పరిచర్యలో ఓర్పును చూపించండి
1. మానవుల పట్ల యెహోవా ఎలా ఓర్పు చూపించాడు?
1 మానవులతో వ్యవహరించేటప్పుడు దేవుడు ఎంతో ఓర్పు చూపించాడు. (నిర్గ. 34:6; కీర్త. 106:41-45; 2 పేతు. 3:9) ప్రేమతో ఆయన చూపించే ఓర్పుకు ప్రపంచవ్యాప్త రాజ్య ప్రకటనా పని ఒక మంచి ఉదాహరణ. ఆ పని ద్వారా యెహోవా దాదాపు 2,000 సంవత్సరాలుగా మానవుల పట్ల ఓర్పు చూపించాడు, ఇప్పటికీ యథార్థ హృదయులను తనవైపు ఆకర్షిస్తూనే ఉన్నాడు. (యోహా. 6:44) పరిచర్యలో మనం యెహోవా ఓర్పును ఎలా అనుకరించవచ్చు?
2. మన ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఓర్పును ఎలా చూపించవచ్చు?
2 ఇంటింటి పరిచర్యలో: ప్రజలు ఇప్పటికీ ఆసక్తి చూపించని ప్రాంతంలో కూడా “మానక” ప్రకటించడం ద్వారా మనం యెహోవా ఓర్పును అనుకరించవచ్చు. (అపొ. 5:42) అంతేకాదు, పరిచర్యలో ఎదురయ్యే ఉదాసీనతను, ఎగతాళిని, వ్యతిరేకతను కూడా మనం ఓపికతో సహిస్తాం. (మార్కు 13:12, 13) ఆసక్తి కనబరచిన వాళ్లను ఇంటిదగ్గర కలుసుకోవడం కష్టమైనా, సత్య విత్తనాలకు నీళ్లు పోయడంలో పట్టుదలగా కొనసాగడం ద్వారా కూడా మనం ఓర్పును చూపిస్తాం.
3. పునర్దర్శనాలు చేసేటప్పుడు, బైబిలు అధ్యయనాలు నిర్వహించేటప్పుడు ఓర్పు ఎందుకు అవసరం?
3 బైబిలు అధ్యయనాలు నిర్వహించేటప్పుడు: మొక్కను పెంచాలంటే ఓర్పు కావాలి. మనం దానికి నీళ్లు పోయగలం కానీ అది త్వరగా ఎదిగేలా చేయలేం. (యాకో. 5:7) అలాగే ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా మెల్లమెల్లగా, దశల వారీగా జరుగుతుంది. (మార్కు 4:28) మన బైబిలు విద్యార్థులకు అబద్ధ మత నమ్మకాలను, లేఖన విరుద్ధ ఆచారాలను విడిచిపెట్టడం కష్టమనిపించవచ్చు. వాళ్లు ఆధ్యాత్మికంగా త్వరగా ఎదగాలనే ఉద్దేశంతో మార్పులు చేసుకోమని మనం వాళ్లను బలవంతం చేయకూడదు. విద్యార్థి హృదయంలో దేవుని ఆత్మ పనిచేయడానికి తగినంత సమయం ఇవ్వాలంటే మనకు ఓర్పు అవసరం.—1 కొరిం. 3:6, 7.
4. అవిశ్వాసులైన బంధువులకు చక్కగా సాక్ష్యమివ్వాలంటే ఓర్పు ఎందుకు అవసరం?
4 అవిశ్వాసులైన బంధువుల విషయంలో: అవిశ్వాసులైన మన బంధువులు సత్యం తెలుసుకోవాలని మనం ఎంతో కోరుకుంటున్నా, మన విశ్వాసం గురించి వాళ్లతో మాట్లాడడానికి సరైన సమయం కోసం వేచి చూడడం ద్వారా, ఒకేసారి ఎక్కువ విషయాలతో వాళ్లను ముంచెత్తకుండా ఉండడం ద్వారా ఓర్పును చూపిస్తాం. (ప్రసం. 3:1, 7) ఈలోగా మన ప్రవర్తన వాళ్లకు సాక్ష్యమిస్తుంది. అంతేకాదు, మనం కూడా మన విశ్వాసం గురించి సాత్వికంతో, ప్రగాఢ గౌరవంతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. (1 పేతు. 3:1, 15) పరిచర్యలో ఓర్పు చూపిస్తే తప్పకుండా ఎన్నో మంచి ఫలితాలు పొందుతాం, మన పరలోక తండ్రిని సంతోషపెడతాం.