యెహోవా కృప చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి
మార్చి 24న క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి
1. యెహోవా మనపట్ల తన కృపను ఎలా చూపించాడు?
1 కీర్తనకర్త ఇలా పాడాడు: “ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.” (కీర్త. 107:8) దేవుని కృప అంటే కేవలం తన ప్రజలపట్ల ఆయనకున్న అనురాగం మాత్రమే కాదు. ఆ వాస్తవం ఈ ప్రేరేపిత స్తుతి వాక్యంలో స్పష్టమవుతోంది: “యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.” (కీర్త. 94:18) యెహోవా మన కోసం తన అద్వితీయ కుమారుని ఇవ్వడంలో ఎంతటి అసాధారణమైన కృప చూపించాడో కదా!—1 యోహా. 4:9, 10.
2. యెహోవాకు మన కృతజ్ఞతను మనం ఎలా చూపించవచ్చు?
2 క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినం సమీపిస్తుండగా, ‘కృపగల దేవునికి’ మనమెలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు? (కీర్త. 59:17) యేసు భూమ్మీద గడిపిన చివరి రోజుల గురించి ధ్యానించడానికి కొంత సమయం వెచ్చించాలని మనం కోరుకుంటాం. (కీర్త. 143:5) ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం—2005లో సూచించిన జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన ప్రత్యేక బైబిలు పఠన పట్టికను అనుసరించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, వీలైతే ఇతర బైబిలు ఆధారిత ప్రచురణలతో పాటు జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి 112-116 అధ్యాయాలు కూడా చదవండి, పరిశోధించండి. మీరు చదివిన భాగాన్ని ధ్యానిస్తూ, దానిని మనస్కరించండి అంటే దానిలో లీనమవ్వండి. (1 తిమో. 4:15) ప్రార్థనాపూర్వక అధ్యయనం మన హృదయాన్ని బలపరచడమే కాక యెహోవాపట్ల మనకున్న ప్రేమను కూడా వ్యక్తం చేస్తుంది.—మత్త. 22:37.
3, 4. (ఎ) లైబీరియాలోని మన సహోదరుల స్ఫూర్తిని మనం ఎలా అనుకరించవచ్చు? (బి) మీరు జ్ఞాపకార్థ దినానికి ఎవరిని ఆహ్వానించాలని పథకం వేసుకున్నారు?
3 దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా ఇతరులను పురికొల్పండి: గత సంవత్సరం జ్ఞాపకార్థ దినానికి ప్రపంచవ్యాప్తంగా 1,67,60,607 మంది హాజరయ్యారు. లైబీరియాలోని ఒక గ్రామంలో, మన సహోదరులు గ్రామ పెద్దకు ఉత్తరం రాస్తూ, ఆయన గ్రామంలో ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరించాలనే తమ ఉద్దేశాన్ని ఆ ఉత్తరంలో తెలిపారు. ఆ గ్రామ పెద్ద ఆ ఆచరణ కోసం స్థానిక ఫుట్బాల్ గ్రౌండును ఉపయోగించుకునేందుకు సహోదరులకు అనుమతి ఇవ్వడమే కాక, చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని ప్రజలు ఆ ఆచరణకు హాజరు కావాలని ప్రకటన చేయించాడు. ఆ గ్రామంలో ఉన్నది కేవలం ఐదుగురు ప్రచారకులే అయినా, జ్ఞాపకార్థ ఆచరణకు 636 మంది హాజరయ్యారు!
4 అలాగే మనం కూడా, మనతోపాటు జ్ఞాపకార్థ ఆచరణను ఆచరించేందుకు వీలైనంత మందికి సహాయపడాలని కోరుకుంటాం. మీరు ఆహ్వానించాలనుకున్న వారి పట్టికను మీరు ఎందుకు తయారు చేసుకోకూడదు? మన పత్రికల వెనుక పేజీల్లో జ్ఞాపకార్థ దిన ఆచరణ ఆహ్వానం ఉంటుంది. ముద్రిత జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాలను కూడా ఉపయోగించవచ్చు. వాటిమీద జ్ఞాపకార్థ ఆచరణ జరిగే స్థలం, సమయం టైప్ చేసి లేదా స్పష్టంగా వ్రాసి, మీరు ఆహ్వానించే వారికి ఇవ్వండి. మార్చి 24 సమీపిస్తుండగా, మీరు ఆహ్వానించిన వారిని మళ్ళీ కలిసి జ్ఞాపకార్థ ఆచరణ గురించి గుర్తు చేసి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇంకా ఏమైనా ఉంటే వాటిని ఖరారు చేసుకోండి.
5. ఈ ఆచరణకు బైబిలు విద్యార్థులు హాజరయ్యేలా వారిని మనమెలా ప్రోత్సహించవచ్చు?
5 కూటాలకు ఇంకా హాజరుకాని బైబిలు విద్యార్థులు ఈ ఆచరణకు హాజరై దానినుండి పూర్తి ప్రయోజనం పొందడానికి వారికి మనం ఎలా సహాయం చేయవచ్చు? అధ్యయనం చేస్తున్న ప్రతీసారి ఆచరణ ప్రాముఖ్యతను విద్యార్థి గ్రహించేందుకు కొంత సమయాన్ని వెచ్చించండి. కావలికోట మార్చి 15, 2004, 3-7 పేజీల్లో, తర్కించండి (ఆంగ్లం) పుస్తకంలోని 266-9 పేజీల్లో చక్కని సమాచారం ఉంది.
6. జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చేవారిని సాదరంగా ఆహ్వానించడం ఎందుకు ప్రాముఖ్యం?
6 సందర్శకులను సాదరంగా ఆహ్వానించండి: జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చే సందర్శకులను పలకరించండి, సాదరంగా ఆహ్వానించండి. (రోమా. 12:13) ఆహ్వానితులతోపాటు మీరుకూడా కూర్చొనేలా ఏర్పాటు చేసుకోండి, వారికి బైబిలు, పాటల పుస్తకం ఉండేటట్లు చూడండి. నిష్క్రియులుగా ఉన్న సహోదర, సహోదరీలు ఎవరైనా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైతే, వారిని సాదరంగా ఆహ్వానించేందుకు చొరవ తీసుకోవాలని మనం ముఖ్యంగా కోరుకుంటాం. వారు తిరిగి సంఘంతో క్రమంగా సహవసించేందుకు మనం వారిపట్ల చూపించే ప్రేమపూర్వక శ్రద్ధ సహాయం చేయగలదు. (లూకా 15:3-7) యెహోవా ‘ఆశ్చర్యకరమైన కృప’ చూపించినందుకు మనతోపాటు ఇతరులు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా ప్రోత్సహించేందుకు ఈ అతి పవిత్ర సందర్భంలో, మనం చేయగలిగినదంతా చేయుదము గాక!—కీర్త. 31:21.