బైబిలు అధ్యయనం ఎలా చేస్తామో చూపించారా?
మనం బైబిలు అధ్యయనం గురించి చెప్పినప్పుడు కొంతమంది గృహస్థులు తమకు ఆసక్తి లేదనో, చర్చిలో తాము బైబిలు చదువుతున్నామనో చెబుతుంటారు. అయితే మనం నిర్వహించే బైబిలు అధ్యయనం ఎంత జ్ఞానాన్నిస్తుందో, ఎంత ఆనందదాయకంగా ఉంటుందో వారికి తెలియదు, అందుకే మనం నిర్వహించే బైబిలు అధ్యయనం కూడా ఇతర మతగుంపులు చేసే అధ్యయనంలాంటిదేనని వారనుకుంటారు. అందువల్ల, కేవలం అధ్యయనం చేద్దామని చెప్పే బదులు, బైబిలు అధ్యయనం ఎలా చేస్తామో చూపించేందుకు ఒకటి రెండు నిమిషాలు తీసుకోవడం మంచిది. ఉదాహరణకు, నేను చాలా బాగా వంట చేస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు వండి తెస్తాను అని చెప్పకండి; బదులుగా అప్పటికప్పుడే దాని రుచి ఏమిటో చూపించండి! మీరు కొద్ది నిమిషాల్లోనే అలా ఎలా చేయవచ్చో తెలుసుకునేందుకు జనవరి 2006 మన రాజ్య పరిచర్య, 6వ పేజీలోని సలహాను పాటించండి:
ఆ వ్యక్తి మన సందేశాన్ని నిజంగానే ఇష్టపడుతున్నాడని గ్రహించిన తర్వాత ఇలా చెప్పవచ్చు: “ఈ మాటలు నెరవేరే కాలమెప్పటికైనా వస్తుందని మీరనుకుంటున్నారా? [యెషయా 33:24 చదివి, వారిని జవాబు చెప్పనివ్వండి.] దీని గురించి మీకు ఆసక్తి కలిగించే ఒక విషయం చూపిస్తాను ఉండండి.” బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఆయన చేతికిచ్చి, 36వ పేజీలో 22వ పేరాను చూపించండి. ఆ పేరాకు సంబంధించిన ప్రశ్న చదివి, మీరు ఆ పేరా చదువుతుండగా దానికి జవాబేమిటో చూడమని చెప్పండి. ఆ ప్రశ్న మళ్ళీ అడిగి ఆయన ఏం చెబుతాడో వినండి. ముందు చదివిన లేఖనం కాక ఆ పేరాలోని మరో లేఖనాన్ని చదవండి. మీరు తిరిగి వెళ్ళి జవాబివ్వడానికి వీలుగా మరో ప్రశ్నవేసి, పునర్దర్శనానికి ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకోండి. అంతే మీరు బైబిలు అధ్యయనం ఆరంభించేశారు!