అధ్యయన ఆర్టికల్ 46
పాట 17 “నాకు ఇష్టమే”
యేసు—మనల్ని అర్థంచేసుకునే ప్రధానయాజకుడు
“మన ప్రధానయాజకుడు మన బలహీనతల్ని అర్థంచేసుకోలేనివాడు కాదు.”—హెబ్రీ. 4:15.
ముఖ్యాంశం
యేసుకున్న కనికరాన్ని, అర్థంచేసుకునే గుణాన్ని బట్టి ఆయన మంచి ప్రధానయాజకుడని ఎలా చెప్పవచ్చు? ఒక యాజకునిగా ఆయన అందించే సేవల నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?
1-2. (ఎ) యెహోవా తన కుమారుణ్ణి భూమ్మీదకు ఎందుకు పంపించాడు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం? (హెబ్రీయులు 5:7-9)
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యెహోవా తను ఎంతో ప్రేమించే తన కుమారుణ్ణి భూమ్మీదకు పంపించాడు. ఎందుకు? అందుకు ఒక కారణం ఏంటంటే, భూమ్మీదున్న మనుషుల్ని పాపం-మరణం నుండి విడిపించి, సాతాను చేసిన నష్టాన్ని పూరించడానికి యేసును పంపించాడు. (యోహా. 3:16; 1 యోహా. 3:8) అలాగే యేసు ఈ భూమ్మీద ఒక మనిషిగా బ్రతకడం వల్ల ఇతరుల్ని అర్థం చేసుకుంటూ, ఎదుటివ్యక్తి బాధను తన బాధగా చూసే ఒక మంచి ప్రధానయాజకునిగా తయారవ్వగలడని యెహోవాకు తెలుసు. క్రీ.శ. 29 లో యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రధానయాజకునిగా సేవచేయడం మొదలుపెట్టాడు.a
2 భూమ్మీద ఉన్నప్పుడు యేసుకు ఎదురైన అనుభవాల్ని బట్టి, ఆయన మనల్ని అర్థంచేసుకునే ప్రధానయాజకునిగా ఎలా అయ్యాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. యేసు ఆ పాత్రలో “పరిపూర్ణుడిగా” ఎలా చేయబడ్డాడో మనం అర్థంచేసుకోవాలి. అలా మనం ఎంతెక్కువ అర్థంచేసుకుంటే, మన పాపాల వల్ల మనం డీలా పడిపోయినప్పుడు అంతెక్కువగా యెహోవాను సమీపించగలుగుతాం.—హెబ్రీయులు 5:7-9 అలాగే అధస్సూచి చదవండి.
దేవుని ప్రియ కుమారుడు భూమ్మీదకు వచ్చాడు
3-4. యేసు భూమ్మీదకు వచ్చినప్పుడు ఆయన జీవితంలో ఎలాంటి పెద్దపెద్ద మార్పులు జరిగాయి?
3 మనలో చాలామంది కొన్ని మార్పులు రుచిచూసి ఉంటాం. ఉదాహరణకు, మనం ఎంతో ఇష్టమైన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్లుండవచ్చు. కానీ యేసుకు వచ్చినంత పెద్ద మార్పు మాత్రం ఎవ్వరికీ రాలేదు. పరలోకంలో యేసు దేవదూతలందరికన్నా చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు. యేసు నిత్యం యెహోవా ప్రేమలో మునిగి తేలాడు. యెహోవా కుడిపక్కన సంతోషంగా ఉన్నాడు. (కీర్త. 16:11; సామె. 8:30) అయినా, ఫిలిప్పీయులు 2:7 చెప్తున్నట్టు, ఆయన భూమ్మీద అపరిపూర్ణ మనుషుల మధ్య బ్రతకడానికి పరలోకంలో ఉన్నతమైన స్థానాన్ని, అక్కడున్న వాటన్నిటినీ ఇష్టంగా వదులుకున్నాడు.
4 యేసు పుట్టినప్పుడు అలాగే ఎదుగుతున్నప్పుడు ఆయన చుట్టూవున్న పరిస్థితుల గురించి కూడా ఒకసారి ఆలోచించండి. యేసు పుట్టిన తర్వాత ఆయన అమ్మానాన్నలు అర్పించిన బలిని బట్టి, ఆయనొక పేద కుటుంబంలో పుట్టాడని తెలుస్తుంది. (లేవీ. 12:8; లూకా 2:24) యేసు పుట్టాడని చెడ్డ రాజైన హేరోదు తెలుసుకుని ఆయన్ని చంపాలని చూశాడు. అతని చేతుల్లో నుండి తప్పించుకోవడానికి యేసు కుటుంబం కొంతకాలంపాటు ఐగుప్తులో తలదాచుకుంది. (మత్త. 2:13, 15) పరలోకంలో యేసు జీవితానికి, భూమ్మీద ఆయన జీవితానికి ఎంత పెద్ద తేడానో కదా!
5. యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఏమేమి చూశాడు? ఆ అనుభవాలు ఆయన్ని ఒక మంచి ప్రధానయాజకునిగా ఎలా సిద్ధం చేశాయి? (చిత్రం కూడా చూడండి.)
5 యేసు భూమ్మీదున్నప్పుడు ఆయన చుట్టూ చాలామంది ప్రజలు బాధపడడం చూశాడు. అంతేకాదు, తనకు ఇష్టమైనవాళ్లు చనిపోవడం, ఆఖరికి తనను పెంచిన తండ్రి యోసేపు చనిపోవడం కూడా యేసు కళ్లారా చూసి ఉంటాడు. యేసు పరిచర్య చేస్తున్నప్పుడు కుష్ఠురోగులు, గుడ్డివాళ్లు, కుంటివాళ్లు, పిల్లల్ని పోగొట్టుకున్న అమ్మానాన్నలు తనకు ఎదురయ్యారు. వాళ్లందరి మీద యేసు కనికరం చూపించాడు. (మత్త. 9:2, 6; 15:30; 20:34; మార్కు 1:40, 41; లూకా 7:13) నిజమే, ఇలాంటి కష్టాల్ని యేసు పరలోకంలో చాలా ఉన్నతమైన స్థానం నుండి చూశాడు. కానీ ఇప్పుడు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన ఆ కష్టాలన్నిటినీ ఒక కొత్త కోణం నుండి చూశాడు. (యెష. 53:4) భూమ్మీద ఉన్నప్పుడు యేసుకు ఎదురైన అనుభవాన్ని బట్టి, ఆయన మనుషులకు ఉన్న భావాల్ని, చిరాకుల్ని, బాధల్ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోగలిగాడు. వీటితోపాటు, మనుషులకు సాధారణంగా వచ్చేలాంటి భావాలు అంటే కోపం, అలసట, దుఃఖం లాంటివి కూడా యేసు స్వయంగా అనుభవించాడు.
యేసు తన చుట్టూ ఉన్నవాళ్ల భావాల్ని, బాధల్ని బాగా పట్టించుకున్నాడు (5వ పేరా చూడండి)
యేసు ఎదుటివ్యక్తి బాధను తన బాధగా చూస్తాడు
6. యేసు చూపించిన ప్రేమ-కనికరం గురించి యెషయా ఉపయోగించిన పద చిత్రాలు ఏం చెప్తున్నాయి? (యెషయా 42:3)
6 యేసు తన పరిచర్య అంతటిలో బడుగు, బలహీన వర్గాల్ని పట్టించుకున్నాడు. వాళ్ల బాధను తన బాధగా చూశాడు. అలా చేసి, యేసు ఒక ప్రవచనాన్ని నెరవేర్చాడు. కొన్నిసార్లు హీబ్రూ లేఖనాలు బాగా వర్ధిల్లినవాళ్లను, బలవంతులైన ప్రజల్ని పచ్చని తోటతో, పెద్దగా-నిటారుగా పెరిగిన చెట్లతో పోల్చాయి. (కీర్త. 92:12; యెష. 61:3; యిర్మీ. 31:12) కానీ పేదవాళ్లను, అణగదొక్కబడిన వాళ్లను నలిగిన రెల్లుతో, ఆరిపోబోతున్న వత్తితో పోల్చాయి. వాటివల్ల ఎవ్వరికీ పెద్దగా ఉపయోగం ఉండదు. (యెషయా 42:3 చదవండి; మత్త. 12:20) అయితే, ఇతరుల దృష్టిలో ఎందుకూ పనికిరాని సాధారణ ప్రజలమీద, యేసు చూపించిన ప్రేమ-కనికరం గురించి వర్ణించడానికి పవిత్రశక్తి ప్రేరణతో యెషయా ప్రవక్త ఆ పద చిత్రాల్ని ఉపయోగించాడు.
7-8. యెషయా చెప్పిన ప్రవచనాన్ని యేసు ఎలా నెరవేర్చాడు?
7 “ఆయన నలిగిన రెల్లును విరవడు, ఆరిపోబోతున్న వత్తిని ఆర్పడు” అని యెషయా రాసిన మాటల్ని మత్తయి యేసుకు అన్వయించాడు. యేసు చేసిన కొన్ని అద్భుతాలు నలిగిన రెల్లులా ఉన్న అణగదొక్కబడినవాళ్లకు, అలాగే రేపటి గురించి ఏ ఆశా లేని ఆరిపోబోతున్న వత్తిలాంటి ప్రజలకు ఎంతో మేలు చేశాయి. ఉదాహరణకు, ఒంటినిండా కుష్ఠురోగం ఉన్న ఒక వ్యక్తిని యేసు కలిశాడు. అతను బాగయ్యి కుటుంబంతో, స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడుపుతాడని కలలోనైనా కలగని ఉండడు. (లూకా 5:12, 13) ఆ తర్వాత, నత్తి ఉన్న ఒక చెవిటివాణ్ణి యేసు కలిశాడు. అతని చుట్టూవున్నవాళ్లు నవ్వుతూ, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే పాపం ఈయనకేమో వినిపించదు, వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు. అప్పుడు అతనికి ఎలా అనిపించి ఉంటుందో ఊహించుకోండి. (మార్కు 7:32, 33) అయితే, కథ ఇక్కడితో అయిపోలేదు.
8 యేసు కాలంలో ఎవరికైనా ఏదైనా శరీర లోపం ఉందంటే, అది వాళ్లు చేసిన పాపం వల్ల గానీ, వాళ్ల అమ్మానాన్నలు చేసిన పాపం వల్ల గానీ అయ్యుంటుందని చాలామంది యూదులు నమ్మేవాళ్లు. (యోహా. 9:2) ఈ తప్పుడు నమ్మకం వల్ల, శరీర లోపాలు ఉన్నవాళ్లందర్నీ ప్రజలు హీనంగా చూసేవాళ్లు. యెషయా ప్రవచనం నెరవేర్పుగా, యేసు శరీర లోపాలు ఉన్నవాళ్లందర్నీ బాగుచేశాడు. దేవుని మీద వాళ్లకున్న ఆశా జ్యోతిని వెలిగించాడు. ఇది మనకు ఏ నమ్మకాన్ని ఇస్తుంది?
9. అపరిపూర్ణ మనుషుల్ని మన ప్రధానయాజకుడు నిజంగా అర్థంచేసుకుంటాడని హెబ్రీయులు 4:15, 16 ఎలా చూపిస్తుంది?
9 హెబ్రీయులు 4:15, 16 చదవండి. యేసు ఎప్పుడూ మనల్ని అర్థంచేసుకుంటాడనే నమ్మకంతో ఉండవచ్చు. దాని అర్థం ఏంటి? ఎదుటివాళ్లను అర్థంచేసుకునే వ్యక్తి వాళ్ల బాధల్ని-భావాల్ని చూసి, వాళ్లకు ఏదోకటి చేయాలని ముందుకొస్తాడు. “అర్థంచేసుకోవడం” అని అనువదించబడిన గ్రీకు పదానికి ఎదుటివ్యక్తి బాధను, నొప్పిని తన బాధగా, తన నొప్పిగా ఫీలవ్వడాన్ని సూచిస్తుంది. ఆసక్తికరంగా, పౌలు హెబ్రీయులు 10:34 లో చెరసాలలో ఉన్న వాళ్లమీద సానుభూతి చూపించడం గురించి చెప్పినప్పుడు ఇదే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. ఎదుటివ్యక్తి బాధను చూసి యేసు ఎంత తల్లడిల్లిపోయాడో ఆయన చేసిన అద్భుతాల నుండి తెలుసుకోవచ్చు. ఆయన వాళ్లందర్నీ ఏదో తప్పదన్నట్లుగా బాగుచేయలేదు. ఆయన వాళ్లను నిజంగా పట్టించుకున్నాడు, వాళ్లకు సహాయం చేయాలని కోరుకున్నాడు. ఉదాహరణకు, ఆయన కుష్ఠురోగిని బాగుచేసినప్పుడు కావాలనుకుంటే దూరం నుండే బాగుచేసి ఉండవచ్చు. కానీ యేసు వెళ్లి, ఆ కుష్ఠురోగిని ముట్టుకుని బాగుచేశాడు. బహుశా, ఒక మనిషి స్పర్శ ఎలా ఉంటుందో ఆ కుష్ఠురోగికి చాలా ఏళ్లుగా తెలిసుండకపోవచ్చు. అంతేకాదు, యేసు చెవిటివాణ్ణి బాగుచేస్తున్నప్పుడు జనాల శబ్దాల నుండి అతన్ని దూరంగా తీసుకెళ్లి బాగుచేశాడు. అలాగే ఒక సందర్భంలో పశ్చాత్తాపం చూపించిన ఒక స్త్రీ తన కన్నీళ్లతో యేసు పాదాల్ని తడిపి, తన వెంట్రుకలతో వాటిని తుడిచింది. అప్పుడు ఒక పరిసయ్యుడు ఆమెను చిన్నచూపు చూశాడు. కానీ యేసు ఆ స్త్రీ తరఫున నిలబడి గట్టిగా మాట్లాడాడు. (మత్త. 8:3; మార్కు 7:33; లూకా 7:44) జబ్బులు ఉన్నవాళ్లను లేదా ఘోరమైన పాపాలు చేసినవాళ్లను యేసు చూసీచూడనట్టు వదిలేయలేదు. దానికి బదులు ఆయన వాళ్లను ఆహ్వానించాడు, కనికరంతో వాళ్లకు ధైర్యం చెప్పాడు. యేసు మనల్ని కూడా అంతే అర్థంచేసుకుంటాడనే నమ్మకంతో ఉండవచ్చు.
మన ప్రధానయాజకునిలా ఉందాం
10. చెవులు వినిపించని వాళ్లకు, చూపులేనివాళ్లకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడానికి ఏవి అందుబాటులో ఉన్నాయి? (చిత్రాలు కూడా చూడండి.)
10 యేసు నమ్మకమైన అనుచరులుగా మనం ఎదుటివ్యక్తి మీద ప్రేమ చూపించడానికి, వాళ్ల బాధను మన బాధలా చూడడానికి, కనికరం చూపించడానికి ప్రయత్నిస్తాం. (1 పేతు. 2:21; 3:8) నిజమే, మనం చెవిటివాళ్లను, గుడ్డివాళ్లను బాగుచేయలేం. కానీ అలాంటి వాళ్లకు ఆధ్యాత్మికంగా సహాయం చేయగలం. ఉదాహరణకు, బైబిలు ప్రచురణలు 100 కన్నా ఎక్కువ సంజ్ఞా భాషల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే చూపులేనివాళ్లకు బ్రెయిలీ ప్రచురణలు 60 కన్నా ఎక్కువ భాషల్లో ఉన్నాయి. మన వీడియోలకు ఆడియో వర్ణనలు 100 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ చెవులు వినిపించనివాళ్లు, చూపులేనివాళ్లు యెహోవాకు, యేసుకు దగ్గరవ్వడానికి సహాయం చేస్తాయి.
బైబిలు ఆధారిత ప్రచురణలు 1,000 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్నాయి
ఎడమవైపు: 100 కన్నా ఎక్కువ సంజ్ఞా భాషల్లో
కుడివైపు: 60 కన్నా ఎక్కువ బ్రెయిలీ భాషల్లో
(10వ పేరా చూడండి)
11. యేసులాగే యెహోవా సంస్థ అన్నిరకాల ప్రజల మీద ఎలా శ్రద్ధ చూపిస్తుంది? (అపొస్తలుల కార్యాలు 2:5-7, 33) (చిత్రాలు కూడా చూడండి.)
11 అన్నిరకాల ప్రజలు యెహోవాకు దగ్గరయ్యేలా సహాయం చేయడానికి సంస్థ గట్టిగా కృషి చేస్తుంది. యేసు పునరుత్థానమైన తర్వాత పెంతెకొస్తు పండుగరోజు సమావేశమైన శిష్యులందరి మీద పవిత్రశక్తి కురిపించాడు. దానివల్ల అక్కడికి వచ్చిన వాళ్లందరూ తమ సొంత భాషలో మంచివార్తను వినేలా వాళ్లు ప్రకటించగలిగారు. (అపొస్తలుల కార్యాలు 2:5-7, 33 చదవండి.) ఇప్పుడు, యేసు నాయకత్వం కింద సంస్థ 1,000 కన్నా ఎక్కువ భాషల్లో బైబిలు ఆధారిత ప్రచురణల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉదాహరణకు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో కేవలం కొంతమంది ప్రజలు మాట్లాడే అమెరిండియన్ భాషల్లో కూడా మన ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి. 160 కన్నా ఎక్కువ రకాల అమెరిండియన్ భాషల్లో మన ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి. దానివల్ల వీలైనంత ఎక్కువమంది మంచివార్తను తెలుసుకోగలుగుతున్నారు. అంతేకాదు, 20 కన్నా ఎక్కువ రోమని భాషల్లో కూడా ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి. దానివల్ల వేలమంది సత్యం తెలుసుకుని దానికి స్పందించగలుగుతున్నారు.
ఎడమవైపు: 160 కన్నా ఎక్కువ అమెరిండియన్ భాషల్లో
కుడివైపు: 20 కన్నా ఎక్కువ రోమని భాషల్లో
(11వ పేరా చూడండి)
12. యెహోవా సంస్థ ఇంకా ఏ పనులు కూడా చేస్తుంది?
12 మంచివార్తను ప్రకటించడానికి జరిగే ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, యెహోవా సంస్థ ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయినవాళ్లను కూడా ఆదుకుంటుంది. దానికోసం వేలమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి, తమ తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేస్తున్నారు. అంతేకాదు, యెహోవా తమను ఎంత ప్రేమిస్తున్నాడో ప్రజలు తెలుసుకోవడానికి, వాళ్లందరూ కలుసుకుని ఆరాధించడానికి వీలుగా ఉండే రాజ్యమందిరాల్ని కూడా సంస్థ అందుబాటులోకి తెస్తుంది.
మన ప్రధానయాజకుడు మీకు సహాయం చేయగలడు
13. యేసు మనకు ఏయే విధాలుగా సహాయం చేస్తాడు?
13 మన మంచి కాపరిగా, యేసు మనలో ఉన్న ప్రతీఒక్కరి ఆధ్యాత్మిక అవసరాల్ని పట్టించుకుంటాడు. (యోహా. 10:14; ఎఫె. 4:7) కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న పరిస్థితుల వల్ల మనకు కూడా నలిగిన రెల్లులా, ఆరిపోబోతున్న వత్తిలా అనిపించవచ్చు. ఏదైనా ఒక పెద్ద జబ్బు వల్లో లేదా మనం ఏదైనా తప్పు చేయడం వల్లో లేదా మన బ్రదర్స్‌సిస్టర్స్‌తో మనకున్న బంధం దెబ్బతినడం వల్లో మనం బాగా డీలా పడిపోవచ్చు. దానివల్ల ప్రస్తుతం మనకు ఉన్న బాధను మర్చిపోయి, భవిష్యత్తు మీద మనసుపెట్టడం కష్టంగా ఉండవచ్చు. అయితే, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో యేసు చూస్తాడని, మీ లోలోపల ఉన్న ఆలోచనల్ని ఆయన అర్థంచేసుకుంటాడని గుర్తుపెట్టుకోండి. మీ తరఫున చర్య తీసుకునేలా యేసుకు ఉన్న కనికరం ఆయన్ని కదిలిస్తుంది. ఉదాహరణకు, మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన పవిత్రశక్తిని ఉపయోగించి మిమ్మల్ని బలపరుస్తాడు. (యోహా. 16:7; తీతు 3:6) వీటికితోడు, యేసు “మనుషుల్లో వరాల్ని,” అలాగే తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఉపయోగించుకుని మీకు కావాల్సిన ప్రోత్సాహాన్ని, మద్దతును, సహాయాన్ని అందిస్తాడు.—ఎఫె. 4:8.
14. మనం లోలోపల నలిగిపోతున్నప్పుడు ఏం చేయాలి?
14 మీకు కూడా ఆరిపోబోతున్న వత్తిలా అనిపించినప్పుడు, లేదా మీరు లోలోపల నలిగిపోతున్నప్పుడు ప్రధానయాజకునిగా యేసుకున్న పాత్ర గురించి లోతుగా ఆలోచించండి. యేసు ఈ భూమ్మీదకు వచ్చింది విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదుగానీ, అపరిపూర్ణ మనుషులు పడుతున్న కష్టాల్ని బాగా అర్థంచేసుకోవడానికి కూడా అని గుర్తుపెట్టుకోండి. మన పాపాల వల్ల లేదా బలహీనతల వల్ల నీరసించిపోయినట్లుగా అనిపిస్తే, మనకు “సరిగ్గా అవసరమైనప్పుడు” యేసు సహాయం చేయడానికి సిద్ధంగా, ఇష్టంగా ఉన్నాడని మర్చిపోకండి.—హెబ్రీ. 4:15, 16 అధస్సూచి.
15. యెహోవా మంద నుండి తప్పిపోయిన ఒక బ్రదర్ సంఘానికి తిరిగిరావడానికి సహాయం ఎలా దొరికిందో చెప్పండి.
15 యెహోవా మంద నుండి తప్పిపోయినవాళ్లను వెదికి, వాళ్లకు సహాయం చేసేలా కూడా యేసు తన ప్రజల్ని నడిపిస్తున్నాడు. (మత్త. 18:12, 13) స్టీఫెన్b అనే వ్యక్తి అనుభవాన్ని చూడండి. ఆయన సంఘం నుండి తొలగించబడిన 12 ఏళ్ల తర్వాత మీటింగ్‌కి హాజరవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆయనిలా చెప్తున్నాడు: “నాకు ముఖం చెల్లలేదు. కానీ నేను తిరిగి యెహోవా కుటుంబంలో ఒకరిగా ఉండాలని అనుకున్నాను. నన్ను కలిసిన సంఘపెద్దలు నాతో చాలా ప్రేమగా మాట్లాడారు. దానివల్ల నేనూ ఆ కుటుంబంలో ఒకడినే అనిపించింది. కొన్నిసార్లు నేను ఎందుకూ పనికిరాను అనిపించేది. కానీ నేను పట్టు వదల్లేదు. యెహోవా, యేసు కూడా నా విషయంలో పట్టు వదల్లేదనే విషయాన్ని బ్రదర్స్ నాకు గుర్తుచేశారు. నేను సంఘంలోకి తిరిగి చేర్చుకోబడినప్పుడు సంఘమంతా నన్నూ, నా కుటుంబాన్ని అక్కున చేర్చుకుంది. తర్వాత్తర్వాత నా భార్య బైబిలు స్టడీ తీసుకుంది. ఇప్పుడు మేము కుటుంబంగా యెహోవాను ఆరాధిస్తున్నాం.” పశ్చాత్తాపం చూపించినవాళ్లు తిరిగి సంఘానికి రావడానికి సంఘమంతా కలిసికట్టుగా సహాయం చేయడం చూసి మన ప్రేమగల ప్రధానయాజకుడు ఎంత సంతోషిస్తాడో కదా!
16. మనల్ని అర్థంచేసుకునే ప్రధానయాజకుడు ఉన్నందుకు మీరెందుకు కృతజ్ఞతతో ఉండవచ్చు?
16 యేసు భూమ్మీద ఉన్నప్పుడు చెప్పలేనంత మంది ప్రజలకు సరిగ్గా అవసరమైనప్పుడు సహాయం చేశాడు. ఇప్పుడు కూడా ఆయన మనకు సరిగ్గా అవసరమైనప్పుడు సహాయం చేస్తాడనే పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. ఇప్పుడేకాదు రాబోయే కొత్త లోకంలో పాపం, మరణం అనే సంకెళ్ల నుండి మనల్ని విడిపించి, స్వేచ్ఛ వైపు నడిపిస్తాడు. యెహోవా మన మీద ప్రేమ, కరుణతో మనల్ని బాగా అర్థంచేసుకునే ప్రధానయాజకుడిగా తన కుమారుణ్ణి నియమించినందుకు మనం ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం!
పాట 13 క్రీస్తు మన ఆదర్శం
a ప్రధానయాజకునిగా యేసు పాత్ర, యూదామత ప్రధానయాజకుడి పాత్రను ఎలా తీసేసిందో ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, అక్టోబరు 2023, కావలికోట పత్రికలో, 26వ పేజీ, 7-9 పేరాల్లో ఉన్న “యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధించడాన్ని విలువైనదిగా చూడండి” అనే ఆర్టికల్ చూడండి.
b కొన్ని పేర్లను మార్చాం.