పరిచర్య చేస్తున్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి
యెహోవా సేవలో నిర్విరామంగా పనిచేయాలనేది మన నిశ్చయమని 2014 సేవా సంవత్సరంలోని గణాంకాలు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఆ సంవత్సరంలో యెహోవాసాక్షులు 194,54,87,604 గంటలు పరిచర్య చేశారు. (కీర్త. 110:3; 1 కొరిం. 15:58) “కాలము సంకుచితమై యున్నది” కాబట్టి మనం పరిచర్యలో వెచ్చించే ఆ విలువైన సమయాన్ని ఎక్కువమందిని కలవడానికి ఉపయోగించగలమా?—1 కొరిం. 7:29.
మనం పరిచర్యలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైన ఒక పద్ధతిలో ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు పరిచర్య చేస్తున్నా, ఒకరితో కూడా మాట్లాడలేకపోతుంటే, కొన్ని సర్దుబాట్లు చేసుకొని ఎక్కువమందిని కలిసి మాట్లాడగలరా? ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారుతుంటాయి. అయితే, “గాలిని కొట్టినట్టు” కాకుండా మన సమయాన్ని మరింతగా సద్వినియోగం చేసుకోవడానికి ఈ కింది సలహాలు మీకు సహాయం చేస్తాయి.—1 కొరిం. 9:26, 27.
ఇంటింటి పరిచర్య: ఎన్నో దశాబ్దాలుగా, ప్రచారకులకు ఉదయం పూట ఇంటింటి పరిచర్య చేయడం అలవాటైపోయింది. అయితే, ఉదయం ప్రజల్ని ఇంటివద్ద కలవడం కష్టంగా ఉంటే, మధ్యాహ్నం లేదా సాయంత్రం చీకటి పడక ముందే పరిచర్య చేయడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో ప్రజలు ఇంటిలో కాస్త ఖాళీగా ఉంటారు. ఉదయం పూట వీధి సాక్ష్యం లేదా వ్యాపార స్థలంలో పరిచర్య చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
బహిరంగ పరిచర్య: మన సంఘ క్షేత్రంలో, పాదచారులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టేబుల్లను, కార్టులను పెట్టాలి. (జూన్ 2014, మన రాజ్య పరిచర్య 3వ పేజీ చూడండి.) ఒకవేళ, బహిరంగ సాక్ష్యం కోసం ఎంచుకున్న ప్రాంతంలో పాదచారులు ఎక్కువమంది లేకపోతే, వాళ్లు ఎక్కువగా ఉండే మరో ప్రాంతంలో కార్ట్ లేదా టేబుల్లను పెట్టాలని సంఘ సేవా కమిటీ నిర్ణయించవచ్చు.
పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు: ఇతర పద్ధతుల్లో పరిచర్య చేస్తున్నప్పుడు అంతగా ఫలితాలు రాకపోతే, ఆ సమయంలో పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు చేయడానికి పట్టిక వేసుకోగలరా? ఉదాహరణకు, శనివారాలు ఉదయం ఇంటింటి పరిచర్య చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తుంటే, మీ బైబిలు అధ్యయనాలను మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి మార్చుకోగలరా?
పరిచర్య చేసినప్పుడు మనకు గంటలు వస్తాయన్నది నిజం, అలాగే అది ఫలవంతంగా ఉన్నప్పుడు దానిలో ఎక్కువ సంతోషాన్ని పొందుతాం. ఫలానా సమయంలో, ఒకానొక పద్ధతిలో పరిచర్య చేయడం అంత సమర్థవంతంగా లేదని మీరు గమనించినప్పుడు, వేరే పద్ధతిని ప్రయత్నించండి. పరిచర్యలో మీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నిర్దేశాన్ని ఇవ్వమని “కోత యజమాని” అయిన యెహోవాకు ప్రార్థన చేయండి.—మత్త. 9:38.