క్షేత్రసేవా కూటాలు, వాటికున్న ఉద్దేశాన్ని అవి నెరవేరుస్తాయి
1. క్షేత్రసేవా కూటాల ఉద్దేశం ఏమిటి?
1 ఒక సందర్భంలో, తన 70 మంది శిష్యుల్ని ప్రచార కార్యక్రమానికి పంపే ముందు యేసు వాళ్లతో కూటం జరిపాడు. (లూకా 10:1-11) వాళ్లు ఒంటరిగా లేరని, “కోత యజమాని” యెహోవా వాళ్లను నిర్దేశిస్తున్నాడని గుర్తుచేసి ప్రోత్సహించాడు. ఆ పని కోసం నిర్దేశాలిచ్చి వాళ్లను సిద్ధంచేశాడు, “ఇద్దరిద్దరినిగా” పంపిస్తూ క్రమపర్చాడు. నేడు, పరిచర్యకు వెళ్లేముందు మనం జరుపుకునే కూటాల ఉద్దేశం కూడా అదే. అవి మనల్ని ప్రోత్సహిస్తాయి, సిద్ధంచేస్తాయి, క్రమపరుస్తాయి.
2. క్షేత్రసేవా కూటం ఎంతసేపు జరగాలి?
2 ప్రస్తుతం క్షేత్రసేవా కూటాలు 10-15 నిమిషాల పాటు జరుగుతున్నాయి; అందులో ప్రచారకులను గుంపులుగా వేరు చేసి, క్షేత్రాన్ని నియమించి, ప్రార్థన చేస్తారు. ఇప్పుడు అది కాస్త మారుతుంది. ఏప్రిల్ నుండి, క్షేత్రసేవా కూటాలు 5-7 నిమిషాల పాటు జరుగుతాయి. ఒకవేళ ఏదైనా సంఘకూటం తర్వాత అది జరుగుతుంటే, ఇంకా చిన్నగా ఉండాలి. ఎందుకంటే, దానికి వచ్చేవాళ్లు అప్పటివరకు చక్కని బైబిలు ఆధారిత చర్చను ఆనందించారు. క్షేత్రసేవా కూటాలు చిన్నగా ఉంటే, అందరూ పరిచర్యలో కాస్త ఎక్కువ సమయం గడపగలుగుతారు. క్షేత్రసేవా కూటానికి ముందే పయినీర్లు, ప్రచారకులు పరిచర్య మొదలుపెట్టి ఉంటే, వాళ్లు మధ్యలో ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం ఉండదు.
3. క్షేత్రసేవా కూటాల నుండి ప్రచారకులు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే, వాటిని ఎలా ఏర్పాటుచేయాలి?
3 క్షేత్రసేవా కూటాలను తప్పకుండా ఏర్పాటుచేయాలి. అలాచేస్తే వాటినుండి ప్రచారకులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. చాలా సంఘాల్లో, సంఘమంతా కలిసి ఒకే చోట క్షేత్రసేవా కూటం జరుపుకునే బదులు ప్రతీ క్షేత్రసేవా గుంపు వేరుగా ఈ కూటం జరుపుకోవడం మంచిది. దానివల్ల క్షేత్రసేవా కూటానికి, క్షేత్రానికి వెళ్లడం ప్రచారకులకు సులభంగా ఉంటుంది. ప్రచారకులను త్వరగా క్రమపర్చవచ్చు, అలాగే గుంపు పర్యవేక్షకులు తమ గుంపులోనివాళ్ల మీద ఎక్కువ శ్రద్ధ చూపించగలుగుతారు. పెద్దల సభ స్థానిక పరిస్థితులను పరిశీలించి, ఏ పద్ధతి మంచిదో నిర్ణయించాలి. చిన్న ప్రార్థనతో కూటాన్ని ముగించాలి; దానికి ముందే, తాము ఎక్కడ-ఎవరితో కలిసి పనిచేయాలో ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి.
4. క్షేత్రసేవా కూటాలు మిగతా కూటాలంత ప్రాముఖ్యంకాదని ఎందుకు అనుకోకూడదు?
4 సంఘ కూటాల కన్నా తక్కువేమీ కాదు: క్షేత్రసేవా కూటాలను, పరిచర్యకు వెళ్లబోతున్న వాళ్ల ప్రయోజనం కోసం జరుపుతారు కాబట్టి వాటికి సంఘమంతా రాకపోవచ్చు. అంతమాత్రాన వాటిని చులకనగా చూడకూడదు లేదా సంఘ కూటాలంత ప్రాముఖ్యంకాదని అనుకోకూడదు. అన్ని కూటాల్లాగే ఈ కూటాలు కూడా ప్రేమ చూపడానికి, మంచి పనులు చేయడానికి ఒకరినొకరం పురికొల్పుకోవడానికి యెహోవా చేసిన ఏర్పాటు. (హెబ్రీ. 10:24, 25) కాబట్టి ఈ కూటాన్ని నిర్వహించే సహోదరుడు యెహోవాకు ఘనత వచ్చేలా, వచ్చినవాళ్లు ప్రయోజనం పొందేలా దాన్ని నిర్వహించడానికి చక్కగా సిద్ధపడాలి. కుదిరితే, పరిచర్యకు వెళ్లేవాళ్లు క్షేత్రసేవా కూటానికి హాజరవడానికి తప్పక ప్రయత్నించాలి.
క్షేత్రసేవా కూటాలను చులకనగా చూడకూడదు లేదా సంఘ కూటాలంత ప్రాముఖ్యంకాదని అనుకోకూడదు
5. (ఎ) క్షేత్రసేవా కూటాలు ఏర్పాటు చేసే విషయంలో సేవా పర్యవేక్షకుని పాత్ర ఏమిటి? (బి) క్షేత్రసేవా కూటాన్ని ఒక సహోదరి ఎలా నిర్వహించాలి?
5 నిర్వాహకుడు ఎలా సిద్ధపడాలి? కూటంలో భాగం నిర్వహించడానికి ఎవరైనా చక్కగా సిద్ధపడాలంటే, వాళ్లకు నియామకాన్ని ముందుగానే ఇవ్వాలి. క్షేత్రసేవా కూటాల విషయంలో కూడా అంతే. క్షేత్రసేవా గుంపులు వేర్వేరుగా కలుసుకున్నప్పుడు, గుంపు పర్యవేక్షకులు లేదా వాళ్ల సహాయకులు ఈ కూటం నిర్వహిస్తారు. అయితే సంఘమంతా కలిసి క్షేత్రసేవా కూటం జరుపుకున్నప్పుడు, దాన్ని నిర్వహించడానికి సేవా పర్యవేక్షకుడు ఒకరిని నియమిస్తాడు. కొందరు సేవా పర్యవేక్షకులు, అలా నిర్వహించే వాళ్లందరికీ ఒక పట్టిక ఇస్తారు, దాని కాపీ ఒకటి నోటీసు బోర్డు మీద కూడా పెడతారు. క్షేత్రసేవా కూటం నిర్వహించడానికి సహోదరులను నియమిస్తున్నప్పుడు సేవా పర్యవేక్షకుడు మంచి వివేచన ఉపయోగించాలి. ఎందుకంటే, ఈ కూటాల నాణ్యత వాటిని నిర్వహించే సహోదరుల బోధించే, క్రమపర్చే సామర్థ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆయా రోజుల్లో కూటం నిర్వహించడానికి సంఘ పెద్దగానీ, పరిచర్య సేవకుడుగానీ, అర్హుడైన సహోదరుడుగానీ లేకపోతే సేవా పర్యవేక్షకుడు సమర్థురాలైన, బాప్తిస్మం పొందిన ఒక సహోదరిని అందుకు నియమించవచ్చు.— ““సహోదరి నిర్వహించాల్సి వస్తే . . . ” అనే ఆర్టికల్ చూడండి.
6. క్షేత్రసేవా కూటాన్ని నిర్వహించే సహోదరుడు ఎందుకు చక్కగా సిద్ధపడాలి?
6 దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో లేదా సేవా కూటంలో మనకొక నియామకం ఇస్తే, దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం, చక్కగా సిద్ధపడతాం. అంతేగానీ, ఏంమాట్లాడాలనే దానిగురించి కూటానికి బయల్దేరిన తర్వాత ఎవ్వరమూ ఆలోచించడం మొదలుపెట్టం. క్షేత్రసేవా కూటాన్ని నిర్వహించే బాధ్యతను కూడా మనం అలాగే చూడాలి. ఇప్పుడు క్షేత్రసేవా కూటం కాసేపే ఉంటుంది కాబట్టి అది అర్థవంతంగా ఉండాలన్నా, సమయానికి ముగించాలన్నా చక్కని సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. అందులో ముందే క్షేత్రాన్ని తీసుకోవడం కూడా ఉంది.
7. నిర్వాహకుడు వేటి గురించి చర్చించవచ్చు?
7 ఏమి చర్చించాలి? ఒక్కో క్షేత్రంలో పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి కాబట్టి క్షేత్రసేవా కూటం కోసం నమ్మకమైన దాసుడు సంక్షిప్త ప్రతిని ఇవ్వలేదు. “క్షేత్రసేవా కూటంలో వీటిని పరిశీలించవచ్చు” అనే బాక్సులో కొన్ని సలహాలు ఉన్నాయి. సాధారణంగా, ఈ కూటం ఒక చర్చలా నిర్వహించాలి. ఎప్పుడైనా ఒకసారి, చక్కగా సిద్ధపడిన ఒక ప్రదర్శన చేయించవచ్చు లేదా jw.orgలోని సముచితమైన ఒక వీడియో చూపించవచ్చు. క్షేత్రసేవా కూటం నిర్వహించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఆ రోజు పరిచర్యకు వెళ్లే ప్రచారకులను ప్రోత్సహించడానికి, సిద్ధపర్చడానికి ఏం చేస్తే బావుంటుందో ఆలోచించాలి.
క్షేత్రసేవా కూటం నిర్వహించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఆ రోజు పరిచర్యకు వెళ్లే ప్రచారకులను ప్రోత్సహించడానికి, సిద్ధపర్చడానికి ఏంచేస్తే బావుంటుందో ఆలోచించాలి
8. శనివారం, ఆదివారం క్షేత్రసేవా కూటాల్లో వేటి గురించి చర్చిస్తే ఎక్కువ ప్రయోజనం ఉండవచ్చు?
8 శనివారం రోజు చాలామంది ప్రచారకులు కావలికోట, తేజరిల్లు! పత్రికలు ఇస్తారు. శనివారం పరిచర్య చేసేవాళ్లలో చాలామంది వారం మధ్యలో పరిచర్యకు వెళ్లరు కాబట్టి కుటుంబ ఆరాధనలో ప్రాక్టీసు చేసిన విషయాలు గుర్తుండకపోవచ్చు. కాబట్టి కూటం నిర్వహించేవాళ్లు, మన రాజ్య పరిచర్య చివరి పేజీలో ఇచ్చిన అందింపుల్లో ఒకదాన్ని సమీక్షించడంవల్ల ప్రయోజనం ఉండవచ్చు. ఒక స్థానిక వార్త, సంఘటన లేదా సెలవుదినం గురించి చెప్తూ పత్రిక ఎలా ఇవ్వవచ్చు? పత్రిక తీసుకుంటే, ఈసారి సందర్శనం కోసం ఎలా పునాది వేసుకోవచ్చు? లాంటి విషయాల గురించి కూడా చర్చించవచ్చు. వచ్చినవాళ్లలో ఎవరైనా ఇప్పటికే ఆ పత్రికలను అందించివుంటే, తమ సూచనలు చెప్పమని లేదా ప్రోత్సహించే అనుభవాలు పంచుకోమని వాళ్లను అడగవచ్చు. ఆదివారం రోజు, ఆ నెల అందించే ప్రచురణ విషయంలో నిర్వాహకుడు అదే పద్ధతి పాటించవచ్చు. మంచివార్త, దేవుడు చెప్పేది వినండి బ్రోషుర్లు, బైబిలు బోధిస్తోంది పుస్తకం లాంటి అధ్యయన ప్రచురణలను ఏ రోజైనా ఇవ్వవచ్చు కాబట్టి వాటిలో ఒకదాన్ని ఎలా అందించాలో నిర్వాహకుడు పరిశీలించవచ్చు.
9. ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న వారాంతంలో ఏమి చర్చించవచ్చు?
9 ఆ వారాంతం సంఘం ఏదైనా ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొంటుంటే, ఆహ్వానపత్రం లేదా కరపత్రంతోపాటు తాజా పత్రికలు ఎలా ఇవ్వాలో నిర్వాహకుడు పరిశీలించవచ్చు లేదా ఎవరైనా ఆసక్తి చూపిస్తే ఏంచేయాలో చర్చించవచ్చు. లేదా, అలాంటి ప్రచార కార్యక్రమాల విలువను చూపించే అనుభవాలను పంచుకోవచ్చు.
10, 11. క్షేత్రసేవా కూటం చక్కగా జరగాలంటే ప్రచారకుల మద్దతు ఎందుకు అవసరం?
10 ప్రచారకులు ఎలా సిద్ధపడాలి? క్షేత్రసేవా కూటం చక్కగా జరగాలంటే ప్రచారకుల మద్దతు కూడా అవసరం. కుటుంబ ఆరాధనలో లేదా వేరే సమయంలో పరిచర్యకు ముందే సిద్ధపడితే, కొన్ని విషయాలు ఇతర ప్రచారకులతో పంచుకోగలుగుతాం. మంచి సిద్ధపాటులో క్షేత్రసేవా కూటానికి రాకముందే పత్రికలను, ఇతర ప్రచురణలను దగ్గర పెట్టుకోవడం ఉంది. అప్పుడు అనవసరమైన ఆలస్యం లేకుండా అందరూ క్షేత్రానికి వెళ్లగలుగుతారు.
11 క్షేత్రసేవా కూటం మొదలవడానికి కొన్ని నిమిషాల ముందే వచ్చేలా ప్రణాళిక వేసుకోవడం కూడా ముఖ్యమే. మనం అన్ని సంఘ కూటాలకు సమయానికి వెళ్లడానికి కృషిచేస్తాం. అయితే, క్షేత్రసేవా కూటానికి ఆలస్యంగా వెళ్తే చాలా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎలా? ఒక గుంపును క్రమపర్చడానికి నాయకత్వం వహిస్తున్న సహోదరుడు చాలా విషయాలు ఆలోచిస్తాడు. ప్రచారకులు కొంతమందే ఉంటే, వాళ్లందరినీ అంతకుముందు పనిచేసిన క్షేత్రానికి పంపించాలనుకోవచ్చు. క్షేత్రం కాస్త దూరంలో ఉంటే, క్షేత్రసేవా కూటానికి నడిచివచ్చిన వాళ్లను వాహనాలు ఉన్న వాళ్లతో పంపించవచ్చు. క్షేత్రం నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో ఉంటే, సహోదరీలతో లేదా వాళ్లకు దగ్గర్లో సేవచేసేలా సహోదరులను పంపించవచ్చు. ఎక్కువ నడవలేని ప్రచారకులను, ఎత్తుపల్లాలు లేని వీధిలో లేదా మెట్లు ఎక్కువ లేని ఇళ్లు ఉన్న వీధిలో పరిచర్య చేయమనవచ్చు. కొత్త ప్రచారకులనైతే కాస్త అనుభవం ఉన్నవాళ్లతో పంపించవచ్చు. ఒకవేళ ప్రచారకులు ఆలస్యంగా వస్తే, వాళ్లకోసం ఈ ఏర్పాట్లను సవరించాల్సి లేదా పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ఒక్కోసారి మనం ఆలస్యంగా రావడానికి సరైన కారణమే ఉండవచ్చు. కానీ మనం తరచూ ఆలస్యంగా వస్తుంటే, క్షేత్రసేవా కూటాల విలువను గుర్తించకపోవడం లేదా మన పనులను క్రమపద్ధతిలో చేసుకోలేకపోవడం కారణమేమో పరిశీలించుకోవాలి.
12. మామూలుగా మీ ఏర్పాట్లు మీరే చేసుకుంటుంటే గనుక, దేని గురించి ఆలోచించవచ్చు?
12 క్షేత్రసేవా కూటానికి వచ్చే ప్రచారకులు కూటం మొదలవకముందే తాము ఎవరితో పనిచేస్తారో ఎంచుకోవచ్చు లేదా నిర్వాహకుడే వాళ్లు ఎవరితో చేయాలో చెప్తాడు. మామూలుగా మీ ఏర్పాట్లు మీరే చేసుకుంటుంటే గనుక, ప్రతీసారి అదే దగ్గరి స్నేహితులతో పనిచేసే బదులు రకరకాల ప్రచారకులతో కలిసి సేవచేసేలా మీ ‘హృదయాన్ని విశాలపర్చుకోగలరా’? (2 కొరిం. 6:11-13) అప్పుడప్పుడు కొత్త ప్రచారకులతో కలిసి పనిచేస్తూ బోధనా సామర్థ్యాన్ని మెరుగుచేసుకోవడానికి వాళ్లకు సహాయపడగలరా? (1 కొరిం. 10:24; 1 తిమో. 4:13, 15) ప్రకటించడం ఎక్కడ మొదలుపెట్టాలనే దానితోసహా మీకు ఇచ్చే ప్రతీ నిర్దేశాన్ని జాగ్రత్తగా వినండి. ఆ కూటం ముగిసిన తర్వాత చేసిన ఏర్పాట్లను మార్చకుండా, వెంటనే క్షేత్రానికి బయల్దేరండి.
13. అందరూ మనసుపెట్టి తమ వంతు తాము చేస్తే, క్షేత్రసేవా కూటాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?
13 యేసు క్రమపర్చి పరిచర్యకు పంపించిన 70 మంది ‘సంతోషముతో తిరిగివచ్చారు.’ (లూకా 10:17) ప్రకటనా పని మొదలుపెట్టడానికి ముందు యేసు జరిపిన కూటం వాళ్లు ఆ పని చక్కగా చేయడానికి సహాయం చేసింది. నేడు కూడా క్షేత్రసేవా కూటాల వల్ల అలాంటి ప్రయోజనమే ఉంటుంది. అందరూ మనసుపెట్టి తమ వంతు తాము చేస్తే, ‘సకల జనములకు సాక్ష్యమిచ్చే’ పనిని నెరవేర్చేలా క్షేత్రసేవా కూటాలు మనల్ని ప్రోత్సహిస్తాయి, సిద్ధంచేస్తాయి, క్రమపరుస్తాయి.—మత్త. 24:14.