అధ్యయన ఆర్టికల్ 44
మీ నిరీక్షణను బలంగా ఉంచుకోండి
“యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి.”—కీర్త. 27:14.
పాట 144 మీ దృష్టి లక్ష్యంపై ఉంచండి!
ఈ ఆర్టికల్‌లో. . .a
1. యెహోవా మనకు ఏ నిరీక్షణ ఇచ్చాడు?
యెహోవా మనకు శాశ్వత జీవితం అనే గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. కొంతమందికి పరలోకంలో ఆత్మ ప్రాణులుగా జీవించే నిరీక్షణ ఉంది. (1 కొరిం. 15:50, 53) అయితే ఎక్కువమందికి ఈ భూమ్మీద సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే నిరీక్షణ ఉంది. (ప్రక. 21:3, 4) మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా మనందరం మన నిరీక్షణను విలువైనదిగా చూడాలి.
2. మన నిరీక్షణ వేటి మీద ఆధారపడినది? ఎందుకు అలా చెప్పవచ్చు?
2 బైబిల్లో ఉన్న “నిరీక్షణ” అనే పదానికి, “మంచి జరుగుతుందని ఎదురు చూడడం లేదా కనిపెట్టుకొని ఉండడం” అనే అర్థం ఉంది. భవిష్యత్తు విషయంలో మన నిరీక్షణ ఖచ్చితంగా నిజమౌతుంది అనడంలో ఏ సందేహం లేదు. ఎందుకంటే యెహోవాయే దాన్ని మాటిచ్చాడు. (రోమా. 15:13) యెహోవా ఏమైనా మాటిస్తే, ఆయన దాన్ని నిలబెట్టుకుంటాడని మనకు తెలుసు. (సంఖ్యా. 23:19) తను చెప్పినవన్నీ చేయాలనే కోరిక, చేయగల శక్తి యెహోవాకు ఉందని మనం నమ్ముతున్నాం. కాబట్టి మన నిరీక్షణ కేవలం ఒక పగటికల కాదు. అది రుజువుల మీద, వాస్తవాల మీద ఆధారపడినది.
3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం? (కీర్తన 27:14)
3 మన పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, అలాగే మనం ఆయన్ని పూర్తిగా నమ్మాలని కోరుకుంటున్నాడు. (కీర్తన 27:14 చదవండి.) యెహోవా కోసం కనిపెట్టుకొని ఉంటే లేదా ఆయన మీద మన నిరీక్షణ బలంగా ఉంటే, ఇప్పుడున్న సమస్యల్ని తట్టుకోగలుగుతాం. అలాగే భవిష్యత్తును ధైర్యంగా, సంతోషంగా ఎదుర్కుంటాం. నిరీక్షణ మనల్ని ఎలా కాపాడుతుందో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. ముందు నిరీక్షణ ఒక లంగరులా, ఒక హెల్మెట్‌లా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. తర్వాత, మన నిరీక్షణను ఎలా బలంగా ఉంచుకోవచ్చో చూద్దాం.
మన నిరీక్షణ లంగరు లాంటిది
4. మన నిరీక్షణను లంగరుతో ఎందుకు పోల్చవచ్చు? (హెబ్రీయులు 6:19)
4 అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరంలో మన నిరీక్షణను లంగరుతో పోల్చాడు. (హెబ్రీయులు 6:19 చదవండి.) పౌలు చాలాసార్లు సముద్రంలో ప్రయాణించాడు, కాబట్టి ఓడ కొట్టుకుపోకుండా లంగరు ఎలా కాపాడుతుందో ఆయనకు తెలుసు. ఒకసారి ఆయన ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు ఓడ కొట్టుకుపోయి, రాళ్లకు గుద్దుకోకుండా ఓడ నడిపేవాళ్లు సముద్రంలోకి లంగర్లు వేశారు. (అపొ. 27:29, 39-41) అదేవిధంగా, మన జీవితంలో తుఫాను లాంటి పెద్దపెద్ద కష్టాలు వచ్చినప్పుడు యెహోవాకు దూరంగా కొట్టుకుపోకుండా, నిరీక్షణ ఒక లంగరులా మనల్ని స్థిరంగా ఉంచుతూ కాపాడుతుంది. కష్టాలు కొంతకాలమే ఉంటాయి, తర్వాత మంచిరోజులు వస్తాయి అనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండేలా నిరీక్షణ మనకు సహాయం చేస్తుంది. అంతేకాదు, క్రైస్తవులకు హింసలు వస్తాయని యేసు ముందే చెప్పాడు. (యోహా. 15:20) అయితే యెహోవా మాటిచ్చిన భవిష్యత్తు గురించి ధ్యానించినప్పుడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనకు నమ్మకంగా ఉంటాం.
5. హింస అనుభవించి చనిపోవాల్సి వచ్చినప్పుడు నిరీక్షణ యేసుకు ఎలా సహాయం చేసింది?
5 యేసుకు తాను హింసను అనుభవించి చనిపోతానని తెలుసు, అయినా స్థిరంగా ఉండేలా నిరీక్షణ ఆయనకు సహాయం చేసింది. క్రీ.శ. 33 పెంతెకొస్తు రోజున అపొస్తలుడైన పేతురు, కీర్తనల పుస్తకంలోని ఒక ప్రవచనం యేసు విషయంలో ఎలా నెరవేరిందో వివరించాడు. ఆ ప్రవచనం యేసు ఎంత ప్రశాంతంగా, ధైర్యంగా ఉన్నాడో చెప్తుంది. అక్కడ ఇలా ఉంది: “నేను ఆశతో జీవిస్తాను; ఎందుకంటే నువ్వు నన్ను సమాధిలో విడిచిపెట్టవు. నీ విశ్వసనీయుణ్ణి కుళ్లిపోనివ్వవు. . . . నీ సన్నిధిలో నా హృదయాన్ని గొప్ప సంతోషంతో నింపుతావు.” (అపొ. 2:25-28; కీర్త. 16:8-11) తాను చనిపోయినా దేవుడు తిరిగి లేపుతాడు, పరలోకంలో ఆయన సన్నిధిలో సంతోషంగా జీవించే అవకాశం తనకు మళ్లీ దొరుకుతుంది అనే బలమైన ఆశ లేదా నిరీక్షణ యేసుకు ఉంది.—హెబ్రీ. 12:2, 3.
6. నిరీక్షణ గురించి ఒక సహోదరుడు ఏమన్నాడు?
6 హింసల్ని సహించడానికి నిరీక్షణ ఎంతోమంది సహోదర సహోదరీలకు సహాయం చేసింది. ఉదాహరణకు ఇంగ్లండ్‌లో జీవించిన లెనార్డ్ చిన్ అనే సహోదరుడి అనుభవం పరిశీలించండి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో చేరనందుకు ఆయన్ని జైల్లో వేశారు. ఆయన్ని రెండు నెలలపాటు ఒంటరిగా ఒకే గదిలో ఉంచారు. ఆ తర్వాత ఆయనతో వెట్టిచాకిరి చేయించారు. ఆ హింసల్ని ఆయన నమ్మకంగా సహించాడు. తర్వాతి కాలంలో ఆయన ఇలా రాశాడు: “హింసల్ని సహించడానికి నిరీక్షణ ఎంత అవసరమో, నా అనుభవం నాకు నేర్పించింది. యేసు, అపొస్తలులు, ప్రవక్తల మంచి ఆదర్శం మనకు ఉంది. బైబిల్లోని అద్భుతమైన వాగ్దానాలు కూడా మనకు ఉన్నాయి. ఇవన్నీ భవిష్యత్తు విషయంలో గొప్ప నిరీక్షణను, హింసల్ని సహించడానికి కావాల్సిన బలాన్ని ఇస్తాయి.” నిరీక్షణ ఒక లంగరులా లెనార్డ్‌ను కాపాడింది, అది మనల్ని కూడా కాపాడుతుంది.
7. కష్టాలు మన నిరీక్షణను ఎలా బలపరుస్తాయి? (రోమీయులు 5:3-5; యాకోబు 1:12)
7 కష్టాల్ని సహిస్తూ యెహోవా సహాయాన్ని, ఆమోదాన్ని పొందినప్పుడు మన నిరీక్షణ బలంగా తయారౌతుంది. (రోమీయులు 5:3-5; యాకోబు 1:12 చదవండి.) మంచివార్త తెలుసుకున్నప్పటితో పోలిస్తే, కష్టాల్ని సహించిన తర్వాత మన నిరీక్షణ ఇంకా బలంగా తయారైందని గుర్తిస్తాం. కష్టాల వల్ల మనం ఉక్కిరిబిక్కిరి అవ్వాలని సాతాను కోరుకుంటున్నాడు. కానీ యెహోవా సహాయంతో, ఎన్ని కష్టాలు వచ్చినా మనం స్థిరంగా ఉండవచ్చు.
మన నిరీక్షణ హెల్మెట్ లాంటిది
8. నిరీక్షణను హెల్మెట్‌తో ఎందుకు పోల్చవచ్చు? (1 థెస్సలొనీకయులు 5:8)
8 బైబిలు నిరీక్షణను హెల్మెట్‌తో కూడా పోలుస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:8, అధస్సూచి చదవండి.) శత్రువుల దాడి నుండి తన తలను కాపాడుకోవడానికి సైనికుడు హెల్మెట్‌ను లేదా శిరస్త్రాణాన్ని పెట్టుకుంటాడు. మనం ఆధ్యాత్మిక యుద్ధంలో, సాతాను దాడుల నుండి మన మనసును కాపాడుకోవాలి. మన ఆలోచనల్ని పాడుచేయడానికి, మనతో తప్పుడు పనులు చేయించడానికి సాతాను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు. హెల్మెట్ సైనికుడి తలను కాపాడినట్టే, నిరీక్షణ మన ఆలోచనల్ని కాపాడుతూ యెహోవాకు నమ్మకంగా ఉండేలా మనకు సహాయం చేస్తుంది.
9. నిరీక్షణ లేని ప్రజలు ఎలా ఉంటారు?
9 శాశ్వత జీవితం అనే మన నిరీక్షణ, తెలివితో నడుచుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. కానీ మన నిరీక్షణ బలహీనపడితే, మనం సొంత కోరికల గురించే ఆలోచించే ప్రమాదం ఉంది. అప్పుడు మన దృష్టి, శాశ్వత జీవితమనే బహుమతి నుండి పక్కకు మళ్లుతుంది. కొరింథులో ఉన్న కొంతమంది క్రైస్తవుల గురించి ఆలోచించండి. వాళ్లు దేవుడిచ్చిన ఒక ముఖ్యమైన వాగ్దానం మీద, అంటే పునరుత్థాన నిరీక్షణ మీద నమ్మకం కోల్పోయారు. (1 కొరిం. 15:12) పునరుత్థాన నిరీక్షణ లేనివాళ్లు కేవలం సొంత కోరికలు తీర్చుకోవడంలోనే మునిగిపోతారని పౌలు చెప్పాడు. (1 కొరిం. 15:32) నేడు దేవుడు ఇచ్చిన వాగ్దానాల మీద నమ్మకంలేని చాలామంది, కేవలం ఇప్పుడు సుఖంగా బ్రతకడం మీదే మనసు పెడుతున్నారు. మనం మాత్రం భవిష్యత్తు గురించి దేవుడు ఇచ్చిన వాగ్దానాల్ని పూర్తిగా నమ్ముతాం. మన నిరీక్షణ ఒక హెల్మెట్‌లా పనిచేస్తూ మన ఆలోచనల్ని కాపాడుతుంది. దానివల్ల మనం సొంత కోరికల్లో మునిగిపోకుండా, యెహోవాతో మన సంబంధాన్ని పాడు చేసుకోకుండా ఉంటాం.—1 కొరిం. 15:33, 34.
10. అబద్ధాల నుండి నిరీక్షణ మనల్ని ఎలా కాపాడుతుంది?
10 ‘దేవున్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించడంలో ఎలాంటి లాభం లేదు’ అనే ఆలోచన నుండి కూడా నిరీక్షణ మనల్ని కాపాడుతుంది. కొంతమంది ఇలా అనుకోవచ్చు: ‘శాశ్వత జీవితానికి వెళ్లేవాళ్లలో నేను అస్సలు ఉండను. ఎందుకంటే, నేను మరీ అంత మంచివాడిని కాదు. దేవుని ప్రమాణాలకు తగ్గట్టు జీవించడం నావల్ల ఎప్పటికీ అవ్వదు.’ యోబుతో కఠినంగా మాట్లాడిన ఎలీఫజు ఏమన్నాడో గుర్తుతెచ్చుకోండి. అతను ఇలా అన్నాడు: “శుద్ధుడిగా ఉండడానికి మనిషి ఏపాటివాడు?” ఎలీఫజు దేవుని గురించి ఇలా అన్నాడు: “ఇదిగో! ఆయన తన దూతల్నే నమ్మట్లేదు, ఆకాశం కూడా ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు.” (యోబు 15:14, 15) అవి ఎంత పచ్చి అబద్ధాలో కదా! నిజానికి ఆ అబద్ధాల వెనక ఎవరున్నారు? సాతాను. అలాంటి అబద్ధాల గురించి ఆలోచిస్తే, మన నిరీక్షణ బలహీనపడుతుందని సాతానుకు తెలుసు. కాబట్టి వాటిని పట్టించుకోకుండా, యెహోవా మాటిచ్చిన వాటిమీదే మనసుపెట్టండి. మీరు శాశ్వత జీవితం పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు, దాన్ని పొందడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు అనే పూర్తి నమ్మకంతో ఉండండి.—1 తిమో. 2:3, 4.
మీ నిరీక్షణను బలంగా ఉంచుకోండి
11. యెహోవా మాటిచ్చినవి నెరవేరేంతవరకు మనం ఎందుకు ఓపిగ్గా ఎదురుచూడాలి?
11 మన నిరీక్షణను బలంగా ఉంచుకోవడం అన్నిసార్లూ అంత తేలికేమీ కాదు. కొన్నిసార్లు మన ఓపిక నశించి, ‘దేవుడు మాటిచ్చినవి నెరవేరడానికి ఇంకెంతకాలం పడుతుంది?’ అని అనుకోవచ్చు. అయితే యెహోవా యుగయుగాల నుండి ఉన్నాడు, మనకు చాలాకాలం అనిపించేది ఆయన దృష్టిలో చాలా తక్కువ కాలం. (2 పేతు. 3:8, 9) యెహోవా తాను మాటిచ్చిన వాటిని సరైన సమయంలో, సరైన విధంగా నెరవేరుస్తాడు. అయితే అది మనం అనుకున్న సమయం కాకపోవచ్చు. దేవుడు మాటిచ్చినవి నెరవేరేంతవరకు ఓపిగ్గా ఎదురుచూస్తూ, మన నిరీక్షణను ఎలా బలంగా ఉంచుకోవచ్చు?—యాకో. 5:7, 8.
12. యెహోవా మాటిచ్చిన వాటి కోసం ఎదురుచూడాలంటే లేదా నిరీక్షించాలంటే, విశ్వాసం అవసరమని హెబ్రీయులు 11:1, 6 ఎలా చూపిస్తోంది?
12 మన నిరీక్షణ బలంగా ఉండాలంటే, యెహోవాతో మన స్నేహం బలంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎదురుచూసే వాటిని లేదా నిరీక్షించే వాటిని నెరవేర్చేది ఆయనే. యెహోవా మాటిచ్చిన వాటికోసం నిరీక్షించాలంటే, ముందుగా ఆయన నిజంగా ఉన్నాడని విశ్వసించాలి. అంతేకాదు, “తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని తప్పకుండా నమ్మాలి.” (హెబ్రీయులు 11:1, 6 చదవండి.) యెహోవా ఉన్నాడని నిజంగా విశ్వసిస్తే, ఆయన మాటిచ్చినవన్నీ నెరవేరుస్తాడనే నమ్మకం పెరుగుతుంది. కాబట్టి, యెహోవాతో మన స్నేహాన్ని బలంగా ఉంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. అవి మన నిరీక్షణను బలంగా ఉంచుకోవడానికి కూడా సహాయం చేస్తాయి.
ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ మన నిరీక్షణను బలంగా ఉంచుకోవచ్చు (13-15 పేరాలు చూడండి)b
13. మనం యెహోవాకు ఎలా దగ్గరవ్వవచ్చు?
13 యెహోవాకు ప్రార్థించండి, ఆయన వాక్యాన్ని చదవండి. మనం యెహోవాను చూడలేకపోయినా, ఆయనకు దగ్గరవ్వవచ్చు. మనం చెప్పేవన్నీ ఆయన తప్పకుండా వింటాడనే నమ్మకంతో ప్రార్థించవచ్చు. (యిర్మీ. 29:11, 12) అలాగే బైబిల్ని చదువుతూ, ధ్యానిస్తూ ఆయన చెప్పేవి వినవచ్చు. గతంలో యెహోవా తన నమ్మకమైన సేవకుల మీద ఎలా ప్రేమ చూపించాడో చదివినప్పుడు, మన నిరీక్షణ ఇంకా బలంగా తయారౌతుంది. బైబిలు ఇలా చెప్తుంది: “మన సహనం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ కలిగివుండాలని పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి.”—రోమా. 15:4.
14. బైబిల్లో యెహోవా తన సేవకులకు ఇచ్చిన మాటను ఎలా నెరవేర్చాడో ధ్యానించడం ఎందుకు మంచిది?
14 తాను మాటిచ్చిన వాటిని యెహోవా ఎలా నెరవేర్చాడో ధ్యానించండి. ఉదాహరణకు అబ్రాహాము, శారాలకు ఇచ్చిన మాటను దేవుడు ఎలా నెరవేర్చాడో పరిశీలించండి. వాళ్లు పిల్లల్ని కనలేనంత ముసలివాళ్లు అయ్యారు. అయినా వాళ్లకు ఒక బాబు పుడతాడని దేవుడు మాటిచ్చాడు. (ఆది. 18:10) అప్పుడు అబ్రాహాము ఏం చేశాడో బైబిలు ఇలా చెప్తుంది: “తాను అనేక దేశాల ప్రజలకు తండ్రి అవుతానని అతను విశ్వసించాడు.” (రోమా. 4:18) సాధారణంగా ఆ వయసులో పిల్లలు పుట్టడం అసాధ్యమని అనిపించినా, యెహోవా తన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడని అబ్రాహాము పూర్తిగా నమ్మాడు. ఆయన నమ్మకం వృథా కాలేదు. (రోమా. 4:19-21) బైబిల్లోని అలాంటి అనుభవాలు, మన దృష్టికి అసాధ్యం అనిపించిన వాటిని కూడా యెహోవా ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే నమ్మకాన్ని మనలో నింపుతాయి.
15. యెహోవా మీ కోసం చేసిన వాటి గురించి ధ్యానించడం ఎందుకు మంచిది?
15 యెహోవా మీ కోసం ఏమేం చేశాడో ధ్యానించండి. బైబిల్లో దేవుడు మాటిచ్చిన విషయాలు, మీ జీవితంలో ఎలా నెరవేరాయో ఆలోచించండి. ఉదాహరణకు మన పరలోక తండ్రి మన కనీస అవసరాల్ని తీరుస్తాడని యేసు మాటిచ్చాడు. (మత్త. 6:32, 33) అంతేకాదు పవిత్రశక్తి కోసం ప్రార్థించినప్పుడు, యెహోవా మనకు దాన్ని ఖచ్చితంగా ఇస్తాడని కూడా యేసు భరోసా ఇచ్చాడు. (లూకా 11:13) యెహోవా నిజంగానే మీ విషయంలో తన మాటను నెరవేర్చాడని మీరు గమనించే ఉంటారు. యెహోవా మీకు ఇంకా ఏమని మాటిచ్చాడో ఆలోచించండి. మీ పాపాల్ని క్షమిస్తానని, మీకు తగినవేళ ఆధ్యాత్మిక ఆహారం ఇస్తానని, మిమ్మల్ని ఓదారుస్తానని కూడా ఆయన మాటిచ్చాడు. వాటన్నిటిని ఆయన నెరవేర్చాడు కదా. (మత్త. 6:14; 24:45; 2 కొరిం. 1:3) ఇప్పటివరకు యెహోవా మీ విషయంలో తాను మాటిచ్చినవి ఎలా నెరవేర్చాడో ధ్యానించినప్పుడు, భవిష్యత్తు విషయంలో ఆయన మాటిచ్చినవి కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడనే మీ నిరీక్షణ బలపడుతుంది.
నిరీక్షణను బట్టి సంతోషించండి
16. నిరీక్షణ అమూల్యమైన బహుమతి అని ఎందుకు చెప్పవచ్చు?
16 దేవుడు మాటిచ్చిన శాశ్వత జీవితమనే నిరీక్షణ నిజంగా ఎంతో అమూల్యమైన బహుమతి. ఆ అద్భుతమైన భవిష్యత్తు కోసం మనం ఎదురుచూస్తున్నాం. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నిరీక్షణ ఒక లంగరులా పనిచేస్తూ మనల్ని స్థిరంగా ఉంచుతుంది. అది కష్టాల్ని సహించేలా; హింసల్ని, చివరికి మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనేలా మనకు సహాయం చేస్తుంది. అంతేకాదు నిరీక్షణ ఒక హెల్మెట్‌లా మన ఆలోచనల్ని కాపాడుతుంది. అది చెడు విషయాల్ని అసహ్యించుకునేలా, మంచిని అంటిపెట్టుకునేలా మనకు సహాయం చేస్తుంది. బైబిలు ఇచ్చే నిరీక్షణ యెహోవాతో మనకున్న స్నేహాన్ని ఇంకా బలపరుస్తుంది, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేస్తుంది. అవును, మన నిరీక్షణను బలంగా ఉంచుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
17. మన నిరీక్షణను బట్టి ఎందుకు సంతోషించవచ్చు?
17 అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో “నిరీక్షణను బట్టి సంతోషించండి” అని చెప్పాడు. (రోమా. 12:12) చివరివరకు నమ్మకంగా ఉంటే, పరలోకంలో శాశ్వత జీవితం ఖచ్చితంగా దొరుకుతుంది అనే నిరీక్షణను బట్టి పౌలు సంతోషించాడు. మనం కూడా మన నిరీక్షణను బట్టి సంతోషించవచ్చు. ఎందుకంటే యెహోవా తాను మాటిచ్చినవన్నీ నెరవేరుస్తాడనే పూర్తి నమ్మకం మనకు ఉంది. కీర్తనకర్త ఇలా రాశాడు: “తమ దేవుడైన యెహోవా మీద ఆశపెట్టుకునే వాళ్లు సంతోషంగా ఉంటారు; . . . ఆయన ఎప్పటికీ నమ్మకంగానే ఉంటాడు.”—కీర్త. 146:5, 6, అధస్సూచి.
పాట 139 కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!
a భవిష్యత్తు విషయంలో యెహోవా మనకు అద్భుతమైన నిరీక్షణను ఇచ్చాడు. ఈ నిరీక్షణ మన జీవితంలో వెలుగు నింపి, మన ముందున్న కష్టాల్ని కాకుండా రాబోయే మంచి రోజుల్ని చూసేలా సహాయం చేస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, యెహోవాకు నమ్మకంగా ఉండడానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. అంతేకాదు, తప్పుడు ఆలోచనల ఉచ్చులో చిక్కుకోకుండా కాపాడుతుంది. కాబట్టి మన నిరీక్షణను బలంగా ఉంచుకోవాలి. అదెలాగో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.
b చిత్రాల వివరణ: హెల్మెట్ సైనికుడి తలను కాపాడుతుంది, లంగరు ఓడ కొట్టుకుపోకుండా దాన్ని స్థిరంగా ఉంచుతుంది. అదేవిధంగా నిరీక్షణ మన ఆలోచనల్ని కాపాడుతుంది, కష్టాల్ని సహిస్తూ స్థిరంగా ఉండేలా సహాయం చేస్తుంది. ఒక సహోదరి, తను చెప్పేవన్నీ యెహోవా వింటాడనే నమ్మకంతో ప్రార్థిస్తుంది. ఒక సహోదరుడు, అబ్రాహాముకు ఇచ్చిన మాటను యెహోవా ఎలా నెరవేర్చాడో ధ్యానిస్తున్నాడు. ఇంకో సహోదరుడు, యెహోవా తనను ఎలా దీవించాడో గుర్తుచేసుకుంటున్నాడు.