ఇంటి గుమ్మం దగ్గర, టెలిఫోన్ ద్వారా బైబిలు అధ్యయనాలను ప్రారంభించడం
1, 2. తీరిక దొరకని వ్యక్తులకు సహాయం చేయడానికి మన బైబిలు అధ్యయన కార్యక్రమాన్ని ఎలా మలచుకోవచ్చు?
1 నేటి ప్రజలకు అసలు తీరిక దొరకడం లేదు. అయినా చాలామందికి ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి ఉంది. వారు తమ ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడానికి మనమెలా సహాయం చేయవచ్చు? (మత్త. 5:3) చాలామంది ప్రచారకులు ఇంటి గుమ్మం దగ్గర గానీ టెలిఫోన్ ద్వారా గానీ వ్యక్తులతో బైబిలు అధ్యయనం చేయగలుగుతున్నారు. ఈ విధంగా మీరు మీ పరిచర్యను విస్తృతపరచుకోగలరా?
2 మనం బైబిలు అధ్యయనాలు ప్రారంభించాలంటే అవకాశం దొరికినప్పుడల్లా బైబిలు అధ్యయనాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండాలి. మనం దానిని ఎలా చేయవచ్చు, ఎక్కడ చేయవచ్చు?
3. మొదటిసారి కలుసుకున్నప్పుడే బైబిలు అధ్యయనాన్ని ఎందుకు ప్రదర్శించాలి, దానిని ఎలా ప్రదర్శించవచ్చు?
3 ఇంటి గుమ్మం దగ్గర: బైబిలు గురించి మాట్లాడడానికి ఇష్టపడే వ్యక్తిని మీరు కలుసుకున్నప్పుడు మీరు ముందుగా సిద్ధపడిన పేరాను చూపించి చర్చను ప్రారంభించండి, అలా ప్రారంభించడానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్లోని 1వ పాఠంలోని మొదటి పేరా వంటి పేరాలను ఉపయోగించండి. పేరా చదివి, ప్రశ్నను చర్చించండి, ఒకటి లేక రెండు ఉదాహరించబడిన లేఖనాలను కూడా చర్చించండి. దీనిని సాధారణంగా ఇంటి గుమ్మం దగ్గరే ఐదు నుండి పది నిమిషాల లోపల చేయవచ్చు. ఆ వ్యక్తి చర్చను ఇష్టపడితే తర్వాతి పేరాను గానీ తర్వాతి రెండు పేరాలను గానీ వేరొక సమయంలో చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.—బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి సూటిగా ప్రస్తావించే పద్ధతిని ఉపయోగించే విషయంలో అదనపు సూచనలను మన రాజ్య పరిచర్య, జనవరి 2002, 6వ పేజీలో చూడవచ్చు.
4. పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు ఇంటి గుమ్మం దగ్గరే బైబిలు అధ్యయనాలను మనమెలా ప్రారంభించవచ్చు?
4 పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి కూడా అదే పద్ధతిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ను పరిచయం చేసి, 2వ పాఠంలోని 1-2 పేరాలను ఉపయోగించి దేవుని పేరు చెప్పవచ్చు. తర్వాతి సందర్శనంలో 3-4 పేరాలను ఉపయోగించి యెహోవా లక్షణాల గురించి బైబిలు ఏమి వెల్లడి చేస్తుందో మీరు చర్చించవచ్చు. ఆ తర్వాతి చర్చలో, యెహోవా గురించి తెలుసుకోవడానికి బైబిలు అధ్యయనం మనకు ఎలా సహాయం చేస్తుందో నొక్కి చెప్పడానికి మీరు 5-6 పేరాలను, 5వ పేజీలోని చిత్రాన్ని చర్చించవచ్చు. వీటినన్నిటినీ ఇంటి గుమ్మం దగ్గర నిలబడే చేయవచ్చు.
5, 6. (ఎ) కొందరు టెలిఫోన్ ద్వారా బైబిలు అధ్యయనం చేయడానికి ఎందుకు ఎంచుకుంటారు? (బి) టెలిఫోన్ ద్వారా అధ్యయనం చేయడానికి ప్రతిపాదిస్తున్నప్పుడు మనం ఏ పద్ధతిని ఉపయోగించవచ్చు?
5 టెలిఫోన్ ద్వారా: కొందరు వ్యక్తులు బైబిలు అధ్యయనాన్ని ముఖాముఖిగా చేయడం కన్నా ఫోన్ ద్వారా చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతుండవచ్చు. ఈ క్రింది అనుభవాన్ని పరిశీలించండి: ఒక సహోదరి ఇంటింటి ప్రకటనా పని చేస్తున్నప్పుడు, ఓ పక్క తల్లి బాధ్యతలను నిర్వహిస్తూ మరోపక్క తీరిక దొరకని ఉద్యోగం చేస్తున్న ఒక యువతిని కలిసింది. ఆ సహోదరి ఆమెను ఇంట్లో మళ్ళీ కలుసుకోలేకపోయినప్పుడు, ఆమెకు ఫోన్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ యువతి, బైబిలు గురించి చర్చించడానికి తనకు నిజంగా సమయం లేదని వివరించింది. ఆ సహోదరి ఇలా చెప్పింది: “మీరు 10 లేక 15 నిమిషాల్లో ఫోన్ ద్వారా కూడా ఏదైనా క్రొత్త విషయం నేర్చుకోవచ్చు.” దానికి ఆ స్త్రీ “ఒకవేళ అది ఫోన్ ద్వారానైతే నేను దానికి ఒప్పుకుంటాను!” అని జవాబిచ్చింది. ఎంతోకాలం గడవకముందే ఫోన్ ద్వారా ఒక క్రమమైన అధ్యయనం ఆరంభమైంది.
6 మీరు కలుసుకొనేవారిలో కొందరు టెలిఫోన్ ద్వారా అధ్యయనం చేయడానికి ఇష్టపడతారా? మీరు, ఇప్పుడే వివరించబడిన పద్ధతిని ప్రయత్నించవచ్చు లేక మీరు కేవలం ఇలా చెప్పవచ్చు: “మీరు ఇష్టపడితే మనం టెలిఫోన్ ద్వారా కూడా బైబిలు గురించి చర్చించవచ్చు. అది మీకు అనుకూలంగా ఉంటుందా?” ఇతరుల పరిస్థితులకు అనుగుణంగా మన బైబిలు అధ్యయన కార్యక్రమాన్ని మలచుకోవడం ద్వారా వారు “దేవుని గూర్చిన విజ్ఞానము” పొందడానికి మనం సహాయం చేయవచ్చు.—సామె. 2:5; 1 కొరిం. 9:23.