పైన ఉన్నది, మృత సముద్ర గ్రంథపు చుట్టలో యెషయా పుస్తకంలోని ఒక భాగం; కింద ఉన్నది, ఆధునిక అరబిక్ భాషలోకి అనువదించిన యెషయా పుస్తకంలోని ఒక భాగం. దేవుని వాక్యంలోని సందేశం ఎప్పటికీ మారదు
దేవుని వాక్యంలో మార్పులు జరిగాయా?
దేవుని వాక్యంలో మార్పులు జరిగాయేమో అని కొందరు అనుకుంటారు. యెషయా అనే ప్రవక్త, “దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచివుంటుంది” అని చెప్పాడు. (యెషయా 40:8) దేవుడు మాటిచ్చిన దీవెనలన్నీ ఉన్నదున్నట్టుగా భద్రపర్చబడ్డాయని మనం ఎందుకు నమ్మవచ్చు?
తన వాక్యాన్ని భద్రపర్చి, అందులోని సందేశం కలుషితం కాకుండా కాపాడే శక్తి దేవునికి ఉంది. పూర్వకాలాల్లో దేవుని వాక్యాన్ని నకలు రాసే వ్యక్తులు తాము రాసిన ప్రతిలోని అక్షరాల సంఖ్యను, మూలప్రతిలోని అక్షరాల సంఖ్యతో సరిచూసేవాళ్లు. అలా వాళ్లు పవిత్ర లేఖనాలకు ఏదీ కలపకుండా, మార్పులు చేయకుండా, ఏదీ తీసేయకుండా జాగ్రత్తపడేవాళ్లు. కానీ మనుషులు అపరిపూర్ణులు కాబట్టి, కొంతమంది నకలు రాసేటప్పుడు చిన్నచిన్న తప్పులు దొర్లాయి.
నేడున్న పవిత్ర లేఖనాల్లోని దేవుని సందేశానికి ఎలాంటి మార్పులు జరగలేదని ఎందుకు నమ్మవచ్చు?
పవిత్ర లేఖనాలకు సంబంధించిన ప్రాచీన రాతప్రతులు వేల సంఖ్యలో ఉన్నాయి. ఏదైనా ప్రతిలో ఒక చిన్న తేడా కనిపిస్తే, వేరే ప్రతులతో పోల్చి చూసుకొని ఏది సరైనదో తెలుసుకోవచ్చు.—ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి jw.org/te వెబ్‌సైట్‌లో “బైబిలుకు మార్పులు-చేర్పులు జరిగాయా?” అనే ఆర్టికల్ చూడండి.
ఉదాహరణకు, మృత సముద్ర గ్రంథపు చుట్టలు అని పిలువబడే ప్రాచీన ప్రతుల్నే తీసుకోండి. వాటిని 1947లో మృత సముద్రం దగ్గర ఉన్న గుహల్లో, ఒకానొక అరబ్ జాతికి చెందినవాళ్లు కనుగొన్నారు. 2000 కన్నా ఎక్కువ ఏళ్ల క్రితం నాటి పవిత్ర లేఖనాల్లోని కొన్ని భాగాలు ఆ గ్రంథపు చుట్టల్లో ఉన్నాయి. కొంతమంది నిపుణులు ఆ గ్రంథపు చుట్టల్ని నేడున్న పవిత్ర లేఖనాలతో పోల్చి చూశారు. వాళ్లు ఏం కనుగొన్నారు?
వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ప్రాచీన రాతప్రతుల్లోని సందేశం, నేడు మన దగ్గరున్న దేవుని వాక్యంలోని సందేశం ఒకటేనని నిపుణులు కనుగొన్నారు.a దీన్నిబట్టి, పవిత్ర లేఖనాలకు ఎలాంటి మార్పులు జరగకుండా మన కోసం వాటిని దేవుడు జాగ్రత్తగా భద్రపర్చాడని నమ్మవచ్చు.
కాబట్టి, దేవుని వాక్యంలో ఉన్న సందేశం ఏమాత్రం మారలేదనే పూర్తి నమ్మకంతో మనం దాన్ని చదవచ్చు. దీన్ని మనసులో ఉంచుకొని, ప్రవక్తల నుండి దేవుని గురించి ఏం నేర్చుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.
a గేజా వెర్మెస్ రాసిన ద కంప్లీట్ డెడ్ సీ స్క్రోల్స్ ఇన్ ఇంగ్లీష్ అనే పుస్తకంలో 16వ పేజీ.