మన అధికారిక వెబ్సైట్—మనకు, ఇతరులకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందింది
రాజ్య సువార్తను ‘సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటించాలని’ యేసు మనకు ఆజ్ఞాపించాడు. (మత్త. 24:14) మన ‘పరిచర్యను సంపూర్ణంగా’ చేయడానికి ఉపకరించేలా, watchtower.org, jw-media.org, jw.org అనే ఈ మూడు వెబ్సైట్లను కలిపి ఒక కొత్త స్వరూపంతో jw.org అనే వెబ్‌సైట్‌ని రూపొందించాం.—2 తిమో. 4:5.
‘లోకమంతటా’: ప్రపంచ జనాభాలో మూడొంతులమంది ఇంటర్నెట్ను వాడుతున్నారు. నేడు చాలామంది, ముఖ్యంగా యువత ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా దాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇంటర్నెట్ ఉపయోగించేవాళ్లకు మన వెబ్సైట్, బైబిలు సంబంధిత ప్రశ్నలకు సరైన జవాబులు ఇస్తుంది. ఈ వెబ్సైట్ ద్వారా యెహోవా సంస్థ ఆసక్తిపరులకు చేరువౌతుంది, వాళ్లు కూడా ఉచిత గృహ బైబిలు అధ్యయనం కోసం సులువుగా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా, రాజ్య సందేశం వినే అవకాశం అంతగా దొరకని ప్రాంతాల్లోని ప్రజలకు కూడా సువార్త వెళ్లడం సాధ్యమౌతుంది.
“సకల జనములు”: “సకల జనములకు” సాక్ష్యమివ్వాలంటే, మనం బైబిలు సత్యాన్ని అనేక భాషల్లో అందించాలి. jw.orgని సందర్శించేవాళ్లు సుమారు 400 భాషల్లో సమాచారాన్ని చూడొచ్చు. మరే వెబ్సైట్ ఇన్ని భాషల్లో లేదు.
దాన్ని చక్కగా ఉపయోగించండి: సరికొత్త రూపంలోని jw.org వెబ్సైట్ బయటివాళ్లకు మాత్రమే కాదు, యెహోవాసాక్షులకు కూడా ఇదెంతో ఉపయోగపడుతుంది. మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే, jw.org గురించి బాగా తెలుసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. దీన్ని ఎలా ఉపయోగించాలో కింద కొన్ని సలహాలున్నాయి.
[3వ పేజీలోని డయాగ్రామ్]
(For fully formatted text, see publication)
ఇలా చేసి చూడండి
1 మీ కంప్యూటర్ ఇంటర్నెట్ బ్రౌజర్లోని అడ్రస్ ఫీల్డ్‌లో www.pr2711.com అని టైప్ చేయండి.
2 హెడ్డింగ్‌లను, మెనూ ఆప్షన్లను, లింక్‌లను క్లిక్ చేస్తూ వెబ్సైట్లో ఏముందో తెలుసుకోండి.
3 ఇంటర్నెట్ పనిచేసే మొబైల్ ఫోన్లో కూడా jw.org వెబ్‌సైట్‌ని తెరిచి చూడండి. మొబైల్ తెరకు తగ్గట్టుగా వెబ్‌పేజీ రూపం మారుతుంది, కానీ సమాచారం మాత్రం మారదు.