు సేవ నిజంగా ఎంత సంతృప్తికరంగా ఉంటుందో మీకే తెలుస్తుంది! ఇప్పటి నుండి పాఠశాల సెలవులు అయిపోయే సమయం వరకు ఉన్న మధ్యకాలంలో పయినీరు సేవ చేయడానికి మీరు ముందుగా పథకం వేసుకోగలరా?
7 దేవుని సంస్థలో మీరు ఒక యౌవన సహోదరుడైతే, పరిచర్య సేవకునిగా సేవ చేయడానికి యోగ్యత సంపాదించుకోవడం గురించి కూడా గంభీరంగా ఆలోచించండి. (1 తిమో. 3:8-10, 12) అంతేకాకుండా, తగినంత వయస్సు వచ్చిన వెంటనే మీరు బేతేలు సేవ కొరకు దరఖాస్తు నింపాలనుకుంటారా లేక మినిస్టీరియల్ ట్రెయినింగ్ స్కూలుకు హాజరవ్వాలనుకుంటారా నిర్ణయించుకోండి. పయినీరు సేవలో మీ అనుభవం, ఒక క్రమమైన దినచర్యను ఎలా కలిగివుండవచ్చు, మీ వ్యక్తిగత వ్యవస్థీకరణను ఎలా మెరుగుపరచుకోవాలి, ఇతరులతో ఎలా సర్దుకుపోవాలి, బాధ్యతా భావాన్ని ఎలా పెంపొందించుకోవాలి వంటి విలువైన పాఠాలను మీకు నేర్పిస్తుంది. ఇవన్ని కూడా తర్వాత వచ్చే ఇంకా గొప్ప సేవాధిక్యతల కొరకు మిమ్మల్ని సిద్ధం చేస్తాయి.
8 దేవుని సేవకు సంబంధించిన విషయాలలో కష్టపడి పనిచేసే వైఖరిని ప్రదర్శించడమే పూర్తికాల సేవలో విజయం సాధించడానికి ముఖ్య కీలకం. అపొస్తలుడైన పౌలు అటువంటి వైఖరినే ప్రోత్సహించాడు, దాని ఫలితంగా వచ్చే ఆశీర్వాదాల గురించి కూడా ఆయన చెప్పాడు: “ప్రభువువలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది . . . ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.” (కొలొ. 3:23, 24) పూర్తికాల సేవలో ఎన్నో ఆనందాలు పొందగలిగేలా యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక!