“క్రీస్తును అనుసరించండి!” అనే జిల్లా సమావేశపు ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా చేసే సమైక్య కృషి
ప్రచారకులు ప్రత్యేక హ్యాండ్బిల్ను మళ్ళీ పంచుతారు
1 గత సంవత్సరం “విడుదల సమీపించింది!” అనే జిల్లా సమావేశం గురించిన ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమం ఆసక్తిగలవారిపై శక్తివంతమైన ప్రభావం చూపించింది. ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకొని సమావేశానికి వచ్చినవారు, యెహోవాసాక్షులతో కలిసి పుష్టికరమైన ఆధ్యాత్మిక విందు ఆరగించడం ఎలా ఉంటుందో మొట్టమొదటిసారిగా చవిచూశారు. (యెష. 65:13) వారు మన ప్రేమపూర్వక, ఐక్య సహోదరత్వంతో సహవసించడాన్ని ఆనందించారు. (కీర్త. 133:1) “క్రీస్తును అనుసరించండి!” అనే జిల్లా సమావేశానికి సాధ్యమైనంత ఎక్కువమంది హాజరయ్యేలా సహాయం చేయడానికి, మనం మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక హ్యాండ్బిల్లులను పంచిపెట్టనున్నాం.
2 గత సంవత్సరపు ఫలితాలు: “విడుదల సమీపించింది!” అనే జిల్లా సమావేశం గురించి ప్రచారం చేయడంవల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి అందిన నివేదికలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనకు మంచి పేరు వచ్చింది. ఉదాహరణకు, ఒక నగరంలో, మన ప్రచార కార్యక్రమాన్ని గురించి ఒక వార్తాపత్రిక ఆరు కాలమ్‌ల శీర్షికను ప్రచురించింది. అందులో ఇలా ఉంది: “సమావేశానికి ముందే ప్రతి ఒక్కరికీ ఆహ్వానప్రతిని ఇవ్వడంలో భాగంగా సాక్షులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎక్కువ గంటలు పనిచేయడానికి, ఎంతో దూరాలు నడవడానికి, క్లుప్త సందేశాలు ఇవ్వడానికి ప్రత్యేక కృషి చేశారు.” హ్యాండ్బిల్ పంచిపెట్టే వ్యవస్థీకృత కార్యక్రమం మరో నగరంలోని స్థానిక మీడియావారి ఆసక్తిని రేకెత్తించింది, దాంతో వారు ప్రచార కార్యక్రమం గురించి వార్తల్లో విశదంగా వివరించారు. కనీసం మూడు వార్తాపత్రికలు సమావేశానికి ముందు మనం చేసిన ప్రచార కార్యక్రమం గురించి సానుకూల నివేదికలను ప్రచురించాయి. ఒక విలేఖరి అనేక వివరణాత్మక శీర్షికల్ని వ్రాశాడు, వాటిని ఆదివారపు వార్తాపత్రికలో ప్రచురించడానికి రెండు పేజీలకన్నా ఎక్కువే పట్టింది. ఆ పత్రికలో మన నమ్మకాల గురించి, మన సహోదరత్వం గురించి, హ్యాండ్బిల్ పంచిపెట్టడం గురించి, జిల్లా సమావేశం గురించి వివరించబడింది. ఒక ప్రచారకురాలు ఒక ఇంట్లో ఆహ్వానప్రతిని ఇస్తున్నప్పుడు, గృహస్థురాలు మధ్యలో కలుగజేసుకుని ఇలా అంది: “అరే, నేనిప్పుడే పేపర్లో దాని గురించి చదువుతున్నాను!” మరో గృహస్థురాలు ఉత్సాహంగా ఇలా చెప్పింది: “నేనిప్పుడే మీ గురించి చదువుతున్నాను, అంతలోనే మీరొచ్చారు! ఇది నాకు ఇస్తున్నారా? నిజంగా యెహోవాసాక్షులు చాలా మంచి పని చేస్తున్నారు.”
3 చాలామంది ఆసక్తిగలవారు సమావేశ స్థలాలకు ఆహ్వానప్రతులను తీసుకొని వచ్చారు. ఆసక్తివున్న కొందరు కార్యక్రమానికి హాజరవడానికి ఎంతో దూరంలో ఉన్న నగరాలనుండి వాహనాల్లో ప్రయాణించి వచ్చారు. ఇతరుల్ని ఆహ్వానించడానికి మనం చేసిన నిర్విరామ కృషి ఎక్కువమంది హాజరయ్యేందుకు దోహదపడింది, ఒక దేశంలో గత సంవత్సరం కన్నా 27 శాతం ఎక్కువమంది సమావేశానికి హాజరయ్యారు.
4 క్షేత్రాన్ని పూర్తిచేయడం: మీరు సమావేశం ప్రారంభమవడానికి మూడు వారాల ముందు హ్యాండ్బిల్ను పంచిపెట్టడం ప్రారంభించవచ్చు. సంఘ క్షేత్రమంతా పూర్తిచేయడానికి సాధ్యమైనంత కృషి చేయాలి. క్షేత్రాలు ఎక్కువగా ఉన్న సంఘాల్లో, సమావేశానికి ఇంకా ఒక వారం ఉందనగా ప్రచారకులు, ఇంట్లో లేని వారి ఇళ్ల దగ్గర హ్యాండ్బిల్ను బయటకు కనిపించకుండా పెట్టవచ్చు. సంఘాలు తమకివ్వబడిన హ్యాండ్బిల్లులన్నింటినీ పంచిపెట్టడానికి, వీలైనంత ఎక్కువ క్షేత్రాన్ని పూర్తి చేయడానికి కృషి చేయాలి. మిగిలిన హ్యాండ్బిల్లులను సంఘంలోని పయినీర్లు ఉపయోగించవచ్చు.
5 ఏమి చెప్పాలి: మీరు బహుశా ఇలా చెప్పవచ్చు: “రాబోయే ప్రాముఖ్యమైన సమావేశానికి ఆహ్వానప్రతులను ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టే పనిలో మేమందరం భాగం వహిస్తున్నాం. ఇది మీ ఆహ్వానప్రతి. మిగతా వివరాలు ఈ ఆహ్వానప్రతిలో ఉన్నాయి.” మీరు క్లుప్తంగా మాట్లాడడంవల్ల మరిన్ని ప్రతులను పంచిపెట్టగలుగుతారు. ఒకవేళ గృహస్థునికి ఏవైనా సందేహాలుంటే, వాటిని తీర్చడానికి సమయం తీసుకోండి. ఆసక్తి చూపించినవారి వివరాలు వ్రాసుకొని, వీలైనంత త్వరగా వారిని మళ్లీ కలవండి.
6 మనం క్రీస్తుని అనుసరించడానికి కృషి చేయడం ఎంత ప్రాముఖ్యమో కదా! (యోహా. 3:36) హాజరైనవారందరూ అలా చేయడానికి రాబోయే జిల్లా సమావేశం సహాయం చేస్తుంది. “క్రీస్తును అనుసరించండి!” అనే జిల్లా సమావేశం గురించి ప్రకటించడానికి మనం చేసే సమైక్య కృషివల్ల మళ్లీ గొప్ప సాక్ష్యమివ్వబడుతుందని మనం ఎదురుచూడవచ్చు. కాబట్టి, వీలైనంత ఎక్కువమందిని సమావేశానికి ఆహ్వానించే పనిలో ఉత్సాహంగా పాల్గొనండి. సమైక్యంగా చేస్తున్న ఈ ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమంలో మీరు భాగం వహిస్తుండగా మీ వ్యక్తిగత ప్రయత్నాలను యెహోవా మెండుగా ఆశీర్వదించునుగాక!