కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 మే పేజీలు 8-13
  • ప్రార్థనలు—వాటికి యెహోవా ఎలా జవాబిస్తాడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రార్థనలు—వాటికి యెహోవా ఎలా జవాబిస్తాడు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మనం అనుకున్నట్లుగా జవాబు ఇవ్వకపోవచ్చు
  • ఈ రోజుల్లో మన ప్రార్థనలకు యెహోవా జవాబు ఇచ్చే విధానాలు
  • విశ్వాసం ఉంటేనే యెహోవా ఇచ్చే జవాబుల్ని తెలుసుకుంటాం, తీసుకుంటాం
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • పరిచయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • యెహోవా నా ప్రార్థనల్ని వింటున్నాడా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ప్రార్థన అనే వరం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 మే పేజీలు 8-13

అధ్యయన ఆర్టికల్‌ 21

ప్రార్థనలు—వాటికి యెహోవా ఎలా జవాబిస్తాడు?

“మనం ఆయన్ని ఏవైతే అడిగామో వాటిని పొందుతామని కూడా మనకు తెలుసు.”—1 యోహా. 5:15.

పాట 41 దయచేసి నా ప్రార్థన ఆలకించు

ఈ ఆర్టికల్‌లో …a

1-2. ప్రార్థన గురించి మనకు ఏం అనిపించవచ్చు?

యెహోవా మీ ప్రార్థనలకు జవాబివ్వట్లేదని ఎప్పుడైనా అనిపించిందా? అయితే అలా మీ ఒక్కరికే కాదు చాలామంది బ్రదర్స్‌, సిస్టర్స్‌కి అనిపించింది. ముఖ్యంగా, కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు అలా అనిపించింది. కష్టాలు మనల్ని ఊపిరాడకుండా చేసినప్పుడు, యెహోవా మనకు ఇచ్చే జవాబుల్ని చూడలేకపోవచ్చు.

2 అయితే, తన ఆరాధకులు చేసే ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడనే నమ్మకంతో ఎందుకు ఉండవచ్చో ఇప్పుడు చూస్తాం. (1 యోహా. 5:15) అంతేకాదు, యెహోవా మన ప్రార్థనలకు కొన్నిసార్లు జవాబివ్వట్లేదని ఎందుకు అనిపించవచ్చు? నేడు యెహోవా మన ప్రార్థనలకు ఏయే విధాలుగా జవాబిస్తున్నాడు? అనే ప్రశ్నలు కూడా పరిశీలిస్తాం.

యెహోవా మనం అనుకున్నట్లుగా జవాబు ఇవ్వకపోవచ్చు

3. తనకు ప్రార్థించమని యెహోవా ఎందుకు అడుగుతున్నాడు?

3 యెహోవా మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని, మనం ఆయనకు చాలా విలువైనవాళ్లమని లేఖనాలు అభయమిస్తున్నాయి. (హగ్గ. 2:7; 1 యోహా. 4:10) అందుకే, మనకు ఏది కావాలన్నా ప్రార్థనలో ఆయన్ని అడగమని చెప్తున్నాడు. (1 పేతు. 5:6, 7) అంతేకాదు, మనం ఆయనకు దగ్గరవ్వాలని, మన కష్టాల్లో మన వెన్నంటే ఉంటూ వాటిని గట్టెక్కించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు.

దావీదు చేతిలో వీణ ఉంది, వెంట్రుక వాసిలో ఈటె నుండి తప్పించుకున్నాడు.

దావీదు తన శత్రువుల నుండి తప్పించుకునేలా చేయడం ద్వారా యెహోవా తన ప్రార్థనలకు జవాబిచ్చాడు (4వ పేరా చూడండి)

4. యెహోవా తన ఆరాధకుల ప్రార్థనలకు జవాబిచ్చాడని మనకు ఎలా తెలుసు? (చిత్రం కూడా చూడండి.)

4 తన ఆరాధకులు చేసే ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చాడని ఎన్నోసార్లు మనం బైబిల్లో చదువుతాం. మీకు ఎవరు గుర్తొస్తున్నారు? దావీదు రాజు గురించి ఆలోచించండి. శత్రువులు ఆయన్ని మట్టుపెట్టడానికి మాటేసుకుని ఉండేవాళ్లు. కానీ దావీదు పదేపదే సహాయం కోసం యెహోవా వైపు చూశాడు. ఒకానొక సందర్భంలో ఆయన ఇలా ప్రాధేయపడ్డాడు: “యెహోవా, నా ప్రార్థన విను; సహాయం కోసం నేను చేసే విన్నపాలు ఆలకించు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ నీతిని బట్టి నాకు జవాబివ్వు.” (కీర్త. 143:1) యెహోవా దావీదు అడిగినట్టే చేశాడు. (1 సమూ. 19:10, 18-20; 2 సమూ. 5:17-25) అందుకే దావీదు ధైర్యంగా ఇలా అనగలిగాడు: “తనకు మొరపెట్టే వాళ్లందరికీ యెహోవా దగ్గరగా ఉన్నాడు.” మనం కూడా అదే ధీమాతో ఉండవచ్చు.—కీర్త. 145:18.

అపొస్తలుడైన పౌలు యెహోవాను ప్రార్థనలో వేడుకుంటున్నాడు.

పౌలు తన సమస్యల్ని తట్టుకోవడానికి శక్తిని ఇవ్వడం ద్వారా యెహోవా తన ప్రార్థనలకు జవాబిచ్చాడు (5వ పేరా చూడండి)

5. గతంలో తన ఆరాధకుల ప్రార్థనలకు వాళ్లు అనుకున్నట్లుగా యెహోవా జవాబిచ్చాడా? ఒక ఉదాహరణ చెప్పండి. (చిత్రం కూడా చూడండి.)

5 యెహోవా మనం అనుకున్నట్లుగా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవచ్చు. అపొస్తలుడైన పౌలు విషయంలో అదే జరిగింది. తన శరీరంలో ఉన్న ముల్లును తీసేయమని ఆయన దేవున్ని అడిగాడు. మూడు సందర్భాల్లో, పౌలు తనకున్న సమస్య గురించి ప్రత్యేకంగా ప్రార్థించాడు. మరి యెహోవా ఆ ప్రార్థనలకు జవాబిచ్చాడా? ఇచ్చాడు, కానీ పౌలు అనుకున్నట్టుగా కాదు. ఎందుకంటే పౌలు అడిగినట్టు ఆ సమస్యను తీసేయలేదు గానీ దాన్ని తట్టుకుంటూ, తనకు నమ్మకంగా సేవచేసే శక్తిని యెహోవా ఆయనకు ఇచ్చాడు.—2 కొరిం. 12:7-10.

6. కొన్నిసార్లు మన ప్రార్థనలకు యెహోవా జవాబు ఇవ్వట్లేదని ఎందుకు అనిపించవచ్చు?

6 మనకు కూడా కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా యెహోవా జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ మనకు ఏది, ఎప్పుడు కావాలో ఆయనకు బాగా తెలుసు. అంతేకాదు ఆయన “మనం అడిగే వాటన్నిటికన్నా, ఊహించగలిగే వాటన్నిటికన్నా ఎంతో గొప్పవాటిని చేయగలడు.” (ఎఫె. 3:20) కాబట్టి మనం ఊహించని సమయంలో, ఊహించని విధంగా ఆయన జవాబివ్వవచ్చు.

7. మనం ప్రార్థించే విషయాల్ని ఎందుకు మార్చుకోవాల్సి రావచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

7 కొన్నిసార్లు యెహోవా ఇష్టం ఏంటో స్పష్టంగా చూడడానికి, మనం ఆయన్ని అడిగే అంశాన్ని మార్చాల్సి రావచ్చు. బ్రదర్‌ మార్టిన్‌ పోయిట్‌జింగర్‌ ఉదాహరణ గమనించండి. పెళ్లయిన వెంటనే ఆయన్ని తీసుకెళ్లి నాజీ నిర్బంధ శిబిరంలో వేశారు. మొదట్లో ఆయన తన భార్యను చూసుకోవడానికి, ప్రీచింగ్‌ చేసుకోవడానికి నిర్బంధ శిబిరం నుండి బయటికి పంపించమని యెహోవాకు ప్రార్థించాడు. కానీ రెండు వారాలు అయిపోయినప్పటికీ యెహోవా ఏ మార్గం చూపించలేదు. కాబట్టి, ఆయన ఇలా ప్రార్థించడం మొదలుపెట్టాడు: “యెహోవా, నేను ఇక్కడ ఏం చేయాలో చెప్పు?” ఆ తర్వాత, ఆ క్యాంప్‌లో ఉన్న వేరే బ్రదర్స్‌ గురించి ఆయన ఆలోచించాడు. వాళ్లలో చాలామంది, తమ భార్యాపిల్లల గురించి ఆందోళనపడుతున్నారని ఈ బ్రదర్‌ అర్థంచేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఇలా ప్రార్థించాడు: “యెహోవా నాకు ఈ కొత్త నియామకం ఇచ్చినందుకు థ్యాంక్యూ. నాతోపాటు ఇక్కడున్న బ్రదర్స్‌ని ప్రోత్సహించడానికి, బలపర్చడానికి నాకు సహాయం చేయి.” అలా బ్రదర్‌ పోయిట్‌జింగర్‌ క్యాంప్‌లో తొమ్మిది సంవత్సరాలు అదే పనిచేస్తూ గడిపాడు.

8. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి?

8 యెహోవా తాను అనుకున్నది, తనదైన సమయంలో చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. తను అనుకున్న దానిలో ప్రకృతి విపత్తుల్ని, అనారోగ్యాన్ని, చావును, మనల్ని పట్టిపీడిస్తున్న ఏ సమస్యనైనా, ఏ ఆనవాలు లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేయాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. తన రాజ్యం ద్వారా యెహోవా దీన్ని చేస్తాడు. (దాని. 2:44; ప్రక. 21:3, 4) అయితే, అప్పటివరకు సాతాను ఈ లోకాన్ని పరిపాలించేలా యెహోవా అనుమతిస్తున్నాడు.b (యోహా. 12:31; ప్రక. 12:9) ఒకవేళ మనకు వచ్చే ప్రతీ సమస్యని యెహోవా తీసేసుకుంటూపోతే, సాతాను పరిపాలనే బాగుందని అనిపించవచ్చు. అయితే ఈలోపు, యెహోవా మాట నిజమవ్వడం లేట్‌ అవుతుందని అనిపించవచ్చు కానీ, అది ఖచ్చితంగా నిజమై తీరుతుంది. అలాగే ఆయన మనల్ని ఏకాకిగా వదిలేయడు. మనకు కావల్సిన సహాయాన్ని చేస్తూ ఉంటాడు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఈ రోజుల్లో మన ప్రార్థనలకు యెహోవా జవాబు ఇచ్చే విధానాలు

9. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు? ఒక ఉదాహరణ చెప్పండి.

9 యెహోవా మనకు తెలివిని ఇస్తాడు. మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావల్సిన తెలివిని ఇస్తానని యెహోవా మాటిస్తున్నాడు. ఒంటరిగా ఉండాలా లేదా పెళ్లి చేసుకోవాలా లాంటి జీవితాల్ని మార్చేసే నిర్ణయాల్ని తీసుకుంటున్నప్పుడు, దేవుడిచ్చే తెలివి మనకు అవసరం. (యాకో. 1:5) ఒంటరి సహోదరి అయిన మారియ అనుభవాన్ని పరిశీలించండి.c సంతోషంగా క్రమపయినీరు సేవచేస్తున్న ఆమె, ఒకరోజు ఒక బ్రదర్‌ని కలిసింది. ఆమె ఇలా చెప్తుంది: “కొంతకాలానికే మేము మంచి స్నేహితులమయ్యాం. మా మధ్య స్నేహం పెరిగేకొద్దీ, మా మనసులు కూడా కలిశాయి. ఇప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా అని నేను నిర్ణయం తీసుకోవాలి. దానిగురించి యెహోవాకు గంటల తరబడి తీవ్రంగా ప్రార్థించాను. ఎందుకంటే యెహోవా నిర్దేశం నాకు ఇప్పుడు అవసరం. నిజమే, యెహోవా నా బదులు నిర్ణయం తీసుకోడని నాకు తెలుసు.” తెలివి కోసం ఆమె అడిగిన ప్రార్థనకు యెహోవా జవాబిచ్చాడని ఆమె గుర్తించింది. ఎలా? ఎలాగంటే ఆమెకు ఉన్న ప్రశ్నలన్నిటికీ మన ప్రచురణల్లో జవాబులు దొరికాయి. అంతేకాదు, యెహోవాసాక్షి అయిన వాళ్ల అమ్మ ఇచ్చిన తెలివైన సలహాను ఆమె పాటించింది. ఆ సలహా వల్ల ఆ బ్రదర్‌ మీద ఆమెకు ఉన్న ఫీలింగ్స్‌ని సరిగ్గా ఆలోచించగలిగింది. దానివల్ల ఆ సిస్టర్‌ తెలివైన నిర్ణయం తీసుకుంది.

శరణార్థ శిబిరంలో బైబిలు చదువుకుంటున్న ఒక బ్రదర్‌.

కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా మనకు ఎలా శక్తిని ఇస్తాడు? (10వ పేరా చూడండి)

10. ఫిలిప్పీయులు 4:13 ప్రకారం, యెహోవా మనకు సహాయం చేయడానికి ఏం ఇస్తాడు? ఒక ఉదాహరణ చెప్పండి. (చిత్రం కూడా చూడండి.)

10 యెహోవా కష్టాల్ని తట్టుకోవడానికి కావల్సిన శక్తిని ఇస్తాడు. ఆయన అపొస్తలుడైన పౌలుకు ఇచ్చినట్టే మనకు కూడా కష్టాల్ని తట్టుకునే శక్తిని ఇస్తాడు. (ఫిలిప్పీయులు 4:13 చదవండి.) బెంజిమెన్‌ అనే బ్రదర్‌కి కష్టాల్ని తట్టుకోవడానికి యెహోవా ఎలా సహాయం చేశాడో గమనించండి. ఆయన బాల్యమంతా తన కుటుంబంతోపాటు ఆఫ్రికాలోని శరణార్థ శిబిరంలో గడిపాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను యెహోవాకు ఎప్పుడూ ప్రార్థించేవాణ్ణి. ఆయన హృదయాన్ని సంతోషపెట్టే పనులు చేసేంత శక్తిని ఇవ్వమని అడిగేవాణ్ణి. దానికి జవాబుగా యెహోవా నాకు మనశ్శాంతిని, ప్రీచింగ్‌ చేసేందుకు ధైర్యాన్ని, ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి కావాల్సిన ప్రచురణల్ని ఇచ్చాడు. అంతేకాదు తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌ అనుభవాల్ని చదవడంవల్ల, వాళ్లకు యెహోవా ఎలా సహాయం చేశాడో తెలుసుకోవడంవల్ల నేను నమ్మకంగా ఉండడానికి కావల్సిన శక్తి వచ్చింది.”

తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌ని ఉపయోగించుకుని యెహోవా మీకు సహాయం చేశాడా? (11-12 పేరాలు చూడండి)d

11-12. మన ప్రార్థనలకు జవాబివ్వడానికి తన కుటుంబంలో వాళ్లని యెహోవా ఎలా ఉపయోగిస్తాడు? (చిత్రం కూడా చూడండి.)

11 యెహోవా మనల్ని బలపర్చడానికి తన కుటుంబంలో ఎవర్నో ఒకర్ని ఉపయోగించుకుంటాడు. యేసు చనిపోవడానికి ముందురోజు రాత్రి, బరువెక్కిన గుండెతో తీవ్రంగా ప్రార్థించాడు. దైవదూషణ చేస్తున్నాడనే నింద తన మీదకు రాకుండా చూడమని యెహోవాను బ్రతిమిలాడాడు. అయితే, యెహోవా దాన్ని చేసే బదులు యేసుకు తోబుట్టువులాంటి దేవదూతను పంపించి ఆయన్ని బలపర్చాడు. (లూకా 22:42, 43) అలాగే యెహోవా మనల్ని బలపర్చడానికి కూడా ఒక బ్రదర్‌నిగానీ, సిస్టర్‌నిగానీ మన ఇంటికి వచ్చేలా లేదా మనకు ఫోన్‌ చేసేలా చేయవచ్చు. కాబట్టి మన తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌ని ఒక ‘మంచి మాటతో’ ప్రోత్సహించే ఏ అవకాశాన్ని వదులుకోకూడదు.—సామె. 12:25.

12 మిరియమ్‌ అనే సిస్టర్‌ ఉదాహరణను గమనించండి. ఆమె భర్త చనిపోయిన కొన్ని వారాల తర్వాత, ఆమెకు జీవితమంతా శూన్యంగా, ఇంకెవరి కోసం బ్రతకాలా అని అనిపించింది. ఆమె గుండెపగిలేలా ఏడ్చింది. తన బాధంతా ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి అనుకుంది. ఆమె ఇలా అంటుంది: “వేరేవాళ్లకు చెప్పుకునే ధైర్యం చాలక యెహోవాకు చెప్పుకున్నాను. నేను ఇంకా అలా ఏడుస్తూ ప్రార్థిస్తుండగానే నా ఫోన్‌ మోగింది. ఫోన్‌ చేసింది ఒక సంఘపెద్ద. ఆయన నా భర్తకు చాలా మంచి స్నేహితుడు.” ఆ సంఘపెద్ద, ఆయన భార్య మిరియమ్‌కి చాలా ఊరటను ఇచ్చారు. యెహోవాయే ఆ బ్రదర్‌కి ఫోన్‌ చేసే మనసు ఇచ్చాడని ఆమె బలంగా నమ్మింది.

ఒక జంటకు ఏదో సమాచారం చూపిస్తున్న డాక్టర్‌.

మనకు సహాయం చేయాలనే మనసు యెహోవా ఎవరికైనా ఇవ్వచ్చు (13-14 పేరాలు చూడండి)

13. యెహోవా మనకు సహాయం చేయడానికి తనను ఆరాధించనివాళ్లను కూడా ఎలా ఉపయోగించుకుంటాడో ఒక ఉదాహరణ చెప్పండి.

13 యెహోవా మనకు సహాయం చేయడానికి తనను ఆరాధించనివాళ్లను కూడా ఉపయోగించుకుంటాడు. (సామె. 21:1) కొన్నిసార్లు తనను ఆరాధించనివాళ్లను ఉపయోగించుకుని యెహోవా మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఉదాహరణకు, నెహెమ్యా గురించి ఆలోచించండి. యెరూషలేము గోడల్ని తిరిగి కట్టాలని నెహెమ్యా అడిగినప్పుడు, దానికి ఒప్పుకునే మనసును యెహోవా రాజైన అర్తహషస్తకు ఇచ్చాడు. (నెహె. 2:3-6) ఈరోజుల్లో కూడా, మనం అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి తనను ఆరాధించనివాళ్లకు కూడా యెహోవా మనసు ఇస్తాడు.

14. సూ హింగ్‌ అనుభవంలో మీకేది బాగా నచ్చింది? (చిత్రం కూడా చూడండి.)

14 సూ హింగ్‌ అనే సిస్టర్‌ ఉదాహరణను గమనించండి. ఒక డాక్టర్‌ని ఉపయోగించుకుని ఆమె ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చాడు. వాళ్ల అబ్బాయికి ఎన్నో మానసిక సమస్యలు ఉండేవి. దానికితోడు యాక్సిడెంట్‌ వల్ల మంచాన పడ్డాడు. దాంతో ఆమె, ఆమె భర్త ఉద్యోగం మానేసి మరీ ఆ అబ్బాయిని చూసుకోవాల్సి వచ్చింది. దానివల్ల ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి ఉప్పెనలా మీద పడుతున్నప్పుడు, దాని నుండి బయటపడలేమేమో అని సూ హింగ్‌కి అనిపించింది. ఆమె బాధంతా యెహోవాకు చెప్పుకుని సహాయం కోసం అడిగింది. వాళ్ల అబ్బాయికి ట్రీట్‌మెంట్‌ చేసిన డాక్టర్‌ వాళ్ల దయనీయ పరిస్థితిని చూసి వాళ్లకు సహాయం చేశాడు. ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని పొందేలా, హాస్పిటల్‌కి దగ్గరగా ఉండేలా ఒక ఇల్లును చూసిపెట్టాడు. తర్వాత సూ హింగ్‌ ఇలా చెప్తుంది: “ఈ పరిస్థితులు అన్నిటిలో యెహోవా మా చెయ్యి పట్టుకుని నడిపించాడు. నిజంగా ఆయన ‘ప్రార్థనలు వినే’ దేవుడు.”—కీర్త. 65:2.

విశ్వాసం ఉంటేనే యెహోవా ఇచ్చే జవాబుల్ని తెలుసుకుంటాం, తీసుకుంటాం

15. ఒక సిస్టర్‌ తన ప్రార్థనలకు యెహోవా జవాబిస్తున్నాడని ఎలా చూడగలిగింది?

15 మన ప్రార్థనలకు వచ్చే జవాబులు కళ్లకు కట్టినట్లుగా కనిపించకపోవచ్చు. కాబట్టి మన ప్రార్థనలకు యెహోవా ఇచ్చే జవాబుల్ని వెదకాలి. ఆ జవాబులు మనం ఆయనకు ఇంకా నమ్మకంగా ఉండేలా సహాయం చేస్తాయి. యోకో అనే ఒక సిస్టర్‌ తన ప్రార్థనలు యెహోవా వినట్లేదేమో అని అనుకుంది. కానీ తను అడుగుతున్నవన్నీ ఒక పుస్తకంలో రాసిపెట్టుకుంది. కొన్ని రోజులైన తర్వాత ఆ పుస్తకాన్ని తిరగేసినప్పుడు, ఆమె అడిగిన చాలావాటికి యెహోవా జవాబిచ్చాడని, ఆమె అడిగిందని ఆమెకే గుర్తులేని విషయాలకు కూడా యెహోవా జవాబిచ్చాడని గుర్తించింది. కాబట్టి, ఎప్పటికప్పుడు మన ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిస్తున్నాడో కాస్త సమయం తీసుకుని ఆలోచించాలి.—కీర్త. 66:19, 20.

16. ప్రార్థన విషయంలో మన విశ్వాసాన్ని ఎలా చూపించవచ్చు? (హెబ్రీయులు 11:6)

16 మనం కేవలం ప్రార్థనలు చేయడమేకాదు, దానికి యెహోవా ఎలా జవాబిచ్చినా తీసుకోవడం ద్వారా విశ్వాసం చూపించవచ్చు. (హెబ్రీయులు 11:6 చదవండి.) మైక్‌, ఆయన భార్య క్రిస్టీ ఉదాహరణ గమనించండి. వాళ్లు బెతెల్‌ సేవ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. “మేము దానిగురించి యెహోవాకు లెక్కలేనన్నిసార్లు ప్రార్థించాం. పదేపదే అప్లై చేశాం. కానీ మమ్మల్ని ఆహ్వానించలేదు” అని మైక్‌ అంటున్నాడు. యెహోవాకు తన సేవలో వాళ్లని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసని మైక్‌, క్రిస్టీ దంపతులు నమ్మకంతో ఉన్నారు. అందుకే క్రమపయినీర్లుగా, అవసరం ఉన్నచోట, నిర్మాణ ప్రాజెక్టులో పనిచేస్తూ వాళ్లు చేయగలిగినదంతా చేశారు. ప్రస్తుతం వాళ్లు ప్రయాణసేవలో ఉన్నారు. మైక్‌ ఇలా అంటున్నాడు: “యెహోవా మా ప్రార్థనలకు జవాబిచ్చాడు. కానీ మేము అనుకున్న విధంగా కాదు, మేము ఊహించినదానికి మించి ఇచ్చాడు.”

17-18. కీర్తన 86:6, 7 ప్రకారం, మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

17 కీర్తన 86:6, 7 చదవండి. యెహోవా తన ప్రార్థనల్ని విన్నాడని, వాటికి జవాబిచ్చాడని కీర్తనకర్త దావీదు నమ్మాడు. మనం కూడా అదే నమ్మకంతో ఉండవచ్చు. ఈ ఆర్టికల్‌లో చూసిన ఉదాహరణల్ని బట్టి యెహోవా మనకు తెలివిని, కష్టాల్ని తట్టుకునే శక్తిని ఇస్తాడని తెలుస్తుంది. అలాగే తన కుటుంబంలో ఉన్నవాళ్లను గానీ లేదా తనను ఆరాధించనివాళ్లను గానీ ఉపయోగించుకుని ప్రస్తుతం మనకు సహాయం చేయవచ్చు.

18 నిజమే మనం చేసే ప్రార్థనలకు అన్నిసార్లు యెహోవా మనం అనుకున్నట్టు జవాబు ఇవ్వకపోవచ్చు. కానీ వాటికి జవాబిస్తాడు. మనకు సరిగ్గా అవసరమైనది, సరైన సమయంలో ఆయన ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంతేకాదు, యెహోవా ప్రస్తుతం మన అవసరాల్ని తీర్చడమేకాదు రానున్న కొత్తలోకంలో కూడా ‘ప్రతీ జీవి కోరికను తృప్తిపరుస్తాడు’ అనే నమ్మకంతో ఉండాలి.—కీర్త. 145:16.

మీరెలా జవాబిస్తారు?

  • మన ప్రార్థనలకు యెహోవా మనం అనుకున్నట్లుగా జవాబులు ఎందుకు ఇవ్వకపోవచ్చు?

  • మన ప్రార్థనలకు యెహోవా ఏయే విధాలుగా జవాబిస్తాడో కొన్ని ఉదాహరణలు చెప్పండి.

  • మన ప్రార్థనలకు యెహోవా ఇచ్చే జవాబులు చూడడానికి విశ్వాసం ఎందుకు అవసరం?

పాట 46 యెహోవా, నీకు కృతజ్ఞతలు

a మన ప్రార్థనలు తన ఇష్టానికి తగ్గట్టుగా ఉంటే వాటికి జవాబిస్తాను అని యెహోవా అభయమిస్తున్నాడు. కష్టాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు తనకు నమ్మకంగా ఉండేలా ఆయన సహాయం చేస్తాడని మనం ధైర్యంతో ఉండవచ్చు. అయితే, యెహోవా మన ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

b సాతాను ఈ లోకాన్ని పరిపాలించేలా యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడో మరింత తెలుసుకోవడానికి 2017, జూన్‌ కావలికోటలో “అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశంపై మనసుపెట్టండి” అనే ఆర్టికల్‌ చూడండి.

c కొన్ని అసలు పేర్లు కావు.

d చిత్రాల వివరణ: ఒక తల్లి, వాళ్ల పాప శరణార్థులుగా కొత్త దేశానికి వచ్చారు. అక్కడున్న తోటి బ్రదర్స్‌, సిస్టర్స్‌ వాళ్లని ఆహ్వానిస్తూ, కావల్సిన సహాయాన్ని అందిస్తున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి