అన్ని రకాల ప్రజలకు ప్రకటించండి
1. చక్కగా పని చేసే సువార్తికులను నిపుణుడైన శిల్పితో ఎందుకు పోల్చవచ్చు?
1 నిపుణుడైన శిల్పి దగ్గర చాలా పనిముట్లు ఉంటాయి. దేన్ని ఎప్పుడు, ఎలా వాడాలో అతనికి తెలుసు. అలాగే మన దగ్గర కూడా సువార్త ప్రకటనా పనిని చక్కగా చేయడానికి ఉపయోగపడే వేర్వేరు పనిముట్లు ఉన్నాయి. ఉదాహరణకు బ్రోషుర్లనే తీసుకుంటే, “అన్నివిధముల” వారికి ప్రకటించడానికి వీలుగా వివిధ అంశాల గురించి చర్చించేలా వాటిని తయారుచేశారు. (1 కొరిం. 9:22) ఈ మన రాజ్య పరిచర్యతో పాటు వచ్చిన అనుబంధంలో కొన్ని బ్రోషుర్ల పేర్లు ఇచ్చారు. వాటిని ఎవరి కోసం రూపొందించారో, వాటిని అందించేటప్పుడు ఏమి మాట్లాడవచ్చో అందులో వివరంగా ఉంది.
2. మనం పరిచర్యలో బ్రోషుర్లను ఎప్పుడు ఇవ్వవచ్చు?
2 బ్రోషుర్లను ఎప్పుడు ఉపయోగించాలి? శిల్పి, అవసరాన్ని బట్టి పనిముట్టు వాడతాడు. బ్రోషుర్లను ప్రత్యేకంగా అందించాల్సిన నెలల్లో మాత్రమే కాదుగానీ వాటివల్ల ప్రయోజనం పొందుతారని అనిపించిన వాళ్ళకు ఎప్పుడైనా ఇవ్వవచ్చు. ఉదాహరణకు, బైబిలు బోధిస్తోంది పుస్తకం అందించాల్సిన నెలలో క్రైస్తవులు కానివాళ్లు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ప్రకటిస్తున్నామని అనుకుందాం. అలాంటప్పుడు బైబిలు గురించి అంతగా ఆసక్తి లేనివాళ్ళకు తగిన బ్రోషురు అందిస్తే ప్రయోజనం ఉండవచ్చు. ఆ వ్యక్తికి ఆసక్తి పెరిగిన తర్వాత బైబిలు బోధిస్తోంది పుస్తకం చూపించవచ్చు.
3. మనం సువార్త పనిముట్లను నైపుణ్యంగా ఉపయోగించడం ఎందుకు నేర్చుకోవాలి?
3 పనిలో నిపుణతగల వాళ్ళను బైబిలు మెచ్చుకుంటోంది. (సామె. 22:29) ఈ రోజుల్లో “సువార్త” ప్రకటించే ‘పరిశుద్ధమైన పనికన్నా’ ప్రాముఖ్యమైనది ఏదీ లేదు. (రోమా. 15:16, NW) “సిగ్గుపడనక్కరలేని పనివానిగా” ఉండాలంటే మనం మన పనిముట్లను నైపుణ్యంగా ఉపయోగించడం నేర్చుకోవాలి.—2 తిమో. 2:15.