“మీ హృదయములను విశాలపరచుకొనుడి”
1. మనలో ప్రతి ఒక్కరికీ ఎటువంటి బాధ్యత ఉంది?
1 క్రైస్తవ సహోదరత్వంలో, మనలో ప్రతి ఒక్కరికీ సంఘంలో ఆప్యాయతను వృద్ధిచేయవలసిన బాధ్యత ఉంది. (1 పేతు. 1:22; 2:17) అలాంటి ఆప్యాయత మనం ఒకరి పట్ల ఒకరం ప్రేమ చూపించుకోవడంలో ‘మన హృదయాలను విశాలపరచుకున్నప్పుడు’ ఉత్పన్నమవుతుంది. (2 కొరిం. 6:12, 13) మన సహోదర సహోదరీలతో బాగా పరిచయం పెంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
2. తోటి విశ్వాసులతో స్నేహాలను పెంపొందించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
2 స్నేహాలు బలపడతాయి: మనం మన తోటి విశ్వాసుల గురించి బాగా తెలుసుకున్నప్పుడు, మనం వారి విశ్వాసాన్ని, సహనాన్ని, ఇతర మంచి లక్షణాలను మరింత విలువైనవిగా ఎంచుతాము. అప్పుడు వారి పొరపాట్లు మనకు అల్పమైనవిగా కనబడతాయి, స్నేహ బంధాలు పెరుగుతాయి. ఒకరినొకరు బాగా తెలుసుకోవడం వల్ల, మనం పరస్పరం క్షేమాభివృద్ధి చేసుకోగలుగుతాము, ఆదరించుకోగలుగుతాము. (1 థెస్స. 5:11) మనం సాతాను లోకపు హానికరమైన ప్రభావాలను నిరోధించేందుకు ఒకరికొకరం ‘బలపరిచే సహాయకంగా’ అవుతాం. (కొలొ. 4:11, NW) ఒత్తిడితో నిండిన ఈ అంత్యదినాల దృష్ట్యా, యెహోవా ప్రజల్లో మనకు మంచి స్నేహితులు ఉన్నందుకు మనమెంతో కృతజ్ఞులమై ఉన్నాము.—సామె. 18:24.
3. మనం ఇతరులను బలపరిచే సహాయకంగా ఎలా ఉండవచ్చు?
3 సన్నిహిత స్నేహితులు మనం తీవ్రమైన శోధనలను ఎదుర్కొంటున్నప్పుడు కావలసిన బలానికి, ఆదరణకు ప్రత్యేక ఆధారంగా ఉండగలరు. (సామె. 17:17) తనెందుకూ పనికిరాననే భావాలతో పోరాడిన ఒక క్రైస్తవురాలు ఇలా జ్ఞాపకం చేసుకుంటోంది: “నాలోని ప్రతికూల భావాలను అధిగమించడానికి సహాయంగా, నా గురించి సానుకూల విషయాలు చెప్పే స్నేహితులున్నారు.” అలాంటి స్నేహితులు యెహోవా అనుగ్రహించిన ఆశీర్వాదమే.—సామె. 27:9.
4. సంఘంలోని ఇతరులతో మనం పరిచయాన్ని ఎలా పెంచుకోవచ్చు?
4 ఇతరుల పట్ల ఆసక్తి చూపించండి: మనం మన తోటి విశ్వాసుల పట్ల ప్రేమ చూపించడంలో మన హృదయాలను ఎలా విశాలపరచుకోవచ్చు? క్రైస్తవ కూటాల్లో ఇతరులను పలకరించడంతోపాటు వారితో అర్థవంతమైన సంభాషణ కొనసాగించడానికి కృషి చేయండి. వారి సొంత విషయాల్లో తలదూర్చకుండా వారి పట్ల వ్యక్తిగత ఆసక్తి చూపించండి. (ఫిలి. 2:4; 1 పేతు. 4:15) ఇతరుల పట్ల ఆసక్తి చూపించడానికి మరో మార్గం, వారిని భోజనానికి ఆహ్వానించడం. (లూకా 14:12-14) లేదా క్షేత్ర పరిచర్యలో వారితో కలిసి పనిచేసే ఏర్పాటు చేసుకోవచ్చు. (లూకా 10:1) మనం మన సహోదరులతో పరిచయం పెంచుకోవడంలో చొరవ తీసుకోవడం ద్వారా, సంఘంలో ఐక్యతను పెంపొందించుతాం.—కొలొ. 3:14.
5. మన స్నేహబంధాలను విస్తరింపజేసుకోవడానికి ఒక మార్గం ఏమిటి?
5 మనం మన సన్నిహిత స్నేహితులను, కేవలం మన ఈడు వారి నుండి లేదా మనకున్నటువంటి ఆసక్తులే ఉన్నవారి నుండి మాత్రమే ఎంచుకోవడానికి మొగ్గుచూపుతున్నామా? అలాంటి విషయాలు, మనం సంఘంలో స్నేహాలను పెంపొందించుకోవడాన్ని పరిమితం చేయనీయకూడదు. దావీదు, యోనాతానులకు మరియు రూతు, నయోమిలకు తమ వయస్సుల్లోను నేపథ్యాల్లోను తేడా ఉన్నప్పటికీ తమ మధ్య ప్రగాఢమైన స్నేహ బంధాలను వృద్ధిచేసుకున్నారు. (రూతు 4:15; 1 సమూ. 18:1) మీరు మీ స్నేహబంధాలను విస్తరింపజేసుకోగలరా? అలా చేయడం మీరు ఊహించని ఆశీర్వాదాలు తేగలదు.
6. మనం మన సహోదరుల పట్ల ప్రేమ చూపించడంలో మన హృదయాలను విశాలపరచుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏవి?
6 మనం ఇతరులపట్ల ప్రేమ చూపించడంలో మన హృదయాలను విశాలపరచుకోవడం ద్వారా ఒకరినొకరం బలపరచుకుంటాము, సంఘంలో సమాధానాన్ని పెంపొందించుతాము. అంతేకాక, మనం మన సహోదరుల పట్ల చూపించే ప్రేమకు యెహోవా కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. (కీర్త. 41:1, 2; హెబ్రీ. 6:10) వీలైనంత మంది సహోదరులతో పరిచయం పెంచుకోవడాన్ని మీ లక్ష్యంగా ఎందుకు పెట్టుకోకూడదు?