ఒకప్పుడు మీరు క్రమ పయినీరా?
1. చాలామంది ఏ ఆనందాన్ని పొందారు, అయితే కొంతమంది ఏమి చేయాల్సివచ్చింది?
1 ఎన్నో సంవత్సరాలుగా, వేలమంది పూర్తికాల పరిచర్య చేస్తూ, ‘బోధించే, ప్రకటించే’ పనిలో ఎంతో ఆనందాన్ని పొందారు. (అపొ. 5:42) అయితే, కొంతమంది కొన్ని కారణాలవల్ల పయినీరు సేవ ఆపేయాల్సివచ్చింది. మీరు ఒకప్పుడు క్రమ పయినీరైతే, మళ్లీ పయినీరు సేవ చేసే అవకాశం ఉందేమో చూడడానికి మీ ప్రస్తుత పరిస్థితులను పరిశీలించుకున్నారా?
2. గతంలో పయినీరు సేవ చేసినవాళ్లు తమ ప్రస్తుత పరిస్థితులను ఎందుకు పరిశీలించుకోవాలి?
2 పరిస్థితులు మారతాయి: మీరు ఒకప్పుడు ఏ కారణంవల్ల పయినీరు సేవ ఆపేశారో బహుశా అది ఇప్పుడు లేకపోవచ్చు. ఉదాహరణకు, ఒకవేళ మీరు 90 గంటలు పూర్తిచేయలేక పయినీరు సేవ ఆపేసివుంటే, ఇప్పుడు 70 గంటలే చేయాలి కాబట్టి మీరు మళ్లీ మొదలుపెట్టగలరా? మీరు పయినీరు సేవ చేయడం మానేసిన తర్వాతి కాలంలో ఉద్యోగం చేయాల్సిన అవసరం తగ్గిందా లేక కుటుంబ బాధ్యతలు తగ్గాయా? మీరు ఈ మధ్యే ఉద్యోగ విరమణ పొందారా? ఒక సహోదరి అనారోగ్య కారణాలవల్ల పయినీరు సేవ చేయడం ఆపేసింది కానీ 89 ఏళ్ల వయస్సులో మళ్లీ మొదలుపెట్టగలిగింది. సంవత్సరం పైగా ఒక్కసారైనా ఆమె ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం రాలేదు, అంతేకాకుండా ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో మళ్లీ పయినీరు సేవ చేయగలనని ఆమెకు అనిపించింది.
3. కుటుంబంలో ఒకరు పయినీరు సేవ చేయగలిగేలా మిగతావాళ్లు ఎలా సహకరించవచ్చు?
3 మీరు ఒకప్పుడు పయినీరు కాకపోయినా, మీ కుటుంబంలో ఎవరైనా ఒకరు వృద్ధ తల్లిదండ్రులకో లేదా మరొకరికో సహాయం చేయాలనే ఉద్దేశంతో పయినీరు సేవ చేయడం ఆపేసివుండవచ్చు. (1 తిమో. 5:4, 8) అలాగైతే, మీరు లేదా మీ కుటుంబంలో ఇంకెవరైనా, పయినీరు సేవ చేయడం ఆపేసిన వాళ్లకు సహాయం చేయగలరా? ఈ విషయం గురించి ఎందుకు కలిసి మాట్లాడుకోకూడదు? (సామె. 15:22) తమ కుటుంబంలో ఒకరు పయినీరు సేవ చేయగలిగేలా మిగతావాళ్లు సహకరించాలి. అలాంటి సహకారం నిజంగా ఎంతో విలువైనది.
4. మీరిప్పుడు పయినీరు సేవ మళ్లీ మొదలుపెట్టలేకపోతుంటే ఏమి చేయవచ్చు?
4 పయినీరు సేవ మళ్లీ మొదలుపెట్టడానికి మీ పరిస్థితులు ఇప్పటికీ అనుకూలంగా లేకపోతే నిరుత్సాహపడకండి. పయినీరు సేవ చేయాలనే మీ ఆశను చూసి యెహోవా ఎంతో సంతోషిస్తాడు. (2 కొరిం. 8:12) మీరు పయినీరు సేవ చేస్తున్నప్పుడు సంపాదించుకున్న నైపుణ్యాలను ఇప్పుడు పరిచర్యలో ఉపయోగించండి. పయినీరు సేవ చేయాలనే మీ ఆశ నెరవేరాలని ప్రార్థించండి. మీ పరిస్థితులను మార్చుకునే అవకాశాలు వస్తాయేమో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి. (1 యోహా. 5:14) బహుశా కొంతకాలానికి, ‘ఫలవంతమైన సేవ చేసే గొప్ప అవకాశాన్ని’ యెహోవా మీకు ఇవ్వవచ్చు, అప్పుడు మీరు మళ్లీ క్రమ పయినీరు సేవ మొదలుపెట్టి ఎంతో ఆనందాన్ని పొందగలుగుతారు.—1 కొరిం. 16:9, పరిశుద్ధ బైబిల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.