కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w21 జూలై పేజీలు 26-29
  • యెహోవా సేవలో సంతోషంగా గడిపాను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా సేవలో సంతోషంగా గడిపాను
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరాను
  • వివాహం అలాగే నా కొత్త నియామకం
  • తిరిగి దక్షిణ ఆఫ్రికా బెతెల్‌కు
  • తిరిగి ప్రింటరీకి
  • మరో కొత్త నియామకం
  • బ్రాంచి ఉత్తరం
    మన రాజ్య పరిచర్య—2006
  • బేతేలు సేవ—మరెక్కువ మంది స్వచ్ఛంద సేవకుల అవసరం ఉంది
    మన రాజ్య పరిచర్య—1995
  • మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా?
    మన రాజ్య పరిచర్య—2003
  • ఇది మీకు అత్యంత శ్రేష్ఠమైన కెరీర్‌ కాగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
w21 జూలై పేజీలు 26-29
జాన్‌, లారా కీకాట్‌.

జీవిత కథ

యెహోవా సేవలో సంతోషంగా గడిపాను

జాన్‌ కీకాట్‌ చెప్పినది

కెనడా బెతెల్‌లో నాకిచ్చిన మొదటి నియామకం ముద్రణా పని జరిగే భవనాన్ని లేదా ప్రింటరీని ఊడ్వడం. 1958లో నేను బెతెల్‌లో సేవ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు 18 ఏళ్లు. అక్కడ జీవితం బాగుండేది. కొంతకాలానికే ముద్రించిన పత్రికల అంచుల్ని కట్‌ చేసే యంత్రంతో పనిచేయడం మొదలుపెట్టాను. బెతెల్‌లో ఉండడం నాకు చాలా సంతోషంగా అనిపించింది!

తర్వాతి సంవత్సరం బెతెల్‌లో ఒక ప్రకటన చేశారు. దక్షిణ ఆఫ్రికా బ్రాంచిలో ఒక కొత్త ముద్రణా యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి స్వచ్ఛంద సేవకులు కావాలని చెప్పారు. దానికి నేను నా పేరు ఇచ్చాను. నన్ను ఎంచుకున్నారని తెలిసినప్పుడు చాలా సంతోషించాను. నాతోపాటు కెనడా బెతెల్‌లో సేవ చేస్తున్న ఇంకో ముగ్గురు సహోదరులను ఎంచుకున్నారు. వాళ్లు ఎవరంటే డెన్నిస్‌ లీచ్‌, బిల్‌ మెక్‌లెలన్‌, కెన్‌ నోర్డన్‌. మమ్మల్ని దక్షిణ ఆఫ్రికాకు పంపిస్తూ మేము అక్కడ ఎక్కువకాలం ఉంటామని చెప్పారు!

నేను మా అమ్మకు ఫోన్‌ చేసి, “అమ్మా! నీకొక విషయం చెప్పాలి. నేను దక్షిణ ఆఫ్రికాకు వెళ్తున్నాను” అని అన్నాను. మా అమ్మ అంతగా మాట్లాడదు. కానీ ఆమె బలమైన విశ్వాసం, యెహోవాతో దగ్గరి సంబంధం ఉన్న స్త్రీ. నేను చెప్పింది విని ఆమె ఎక్కువ మాట్లాడకపోయినా ఆమె మద్దతు నాకుందని తెలుసు. నేను చాలా దూరం వెళ్తున్నందుకు అమ్మానాన్నలు బాధపడ్డారు. కానీ నేను తీసుకున్న నిర్ణయం విషయంలో వాళ్లు అడ్డుచెప్పలేదు.

దక్షిణ ఆఫ్రికాకు బయలుదేరాను

1959లో కేప్‌టౌన్‌ నుండి జోహాన్నస్‌బర్గ్‌కు వెళ్తున్న ట్రైన్‌లో డెన్నిస్‌ లీచ్‌, కెన్‌ నోర్డన్‌, బిల్‌ మెక్‌లెలన్‌తో నేను

దక్షిణ ఆఫ్రికా బ్రాంచిలో పనిచేసి 60 ఏళ్లు గడిచిన సందర్భంగా 2019లో మేము నలుగురం తిరిగి కలుసుకున్నప్పుడు

మేము నలుగురం ముందు బ్రూక్లిన్‌ బెతెల్‌కు వెళ్లాం. అక్కడ మూడు నెలలపాటు ముద్రణా పనికి సంబంధించి ఒక ప్రత్యేక శిక్షణ పొందాం. ఆ తర్వాత దక్షిణ ఆఫ్రికాలోని కేప్‌టౌన్‌కు వెళ్లే ఓడ ఎక్కాం. అప్పుడు నాకు 20 ఏళ్లు. మేము కేప్‌టౌన్‌లో దిగి, ఆ సాయంత్రం జోహాన్నస్‌బర్గ్‌ వెళ్లే ట్రైన్‌ ఎక్కాం. అది చాలా దూర ప్రయాణం. మా ట్రైన్‌ మొదట కాస్త ఎడారి ప్రాంతంలా ఉండే కరూ అనే చిన్న పట్టణంలో ఆగింది. అది దుమ్ముగా, వేడిగా ఉండే ప్రాంతం. మేం నలుగురం కిటికీలో నుండి తొంగి చూస్తూ, ‘ఇక్కడేంటి ఇలా ఉంది’ అనుకున్నాం. మేము సేవ చేయడానికి వెళ్లే ప్రాంతం ఇంకెలా ఉంటుందోనని కాస్త ఆందోళనపడ్డాం. కొన్ని సంవత్సరాల తర్వాత మేము మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ చిన్న పట్టణాల్లో జీవితం ఎంత ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుందో గ్రహించాం.

నా నియామకంలో భాగంగా నేను కొన్ని సంవత్సరాలు అద్భుతమైన, కష్టమైన లినోటైప్‌ మెషీన్‌ని ఆపరేట్‌ చేసే పనిచేశాను. ఈ మెషీన్‌ సహాయంతో కావలికోట, తేజరిల్లు! పత్రికల ముద్రణకు కావాల్సిన ఏర్పాట్లు చేసేవాళ్లం. మా బ్రాంచిలో చాలా ఆఫ్రికన్‌ భాషల్లో పత్రికల్ని ముద్రించేవాళ్లం. అవి కేవలం దక్షిణ ఆఫ్రికాకే కాదు, ఆఫ్రికాలోని ఇతర దేశాలకు కూడా వెళ్లేవి. ఈ కొత్త ముద్రణా యంత్రం మాకు బాగా ఉపయోగపడింది. మేము కెనడా నుండి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నందుకు చాలా సంతోషించాం.

ఆ తర్వాత ప్రచురణల్ని ముద్రించడం, రవాణా చేయడం, అనువదించడం వంటి వివిధ పనులు చూసుకునే ఫ్యాక్టరీ ఆఫీసులో నేను పని చేశాను. నా జీవితం బిజీగా, సంతృప్తిగా, అర్థవంతంగా సాగింది.

వివాహం అలాగే నా కొత్త నియామకం

1968లో లారా, నేను ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్నప్పుడు

బెతెల్‌ దగ్గర్లో ఉండే లారా బోయన్‌ అనే పయినీరు సహోదరిని 1968లో నేను పెళ్లి చేసుకున్నాను. ఆమె అనువాద విభాగానికి టైపిస్టుగా కూడా పని చేసింది. ఆ రోజుల్లో కొత్తగా పెళ్లైనవాళ్లు బెతెల్‌లో ఉండే ఏర్పాటు లేదు. కాబట్టి బ్రాంచి మమ్మల్ని ప్రత్యేక పయినీర్లుగా నియమించింది. నేను కాస్త ఆందోళనపడ్డాను. ఎందుకంటే పది సంవత్సరాల పాటు నేను బెతెల్‌లో ఉన్నప్పుడు బ్రాంచే నాకు ఆహారం, వసతి ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు ప్రత్యేక పయినీర్లుగా మాకు వచ్చే కొద్దిడబ్బుతో మా అవసరాలు ఎలా తీరతాయని ఆలోచించాను. మేము ప్రతీ నెల చేయాల్సినన్ని గంటలు, పునర్దర్శనాలు చేసినప్పుడు, అందించాల్సినన్ని ప్రచురణలు అందించినప్పుడు మాత్రమే మా ఒక్కొక్కరికీ అలవెన్స్‌ వచ్చేది. (వాళ్లకొచ్చే 25 ర్యాండ్ల అలవెన్స్‌, అప్పట్లో 35 యూఎస్‌ డాలర్లతో సమానం.) వచ్చిన ఆ డబ్బునే ఇంటి అద్దె కోసం, ఆహారం కోసం, ప్రయాణ ఖర్చుల కోసం, మందులు అలాగే ఇతర ఖర్చుల కోసం ఉపయోగించేవాళ్లం.

దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్‌ అనే పట్టణానికి మమ్మల్ని పయినీర్లుగా నియమించారు. ఆ పట్టణం హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఉంది. అక్కడ ఎక్కువమంది భారతీయులు ఉండేవాళ్లు. వాళ్లలో చాలామంది 1875 ఆ సమయంలో దక్షిణ ఆఫ్రికాలోని షుగర్‌ ఫ్యాక్టరీల్లో పని చేయడానికి వచ్చిన భారతీయులకు పుట్టిన పిల్లలే. మేము అక్కడికి వెళ్లే సమయానికి వాళ్లు వేరే ఉద్యోగాలు చేస్తున్నా, వాళ్ల భారతీయ సంస్కృతినే పాటిస్తూ, ఘుమఘుమలాడే ఆ దేశపు వంటల్నే చేస్తున్నారు. వాళ్లకు ఇంగ్లీషు వచ్చు కాబట్టి వాళ్లకు ప్రకటించడానికి మేము వేరే భాష నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు.

ప్రతీనెల ప్రత్యేక పయినీర్లు 150 గంటలు పరిచర్యలో వెచ్చించాలి. కాబట్టి నేను, లారా మొదటి రోజు ఆరు గంటలు పరిచర్య చేయాలని ప్రణాళిక వేసుకున్నాం. అక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంది. మాకు పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు లేవు. అందుకే ఆరు గంటలు ఇంటింటి పరిచర్యే చేయాల్సి వచ్చింది. మేము మొదలుపెట్టిన కాసేపటికి నా వాచ్‌ చూసుకున్నాను. అప్పటికి 40 నిమిషాలే గడిచాయి! మేము ప్రత్యేక పయినీర్లుగా ఎలా కొనసాగగలమని ఆలోచించాను.

కొన్ని రోజులకే మా పనుల్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకోవడం అలవాటైంది. మేం ప్రతిరోజు సాండ్‌విచ్‌లను తయారుచేసుకొని, సూప్‌ లేదా కాఫీని ఫ్లాస్కులో పోసుకొని బయలుదేరేవాళ్లం. మాకు విరామం అవసరమైనప్పుడు, మా కారును చెట్టు నీడన పార్క్‌ చేసి ఆగేవాళ్లం. అలా ఆగినప్పుడు, కొన్నిసార్లు అందమైన భారతీయుల పిల్లలు మా చుట్టూ చేరి మేము చూడ్డానికి వేరుగా ఉండడం వల్ల మమ్మల్ని అలాగే చూస్తూ ఉండేవాళ్లు. పరిచర్య మొదలుపెట్టి రెండుమూడు గంటలు గడిచాక, మిగతా రోజు చాలా త్వరగా గడిచిపోయిందని మేం కొద్దిరోజులకే గ్రహించాం.

ఆ ప్రాంతంలో ఆతిథ్యస్ఫూర్తి ఉన్న ప్రజలతో బైబిలు సత్యాలు పంచుకోవడం సంతోషాన్నిచ్చింది. ఇక్కడున్న భారతీయులు గౌరవం, దయ, దైవభక్తి ఉన్న ప్రజలు. మేము చెప్పిన సందేశాన్ని చాలామంది హిందువులు విన్నారు. యెహోవా గురించి, యేసు గురించి, బైబిలు గురించి, శాంతి ఉండే కొత్త లోకం గురించి, చనిపోయిన వాళ్లకున్న నిరీక్షణ గురించి వాళ్లు నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. ఒక సంవత్సరం అయ్యేసరికి మేము 20 బైబిలు అధ్యయనాలు చేస్తూ ఉన్నాం. మేము బైబిలు అధ్యయనాలు చేసేవాళ్లలో ప్రతీరోజు ఒక్కో కుటుంబం మాకు మధ్యాహ్న భోజనం పెట్టేవాళ్లు. మేం వాళ్లతో కలిసి దాన్ని ఆస్వాదించేవాళ్లం. అలా చాలా సంతోషించాం.

కొంతకాలానికి మా నియామకం మారింది. అందమైన హిందూ మహాసముద్రం ఒడ్డునున్న సర్క్యూట్‌లో మమ్మల్ని ప్రాంతీయ సేవకు నియమించారు. మేము ప్రతీవారం సందర్శనానికి వెళ్లినప్పుడు సంఘంలోని ఒకరి ఇంట్లో ఉండేవాళ్లం. అక్కడి ప్రచారకులతో కలిసి పనిచేస్తూ వాళ్లను ప్రోత్సహించేవాళ్లం. మేము ఎవరి ఇంట్లోనైతే ఉండేవాళ్లమో వాళ్లు మమ్మల్ని సొంత కుటుంబసభ్యుల్లా చూసుకునేవాళ్లు. మేం వాళ్ల పిల్లలతో, పెంపుడు జంతువులతో కలిసి ఆడుకునేవాళ్లం. రెండు సంవత్సరాలు సంతోషంగా గడిచిపోయాయి. ఒకరోజు బ్రాంచి కార్యాలయం నుండి ఫోన్‌ వచ్చింది. ఒక సహోదరుడు మాట్లాడుతూ, “మేం మిమ్మల్ని మళ్లీ బెతెల్‌కు ఆహ్వానించాలనుకుంటున్నాం” అని అన్నాడు. దానికి నేను “మేము ప్రస్తుతం ఉన్న నియామకంలో చాలా సంతోషంగా ఉన్నాం” అని అన్నాను. కానీ మమ్మల్ని ఎక్కడ నియమించినా అక్కడ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

తిరిగి దక్షిణ ఆఫ్రికా బెతెల్‌కు

నేను బెతెల్‌లో సర్వీస్‌ డిపార్టుమెంట్లో పని చేశాను. అక్కడ పరిణతిగల, అనుభవంగల చాలామంది సహోదరులతో పనిచేసే గొప్ప అవకాశం నాకు దొరికింది. ఆ రోజుల్లో ప్రాంతీయ పర్యవేక్షకులు ఒక సంఘాన్ని సందర్శించిన తరువాత బ్రాంచికి ఒక రిపోర్టు పంపించేవాళ్లు. ఆ రిపోర్టు ఆధారంగా సర్వీస్‌ డిపార్టుమెంట్‌లోని సహోదరులు తిరిగి సంఘానికి ఒక ఉత్తరం పంపించేవాళ్లు. ఆ ఉత్తరం ద్వారా ప్రోత్సాహాన్ని, కావాల్సిన నిర్దేశాన్ని ఇచ్చేవాళ్లు. ప్రాంతీయ పర్యవేక్షకులు పంపించిన రిపోర్టులను ఖోసా, జూలూ అలాగే ఇతర ఆఫ్రికన్‌ భాషల నుండి ఇంగ్లీష్‌లోకి అనువదించడానికి; ఆ తర్వాత సర్వీస్‌ డిపార్టుమెంట్‌ వాళ్లు రాసిన ఉత్తరాలను ఇంగ్లీష్‌ నుండి ఆఫ్రికన్‌ భాషల్లోకి అనువదించడానికి సెక్రటరీలుగా పనిచేస్తున్న సహోదరులు చాలా కష్టపడేవాళ్లు. ఆఫ్రికాలోని నల్లజాతీయులైన సహోదరసహోదరీలు ఎదుర్కొన కష్టాలను అర్థం చేసుకోవడానికి కూడా సెక్రటరీలైన ఆ అనువాదకులు నాకు సహాయం చేశారు. అందుకు నేనెంతో కృతజ్ఞుణ్ణి.

అప్పట్లో దక్షిణ ఆఫ్రికాలోని ప్రభుత్వం ఒక్కో తెగ ప్రజలు నివసించడానికి ఒక్కో ప్రాంతాన్ని నియమించేది. దానివల్ల ఒక తెగ ప్రజలు ఇంకో తెగ ప్రజలతో సమయం గడిపేవాళ్లు కాదు. కాబట్టి ఆఫ్రికాలోని నల్లజాతీయులైన మన సహోదరులు ఎవరి భాషలో వాళ్లు మాట్లాడుతూ, ఆ భాషలోనే ప్రకటిస్తూ, ఆ భాషలో జరిగే కూటాలకు హాజరయ్యేవాళ్లు.

అప్పటివరకూ ఇంగ్లీష్‌ మాట్లాడే సంఘ క్షేత్రాల్లో నా నియామకాలు ఉండడం వల్ల నల్లజాతీయుల గురించి నాకు ఎక్కువగా తెలీదు. కానీ ఇప్పుడు నల్లజాతీయుల గురించి, వాళ్ల సంస్కృతి గురించి, పద్ధతుల గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. స్థానిక ఆచారాలు, మతనమ్మకాల వల్ల మన సహోదరులు ఎన్ని ఇబ్బందులుపడ్డారో నేను తెలుసుకోగలిగాను. కుటుంబ సభ్యుల నుండి, ఊరి ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చినా లేఖనాలకు అనుగుణంగాలేని ఆచారాలను, మంత్రతంత్రాలకు సంబంధించిన పనులను విడిచిపెట్టి వాళ్లు ఎంతో ధైర్యం చూపించారు. అక్కడి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పేదరికంలో మగ్గిపోయారు. చాలామంది కొద్దిగా చదువుకున్నారు లేదా అస్సలు చదువుకోలేదు. కానీ వాళ్లు బైబిల్ని గౌరవించేవాళ్లు.

స్వేచ్ఛగా ఆరాధించడం గురించి, తటస్థత గురించి కొన్ని కోర్టు కేసుల్లో పనిచేసే గొప్ప అవకాశం నాకు దొరికింది. స్కూల్లో మతసంబంధమైన ప్రార్థనలు చేయనందుకు, పాటలు పాడనందుకు సాక్షులైన పిల్లల్ని స్కూల్లో నుండి తీసేశారు. వాళ్ల విశ్వసనీయత, ధైర్యం చూసినప్పుడు నిజంగా నా విశ్వాసం బలపడింది.

ఆఫ్రికాలో స్వాజీలాండ్‌ (ఇప్పుడు ఇస్వాతిని) అనే చిన్న దేశంలో మన సహోదరులు ఇంకో సవాలును ఎదుర్కొన్నారు. ఆ దేశంలో ఎవరైనా చనిపోయినప్పుడు కొన్ని ఆచారాలు చేసేవాళ్లు. రాజైన సోబూజ II చనిపోయినప్పుడు, ఆ దేశ పౌరులందర్నీ ఆ ఆచారాల్లో పాల్గొనమని ఆదేశించారు. పురుషులైతే గుండు చేయించుకోవాలి, స్త్రీలైతే వాళ్ల జుట్టును పొట్టిగా కత్తిరించుకోవాలి. అది పూర్వీకుల ఆరాధనకు సంబంధించింది కాబట్టి చాలామంది సహోదరసహోదరీలు అలా చేయడానికి నిరాకరించారు. దానివల్ల వాళ్లు హింసకు గురయ్యారు, వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉండడం చూసి మేము చాలా సంతోషించాం. ఆఫ్రికాలోని మన సహోదరుల విశ్వసనీయత, సహనం నుండి మేము ఎంతో నేర్చుకున్నాం, అలాగే మా విశ్వాసం బలపడింది.

తిరిగి ప్రింటరీకి

1981లో నన్ను మళ్లీ ప్రింటరీలో పనిచేయడానికి నియమించారు. కంప్యూటర్‌ను ఉపయోగిస్తూ ముద్రణా పనిచేయడంలో అక్కడ నేను సహాయం చేశాను. అదెంతో ఉత్తేజకరమైన సమయం; ముద్రణా రంగంలో మార్పులు జరుగుతున్న కాలం అది. ఒక సేల్స్‌మ్యాన్‌ బ్రాంచికి ఒక కొత్త మెషీన్‌ని ఉచితంగా ఇచ్చి, దాన్ని వాడి చూడమన్నాడు. దాంతో తొమ్మిది లినోటైప్‌ మెషీన్లకు బదులు ఐదు కొత్త మెషీన్లను వాడడం మొదలుపెట్టాం. అలాగే ఒక కొత్త ప్రింటింగ్‌ ప్రెస్‌ను కూడా వాడడం మొదలుపెట్టాం. వీటివల్ల ముద్రణా పనిని వేగంగా చేయగలిగాం!

మెప్స్‌a (MEPS) సహాయంతో సమాచారాన్ని పేజీల వారీగా అమర్చే కొత్త పద్ధతుల్ని కనుక్కోవడానికి కంప్యూటర్లు ఉపయోగపడ్డాయి. కెనడా బెతెల్‌ నుండి మేము నలుగురం దక్షిణ ఆఫ్రికాకి పనిచేయడానికి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. (యెష. 60:17) ఆ సమయానికే మేము నలుగురం యెహోవాను ఎంతో ప్రేమించే పయినీరు సహోదరీలను పెళ్లి చేసుకున్నాం. బిల్‌ అలాగే నేను ఇంకా బెతెల్‌లోనే సేవ చేస్తున్నాం. కెన్‌ అలాగే డెన్నిస్‌, వాళ్ల భార్యాపిల్లలతో మాకు దగ్గర్లో ఉంటున్నారు.

బ్రాంచిలో పని మరింత పెరిగింది. మేము మా బ్రాంచి పరిధిలో మాట్లాడే భాషల్లో ప్రచురణల్ని అనువదించి, ముద్రించేవాళ్లం. అలాగే ఇతర బ్రాంచీల్లో అనువదించిన ప్రచురణల్ని కూడా ముద్రించేవాళ్లం. అందువల్ల మాకు ఒక కొత్త బెతెల్‌ భవనం అవసరమైంది. జోహాన్నస్‌బర్గ్‌లోని పడమర వైపు ఒక అందమైన ప్రాంతంలో సహోదరులు దాన్ని కట్టి, 1987లో యెహోవాకు సమర్పించారు. ఈ విస్తరణ జరుగుతున్నప్పుడు మేము కూడా పాల్గొనడం, అలాగే దక్షిణ ఆఫ్రికా బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవ చేయడం నాకు సంతోషాన్నిచ్చింది.

మరో కొత్త నియామకం

కొత్తగా ఏర్పడిన అమెరికా బ్రాంచి కమిటీలో సేవ చేయడానికి నన్ను 2001లో పిలిచినప్పుడు మేము ఎంతో ఆశ్చర్యపోయాం. దక్షిణ ఆఫ్రికాలో మా పనిని, స్నేహితుల్ని విడిచివెళ్లడం బాధగా అనిపించినా అమెరికా బెతెల్‌ కుటుంబంలో భాగంగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం మాకు ఉత్సాహంగా అనిపించింది.

అయితే వయసుపైబడిన లారా అమ్మను విడిచి అంత దూరం వెళ్లడం గురించి ఆలోచించినప్పుడు కాస్త ఆందోళనపడ్డాం. మేము న్యూయార్క్‌ నుండి ఆమెకు ఎక్కువ సహాయం చేయలేం కాబట్టి లారా ముగ్గురు చెల్లెళ్లు ఆమెకు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా సహాయం చేస్తామన్నారు. వాళ్లు మాతో, “మేము ఎలాగో పూర్తికాలసేవ చేయలేకపోతున్నాం కాబట్టి అమ్మ అవసరాల్ని చూసుకుంటే మీరు మీ నియామకాల్లో కొనసాగగల్గుతారు” అని అన్నారు. వాళ్లకు మేమెంతో రుణపడి ఉన్నాం.

లారా చెల్లెళ్లు వాళ్ల అమ్మను చూసుకున్నట్టే, మా అన్నయ్య-వదిన కూడా ఒంటరిగా ఉంటున్న మా అమ్మను చూసుకున్నారు. 20 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా మా అమ్మ కెనడాలోని టోరంటోలో వాళ్లతోనే ఉంది. మేము న్యూయార్క్‌ వచ్చాక ఆమె చనిపోయింది. అప్పటివరకు మా అన్నయ్య-వదిన ఆమెను ప్రేమగా, శ్రద్ధగా చూసుకున్నందుకు మేము వాళ్లకు ఎంతో కృతజ్ఞులం. తమ జీవితాల్లో సర్దుబాట్లు చేసుకొని వయసుపైబడుతున్న తల్లిదండ్రులను చూసుకోవడం కొన్నిసార్లు కష్టమే. అయినా అలాంటి కుటుంబ సభ్యులు ఉండడం నిజంగా ఓ ఆశీర్వాదం!

నేను అమెరికా బెతెల్‌కు వెళ్లాక కొన్ని సంవత్సరాల వరకు ప్రింటరీలో పని చేశాను. ఇప్పుడు ప్రచురణల తయారీ మరింత కొత్త విధానాల్లో తేలిగ్గా జరుగుతోంది. ప్రస్తుతం పర్చేసింగ్‌ డిపార్టుమెంట్లో పని చేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా ఈ పెద్ద బ్రాంచిలో సేవ చేయడం నిజంగా ఓ ఆశీర్వాదం! ఇప్పుడు ఇక్కడ 5,000 మంది బెతెల్‌ కుటుంబ సభ్యులతో పాటు, దాదాపు 2,000 మంది కమ్యూటర్లు కూడా సేవ చేస్తున్నారు.

నేను ఈ నియామకంలో సేవ చేస్తానని 60 ఏళ్ల క్రితం అనుకోలేదు. గడచిన సంవత్సరాలన్నిటిలో లారా నాకు హృదయపూర్వకంగా మద్దతిచ్చింది. నా జీవితం అద్భుతంగా సాగింది. మేము సేవ చేసిన వేర్వేరు నియామకాలను; ఆ నియామకాల్లో మాతో కలిసి పనిచేసిన వాళ్లను; అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా బ్రాంచీలకు మేము చేసిన సందర్శనాల్లో కలిసినవాళ్లను ఎప్పటికీ మర్చిపోలేం. నాకు 80 ఏళ్లు దాటడంతో ఎక్కువ పని ఇవ్వడం లేదు. ఎందుకంటే శిక్షణ పొందిన యౌవన సహోదరులు ఆ పనిని చేస్తున్నారు.

కీర్తనకర్త ఇలా రాశాడు: ‘యెహోవా దేవునిగా ఉన్న దేశం సంతోషంగా ఉంటుంది.’ (కీర్త. 33:12) ఆ మాటలు ఎంత నిజమో కదా! సంతోషంగల యెహోవా ప్రజలతో కలిసి ఆయన సేవ చేయగల్గుతున్నందుకు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.

a ఎమ్‌.ఇ.పి.యస్‌. (MEPS) అంటే మల్టీలాంగ్వేజ్‌ ఎలక్ట్రానిక్‌ పబ్లిషింగ్‌ సిస్టమ్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి