సరికొత్త రూపంతో కొత్త కరపత్రాలు!
1. మనం పరిచర్యలో ఉపయోగించే వేటిని సరికొత్తగా రూపొందించారు?
1 “దేవుని వాక్యమే సత్యం!” జిల్లా సమావేశంలో ఐదు కొత్త కరపత్రాలు అందుకున్నాం. “చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా?” అనే రాజ్యవార్త నం. 38 కూడా వాటితోపాటు చేరింది. ఈ ఆరు కరపత్రాలను ఆసక్తికరమైన రూపంతో తయారుచేశారు. ఎందుకలా తయారుచేశారు? ఈ కరపత్రాలను ఇంటింటి పరిచర్యలో ఇస్తున్నప్పుడు, వాటిలోని ఆయా అంశాలను చక్కగా ఎలా ఉపయోగించవచ్చు?
2. కరపత్రాలను కొత్త రూపంతో ఎందుకు తయారుచేశారు?
2 కొత్త రూపం ఎందుకు? ఇంటింటి పరిచర్యలో సమర్థవంతంగా మాట్లాడడానికి తరచూ ఈ నాలుగు పనులు చేస్తాం: (1) సంభాషణ మొదలుపెట్టగలిగేలా అభిప్రాయం రాబట్టే ప్రశ్న వేస్తాం. (2) దానికి సంబంధించిన లేఖనాన్ని చూపిస్తాం. (3) ఇంటివాళ్లు చదువుకోవడానికి ప్రచురణ ఇస్తాం. (4) ఈసారి వచ్చినప్పుడు జవాబిచ్చేలా ఒక ప్రశ్న అడుగుతాం, మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకుంటాం. కొత్త కరపత్రాల రూపం, ఈ నాలుగు పనులూ చేయడానికి అనువుగా ఉంటుంది.
3. కొత్త కరపత్రాలను పరిచర్యలో ఎలా అందించవచ్చు?
3 ఎలా ఉపయోగించాలి? (1) ఇంటివాళ్లను పలకరించాక, కరపత్రం మీదున్న ప్రశ్నను, దాని కిందవున్న ఎంపికలను చూపించి వాళ్ల అభిప్రాయం అడగండి. (2) తర్వాత కరపత్రం తెరచి, “పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?” అనే భాగం పరిశీలించండి. పరిస్థితులు అనుకూలిస్తే, నేరుగా బైబిలు తెరచి ఆ లేఖనం చదవండి. వాళ్లకు సమయం ఉంటే, “దానివల్ల మీరు పొందే ప్రయోజనాలు” అనే భాగం చర్చించండి. (3) కరపత్రం ఇచ్చి, మిగతా సమాచారాన్ని తీరిక దొరికినప్పుడు చదవమనండి. (4) వెళ్లేముందు, కరపత్రం వెనుక ఉన్న “ఒక్కసారి ఆలోచించండి . . . ” అనే భాగం చూపించి, బైబిలు ఇచ్చే జవాబును పరిశీలించడానికి మళ్లీ కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకోండి.
4. పునర్దర్శనంలో కొత్త కరపత్రాలను ఎలా ఉపయోగించవచ్చు?
4 వీటితో పునర్దర్శనం చేయడం కూడా తేలిక. కరపత్రం వెనుక భాగంలో ఉన్న లేఖనాలను ఉపయోగించి, అంతకుముందు కలిసినప్పుడు చివర్లో అడిగిన ప్రశ్నకు జవాబివ్వండి. వెళ్లేముందు, కరపత్రం మీదున్న మంచివార్త బ్రోషుర్ చిత్రం చూపించి, అక్కడ చదవమని ఉన్న పాఠానికి బ్రోషుర్ను తెరచి దాన్ని వాళ్లకు ఇవ్వండి. వాళ్లు దాన్ని తీసుకుంటే, ఈసారి వచ్చినప్పుడు అందులో నుండి చర్చించేలా ఏర్పాట్లు చేసుకోండి. అంతే, మీరు బైబిలు అధ్యయనం మొదలుపెట్టేసినట్లే! అలాకాకుండా, బ్రోషుర్కు బదులు ఇంకో కరపత్రం ఇచ్చి, ఈసారి వెళ్లినప్పుడు దాన్నుండి చర్చించేలా కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు.
5. మన పరిచర్యలో కరపత్రాలకు ఎంత ప్రాముఖ్యత ఉంది?
5 మనం 130 ఏళ్లకు పైగా కరపత్రాలను పరిచర్యలో ఉపయోగిస్తున్నాం. వాటి పరిమాణం, రూపురేఖలు మారుతూ వచ్చినా సమర్థవంతంగా సాక్ష్యమివ్వడానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. కొత్తగా రూపొందించిన కరపత్రాలను చక్కగా ఉపయోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా బైబిలు జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో కొనసాగుదాం.—సామె. 15:7ఎ.