దయ చూపిస్తూ నడుచుకోండి
బైబిలు చదవడాన్ని, ధ్యానించడాన్ని లీసా, ఆన్ అనే ఇద్దరు సహోదరీలు ఇప్పుడు ఎంతో ఆనందిస్తున్నారు.a దానికి కారణం మొదట్లో సాక్షులు వాళ్లమీద చూపించిన దయే. దానివల్ల వాళ్ల జీవితాలు మారిపోయాయి. సత్యం తెలుసుకోవడానికి తనను ఏది ఆకర్షించిందో చెప్తూ లీసా ఇలా అంటుంది: “క్రైస్తవ సహోదర సహోదరీలు చూపించిన దయను నేను ఎప్పుడూ మర్చిపోను.” ఆన్ కూడా ఇలా అంటుంది: “మొదట్లో సాక్షులు చెప్పే వాటికన్నా వాళ్లు చూపించిన దయ వల్లే నేను సత్యం గురించి తెలుసుకోవడానికి ఇష్టపడ్డాను.”
మన చుట్టూ ఉన్నవాళ్లను కదిలించేలా దయ ఎలా చూపించవచ్చు? రెండు మార్గాల్ని పరిశీలిద్దాం. ఒకటి మన మాటల ద్వారా, రెండు మన పనుల ద్వారా. ఆ తర్వాత మనం ఎవరెవరితో దయగా ఉండాలో కూడా చూద్దాం.
మాటల ద్వారా దయ చూపించండి
సామెతలు 31వ అధ్యాయంలో చెప్పిన సమర్థురాలైన భార్య ఎప్పుడూ “దయగా మాట్లాడుతుంది.” (సామె. 31:26) ఆమె మాట్లాడే మాటల్లోనే కాదు, మాట్లాడే విధానంలో కూడా దయ చూపిస్తుంది. తండ్రులు కూడా ఎప్పుడూ దయగా మాట్లాడాలి. దురుసుగా మాట్లాడితే తమ పిల్లలకు హాని జరుగుతుందని చాలామంది తల్లిదండ్రులకు తెలుసు. అంతేకాదు అలా ఉంటే బహుశా పిల్లలు సరిగ్గా మాట కూడా వినకపోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు దయగా మాట్లాడినప్పుడు, పిల్లలు వాళ్ల మాట వినడం మరింత సులువౌతుంది.
మీకు పిల్లలు ఉన్నా లేకపోయినా దయగా మాట్లాడడం ఎలా నేర్చుకోవచ్చు? ఒక విధానం గురించి సామెతలు 31:26 లో చూస్తాం. అక్కడిలా ఉంది: “ఆమె తెలివితో నోరు తెరుస్తుంది.” దానర్థం మన మాటల్ని తెలివిగా ఎంచుకోవాలి. అలాగే మనం మాట్లాడే విధానం ఎలా ఉందో చూసుకోవాలి. అందుకు ఇలా ప్రశ్నించుకోవడం మనకు సహాయం చేస్తుంది: ‘నేను ఇప్పుడు చెప్పబోయే విషయాల వల్ల అవతలి వ్యక్తిలో కోపం పెరుగుతుందా లేదా తగ్గుతుందా?’ (సామె. 15:1) అవును, మాట్లాడే ముందు కాస్త ఆగి ఆలోచించడం తెలివైన పని.
ఇంకో విధానం గురించి కూడా సామెతలు పుస్తకంలోనే ఉంది. అక్కడిలా ఉంది: “ఆలోచించకుండా మాట్లాడే మాటలు కత్తిపోట్ల లాంటివి.” (సామె. 12:18) మన మాటలు, మాట్లాడే విధానం ఇతరులకు ఎలా అనిపిస్తుందో ఆలోచించినప్పుడు మరింత జాగ్రత్తగా మాట్లాడతాం. మనం ఎప్పుడైతే దయ చూపిస్తామో దురుసుగా, ఇతరుల్ని నొప్పించే మాటల్ని మాట్లాడం. (ఎఫె. 4:31, 32) బదులుగా ప్రేమతో, ఆప్యాయతతో మాట్లాడతాం. దానివల్ల ఇతరులు ప్రోత్సాహం పొందుతారు. అయితే ఈ విషయంలో యెహోవా మంచి ఆదర్శాన్ని ఉంచాడు. ఆయన భయపడుతున్న తన సేవకుడైన ఏలీయాకు ధైర్యం చెప్పడానికి ఒక దేవదూతను పంపించాడు. ఆ దూత ‘ప్రశాంతమైన, మెల్లని స్వరంతో’ మాట్లాడాడు. (1 రాజు. 19:12) నిజమే, దయగా ఉండడం అంటే కేవలం దయగా మాట్లాడడమే కాదు. మనం మన పనుల్లో కూడా దయ చూపించాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
పనుల్లో దయ చూపించినప్పుడు ఇతరులు ప్రోత్సాహం పొందుతారు
మనం మాటల్లోనే కాదు, పనుల్లో కూడా దయ చూపించినప్పుడు యెహోవాను అనుకరించిన వాళ్లమౌతాం. (ఎఫె. 4:32; 5:1, 2) ఇంతకుముందు ప్రస్తావించిన లీసా, సాక్షులు తనపట్ల ఎలా దయ చూపించారో చెప్తూ ఇలా అంటుంది: “మమ్మల్ని ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయమని చెప్పినప్పుడు, సంఘంలో ఉన్న రెండు జంటలు సెలవు తీసుకుని మరీ సామాన్లు సర్దడానికి మాకు సహాయం చేశారు. అప్పటికింకా నేను బైబిలు స్టడీ తీసుకోవడం కూడా మొదలుపెట్టలేదు.” అలా వాళ్లు దయ చూపించడంవల్ల లీసా సత్యం గురించి ఇంకా తెలుసుకోవాలని నిర్ణయించుకుంది.
ముందు ప్రస్తావించిన ఆన్, సాక్షులు చూపించిన దయవల్ల ఎలా ప్రయోజనం పొందిందో చెప్తూ ఇలా అంటుంది: “లోకంలోనివాళ్లు చెడుగా ప్రవర్తిస్తారు కాబట్టి నేను ఎవర్నీ అంత సులువుగా నమ్మేదాన్ని కాదు. అందుకే సాక్షుల్ని కలిసినప్పుడు వాళ్లని కూడా నమ్మలేదు. వాళ్లు నామీద ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారా అని సందేహపడ్డాను. కానీ నాకు స్టడీ ఇస్తున్న సహోదరి నామీద నిజంగా దయ చూపిస్తుందని అర్థంచేసుకున్నప్పుడు ఆమెను నమ్మడం మొదలుపెట్టాను. అప్పటినుండి నేను నేర్చుకుంటున్న విషయాల మీద కూడా మనసుపెట్టాను.”
సంఘంలో సహోదర సహోదరీలు చూపించిన దయ లీసా, ఆన్లకు బాగా నచ్చిందని మనం చూశాం. దానివల్లే సత్యం నేర్చుకోవాలనే కోరిక వాళ్లలో కలిగింది. నిజానికి యెహోవాను, ఆయన ప్రజల్ని నమ్మడానికి సంఘంలోవాళ్లు చూపించిన దయే వాళ్లకు సహాయం చేసింది.
దేవుడు చూపించేలాంటి దయను ఇతరులపట్ల చూపించడం నేర్చుకోండి
కొంతమందికి వాళ్లు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వాళ్ల సంస్కృతిని బట్టి మర్యాదగా, దయగా మాట్లాడడం లేదా నవ్వడం తేలిగ్గా ఉండవచ్చు. అలా సహజంగా లేదా సంస్కృతిని బట్టి దయ చూపించడం మంచిదే. కానీ కేవలం ఆ కారణాల్నిబట్టే దయ చూపిస్తే, అది దేవుడు చూపించినలాంటి దయ అయితే కాదు.—అపొస్తలుల కార్యాలు 28:2 తో పోల్చండి.
దేవుని పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో నిజమైన దయ ఒకటి. (గల. 5:22, 23) కాబట్టి మనం అలాంటి దయ చూపించాలంటే మన ఆలోచనలు, పనులు దేవుని పవిత్రశక్తి ప్రకారంగా ఉండాలి. అలా ఉంటే మనం యెహోవాను, యేసును అనుకరించిన వాళ్లమౌతాం. అంతేకాదు క్రైస్తవులుగా మనం ఇతరులమీద నిజమైన శ్రద్ధను చూపిస్తాం. కాబట్టి యెహోవా దేవునిపట్ల, సాటిమనుషుల పట్ల ప్రేమవల్ల దయ చూపించడానికి ముందుకొస్తాం. అలాంటి దయ మన హృదయంలో నుండి వస్తుంది, దాన్ని దేవుడు కూడా ఇష్టపడతాడు.
ఎవరిపట్ల దయ చూపించాలి?
మనతో దయగా ఉండేవాళ్ల పట్ల లేదా మనకు తెలిసినవాళ్ల పట్ల దయ చూపించడం, వాళ్లకు థాంక్యూ చెప్పడం సులువే. (2 సమూ. 2:6; కొలొ. 3:15) అయితే ఒక వ్యక్తి మన దయ పొందడానికి అర్హుడు కాదనిపిస్తే లేదా వాళ్ల మీద దయ చూపించినా లాభం లేదనిపిస్తే అప్పుడేంటి?
ఒకసారి దీనిగురించి ఆలోచించండి: అపారదయ చూపించే విషయంలో యెహోవా దేవుడు సాటిలేని ఆదర్శాన్ని ఉంచాడు. ఈ లక్షణాన్ని చూపించడం గురించి ఒక ముఖ్యమైన పాఠాన్ని ఆయన బైబిలు ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. నిజానికి “అపారదయ” అనే మాట, మత్తయి నుండి ప్రకటన పుస్తకాల్లో చాలాసార్లు కనిపిస్తుంది. మరైతే దేవుడు మనమీద ఎలా దయ చూపిస్తున్నాడు?
బతకడానికి అవసరమైనవన్నీ ఇస్తూ ఇప్పటివరకు జీవించిన ఎన్నో కోట్లమందిపట్ల యెహోవా దయ చూపిస్తూ వచ్చాడు. (మత్త. 5:45) నిజానికి మనుషులకు తానెవరో తెలియకముందే యెహోవా వాళ్లమీద దయ చూపించాడు. (ఎఫె. 2:4, 5, 8) ఉదాహరణకు, ఆయన శ్రేష్ఠమైనది మనకు ఇచ్చాడు, అంటే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మనుషులందరి కోసం అర్పించాడు. “దేవుని అపారదయ చాలా గొప్పది” కాబట్టే ఆయన విమోచన క్రయధన ఏర్పాటు చేశాడని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఎఫె. 1:7) అలాగే మనం తప్పులు చేసినా, యెహోవాను బాధపెట్టినా ఆయన మనల్ని నడిపిస్తూ, మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయనిచ్చే నిర్దేశాలు, మాటలు ఊరటనిచ్చే “జల్లులా” ఉంటాయి. (ద్వితీ. 32:2) నిజానికి ఆయన మనపట్ల చూపిస్తున్న దయ అంతటినిబట్టి, మనం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉన్నాం. అంతేకాదు యెహోవా మనపట్ల అపారదయను చూపించకపోయుంటే, మనకు భవిష్యత్తు విషయంలో ఎలాంటి ఆశ ఉండేది కాదు.—1 పేతురు 1:13 తో పోల్చండి.
యెహోవా చూపించే దయ గురించి ఆలోచించినప్పుడు మనం ఆయనకు ఇంకా దగ్గరవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటాం, ఆయనలానే దయ చూపించాలనుకుంటాం. కాబట్టి కేవలం కొంతమంది పట్లే దయ చూపించాలని అనుకోకుండా, మనం కలిసే ప్రతీ ఒక్కరిపట్ల దయగా, ప్రేమగా ఉంటూ యెహోవాను ప్రతిరోజూ అనుకరించడానికి ప్రయత్నించాలి. (1 థెస్స. 5:15) అలా మనం ఎప్పుడూ దయ చూపిస్తే, మనచుట్టూ ఉన్నవాళ్లకు ఎముకలు కొరికే చలిలో వెచ్చని చలిమంటలా ఉంటాం. అంతేకాదు మన కుటుంబ సభ్యులు, తోటి ఆరాధకులు, పనిస్థలంలో-స్కూల్లో మన తోటివాళ్లు అలాగే ఇరుగుపొరుగువాళ్లు మనవల్ల ఎంతో ఊరటను పొందుతారు.
కుటుంబంలో లేదా సంఘంలో మీ మాటల ద్వారా, పనుల ద్వారా దయ చూపించడం వల్ల ఎవరైనా ప్రయోజనం పొందుతారేమో ఆలోచించండి. బహుశా మీ సంఘంలో ఎవరికైనా ఇంటిపనులు చేసుకోవడానికి, సరుకులు కొనుక్కోవడానికి సహాయం అవసరం అవ్వొచ్చు. అంతేకాదు పరిచర్యలో కలిసేవాళ్లకు ఏదైనా అవసరం ఉంటే మీరు సహాయం చేయగలరేమో ఆలోచించండి.
అలా మనం యెహోవాను అనుకరిస్తూ మాటల ద్వారా, పనుల ద్వారా ఎప్పుడూ దయ చూపిస్తూ ఉందాం.
a కొన్ని అసలు పేర్లు కావు.