మీ భాష మాట్లాడే వాళ్ల కోసం ఎలా వెదకాలి?
1. వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతాల్లో సంఘ క్షేత్రాలను భాష ఆధారంగా ఎందుకు నియమిస్తారు?
1 సా.శ. 33 పెంతెకొస్తు రోజు, యేసు శిష్యులు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లతో ‘అన్యభాషల్లో మాట్లాడారు.’ (అపొ. 2:4) ఫలితంగా, దాదాపు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. నిజానికి, అక్కడికి వచ్చినవాళ్లలో చాలామందికి శిష్యులు మాట్లాడే హీబ్రూ, గ్రీకు భాషలు కూడా వచ్చు. అయినా, మాతృభాషలో రాజ్యసువార్త వినే అవకాశాన్ని యెహోవా వాళ్లకిచ్చాడు. దానికొక కారణమేమిటంటే, తమ మాతృభాషలో సువార్త విన్నప్పుడు ప్రజలు త్వరగా స్పందిస్తారు. అందుకే నేడు, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతంలో సంఘ క్షేత్రాలను భాష ఆధారంగా నియమిస్తారు. (సంస్థీకరించబడ్డాం, 107వ పేజీ, 1-2 పేరాలు) భాషా గుంపులకు వాటికంటూ ప్రత్యేకంగా క్షేత్రం ఉండదు. వాటిలోని సహోదరులు తమ సంఘ క్షేత్రంలో, అలాగే దగ్గర్లోని సంఘాల క్షేత్రాల్లో తమ భాష మాట్లాడే ప్రజలకు ప్రకటిస్తారు.
2. (ఎ) వెదికే పని అంటే ఏమిటి? ఏ ప్రాంతాల్లో అది అవసరమౌతుంది? (బి) వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలున్న ప్రాంతంలోని సంఘాలు ఒకదానికొకటి ఎలా సహాయం చేసుకోవచ్చు? (సి) వేరే భాష మాట్లాడే ప్రజలు ఆసక్తి చూపించినప్పుడు మనం ఏమి చేయాలి?
2 మీ ప్రాంతంలో కేవలం ఒకే భాష మాట్లాడే ప్రజలుంటే, మీరు ప్రతీ ఇంటికి వెళ్లి మాట్లాడవచ్చు. కానీ, మీ ప్రాంతంలో వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజలుంటే అలా ప్రకటించడం కుదరదు. ఎందుకంటే, వేరే భాషా సంఘాలు కూడా అదే ప్రాంతంలో ప్రకటిస్తుండవచ్చు. ఆ సంఘాల భాషలు మాట్లాడే ప్రజలు కూడా చాలామంది ఉంటే, ఒక్కో సంఘం ఒక్కో సమయంలో ప్రకటించేలా ఆ సంఘాల సేవా పర్యవేక్షకులు ఒక ఏర్పాటును రూపొందిస్తారు. అలా కాకుండా, ఏదైనా సంఘానికి/గుంపుకు సంబంధించిన భాష మాట్లాడే ప్రజలు కొద్దిమందే ఉంటే, వాళ్లను క్రమపద్ధతిలో వెదకేలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వేరే సంఘాలు మీ భాష మాట్లాడే ప్రజల వివరాలు మీకు అందిస్తుండవచ్చు. అయితే, మీ భాష మాట్లాడే వాళ్లను కనుగొనాల్సిన ప్రాథమిక బాధ్యత మీ సంఘం/గుంపు మీదే ఉంటుంది. (“ఒకరికొకరు సహాయం చేసుకోండి” అనే బాక్సు చూడండి.) కాబట్టి, మీరు వెదికే పని చేయాలి అంటే, మీ భాష మాట్లాడే ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో అడిగి తెలుసుకోవాలి. ఇంతకీ వాళ్లను ఎలా వెదకాలి?
3. ఏ ప్రాంతాల్లో వెదకాలి, అందుకు ఎంత సమయం వెచ్చించాలి అనేది దేనిమీద ఆధారపడి ఉంటుంది?
3 క్రమపద్ధతిలో వెదకడం: వేర్వేరు భాషల ప్రజలున్న ప్రాంతంలో, మీ భాష మాట్లాడే వాళ్ల కోసం వెదకడానికి ఎంత సమయం వెచ్చించాలనేది స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుంది. ఉదాహరణకు, ఆ ప్రాంతంలో మీ భాష మాట్లాడేవాళ్లు ఎంతమంది ఉన్నారు? ప్రచారకులు ఎంతమంది ఉన్నారు? ఇప్పటికే సంఘం లేదా గుంపు దగ్గర ఎంతమంది చిరునామాలు ఉన్నాయి? అన్ని ప్రాంతాల్లో ఒకేలా వెదకాల్సిన అవసరం లేదు. మీ సంఘ క్షేత్రంలో ఏయే ప్రాంతాల్లో మీ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారో వాటిమీద, అలాగే మీ క్షేత్రానికి కాస్త దగ్గర్లోవున్న ప్రాంతాలమీద దృష్టి పెట్టవచ్చు. అయితే వెదికే పని ఓ క్రమపద్ధతిలో జరిగినప్పుడు, యెహోవా నామమున ప్రార్థించే అవకాశం వీలైనంత ఎక్కువమందికి దొరుకుతుంది.—యోవే. 2:32; రోమా. 10:14.
4. (ఎ) వెదికే పనిని ఎలా వ్యవస్థీకరించాలి? (బి) మీ భాష మాట్లాడే ప్రజలను ఎలా వెదకవచ్చు?
4 వెదికే పని క్రమపద్ధతిలో జరిగితే సమయం వృథా కాకుండా ఉంటుంది కాబట్టి పెద్దల సభ, ముఖ్యంగా సేవా పర్యవేక్షకుడు అందుకోసం ఏర్పాట్లు చేయాలి, వాటిని పర్యవేక్షించాలి. (1 కొరిం. 9:26, 27) భాషా గుంపుల్లో అయితే, వెదికే పనిలో నాయకత్వం వహించడానికి అర్హుడైన ఒక సహోదరుణ్ణి వీలైతే ఒక పెద్దను లేదా పరిచర్య సేవకుణ్ణి పెద్దల సభ నియమిస్తుంది. చాలా సంఘాలు ముందుగా టెలిఫోన్ డైరెక్టరీ లేదా ఇంటర్నెట్ ఉపయోగించి తమ భాష వాళ్లు సాధారణంగా పెట్టుకునే పేర్ల కోసం వెదుకుతారు. తర్వాత, వాళ్లకు ఫోన్ చేసి లేదా నేరుగా కలిసి ఎవరెవరు తమ క్షేత్రం కిందకు వస్తారో రాసిపెట్టుకుంటారు. అప్పుడప్పుడూ తమ సంఘం, దాని పర్యవేక్షణలో ఉన్న భాషా గుంపు కలిసి వెదికే పనిలో పాల్గొనేలా పెద్దల సభ ఏర్పాట్లు చేయవచ్చు.—“మీ భాష మాట్లాడే వాళ్లను ఎలా వెదకవచ్చు?” అనే బాక్సు చూడండి.
5. (ఎ) వెదికే పనిలో పాల్గొంటున్నప్పుడు ఉపయోగపడే సలహాలు చెప్పండి. (బి) వెదికే పని చేస్తున్నప్పుడు ఎలా మాట్లాడవచ్చు?
5 వెదికే పని ఎప్పుడు చేసినా, మన మనసులో లక్ష్యం స్పష్టంగా ఉండాలి. ఈ పని మన పరిచర్యలో భాగం కాబట్టి మామూలుగా ప్రకటనా పనికి వేసుకునే లాంటి బట్టలే వేసుకోవాలి. వెదికే పని చేస్తున్నప్పుడు, గృహస్థులతో ఎలా మాట్లాడాలో ప్రాక్టీసు చేయండి, ఆ భాషలో మాట్లాడుకోండి. దానివల్ల, ఉత్సాహం కాపాడుకోవడంతో పాటు ఆ భాషలో నైపుణ్యం కూడా సాధించవచ్చని చాలామంది తెలుసుకున్నారు. వెదికే పనిలో మనం వెచ్చించే సమయాన్ని రిపోర్టు చేయవచ్చు కానీ టెరిటరీ మ్యాప్‌లను, లిస్ట్‌లను సిద్ధం చేసే సమయాన్ని మాత్రం రిపోర్టు చేయకూడదు. మనం వెదుకుతున్న భాష మాట్లాడే వాళ్లు ఎవరైనా కలిసినప్పుడు అతనితో సువార్త పంచుకొని, వీలైనంత త్వరగా సేవా పర్యవేక్షకునికి గానీ ఆయన నియమించిన సహోదరునికి గానీ దాని గురించి చెప్పాలి. అప్పుడాయన, టెరిటరీ రికార్డుల్లో దాన్ని నమోదు చేస్తాడు. గృహస్థుడు ఆసక్తి చూపించినా, చూపించకపోయినా మనం అలా చెప్పాలి. వెదికే పని ప్రాముఖ్యమే అయినా, పరిచర్యకు సంబంధించిన ఇతర రంగాల మీద కూడా మనం శ్రద్ధపెట్టాలి.—“వెదుకుతున్నప్పుడు ఏం చెప్పాలి?” అనే బాక్సు చూడండి.
6. బధిరులను వెదికే పనిలో ఎలాంటి ప్రత్యేకమైన సవాళ్లు ఉంటాయి?
6 బధిరుల కోసం వెదకడం: ఈ పనిలో కొన్ని ప్రత్యేకమైన సవాళ్లు ఉంటాయి కాబట్టి ఎంతో పట్టుదల, కృషి అవసరం. పేరు చూసో, పైరూపం చూసో, వేసుకున్న బట్టలు చూసో బధిరులను గుర్తుపట్టడం కుదరదు. పైగా, వాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు వాళ్ల గురించి చెప్పడానికి తటపటాయించవచ్చు. బధిరులను వెదకడానికి కింద ఇచ్చిన సలహాలు, మౌఖిక భాష మాట్లాడే వాళ్లను వెదకడానికి కూడా పనికొస్తాయి.
7. (ఎ) బధిరుల కోసం ఎలా వాకబు చేయవచ్చు? (బి) గృహస్థుల భయాలను ఎలా పోగొట్టవచ్చు?
7 సంజ్ఞా భాష సంఘాలు, గ్రూపులు జనావాస ప్రాంతాల్లో విచారణ చేసి మంచి ఫలితాలు పొందాయి. గృహస్థుడు బహుశా తన పొరుగు వాళ్లో, సహోద్యోగో, తోటి విద్యార్థో సంజ్ఞా భాష మాట్లాడడం గమనించి ఉండవచ్చు. లేదా అతని బంధువుల్లో ఎవరో ఒకరు బధిరుడై ఉండవచ్చు. కొన్ని దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో సంజ్ఞా భాష మాట్లాడే పిల్లలున్నారని తెలిపే సైన్‌బోర్డ్‌లు పెడతారు. అయితే, మనం చేసే పనిని కొందరు సందేహించే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. కానీ, మనం ఎందుకు వచ్చామో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ సూటిగా, నిజాయితీగా, మర్యాదగా వివరిస్తే వాళ్ల భయాలను పోగొట్టవచ్చు. వెదికే పని చేస్తున్నప్పుడు కొందరు సంజ్ఞా భాష బైబిలునూ డీవీడీలనూ చూపించి, బధిరులతో ఈ విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నామని చెప్తారు. అలా వాళ్లు మంచి ఫలితాలు సాధించారు. బధిరుడైన తన బంధువు లేదా స్నేహితుని వివరాలు చెప్పడానికి గృహస్థుడు సంకోచిస్తే, మీ అడ్రస్ కార్డు గానీ సంఘ కూటాల ఆహ్వానపత్రం గానీ చూపించి, అది వాళ్లకు ఇవ్వమని చెప్పవచ్చు.
8. సంజ్ఞా భాష సంఘానికి, దగ్గర్లోని సంఘం ఎలా సహాయం చేయవచ్చు?
8 సంజ్ఞా భాష సంఘాలు ఏడాదికి ఒకట్రెండు రోజులు, పెద్దగావున్న తమ క్షేత్రంలోని ఒక పట్టణంలో లేదా నగరంలో బధిరుల కోసం వెదకడానికి దగ్గర్లోని వేరే భాష సంఘం సహాయం కోరవచ్చు. సంజ్ఞా భాష సంఘం, సేవ కోసం నిర్వహించే ఒక కూటంలో దానికి సంబంధించిన నిర్దేశాలను, ప్రదర్శనను చేర్చవచ్చు. ప్రతీ కారు గ్రూపులో, సంజ్ఞా భాష సంఘానికి చెందిన కనీసం ఒక ప్రచారకుడు, వెదకాల్సిన నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన మ్యాపు ఉంటే మంచిది.
9. బధిరులు ఎక్కువగా వెళ్లే ఆయా ప్రాంతాల్లో మనమెలా వెదకవచ్చు?
9 ఆటవిడుపుకు, కలిసి సమయం గడపడానికి, సమాజంలోని సహాయక సేవలు పొందడానికి బధిరులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాల్లో కూడా మనం వెదకవచ్చు. అలా వెదుకుతున్నప్పుడు, ప్రచారకులు ఆ సందర్భానికి తగిన బట్టలు వేసుకోవాలి. అక్కడున్న వాళ్లందరితో కాకుండా ఒకరిద్దరితోనే మాట్లాడడం, వివేచన చూపించడం మంచిది. వాళ్లు చక్కగా వింటే, మీకు ఒకరి వివరాలు ఒకరు ఇచ్చిపుచ్చుకోవచ్చు.
10. స్థానిక వ్యాపారాల దగ్గర ఎలా వెదకవచ్చు?
10 మరో పద్ధతి ఏమిటంటే, స్థానిక వ్యాపారాలను సూచించే ఒక మ్యాప్ తయారుచేసి, తగిన సమయంలో అక్కడికి వెళ్లి వెదకడం. ఉదాహరణకు, పెట్రోల్ బంక్‌లు ఎక్కడెక్కడ ఉన్నాయో సూచిస్తూ ఒక మ్యాప్ తయారుచేయవచ్చు. మరో మ్యాప్‌లో డ్రై క్లీనింగ్ సెంటర్లను, లాండ్రీలను, రెస్టారెంట్లను, హోటళ్లను సూచించవచ్చు. ఒక మ్యాప్‌లో ఒకే రకమైన వ్యాపారం గురించి ఉంటే, ప్రచారకులు ఒకే పద్ధతిని అనుసరించి దానిలో అనుభవం, నేర్పు సంపాదించవచ్చు. ఉదాహరణకు, హోటళ్లలో బధిరులు కూడా ఉంటారు కాబట్టి రిసెప్షనిస్ట్‌కు మన పని గురించి క్లుప్తంగా వివరించి, ఒక డీవీడీ-సంఘ కూటాల ఆహ్వానపత్రం ఉన్న ప్యాకెట్ అందించి వాళ్లకు ఇవ్వమని చెప్పవచ్చు. ఇంకొన్ని వ్యాపార స్థలాల్లో అయితే, అక్కడ పనిచేసే వాళ్లలో లేదా అక్కడికి వచ్చే కస్టమర్లలో ఎవరైనా సంజ్ఞా భాష మాట్లాడతారేమోనని వాకబు చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ ప్రాంతంలో బధిరుల కోసం పాఠశాల ఉంటే, లైబ్రరీలో పెట్టడానికి డీవీడీ రూపంలో ఉన్న కొన్ని ప్రచురణలు ఇవ్వవచ్చు.
11. వెదికే పని, పరిచర్యలో ముఖ్యమైన భాగమని ఎందుకు చెప్పవచ్చు?
11 ప్రాముఖ్యమైన పని: మన భాష మాట్లాడే వాళ్ల కోసం వెదకడం కాస్త కష్టమైన పనే. పైగా, కొన్ని ప్రాంతాల్లో వేర్వేరు భాషల వాళ్లు తరలి వస్తుంటారు, వెళ్తుంటారు. దాంతో, ఎప్పటికప్పుడు ఆ వివరాలను టెరిటరీ రికార్డుల్లో చేర్చడం పెద్ద సవాలు అయిపోతుంది. అయినా సరే చాలా ప్రాంతాల్లో, వెదికే పని పరిచర్యలో ఒక ముఖ్యమైన భాగం. పైగా, అలాంటి ప్రాంతాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకటించే పనిని మనకు అప్పగించిన యెహోవా పక్షపాతి కాడు. (అపొ. 10:34) “ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.” (1 తిమో. 2:3, 4) కాబట్టి, “యోగ్యమైన మంచి మనస్సు” ఉన్న అన్ని భాషల ప్రజలను వెదకడంలో యెహోవాతో, అలాగే ఒకరితో ఒకరం కలిసి పనిచేద్దాం.—లూకా 8:15.
[7వ పేజీలోని బాక్సు]