7వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రార్థించడం
1. (ఎ) బైబిలు అధ్యయనాన్ని ప్రార్థనతో ప్రారంభించి, ప్రార్థనతో ముగించడం ఎందుకు సముచితంగా ఉంటుంది? (బి) బైబిలు అధ్యయన సమయంలో మనం ప్రార్థనను ఎలా పరిచయం చేయవచ్చు?
1 బైబిలు విద్యార్థులు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించాలంటే, యెహోవా ఆశీర్వాదం ఆవశ్యకం. (1 కొరిం. 3:6) అందుకే అధ్యయనం ప్రార్థనతో ప్రారంభించి, ప్రార్థనతో ముగించడం సముచితంగా ఉంటుంది. సాధారణంగా మతసంబంధమైన ఆసక్తి ఉన్నవారితో మొదటిసారిగా అధ్యయనం చేస్తున్నప్పుడే మనం ప్రార్థించవచ్చు. ఇతర విద్యార్థుల విషయంలో అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రార్థించడానికి సరైన సమయాన్ని మనం గుర్తించాల్సి రావచ్చు. ప్రార్థించాల్సిన అవసరాన్ని విద్యార్థి గ్రహించేలా సహాయం చేయడానికి కీర్తన 25:4, 5; 1 యోహాను 5:14లను మీరు ఉపయోగించవచ్చు, యేసుక్రీస్తు ద్వారా యెహోవాకు ప్రార్థించడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించేందుకు యోహాను 15:16ను కూడా ఉపయోగించవచ్చు.
2. బైబిలు అధ్యయనానికి ఒక సహోదరితో బాప్తిస్మం తీసుకున్న సహోదరుడు లేక బాప్తిస్మం తీసుకోని ప్రచారకుడు వెళ్తే ఎవరు ప్రార్థిస్తారు?
2 బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు ఎవరు ప్రార్థించాలి? అధ్యయనానికి ఒక సహోదరితో బాప్తిస్మం తీసుకున్న సహోదరుడు వెళ్తే ఆయన ప్రార్థిస్తాడు, అయితే ఆ సహోదరి తల మీద ముసుగు వేసుకొని అధ్యయనాన్ని నిర్వహించవచ్చు. (1 కొరిం. 11:5, 10) అలాకాక అధ్యయనానికి ఒక సహోదరితో బాప్తిస్మం తీసుకోని రాజ్య ప్రచారకుడు వెళ్తే, ఆమే ప్రార్థిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో, ప్రార్థిస్తున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు ఆమె తలమీద ముసుగు వేసుకోవాలి.
3. బైబిలు అధ్యయన సమయంలో చేసే ప్రార్థనలో ఎలాంటి సముచితమైన విషయాలను చేర్చవచ్చు?
3 ప్రార్థనలో ఏమేమి చేర్చవచ్చు: బైబిలు అధ్యయన సమయంలో చేసే ప్రార్థనలు దీర్ఘంగా ఉండనవసరం లేదు, అయితే అవి నిర్దిష్టంగా ఉండాలి. ప్రార్థనలో అధ్యయనం మీద దేవుని ఆశీర్వాదాలు అడగడం, నేర్చుకుంటున్న సత్యాల కోసం కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా ఉపదేశానికి మూలమైన యెహోవాను స్తుతించడం సముచితంగా ఉంటుంది. (యెష. 54:13) విద్యార్థి మీద మనకున్న నిజమైన ఆసక్తిని, యెహోవా ఉపయోగిస్తున్న సంస్థపట్ల కృతజ్ఞతను సూచించే వాక్యాలను కూడా మనం ప్రార్థనలో చేర్చవచ్చు. (1 థెస్స. 1:2, 3; 2:7, 8) విద్యార్థి తాను నేర్చుకుంటున్న వాటిని పాటించడానికి చేస్తున్న ప్రయత్నాల మీద యెహోవా ఆశీర్వాదాలను మనం అడిగితే ‘వాక్యప్రకారము ప్రవర్తించడంలో’ ఉన్న ప్రాముఖ్యతను ఆయన గ్రహించడానికి మనం సహాయం చేయవచ్చు.—యాకో. 1:22.
4. బైబిలు అధ్యయనాన్ని ప్రార్థనతో ప్రారంభించడంలో, ప్రార్థనతో ముగించడంలో ఏ ప్రయోజనాలు ఉన్నాయి?
4 ప్రార్థించడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది దేవుని ఆశీర్వాదాన్ని తెస్తుంది. (లూకా 11:13) దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడంలో ఉన్న గంభీరతను నొక్కి చెబుతుంది. మన ప్రార్థనలను విద్యార్థి విన్నప్పుడు ప్రార్థించే విధానాన్ని ఆయన నేర్చుకుంటాడు. (లూకా 6:40) అంతేకాకుండా దేవుని మీద ప్రేమతో, ఆయన సాటిలేని లక్షణాలపట్ల కృతజ్ఞతతో నిండిన హృదయం నుండి వచ్చే ప్రార్థనలు, యెహోవాతో వ్యక్తిగత సంబంధాన్ని వృద్ధి చేసుకొనేందుకు ఆ విద్యార్థికి సహాయం చేయవచ్చు.