ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఎక్కువ ఆనందం పొందండి!
1. ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో మీ ఆనందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు?
1 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలనుందా? అయితే, పరిచర్యలో ఎక్కువగా పాల్గొనండి, వీలైతే సహాయ పయినీరు సేవ చేయండి. ఎక్కువగా పరిచర్య చేస్తే ఎందుకు ఎక్కువ ఆనందం పొందుతాం?
2. ఎక్కువగా పరిచర్య చేస్తే మన సంతోషం ఎందుకు పెరుగుతుంది?
2 మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి: మనం తనను ఆరాధిస్తూ సంతోషాన్ని, సంతృప్తిని పొందేలా యెహోవా మనల్ని సృష్టించాడు. (కీర్త. 144:15) ఇవ్వడంలో ఆనందం పొందేలా కూడా ఆయన మనల్ని రూపించాడు. (అపొ. 20:35) పరిచర్య వల్ల మనం ఒకే సమయంలో ఆ రెండు పనులూ చేస్తాం. ఒకటి, దేవుణ్ణి ఆరాధిస్తాం; రెండు, ఇతరులకు సహాయం చేస్తాం. కాబట్టి, ఎంతగా పరిచర్య చేస్తే అంతగా సంతోషం పొందుతాం. అంతేకాక, పరిచర్యలో ఎక్కువగా పాల్గొనే కొద్దీ మన నైపుణ్యం కూడా మెరుగౌతుంది. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, ధైర్యంగా ప్రకటించగలుగుతాం. అలా ఎక్కువమందికి సాక్ష్యమిస్తూ, మరిన్ని బైబిలు అధ్యయనాలు ప్రారంభించగలుగుతాం. వీటన్నిటి వల్ల పరిచర్యలో మన ఆనందం రెట్టింపౌతుంది.
3. సహాయ పయినీరు సేవకు మార్చి, ఏప్రిల్ నెలలు ఎందుకు అనువుగా ఉంటాయి?
3 సహాయ పయినీరు సేవ చేయడానికి మార్చి, ఏప్రిల్ నెలలు చాలా అనువుగా ఉంటాయి. ఎందుకంటే, ఆ నెలల్లో 30 గంటలు చేయాలో, 50 గంటలు చేయాలో ఎంచుకునే అవకాశం మనకుంటుంది. దానికితోడు, మార్చి 22 నుండి ఏప్రిల్ 14న జ్ఞాపకార్థ ఆచరణ జరిగే వరకు సంతోషకరమైన ప్రచార కార్యక్రమంలో పాల్గొంటాం. ఆ గడువులో వీలైనంత ఎక్కువమందిని ఆహ్వానించడానికి చాలామంది సహోదరులు “యేకమనస్కులై” పనిచేస్తారు కాబట్టి సంఘాలు ఉత్సాహంతో నిండిపోతాయి.—జెఫ. 3:9.
4. సహాయ పయినీరు సేవ చేయడానికి ఎలా సిద్ధపడాలి?
4 ఇప్పుడే సిద్ధపడండి: మీరు ఇంకా సిద్ధపడకపోతే, వెంటనే మీ పరిస్థితుల్ని పరిశీలించుకొని ఒకటి లేదా రెండు నెలలు ఎక్కువ పరిచర్య చేయగలిగేలా ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవచ్చో ఆలోచించండి. దాన్ని ప్రార్థనలో పెట్టండి. (యాకో. 1:5) మీ కుటుంబంతో, తోటి సహోదరసహోదరీలతో దాని గురించి మాట్లాడండి. (సామె. 15:22) అలాచేస్తే అనారోగ్య సమస్యలున్నా, ఖాళీ సమయం లేకపోయినా మీరు సహాయ పయినీరు సేవలోని ఆనందాన్ని ఆస్వాదించవచ్చని గుర్తిస్తారు.
5. ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఎక్కువగా పరిచర్య చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి?
5 తన సేవకులు సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్త. 32:11) ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఎక్కువగా పరిచర్య చేయడానికి కృషిచేద్దాం. దానివల్ల మన సంతోషం రెట్టింపౌతుంది, మన పరలోక తండ్రి హృదయాన్ని కూడా సంతోషపెడతాం.—సామె. 23:24; 27:11.