ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—యోవేలు
1. పరిచర్యలో మనం యోవేలులా వినయాన్ని ఎలా చూపించవచ్చు?
1 యోవేలు ప్రవక్త ఎవరు? తాను ‘పెతూయేలు కుమారుణ్ణి’ అనే విషయం మాత్రమే ఆయన తెలియజేశాడు. (యోవే. 1:1) వినయస్థుడైన ఈ ప్రవక్త తన గురించి ఎక్కువ చెప్పుకోలేదు గానీ యెహోవా సందేశానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే మనం కూడా పరిచర్యలో, ప్రజలు మనల్ని గుర్తించాలనో, పొగడాలనో ఆశించంగానీ వాళ్ల దృష్టి యెహోవా మీదకు, బైబిలు మీదకు వెళ్లేలా చేస్తాం. (1 కొరిం. 9:16; 2 కొరిం. 3:5) అంతేకాదు, మనం ప్రకటించే సందేశం వల్ల మనం బలం పొందుతాం. యోవేలు ప్రవచనంలోని ఏ అంశాలు మనలో భవిష్యత్తుపై ఆశను, ఉత్సాహాన్ని నింపుతాయి?
2. యెహోవా దినం దగ్గరవడం గురించి ఆలోచిస్తే మనం ఏమి చేస్తాం?
2 “యెహోవా దినము వచ్చెనే!” (యోవే. 1:15): యోవేలు ఈ మాటలు రాసి ఇప్పటికి వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే మనం వాటి అంతిమ నెరవేర్పు కాలంలో జీవిస్తున్నాం. లోకంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోవడం, ప్రజలు మన పరిచర్యను పట్టించుకోకపోవడం, హేళన చేయడం వంటివన్నీ మనం ఈ దుష్ట లోకపు అంత్యదినాల్లో జీవిస్తున్నాం అనడానికి స్పష్టమైన నిదర్శనాలు. (2 తిమో. 3:1-5; 2 పేతు. 3:3, 4) అంతం ఎంత దగ్గర్లో ఉందో ఆలోచిస్తే, మన జీవితంలో తప్పకుండా పరిచర్యకు మొదటి స్థానం ఇస్తాం.—2 పేతు. 3:11, 12.
3. మహాశ్రమలు దగ్గరపడుతుండగా, పరిచర్యలో కొనసాగడం ఎందుకు ప్రాముఖ్యం?
3 “యెహోవా తన జనులకు ఆశ్రయమగును.” (యోవే. 3:16): భూమ్యాకాశములు వణుకుతున్నాయనే వర్ణన, మహాశ్రమల కాలంలో యెహోవా తన తీర్పులు అమలు చేసినప్పుడు ఏంజరుగుతుందో తెలియజేస్తుంది. అయితే ఆ సమయంలో యెహోవా తన నమ్మకమైన సేవకులను కాపాడతాడని తెలుసుకోవడం మనకు ఊరటనిస్తుంది. (ప్రక. 7:9, 14) మనం పరిచర్యలో కొనసాగుతూ, యెహోవా మనల్ని ఎలా కాపాడుతున్నాడో, బలపరుస్తున్నాడో చూడడం వల్ల మహాశ్రమలు వచ్చినప్పుడు తట్టుకోవడానికి సహాయపడేంత విశ్వాసాన్ని, సహనాన్ని పెంపొందించుకుంటాం.
4. మనం ఎందుకు సంతోషంగా ఉంటూ భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవచ్చు?
4 యోవేలు సందేశమంతా నాశనం గురించే చెబుతోందని కొంతమంది విమర్శించినా, అది దేవుని ప్రజలకు మాత్రం విడుదల దొరుకుతుందనే అద్భుత నిరీక్షణను ఇస్తుంది. (యోవే. 2:32) అందుకే మనం యోవేలు 2:23లోని, “ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి” అనే మాటలను పాటిస్తూ, దేవుని రాజ్యసువార్తను ఉత్సాహంగా ప్రకటిద్దాం, భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొందాం.