కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w22 జూన్‌ పేజీలు 14-19
  • భయాన్ని అధిగమించేలా యెహోవా ప్రేమ సహాయం చేస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భయాన్ని అధిగమించేలా యెహోవా ప్రేమ సహాయం చేస్తుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబాన్ని పోషించలేం అనే భయం
  • మనుషుల భయం
  • చనిపోతామనే భయం
  • మన భయాల్ని అధిగమించడం
  • మనుష్యులకు కాక దేవునికి ఎందుకు భయపడవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • మనుషులకు కాక దేవునికి భయపడడానికి అయిదు కారణాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • యెహోవాకు భయపడి ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవాకు భయపడేలా మీహృదయాన్ని మలచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
w22 జూన్‌ పేజీలు 14-19

అధ్యయన ఆర్టికల్‌ 26

భయాన్ని అధిగమించేలా యెహోవా ప్రేమ సహాయం చేస్తుంది

“యెహోవా నా పక్షాన ఉన్నాడు; నేను భయపడను.”—కీర్త. 118:6.

పాట 105 “దేవుడు ప్రేమ”

ఈ ఆర్టికల్‌లో. . .a

1. మనం ఏ విషయాల గురించి భయపడతాం?

కొంతమంది సహోదర సహోదరీల అనుభవాల్ని చూడండి. నెస్టర్‌​, అతని భార్య మారియ అవసరం ఎక్కువున్న చోట సేవ చేయాలనుకున్నారు.b అలా చేయాలంటే వాళ్లు తక్కువ డబ్బులతో జీవించడం నేర్చుకోవాలి. కానీ అలా ఉంటే సంతోషంగా ఉండలేమేమో అని వాళ్లు భయపడ్డారు. బినియం అనే సహోదరుడు మన పనిని వ్యతిరేకించే దేశంలో ఉంటూ, సత్యం నేర్చుకున్నాడు. దేవుని ప్రజల్లో ఒకరిగా ఉన్నందుకు తనని కూడా హింసిస్తారేమో అని భయపడ్డాడు. అంతేకాదు తానొక యెహోవాసాక్షి అయ్యానని తన కుటుంబ సభ్యులకు తెలిస్తే, వాళ్లు ఏమనుకుంటారోనని ఇంకా ఎక్కువ భయపడ్డాడు. వేలరీ అనే సహోదరి, తన శరీరమంతా క్యాన్సర్‌ పాకిపోయిందని తెలుసుకుంది. అప్పుడు రక్తం ఎక్కించకుండా వైద్యం చేసే డాక్టర్‌ కోసం ఆమెంతో వెతికింది. తన అనారోగ్యంవల్ల ఇక ఎక్కువ సమయం బతకలేనని ఆమె భయపడింది.

2. మన భయాల్ని తీసేసుకోవడానికి మనమెందుకు బాగా ప్రయత్నించాలి?

2 మనలో చాలామందికి అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి కాబట్టి భయపడతాం. ఒకవేళ మనం ఆ భయాల్ని తీసేసుకోకపోతే చెడు నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల యెహోవాతో మన సంబంధం బలహీనమౌతుంది. నిజానికి సాతానుకు అదే కావాలి. మన భయాల్ని ఉపయోగించి ప్రకటించకుండా, యెహోవా ఇచ్చిన ఇతర ఆజ్ఞల్ని పాటించకుండా చేస్తాడు. (ప్రక. 12:17) సాతాను ఎంతో దుష్టుడు. అతనికి కొంచెం కూడా జాలి, దయ లేవు. ఇంకా అతనికి ఎంతో శక్తి ఉంది. అయినాసరే అతని నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు?

3. భయాల్ని పోగొట్టుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది?

3 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన మనవైపు ఉన్నాడని మనం అర్థంచేసుకున్నప్పుడు సాతాను మనల్ని భయపెట్టలేడు. (కీర్త. 118:6) ఒకసారి 118వ కీర్తన రాసిన కీర్తనకర్త గురించి ఆలోచించండి. అతను ఎన్నో కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. అతనికి పెద్దపెద్ద వాళ్లతో సహా చాలామంది శత్రువులు ఉన్నారు (9, 10 వచనాలు). కొన్నిసార్లైతే అతను తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు (13వ వచనం). అంతేకాదు, యెహోవా నుండి క్రమశిక్షణ పొందాడు (18వ వచనం). అయినా అతను “నేను భయపడను” అని అన్నాడు. ఆ కీర్తనకర్త చాలా సురక్షితంగా ఉన్నానని ఎందుకు అన్నాడు? ఎందుకంటే, యెహోవా అతనికి క్రమశిక్షణ ఇచ్చినా తననెంతో ప్రేమిస్తున్నాడని అతనికి తెలుసు. అంతేకాదు అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తన ప్రేమగల పరలోక తండ్రి సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని అతను గట్టిగా నమ్మాడు.—కీర్త. 118:29.

4. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మినప్పుడు ఎలాంటి భయాల్ని అధిగమిస్తాం?

4 మొదటి పేరాలో చూసిన సహోదర సహోదరీలు దేవుడు చూపించిన ప్రేమనుబట్టి భయాల్ని అధిగమించగలిగారు. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని బలంగా నమ్మితే భయాల్ని అధిగమించొచ్చు. మనందరికి సాధారణంగా ఎదురయ్యే భయాలు ఏంటంటే: (1) కుటుంబాన్ని పోషించలేమేమో అనే భయం, (2) మనుషుల భయం, (3) చనిపోతామనే భయం. మనకు ఎదురయ్యే ఈ మూడు భయాల్ని ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు చూద్దాం.

కుటుంబాన్ని పోషించలేం అనే భయం

ఒక సహోదరుడు తన బాబుతో కలిసి చేపలు పట్టడానికి రేవులోకి వల విసురుతున్నారు.

కుటుంబ అవసరాలు తీర్చడానికి ఒక సహోదరుడు తన బాబుతో కలిసి చేపలు పడుతున్నాడు (5వ పేరా చూడండి)

5. ఒక కుటుంబ పెద్దకు ఎలాంటి భయాలు ఉండొచ్చు? (కవర్‌ పేజీ మీదున్న చిత్రం చూడండి.​)

5 తన కుటుంబ అవసరాల్ని తీర్చడం చాలా ప్రాముఖ్యమని ఒక కుటుంబ పెద్దకి తెలుసు. (1 తిమో. 5:8) మీరొక కుటుంబ పెద్ద అయితే, బహుశా ఈ కోవిడ్‌ సమయంలో ఉద్యోగం పోతుందని ఆందోళనపడి ఉంటారు. అలాగే ప్రతీ పూట మీ కుటుంబ సభ్యుల ఆకలి తీర్చలేరేమో అని, ఇంటి గురించి తీసుకున్న లోన్‌ లేదా అద్దె కట్టలేరేమో అని కంగారుపడి ఉంటారు. అంతేకాదు మీ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం దొరకదేమో అని భయపడి ఉంటారు. లేదా పైన చూసిన నెస్టర్‌​, మారియలా తక్కువ డబ్బులతో జీవించడం సాధ్యం కాదని అనుకొనివుంటారు. సాతాను ఇలాంటి భయాల్ని ఉపయోగించి, చాలామంది యెహోవా సేవ ఆపేసేలా చేయడంలో విజయం సాధించాడు.

6. మనమేం అనుకోవాలని సాతాను ప్రయత్నిస్తాడు?

6 యెహోవా మనల్ని ప్రేమించడని, పట్టించుకోడని, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఆయన ఏ సహాయం చేయడని అనుకునేలా సాతాను ప్రయత్నిస్తాడు. దానివల్ల ఏం చేసైనా మన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలని, చివరికి యెహోవాతో మన స్నేహం పాడైనా సరే అలా చేయాలని మనం అనుకోవచ్చు.

7. యేసు మనకు ఏ భరోసా ఇస్తున్నాడు?

7 యెహోవా గురించి అందరికన్నా బాగా యేసుకు తెలుసు. అందుకే మనం అడగకముందే మనకేం అవసరమో ఆయనకు తెలుసని యేసు భరోసా ఇచ్చాడు. (మత్త. 6:8) అంతేకాదు, మన అవసరాలు తీర్చడానికి యెహోవా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని కూడా యేసుకు తెలుసు. మనందరం యెహోవా కుటుంబంలో ఒకరం, ఆయనే మన కుటుంబ పెద్ద. కాబట్టి 1 తిమోతి 5:8 లో ఉన్న సూత్రాన్ని ఆయన ఖచ్చితంగా పాటిస్తాడని నమ్మకంతో ఉండొచ్చు.

ఒక సహోదరి, ఆమె పాప బట్టలు ఉతుకుతున్నారు. ఒక సహోదరుడు, అతని భార్య వాళ్ల కోసం భోజనం తీసుకొస్తున్నారు.

మన అవసరాలు తీరేలా యెహోవా చూసుకుంటాడు. దానికోసం ఆయన మన సహోదర సహోదరీల్ని ఉపయోగించవచ్చు (8వ పేరా చూడండి)d

8. (ఎ) కుటుంబ అవసరాల్ని తీర్చలేమేమో అనే భయాన్ని అధిగమించడానికి మనకేది సహాయం చేస్తుంది? (మత్తయి 6:31-33) (బి) 8వ పేరాకు సంబంధించిన చిత్రంలో ఉన్న భార్యాభర్తల నుండి మనమేం నేర్చుకోవచ్చు?

8 యెహోవా మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తున్నాడని అర్థంచేసుకున్నప్పుడు ఆయన మన అవసరాల్ని ఖచ్చితంగా తీరుస్తాడని నమ్మకంతో ఉంటాం. (మత్తయి 6:31-33 చదవండి.) యెహోవా ప్రేమగల, ఉదారతగల దేవుడు కాబట్టి మన అవసరాల్ని తీర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన భూమిని సృష్టించినప్పుడు మనకు అవసరమయ్యే ఏవో కొన్నిటిని మాత్రమే ఇవ్వలేదు. మనకు ఆనందాన్నిచ్చే ఎన్నిటినో ఆయన ప్రేమతో సృష్టించాడు. (ఆది. 2:9) అయితే కొన్ని సందర్భాల్లో మన దగ్గర అవసరమైనవి తప్ప ఎక్కువేమీ ఉండకపోవచ్చు. అప్పుడు కూడా యెహోవాయే వాటిని మనకిచ్చాడని మర్చిపోకూడదు. (మత్త. 6:11) అంతేకాదు, వస్తుపరంగా మనం ఏ త్యాగం చేసినా యెహోవా ఇప్పుడూ భవిష్యత్తులో ఇచ్చే ఆశీర్వాదాలతో పోలిస్తే, అవి ఎప్పటికీ సాటిరావని గుర్తుంచుకోవాలి. ఆ విషయాన్నే నెస్టర్‌​, మారియ అర్థంచేసుకున్నారు.—యెష. 65:21, 22.

9. నెస్టర్‌, మారియల అనుభవం నుండి మీరేం నేర్చుకోవచ్చు?

9 నెస్టర్‌, మారియలు కొలంబియా దేశంలో సౌకర్యవంతంగా జీవించేవాళ్లు. వాళ్లు ఇలా అంటున్నారు: “మా దగ్గరున్న కొన్ని వస్తువుల్ని అమ్మేసి, అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి సేవచేయాలి అనుకున్నాం. కానీ తక్కువ డబ్బులతో సంతోషంగా ఉండలేమని భయపడ్డాం.” మరైతే ఆ భయాన్ని తీసేసుకోవడానికి వాళ్లకేది సహాయం చేసింది? యెహోవా అప్పటికే ప్రేమతో తమకు ఎన్ని విధాలుగా సహాయం చేశాడో ఆలోచించారు. అప్పుడు యెహోవా వాళ్ల అవసరాల్ని ఖచ్చితంగా తీరుస్తాడని అర్థంచేసుకుని, ఉద్యోగాల్ని వదిలేసి, ఇంటిని అమ్మేసి, అదే దేశంలో అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లి సేవ చేయడం మొదలుపెట్టారు. వాళ్లు తీసుకున్న నిర్ణయం గురించి ఏమనుకుంటున్నారో నెస్టర్‌​ ఇలా చెప్తున్నాడు: “మత్తయి 6:33 లోని మాటలు మా జీవితంలో నిజమవ్వడాన్ని చూశాం. ఇప్పుడు ఏలోటూ లేకుండా మేం చాలా సంతోషంగా జీవిస్తున్నాం.”

మనుషుల భయం

10. మనుషులు ఒకరిని చూసి ఒకరు ఎందుకు భయపడుతున్నారు?

10 ఆదాము హవ్వలు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటి నుండి మనుషులు ఒకరికొకరు హాని చేసుకుంటున్నారు. (ప్రసం. 8:9) ఉదాహరణకు, కొంతమంది తమ అధికారాన్ని ఉపయోగించి ఇతరుల మీద పెత్తనం చెలాయిస్తారు. కొంతమంది నేరస్తులు ఇతరుల్ని తీవ్రంగా హింసిస్తూ వాళ్ల ప్రాణాల్ని తీయడానికి కూడా వెనకాడడం లేదు. స్కూల్లో కొంతమంది పిల్లలు తోటి పిల్లల్ని ఏడ్పిస్తూ ఉంటారు. అంతేకాదు కొంతమంది తమ కుటుంబ సభ్యుల పట్ల నీచంగా ప్రవర్తిస్తూ కొడుతూ, తిడుతూ ఉంటారు. వీటన్నిటిని బట్టి మనుషులు తోటివాళ్లను చూసి భయపడడంలో ఏమాత్రం ఆశ్చర్యంలేదు. అయితే మనుషుల భయాన్ని సాతాను ఎలా ఉపయోగిస్తాడు?

11-12. సాతాను ఏయే విధాలుగా మనుషుల భయాన్ని మనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తాడు?

11 మనుషుల భయాన్ని ఉపయోగించి మనం ప్రకటనా పనిని ఆపేసేలా లేదా యెహోవా చెప్పిన ఇతర పనుల్ని చేయకుండా ఉండేలా సాతాను ప్రయత్నిస్తాడు. అతను వెనకుండి నడిపిస్తున్న మానవ ప్రభుత్వాలు మన పనిని నిషేధించి, మనల్ని హింసించాయి. (లూకా 21:12; ప్రక. 2:10) దానికితోడు, సాతాను లోకంలో చాలామంది మన గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని, పచ్చి అబద్ధాల్ని చెప్తున్నారు. వాటిని నమ్మి చాలామంది మనల్ని ఎగతాళి చేయొచ్చు లేదా మన మీద దాడి చేయొచ్చు. (మత్త. 10:36) సాతాను ఉపయోగించే కుతంత్రాలు కొత్తవేమీ కావు. ఎందుకంటే అతను మొదటి శతాబ్దంలో కూడా వాటిని ఉపయోగించాడు.—అపొ. 5:27, 28, 40.

ఒక యౌవన సహోదరుడు మీటింగ్‌కి రెడీ అయ్యి ధైర్యంగా వెళ్తున్నాడు, అతని తల్లిదండ్రులు తమ ఇంటి గుమ్మం మీద నిలబడి అతనిమీద అరుస్తున్నారు.

కుటుంబ సభ్యులు మనల్ని వ్యతిరేకించినా యెహోవా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడని నమ్మవచ్చు (12-14 పేరాలు చూడండి)e

12 ఈ లోక ప్రభుత్వాలు మనల్ని ప్రకటించకుండా ఆపి, వ్యతిరేకిస్తాయనే భయంతోపాటు సాతాను ఇంకో విధంగా కూడా మనల్ని భయపెడతాడు. కొంతమంది తాము సాక్షులైతే, తమ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అని భయపడతారు. అది ఇతరులు వాళ్లను కొడతారనే భయంకన్నా ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే వాళ్లు తమ కుటుంబ సభ్యుల్ని ఎంతో ప్రేమిస్తారు. అలాగే వాళ్లు కూడా యెహోవాను తెలుసుకుని ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటారు. అందుకే వాళ్లలో ఎవరైనా యెహోవా గురించి, తోటి ఆరాధకుల గురించి తప్పుగా మాట్లాడితే చాలా బాధపడతారు. ఇంకొన్ని సందర్భాల్లో, మొదట్లో వ్యతిరేకించిన బంధువులు ఆ తర్వాత సత్యాన్ని తెలుసుకున్నారు. కానీ యెహోవాసాక్షి అయినందుకు కుటుంబ సభ్యులు మనతో తెగతెంపులు చేసుకుంటే మనమేం చేయాలి?

13. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మడం, కుటుంబ సభ్యుల వ్యతిరేకతను తట్టుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది? (కీర్తన 27:10)

13 కీర్తన 27:10 లో ఉన్న మాటల్నిబట్టి మనమెంతో ఓదార్పుని పొందొచ్చు. (చదవండి.) యెహోవా మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థంచేసుకున్నప్పుడు, వ్యతిరేకత వచ్చినా ఏ భయం లేకుండా జీవించగల్గుతాం. అలాగే మనం సహిస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా దీవిస్తాడనే నమ్మకంతో ఉంటాం. అంతేకాదు మనం జీవించి ఉండడానికి కావాల్సిన వాటన్నిటిని, యెహోవా అందరికన్నా గొప్పగా ఇస్తాడు. మనం ప్రశాంతంగా, సంతోషంగా, తనకు దగ్గరగా ఉండడానికి కూడా సహాయం చేస్తాడు. ఈ విషయాన్నే బినియం​ అనే సహోదరుడు అర్థంచేసుకున్నాడు.

14. బినియం అనుభవం నుండి మీరేం నేర్చుకోవచ్చు?

14 బినియం ఉంటున్న దేశంలో అధికారులు సాక్షుల్ని తీవ్రంగా హింసించేవాళ్లు. అయినాసరే అతను యెహోవాసాక్షి అయ్యాడు. యెహోవా తనను ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడం వల్ల బినియం​ మనుషుల భయాన్ని అధిగమించగలిగాడు. అతను ఇలా అంటున్నాడు: “నేను ఊహించిన దానికన్నా ఎక్కువ హింసకు గురయ్యాను. కానీ అధికారులు పెట్టే హింసకన్నా, కుటుంబ సభ్యుల నుండి వచ్చే వ్యతిరేకత గురించి నేను ఎక్కువ భయపడ్డాను. నేను యెహోవాసాక్షి అయినందుకు సత్యంలోలేని మా నాన్న బాధపడతాడని అలాగే నా జీవితాన్ని పాడుచేసుకున్నానని మిగతా కుటుంబ సభ్యులు అనుకుంటారని భయపడ్డాను.” అయితే యెహోవా తాను ప్రేమించేవాళ్ల పట్ల ఎప్పుడూ శ్రద్ధ చూపిస్తాడని బినియం​ నమ్మాడు. అతను ఇంకా ఇలా అంటున్నాడు: “ఆర్థిక ఇబ్బందుల్ని, పక్షపాతాన్ని, హింసని తట్టుకోవడానికి తోటి సహోదర సహోదరీలకు యెహోవా ఎలా సహాయం చేశాడో ఆలోచించాను. అప్పుడు, యెహోవాకు దగ్గరగా ఉంటే ఆయన నాకూ సహాయం చేస్తాడని తెలుసుకున్నాను. నన్ను చాలాసార్లు అరెస్ట్‌ చేసి చిత్రహింసలు పెట్టినప్పుడు కూడా, యెహోవాకు నమ్మకంగా ఉంటే ఆయనెప్పుడూ సంరక్షిస్తాడని నేను స్వయంగా చూశాను.” యెహోవా తనకు నిజమైన తండ్రని, తోటి సహోదర సహోదరీలు తనకు నిజమైన కుటుంబమని బినియం​ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు.

చనిపోతామనే భయం

15. మనందరం చనిపోతామని ఎందుకు భయపడతాం?

15 బైబిలు మరణాన్ని ఒక శత్రువని పిలుస్తుంది. (1 కొరిం. 15:25, 26) కొన్నిసార్లు మనకు కానీ, మన ప్రియమైన వాళ్లకు కానీ తీవ్రమైన అనారోగ్యం రావొచ్చు. అలాంటప్పుడు చనిపోతామనే ఆలోచన వస్తే చాలా ఆందోళన పడతాం. అసలు మనందరం చనిపోతామనే ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు భయపడతాం? ఎందుకంటే నిరంతరం జీవించాలనే కోరికతో యెహోవా మనల్ని సృష్టించాడు. అందుకే మనలో ఎవ్వరం చనిపోవాలని కోరుకోం. (ప్రసం. 3:11) ఈ కారణాన్నిబట్టి మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాం, మంచి ఆహారాన్ని తీసుకుంటాం, వ్యాయామం చేస్తాం అలాగే ఒంట్లో బాలేనప్పుడు డాక్టరును కలిసి సరైన వైద్యం తీసుకుంటాం. అంతేకాదు అనవసరమైన పనులు చేసి మన ప్రాణాల్ని ప్రమాదంలో పడేసుకోం.

16. మనలో ఉండే చనిపోతామనే భయాన్ని సాతాను ఎలా ఉపయోగిస్తాడు?

16 మనం జీవాన్ని ఎంతో విలువైనదిగా చూస్తామని సాతానుకు తెలుసు. మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి దేన్నైనా, చివరికి యెహోవాతో ఉన్న స్నేహాన్ని కూడా మనం విడిచిపెట్టేస్తామని అతను అంటున్నాడు. కానీ అది పచ్చి అబద్ధం. (యోబు 2:4, 5) అయితే, సాతానుకు “మరణాన్ని కలగజేసే సామర్థ్యం” ఉంది. కాబట్టి చనిపోతామనే భయాన్ని ఉపయోగించి మనం యెహోవాను విడిచిపెట్టేలా చేయాలని అతను ప్రయత్నిస్తాడు. (హెబ్రీ. 2:14, 15) కొన్నిసార్లు సాతాను చెప్పుచేతల్లో ఉన్న కొంతమంది మనం యెహోవాను ఆరాధించడం ఆపేయకపోతే చంపేస్తామని బెదిరిస్తారు. ఇంకొన్నిసార్లు మనకు తీవ్రమైన అనారోగ్యం వస్తే, ఆ పరిస్థితిని సాతాను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. అతను డాక్టర్ల ద్వారా లేదా సత్యంలోలేని కుటుంబ సభ్యుల ద్వారా రక్తం ఎక్కించుకోమని, బైబిలు సూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఏదైనా వైద్యాన్ని తీసుకోమని మనల్ని ఒత్తిడి చేయొచ్చు.

17. రోమీయులు 8:37-39 ప్రకారం, మనం చనిపోతామని ఎందుకు భయపడాల్సిన అవసరంలేదు?

17 మనలో ఎవ్వరం చనిపోవాలని కోరుకోం. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, యెహోవా మనల్ని ప్రేమించడం ఆపడని మనకు తెలుసు. (రోమీయులు 8:37-39 చదవండి.) తన స్నేహితులు ఎవరైనా చనిపోతే, యెహోవా వాళ్లను మర్చిపోడు. ఆయన దృష్టిలో వాళ్లింకా బ్రతికి ఉంటారు. (లూకా 20:37, 38) ఆయన వాళ్లను తిరిగి బ్రతికించాలని ఎంతో కోరుకుంటున్నాడు. (యోబు 14:15) మనందరం “శాశ్వత జీవితం పొందాలని” యెహోవా తన కుమారుణ్ణి అర్పించి గొప్ప మూల్యం చెల్లించాడు. (యోహా. 3:16) దీన్నిబట్టి యెహోవాకు మన మీద ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి మనకు ఒంట్లో బాలేనప్పుడు లేదా చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు యెహోవాను విడిచిపెట్టకుండా ఓదార్పు కోసం, తెలివి కోసం, బలం కోసం ఆయన మీద ఆధారపడాలి. వేలరీ, ఆమె భర్త అదే చేశారు.—కీర్త. 41:3.

18. వేలరీ అనుభవం నుండి మీరేం నేర్చుకోవచ్చు?

18 వేలరీ అనే సహోదరికి 35 ఏళ్లు ఉన్నప్పుడు, చాలా తక్కువ మందికి వచ్చే ఒక రకమైన క్యాన్సర్‌ తనకుందని, అది శరీరమంతా పాకిపోయిందని తెలిసింది. దానిగురించి ఆమె ఇలా చెప్తుంది: “నాకు క్యాన్సర్‌ అని తెలియగానే షాక్‌ అయ్యాను. రాత్రికిరాత్రే నా జీవితం మారిపోయింది. నేను బతకాలంటే చాలా కష్టమైన ఆపరేషన్‌ చేయాలి. దానికోసం రక్తం ఎక్కించకుండా ఆపరేషన్‌ చేయమని నేను చాలామంది డాక్టర్లను అడిగాను. కానీ ఎవ్వరూ ఒప్పుకోకపోయేసరికి నేను చాలా భయపడ్డాను. అయితే రక్తం ఎక్కించుకోకూడదనే దేవుని ఆజ్ఞను ఎట్టి పరిస్థితుల్లో మీరాలని అనుకోలేదు. యెహోవా ఇప్పటివరకు నన్ను ప్రేమిస్తున్నాడని ఎన్నో విధాలుగా చూపించాడు. ఇప్పుడాయన్ని ప్రేమిస్తున్నానని చూపించే అవకాశం నాకు వచ్చింది. డాక్టర్లు నా ఆరోగ్యం పాడైపోతుందని చెప్పిన ప్రతిసారీ, యెహోవాకు నమ్మకంగా ఉంటూ సాతాను అబద్ధికుడని నిరూపించాలని ఇంకా గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత రక్తం ఎక్కించకుండానే నాకు ఆపరేషన్‌ జరిగింది. నాకిప్పటికీ అనారోగ్య పరిస్థితులు ఉన్నా యెహోవా మాకు అవసరమైన సహాయాన్ని చేస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు, నాకు క్యాన్సర్‌ ఉందని తెలిసే ముందు వారం, మీటింగ్‌లో ‘కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోండి’ అనే ఆర్టికల్‌ చూశాం.c ఆ ఆర్టికల్‌ మా పరిస్థితికి సరిగ్గా సరిపోయింది కాబట్టి దాన్ని పదేపదే చదివి, చాలా ఓదార్పు పొందాం. ఇలాంటి ఆర్టికల్స్‌ని చదవడం ద్వారా, మానకుండా ప్రీచింగ్‌కి, మీటింగ్స్‌కి వెళ్లడం ద్వారా నా భర్త నేను ప్రశాంతంగా ఉండగలిగాం. మంచి నిర్ణయాలు తీసుకోగలిగాం.”

మన భయాల్ని అధిగమించడం

19. అతిత్వరలో ఏం జరుగుతుంది?

19 ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ఆరాధకులు ఆయన సహాయంతో ఎన్నో కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొని, సాతాన్ని ఎదిరించడంలో విజయం సాధించారు. (1 పేతు. 5:8, 9) వాళ్లలానే మీరూ విజయం సాధించవచ్చు. అతిత్వరలో ‘అపవాది పనుల్ని నాశనం చేయమని’ యేసుకు, ఆయన తోటి పరిపాలకులకు యెహోవా చెప్తాడు. (1 యోహా. 3:8) ఆ తర్వాత దేవున్ని సేవించే ప్రజలు దేనికీ భయపడరు, అలాగే వాళ్లను ఏదీ భయపెట్టదు. (యెష. 54:14; మీకా 4:4) అయితే అప్పటివరకు మన భయాల్ని అధిగమించడానికి బాగా ప్రయత్నించాలి.

20. భయాల్ని అధిగమించడానికి మనమేం చేయాలి?

20 యెహోవా తన సేవకుల్ని ప్రేమిస్తాడనే, వాళ్లను కాపాడతాడనే నమ్మకాన్ని బలపర్చుకుంటూ ఉందాం. దానికోసం యెహోవా తన సేవకుల్ని గతంలో ఎలా కాపాడాడో లోతుగా ఆలోచించాలి అలాగే వాటి గురించి ఇతరులకు చెప్పాలి. అంతేకాదు మనం కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు ఆయనెలా సహాయం చేశాడో గుర్తు చేసుకోవాలి. అలా యెహోవా మన పక్కన ఉంటే మన భయాల్ని అధిగమించగలం.—కీర్త. 34:4.

మీరెలా జవాబిస్తారు?

  • కుటుంబాన్ని పోషించలేమేమో అనే భయాన్ని అధిగమించడానికి యెహోవా ప్రేమ మనకెలా సహాయం చేస్తుంది?

  • మనుషుల భయాన్ని అధిగమించడానికి యెహోవా ప్రేమ మనకెలా సహాయం చేస్తుంది?

  • చనిపోతామనే భయాన్ని అధిగమించడానికి యెహోవా ప్రేమ మనకెలా సహాయం చేస్తుంది?

పాట 129 సహనం చూపిస్తూ ఉందాం

a కొన్నిసార్లు భయపడడం వల్ల మనకు మంచే జరుగుతుంది. ఎలా అంటే అది మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది. అయితే ఇంకొన్నిసార్లు భయపడడం వల్ల మనకు హాని జరుగుతుంది. ఎలా? సాతాను అలాంటి భయాన్ని ఉపయోగించి మనల్ని మంచి నిర్ణయాలు తీసుకోకుండా చేస్తాడు. కాబట్టి అలాంటి భయాన్ని తీసేసుకోవడానికి గట్టిగా కృషిచేయాలి. యెహోవా మన వైపు ఉన్నాడని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మకం కుదిరినప్పుడు ఎలాంటి భయాన్నైనా అధిగమించగలమని ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

b కొన్ని అసలు పేర్లు కావు.

c 2012 అక్టోబరు 15, కావలికోట పత్రికలోని 7-11 పేజీలు చూడండి.

d చిత్రాల వివరణ: కష్టపడి పనిచేస్తున్న ఒక సహోదరికి, ఆమె కుటుంబానికి సంఘంలోని ఒక జంట ఆహారం తీసుకొస్తున్నారు.

e చిత్రాల వివరణ: యెహోవాను సేవించకుండా ఒక యౌవన సహోదరుణ్ణి అతని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. కానీ అతను మాత్రం యెహోవా తనకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి