యెహోవా ఆశ్చర్యకార్యాల గురించి నిరంతరం తెలియజేస్తుండండి
1. మీరు ప్రత్యేకించి గొప్పవిగా భావించే యెహోవా ఆశ్చర్యకార్యాల్లో కొన్ని ఏవి?
1 మన గొప్ప దేవుడైన యెహోవాకు ఎవరూ సాటిరారు! దావీదు ఇలా వ్రాశాడు: “యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. . . . నీకు సాటియైనవాడొకడును లేడు.” (కీర్త. 40:5) యెహోవా ఆశ్చర్యకార్యాల్లో విశ్వ సృష్టి, మెస్సీయా రాజ్యం, తన ప్రజల పట్ల ప్రేమపూర్వక దయతో చేసిన క్రియలు, ప్రపంచవ్యాప్త ప్రకటనోద్యమం కూడా ఉన్నాయి. (కీర్త. 17:7, 8; 139:14; దాని. 2:44; మత్త. 24:14) మనకు యెహోవా పట్ల ఉన్న ప్రేమ, ఆయన చేసిన వాటన్నింటి పట్ల ఉన్న కృతజ్ఞత ఆయన గురించి ఇతరులకు చెప్పేందుకు మనల్ని పురికొల్పుతాయి. (కీర్త. 145:5-7) మనం ఈ విధంగా ఆయన గురించి మరింత సమగ్రంగా చెప్పే సదవకాశం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మనకు ఉంటుంది.
2. సహాయ పయినీరు సేవ చేయడం ద్వారా మనం వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం పొందుతాము?
2 ఒక సహాయ పయినీరుగా: ఈ ప్రత్యేక కార్యకలాపాల నెలల్లో ఒకటి లేక అంతకంటే ఎక్కువ నెలలు పరిచర్యలో 50 గంటలు గడిపే విధంగా మీరు పట్టిక వేసుకోగలరా? మీ దైనందిన కార్యక్రమంలో ఏ మార్పులు చేసుకున్నా అవి విలువైనవే అనడంలో సందేహం లేదు. (ఎఫె. 5:16) చాలామంది తమ పరిచర్య నాణ్యతను మెరుగుపరచుకోవడానికి సహాయ పయినీరు సేవ దోహదపడుతుందని తెలుసుకున్నారు. వారు గుమ్మం దగ్గర మరింత సుళువుగా మాట్లాడగలిగారు, బైబిలు ఎక్కువ ఉపయోగించారు. పరిచర్యలో ఎక్కువ సమయం గడపడం వల్ల ఆసక్తిగలవారు ఎవరైనా ఉంటే వారిని మళ్ళీ కలుసుకోవడం సులభమవుతుంది. అంతకుముందు బైబిలు అధ్యయనం నిర్వహించని కొందరు సహాయ పయినీరు సేవా సమయంలో ఒక అధ్యయనం ప్రారంభించారు. సహాయ పయినీరు సేవలో మనం ఇతరులకు సహాయం చేయడం ఉంటుంది కాబట్టి, అదొక సంతోషభరితమైన కార్యరంగం.—అపొ. 20:35.
3. కొందరు కష్ట పరిస్థితుల్లో కూడా సహాయ పయినీరు సేవ ఎలా చేయగలిగారు?
3 మీరు పయినీరు సేవ చేయడానికి మీ పరిస్థితులు అనుకూలించవని తొందరపడి ఓ నిర్ధారణకు రాకండి. ఇద్దరు పిల్లలు, పూర్తికాలపు ఉద్యోగం ఉన్న ఒక పెద్ద పోయిన సంవత్సరం సహాయ పయినీరు సేవ చేశాడు. ఎప్పుడూ పనిరద్దీలో ఉండే ఆ సహోదరుడు ఎలా చేయగలిగాడు? వారంలోని మిగతా రోజుల్లో ఆయన పని చేస్తాడు కాబట్టి, వారాంతాల్లో సేవలో ఎక్కువ సమయం గడిపేలా ఆయన ప్రణాళిక వేసుకున్నాడు, శనివారాలు ఉదయం 7 గంటలకు వీధి సాక్ష్యంతో ప్రారంభించేవాడు. అటువంటి పరిస్థితులే ఉన్న సంఘంలోని మరికొందరు కూడా పయినీరు సేవ చేశారు, వారు ఒకరికొకరు మద్దతునిచ్చుకున్నారు, ప్రోత్సహించుకున్నారు. మరొక సంఘంలో 99 ఏండ్ల ఒక సహోదరి, తన కూతురు తనతోపాటు రమ్మని ఆహ్వానించిన తర్వాత మే నెలలో పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకుంది. వృద్ధురాలైన ఈ సహోదరి ఇంటింటికి, బైబిలు అధ్యయనాలకు వెళ్ళేందుకు వీలుగా ఆమె చక్రాల కుర్చీని తోయడం ద్వారా సంఘంలోని ఇతరులు ఆమెకు సహాయం చేశారు. ఆమె టెలిఫోన్ సాక్ష్యంలోను, వీధి సాక్ష్యంలోను, ఉత్తరాలు వ్రాయడంలోను పాల్గొంది. ఇది కేవలం యెహోవా సహాయం వల్లనే నెరవేరింది కానీ తన సొంత శక్తితో కాదని ఆమె గట్టిగా నమ్మింది.—యెష. 40:29-31.
4. సహాయ పయినీరు సేవకు పట్టిక తయారు చేసుకునేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు?
4 మీ పరిస్థితులకు చక్కగా సరిపోయే ఒక పట్టికను వేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సంచికలోని నమూనా పట్టికలు సహాయకరంగా ఉండవచ్చు. మీరు పూర్తి కాలపు ఉద్యోగం చేస్తున్నారా లేక స్కూలుకు వెళ్తున్నారా? ముఖ్యంగా వారాంతాల్లో ఉపయోగపడే పట్టిక మీకు ఎక్కువ ఆచరణాత్మకంగా ఉంటుంది. మీకు ఆరోగ్య సమస్యలుండి, రోజులో ఎక్కువ సమయం పరిచర్యలో గడిపేందుకు మీ శక్తి అనుకూలించనట్లయితే, ప్రతిరోజు కొద్ది సమయమే అవసరమయ్యే పట్టిక మీకు బాగుంటుండవచ్చు. పయినీరు సేవ చేయాలనే మీ కోరిక గురించి ఇతరులతో మాట్లాడండి. బహుశా వాళ్ళు కూడా దాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు.
5. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో యౌవనులు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు?
5 యువత పాల్గొనే విధానాలు: యౌవనులు తన ఆశ్చర్యకార్యాల గురించి చెప్పినప్పుడు యెహోవా సంతోషిస్తాడు. (కీర్త. 71:17; మత్త. 21:16) మీరు బాప్తిస్మం పొందిన యౌవనులైతే, బహుశా మీ స్కూలు సెలవుల్లో ఒక నెల సహాయ పయినీరు చేయవచ్చు. ఒకవేళ మీరు సహాయ పయినీరు సేవ చేయలేకపోతే, ఈ నెలల్లో ఎక్కువగా పాల్గొని మీ పరిచర్య నాణ్యతను మెరుగుపరచుకోవడానికి నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకోగలరా? మీరు మీ తల్లిదండ్రులతో పరిచర్యలో పాల్గొంటూ ఇంకా బాప్తిస్మం పొందని ప్రచారకులు కానట్లయితే, ఆ అర్హత పొందే ప్రయత్నానికి ఇది మంచి సమయం. బైబిలు ప్రశ్నలకు జవాబులివ్వడంలో మీకు మంచి నైపుణ్యత ఉండాలని లేదా బాప్తిస్మం పొందిన పెద్దవారికి తెలిసినంతగా మీకూ తెలిసుండాలని భావించకండి. మీరు బైబిలు ప్రాథమిక బోధనలను అర్థం చేసుకున్నారా? మీరు బైబిలు నైతిక ప్రమాణాలను అంటిపెట్టుకొని ఉంటున్నారా? మీరొక యెహోవాసాక్షిగా గుర్తించబడాలని కోరుకుంటున్నారా? అయితే ఈ విషయం గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. మీకు కావలసిన అర్హతలు ఉన్నాయో లేవో చూసేందుకు వారు మీతోపాటు పెద్దలను సంప్రదించే ఏర్పాటు చేస్తారు.—మన పరిచర్య పుస్తకంలో 98-9 పేజీలు చూడండి.
6. బైబిలు విద్యార్థులు సువార్త ప్రచారకులు అయ్యేందుకు మనం ఎలా సహాయం చేయవచ్చు?
6 ప్రకటించడానికి ఇతరులకు సహాయం చేయడం: ప్రగతి సాధిస్తున్న బైబిలు విద్యార్థులు రానున్న ప్రత్యేక కార్యకలాపాల నెలల్లో ప్రచారకులుగా మనతో పాల్గొనేందుకు అర్హత పొందవచ్చు. ప్రగతి సాధిస్తున్న బైబిలు విద్యార్థి మీకు ఉన్నట్లయితే, మీ పుస్తక అధ్యయన పైవిచారణకర్తను గానీ సేవా పైవిచారణకర్తను గానీ సహాయం అడగండి. వారిలో ఒకరు మీతోపాటు అధ్యయనంలో పాల్గొని విద్యార్థి ప్రగతిని అంచనా వేస్తారు. విద్యార్థి అర్హత పొంది, ప్రచారకుడు కావాలని కోరుకుంటే, సంఘ పైవిచారణకర్త మిమ్మల్ని మీ విద్యార్థిని ఇద్దరు పెద్దలు కలిసే ఏర్పాటు చేస్తాడు. (నవంబరు 15, కావలికోట, [ఆంగ్లం] 1988 17వ పేజీ చూడండి.) విద్యార్థి ఆమోదం పొందిన తర్వాత, ఆయనకు పరిచర్యలో శిక్షణ ఇవ్వడాన్ని వెంటనే ప్రారంభించండి.
7. క్రమంగా హాజరుకాని ప్రచారకులకు, నిష్క్రియులైన ప్రచారకులకు ఎలా సహాయపడవచ్చు?
7 పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు తమ గుంపులో ఎవరైనా నిష్క్రియులు లేక క్రమంగా హాజరుకానివారు ఉంటే వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. పరిచర్యలో మీతోపాటు పనిచేయడానికి వ్యక్తిగతంగా వారిని ఆహ్వానించండి. వారు చాలాకాలం నుండి నిష్క్రియులుగా ఉంటున్నట్లయితే, వారు అర్హులో కాదో చూసేందుకు ఇద్దరు పెద్దలతో మాట్లాడడం సముచితంగా ఉంటుంది. (నవంబరు 2000 మన రాజ్య పరిచర్య ప్రశ్నా భాగం చూడండి.) సంఘం ఈ ప్రత్యేక కార్యకలాపాల నెలల్లో చూపించే ఆసక్తి, వారు పరిచర్యను మళ్ళీ తమ జీవితంలోని క్రమబద్ధమైన చర్యగా చేసుకునేందుకు పురికొల్పవచ్చు.
8, 9. ప్రత్యేక కార్యకలాపాల కోసం ఉత్సాహాన్ని వృద్ధి చేసేందుకు పెద్దలు ఏమి చేయవచ్చు?
8 అధిక కార్యకలాపాలకు ఇప్పుడే సిద్ధపడండి: పెద్దలారా, సహాయ పయినీరు కోసం సంఘంలో ఉత్సాహాన్ని వృద్ధి చేయడం ఇప్పుడే ప్రారంభించండి. మీరు మీ సానుకూలమైన వ్యాఖ్యానాల ద్వారా, మంచి మాదిరి ద్వారా ఎంతో చేయవచ్చు. (1 పేతు. 5:3) గతంలో మీ సంఘంలోని సహాయ పయినీర్ల శిఖరాగ్ర సంఖ్య ఎంత? దాన్ని ఈ సంవత్సరం అధికం చేయవచ్చా? పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు, వారి సహాయకులు తమ గుంపులోని వారందరూ తమ తమ కార్యకలాపాలను అధికం చేసుకునేలా ప్రోత్సహించేందుకు మార్గాలు వెతకాలి. సేవా పైవిచారణకర్తలు క్షేత్రసేవ కోసం అదనపు కూటాల పట్టిక వేయవచ్చు. ఏర్పాటు చేసినదాన్ని సంఘానికి ముందస్తుగా తెలియజేయండి. సమర్థులైన ప్రచారకులు సారథ్యం వహించేందుకు నియమించబడేలా, క్షేత్రసేవ కూటాలు సమయానికి ఆరంభమై ముగిసేలా జాగ్రత్తవహించండి. (సెప్టెంబరు 2001 మన రాజ్య పరిచర్య ప్రశ్నా భాగం చూడండి.) సేవా పైవిచారణకర్త సరిపడేంత క్షేత్రాన్ని, పత్రికలను, సాహిత్యాలను కూడా ఏర్పాటు చేయాలి.
9 గత సంవత్సరం ఒక సంఘంలోని పెద్దలు ఉత్సాహంగా ప్రారంభించారు, సహాయ పయినీరు సేవను ప్రోత్సహించేందుకు వారిలో చాలామంది చాలా ముందుగానే దరఖాస్తులు ఇచ్చారు. వారు క్షేత్రసేవ కోసం అదనపు కూటాలను ఏర్పాటు చేశారు, ఒకటి ఉదయం 5:30కు వీధి సాక్ష్యం కోసం మరొకటి మధ్యాహ్నం 3:00కు స్కూలు నుండి వచ్చేవారి కోసం, మూడవది సాయంత్రం 6:00కు ఉద్యోగం నుండి వచ్చేవారి కోసం. అదనంగా, క్షేత్రసేవ కోసం శనివారాల్లో మూడు కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ నెలలో 66 మంది సహాయ పయినీరు సేవలో చేరడం ద్వారా సంఘం స్పందించింది!
10. తమ కార్యకలాపాలను అధికం చేసుకోవడానికి కుటుంబాలు ఎలా సిద్ధపడవచ్చు?
10 రానున్న నెలల్లో వాస్తవికమైన లక్ష్యాల కోసం మీ తదుపరి కుటుంబ అధ్యయనంలో కాస్త సమయాన్ని ఎందుకు కేటాయించకూడదు? మంచి సహకారంతో, పథకంతో బహుశా కుటుంబంలోని కొందరు లేక అందరు సహాయ పయినీరు సేవ చేయవచ్చు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మామూలుగా మీరు కేటాయించే సేవా సమయాన్ని అధికం చేసుకోవడం ద్వారా లేదా అదనంగా ఇతర సమయాల్లో కూడా వెళ్ళడం ద్వారా మీ కార్యకలాపాలను అధికం చేసుకునే లక్ష్యాలను పెట్టుకోండి. కుటుంబమంతా దీన్ని ఒక ప్రార్థనాంశంగా చేయండి. మీ ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడని మీరు దృఢనమ్మకంతో ఉండవచ్చు.—1 యోహా. 3:22.
11. (ఎ) క్రీస్తు బలి ఎలాంటి ఆశ్చర్యకార్యాలను నెరవేర్చింది? (బి) స్థానిక జ్ఞాపకార్థ ఆచరణ ఎక్కడ, ఏ సమయములో జరుగుతుంది?
11 దేవుని అత్యంత ఆశ్చర్యకార్యం: యెహోవా ప్రేమకు అత్యంత గొప్ప వ్యక్తీకరణ ఏమిటంటే మన కోసం విమోచన క్రయధనంగా తన కుమారుణ్ణి బహుమతిగా ఇవ్వడం. (1 యోహా. 4:9, 10) విమోచన క్రయధన బలి మానవాళిని పాపమరణాల నుండి విముక్తి చేసేందుకు కావలసిన న్యాయమైన ఆధారాన్నిచ్చింది. (రోమా. 3:23, 24) యేసు చిందించిన రక్తం కొత్త నిబంధనను స్థిరీకరించింది, అది అపరిపూర్ణులైన మానవులకు దేవుని కుమారులుగా దత్తత చేసుకోబడి పరలోక రాజ్యంలో పరిపాలించే ఉత్తరాపేక్షను సాధ్యం చేసింది. (యిర్మీ. 31:31-34; మార్కు 14:24) ప్రాముఖ్యంగా, పరిపూర్ణ విధేయతతో గడిపిన యేసు జీవిత విధానం యెహోవా నామమును ఘనపరచింది. (ద్వితీ. 32:4; సామె. 27:11) ఏప్రిల్ 4, ఆదివారం సూర్యాస్తమయం తర్వాత క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తారు.
12. ప్రభువు రాత్రి భోజన ఆచరణకు హాజరుకావడం ఆసక్తిగలవారికి ఎలా ప్రయోజనం కాగలదు?
12 ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించడం యెహోవా ఆశ్చర్యకార్యాలను మహిమపరుస్తుంది. ప్రసంగం బలి ఏర్పాటు ద్వారా యెహోవా చేసినదానిపట్ల మన అవగాహనను, కృతజ్ఞతను పెంచుతుంది. హాజరైనవారిలోని ఆసక్తిగలవారు దేవుని ఇతర ఆశ్చర్యకార్యాలను గమనించగలుగుతారు. తన ప్రజలు ప్రదర్శించేందుకు యెహోవా వారికి బోధించిన ఐక్యత, ప్రేమలను వారు చూడగలుగుతారు. (ఎఫె. 4:16, 22-24; యాకో. 3:17, 18) చాలా ముఖ్యమైన ఈ సందర్భంలో హాజరుకావడం ఒక వ్యక్తి ఆలోచనపై నిజంగా గట్టి ప్రభావం చూపిస్తుంది, కాబట్టి మనం ఎంతమంది సాధ్యమైతే అంతమంది హాజరుకావాలని కోరుకుంటాం.—2 కొరిం. 5:14, 15.
13, 14. జ్ఞాపకార్థ ఆచరణకు మనం ఎవరిని ఆహ్వానించాలి, ఎలా ఆహ్వానించాలి?
13 హాజరుకావడానికి ఇతరులను ఆహ్వానించడం: ఆహ్వానించదలచుకున్నవారి లిస్టు తయారుచేయడం వెంటనే ప్రారంభించండి. మీ లిస్టులో అవిశ్వాసులైన కుటుంబ సభ్యులు, పొరుగువారు, ఉద్యోగస్థలంలోని లేదా స్కూల్లోని పరిచయస్థులు, గతంలోని బైబిలు విద్యార్థులు, ప్రస్తుతపు బైబిలు విద్యార్థులు, మీరు పునర్దర్శనాలకు వెళ్లేవారు ఉండాలి. పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు తమ లిస్టులో నిష్క్రియులుగా మారిన ప్రచారకులు ఎవరైనా ఉంటే వారిని కూడా చేర్చుకోవాలి.
14 ముద్రిత జ్ఞాపకార్థ ఆహ్వాన పత్రాలను ఉపయోగించండి, వాటి మీద జ్ఞాపకార్థ ఆచరణ జరిగే స్థలము, సమయము స్పష్టంగా టైప్ చేయండి లేదా వ్రాయండి. కావలికోట మార్చి 15, 2004 లేక తేజరిల్లు! (ఆంగ్లం) మార్చి 22, 2004 చివరి పేజీలో కనబడే ఆహ్వానాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఏప్రిల్ 4 సమీపిస్తుండగా, మీ లిస్టులోని వారికి ఫోను ద్వారా గానీ లేదా స్వయంగా కలుసుకొని గానీ గుర్తుచేయండి.
15. జ్ఞాపకార్థాన్ని ఆచరించే రాత్రి మన ఆతిథ్యాన్ని ఎలా చూపించవచ్చు?
15 జ్ఞాపకార్థాన్ని ఆచరించే స్థలంలో: జ్ఞాపకార్థాన్ని ఆచరించే రాత్రి సాధ్యమైనంత త్వరగా ఆచరణ జరిగే ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయత్నించండి. కొత్తవారిని సాదరంగా ఆహ్వానించడం ద్వారా అతిథి సత్కార్యాన్ని ప్రదర్శించండి. (రోమా. 12:13) మీరు ఆహ్వానించే అతిథుల పట్ల మీకు ప్రత్యేక బాధ్యత ఉంది. వారిని సాదర మర్యాదలతో ఆహ్వానించి, సంఘంలోని ఇతరులకు పరిచయం చేయండి. బహుశా మీకు దగ్గరగా ఉన్న సీటు చూపించడం ద్వారా వారికి మీరు సహాయపడవచ్చు. బైబిలు గానీ పాటల పుస్తకం గానీ లేనివారుంటే వారు మీతో లేదా వేరే ఎవరితోనైనా కలిసి చూసే ఏర్పాటు చేయండి. ఆచరణ తర్వాత వారికేమైనా సందేహాలుంటే సమాధానం ఇవ్వడానికి అందుబాటులో ఉండండి. వారిలో మొదటిసారిగా వచ్చినవారు ఎవరైనా ఉంటే, దేవుని గురించి ఆయన సంకల్పం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా అని అడగండి. వారితో గృహ బైబిలు అధ్యయనం నిర్వహిస్తామని ప్రతిపాదించండి.
16. హాజరైనవారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి వీలుగా సహాయం ఎలా చేయవచ్చు?
16 హాజరైనవారికి సహాయంచేస్తూ ఉండండి: జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైన వారికి దాని తర్వాతి వారాల్లో సహాయం అవసరం రావచ్చు. వారిలో ఒకప్పుడు క్రమంగా కూటాలకు హాజరై ప్రస్తుతం సంఘంతో పరిమిత సహవాసం ఉన్నవారు కూడా ఉండవచ్చు. అలాంటివారు ఉపేక్షించబడకుండా వారు ఆధ్యాత్మిక అభివృద్ధిని ఎందుకు ఆపేసారో తెలుసుకొని దాన్ని పరిష్కరించేందుకు పెద్దలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర కాలాల గురించి వారి మనసుల్లో ముద్రించండి. (1 పేతు. 4:7) దేవుని ప్రజలతో క్రమంగా కూడుకోవాలనే లేఖనాధారిత ఉద్బోధకు విధేయంగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనమేమిటో గ్రహించేందుకు అందరికీ సహాయపడండి.—హెబ్రీ. 10:24, 25.
17. యెహోవా ఆశ్చర్యకార్యాల గురించి మనం నిరంతరం ఎందుకు తెలియజేస్తుండాలి?
17 యెహోవా కార్యాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, మనం నిత్యం జీవించినా అవి మనకు ఎంతో అద్భుతంగానే ఉంటాయి. (యోబు 42:2, 3; ప్రసం. 3:11) కాబట్టి మనం ఆయనను స్తుతించాల్సిన విషయాలకు ఎన్నడూ కొదువ ఉండదు. మనం మన పరిచర్యను విస్తరింపజేసుకునే ప్రత్యేక ప్రయత్నం ద్వారా, ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో యెహోవా ఆశ్చర్యకార్యాల పట్ల మన కృతజ్ఞతను ప్రదర్శించవచ్చు.
[5వ పేజీలోని చార్టు]
ఈ సమయ పట్టికల్లో ఒక దాన్ని ఉపయోగించి మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా?
మార్చి ఆ సో* మం* బు* గు శు శ నెల మొత్తం
ప్రతిరోజు 2 1 1 1 1 1 5 51
రెండు రోజులు 0 5 0 5 0 0 0 50
వారాంతాలు మాత్రమే 5 0 0 0 0 0 8 52
వారాంతాలు మరియు వారంలో రెండు రోజులు 2 0 0 2 0 2 6 50
ఏప్రిల్ ఆ సో మం బు గు* శు* శ నెల మొత్తం
ప్రతిరోజు 2 1 1 1 1 1 5 50
రెండు రోజులు 0 0 0 0 5 5 0 50
వారాంతాలు మాత్రమే 5 0 0 0 0 0 8 52
వారాంతాలు మరియు వారంలో రెండు రోజులు 2 0 0 2 0 2 6 50
మే ఆ* సో* మం బు గు శు శ* నెల మొత్తం
ప్రతిరోజు 2 1 1 1 1 1 4 51
రెండు రోజులు 0 5 0 0 0 0 5 50
వారాంతాలు మాత్రమే 3 0 0 0 0 0 7 50
వారాంతాలు మరియు వారంలో రెండు రోజులు 2 0 0 2 0 2 5 51
* నెలలో అయిదు