ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—ఆమోసు
1. ఆమోసు ఉదాహరణ మనకెందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది?
1 పెద్ద చదువులు, ఆస్తిపాస్తులు లేవు కాబట్టి ప్రకటించడానికి అర్హులం కామని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలాగైతే, ఆమోసు ఉదాహరణను చూసి మీరు ధైర్యం తెచ్చుకోవచ్చు. ఆయన గొర్రెలు కాసేవాడు, అలాగే కొన్ని రుతువుల్లో కాసే పండ్ల తోటల్లో కూలీగా పని చేసేవాడు. అలాంటివాణ్ణి యెహోవా ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని ప్రకటించేందుకు సమర్థుణ్ణి చేశాడు. (ఆమో. 1:1; 7:14, 15) అదేవిధంగా, ఈ రోజుల్లో కూడా యెహోవా వినయస్థులను, దీనులను ఉపయోగించుకుంటున్నాడు. (1 కొరిం. 1:27-29) మన పరిచర్యకు సంబంధించి, ఆమోసు ప్రవక్త నుండి మనం ఇంకా ఏమి నేర్చుకోవచ్చు?
2. పరిచర్యలో వ్యతిరేకత వచ్చినా మనమెందుకు స్థిరంగా ఉండవచ్చు?
2 వ్యతిరేకత వచ్చినా స్థిరంగా ఉండండి: ఇశ్రాయేలు పదిగోత్రాల ఉత్తర రాజ్యంలో దూడను ఆరాధించే యాజకుడైన అమజ్యా, ఆమోసు ప్రవచించడం విని, ‘వెళ్లిపో ఇక్కడ నుంచి! మమ్మల్ని ఇలా వదిలేయ్! మా మతం మాకుంది!’ అని అర్థమిచ్చే మాటలంటూ మండిపడ్డాడు. (ఆమో. 7:12, 13) ఆమోసు పనిని ఆపుజేయించాలని యరొబాము రాజుకు తాను పంపిన లేఖలో అమజ్యా ఆ ప్రవక్త మాటల్ని వక్రీకరించాడు. (ఆమో. 7:7-11) కానీ ఆమోసు భయపడలేదు. నేడు కూడా, యెహోవా ప్రజల్ని హింసించడానికి కొందరు మతనాయకులు రాజకీయ మద్దతును తీసుకుంటున్నారు. అయినా, ‘మనకు విరోధముగా రూపొందిన ఏ ఆయుధమూ’ శాశ్వత విజయం సాధించదని యెహోవా మనకు హామీనిస్తున్నాడు.—యెష. 54:17.
3. నేడు మనం ప్రకటించే సందేశంలో ఏ రెండు అంశాలు ఉన్నాయి?
3 దేవుని తీర్పును, భవిష్యత్తు ఆశీర్వాదాలను ప్రకటించండి: ఆమోసు ఇశ్రాయేలు పదిగోత్రాల ఉత్తర రాజ్యానికి వ్యతిరేకంగా తీర్పును ప్రవచించాడు. అయినా తన పుస్తకం ముగింపులో, ఇశ్రాయేలీయులను చెర నుండి విడిపించడం గురించి, వాళ్లను మెండుగా దీవించడం గురించి యెహోవా చేసిన ప్రమాణాన్ని ఆయన ప్రస్తావించాడు. (ఆమో. 9:13-15) మనం కూడా రాబోయే దేవుని ‘తీర్పుదినం’ గురించి మాట్లాడతాం, అయితే అది మనం ప్రకటించాల్సిన ‘రాజ్య సువార్తలో’ ఒక భాగం మాత్రమే. (2 పేతు. 3:7; మత్త. 24:14) హార్మెగిద్దోనులో యెహోవా దుష్టులను నాశనం చేసినప్పుడు భూపరదైసుకు బాట ఏర్పడుతుందనే విషయాన్ని కూడా మనం ప్రజలకు తెలియజేస్తాం.—కీర్త. 37:34.
4. యెహోవా చిత్తాన్ని నెరవేర్చగలమని మనం ఎందుకు చెప్పవచ్చు?
4 ఈ ప్రపంచంలో మన రాజ్యసందేశాన్ని వ్యతిరేకించేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటివాళ్ల మధ్య సువార్త ప్రకటించడం అనేది, మనం యెహోవాకు చేసుకున్న సమర్పణకు తగినట్లు జీవించాలనే, ఆయన చిత్తం చేయాలనే మన కృతనిశ్చయానికి నిజంగా ఓ పరీక్షే. (యోహా. 15:19) అయినా, యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమోసుకు సహాయం చేసినట్లే మనకూ చేస్తాడనే నమ్మకంతో మనం ఉన్నాం.—2 కొరిం. 3:5.