మహాశ్రమ అంటే ఏమిటి?
బైబిలు ఇచ్చే జవాబు
మహాశ్రమ సమయంలో ఇంతకుముందెప్పుడు రాని అతి గొప్ప శ్రమ మనుషుల మీదకు వస్తుంది. బైబిలు ముందే చెప్పినట్టు, అది “చివరి రోజుల్లో” లేదా ‘అంత్యకాలములో’ వస్తుంది. (2 తిమోతి 3:1; దానియేలు 12:4) “దేవుని సృష్టి ఆరంభం నుండి ఇప్పటివరకు అలాంటి శ్రమ రాలేదు, మళ్లీ రాదు కూడా.”—మార్కు 13:19; దానియేలు 12:1; మత్తయి 24:21, 22.
మహాశ్రమ సమయంలో జరిగే సంఘటనలు
అబద్ధమత నాశనం. ఊహించని వేగంతో, అబద్ధమతం నాశనం చేయబడుతుంది. (ప్రకటన 17:1, 5; 18:9, 10, 21) ఐక్యరాజ్య సమితికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలు అబద్ధమతాన్ని నాశనం చేసే విషయంలో దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తాయి.—ప్రకటన 17:3, 15-18.a
సత్యమతం పై దాడి. యెహెజ్కేలు తన దర్శనంలో చూసిన “మాగోగు దేశపువాడగు గోగు,“ సత్యారాధన చేసేవాళ్లను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ “మాగోగు దేశపువాడగు గోగు” కొన్ని దేశాలను సూచిస్తోంది. కానీ తన ఆరాధకులు నాశనం అవ్వకుండా దేవుడు కాపాడతాడు.—యెహెజ్కేలు 38:1, 2, 9-12, 18-23.
భూమ్మీదున్న మనుషులకు తీర్పు. యేసు మనుషులందరికీ తీర్పుతీరుస్తాడు, “గొర్రెల కాపరి మేకల్లో నుండి గొర్రెల్ని వేరుచేసినట్టు, ప్రజల్ని ఆయన రెండు గుంపులుగా వేరుచేస్తాడు.” (మత్తయి 25:31-33) పరలోకంలో యేసుతోపాటు పరిపాలించబోయే తన ‘సోదరులకు’ ప్రతిఒక్కరూ మద్దతివ్వడం, ఇవ్వకపోవడం బట్టే ఆ తీర్పు ఉంటుంది.—మత్తయి 25:34-46.
రాజ్య పాలకులను సమకూర్చడం. యేసుతో పరిపాలించడానికి ఎంచుకోబడిన నమ్మకమైన వ్యక్తులు తమ భూజీవితాన్ని పూర్తి చేసుకొని, పరలోకానికి పునరుత్థానం చేయబడతారు.—మత్తయి 24:31; 1 కొరింథీయులు 15:50-53; 1 థెస్సలొనీకయులు 4:15-17.
హార్మెగిద్దోను. “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు” ఈ యుద్ధాన్ని “యెహోవా దినము” అని కూడా పిలుస్తారు. (ప్రకటన 16:14-16; యెషయా 13:9; 2 పేతురు 3:11, 12) చెడ్డవాళ్లుగా తీర్పు తీర్చబడినవాళ్లను యేసు నాశనం చేస్తాడు. (జెఫన్యా 1:18; 2 థెస్సలొనీకయులు 1:6-10) వాళ్లతోపాటు బైబిలు ఏడు తలలుగల క్రూరమృగంగా వర్ణించిన ప్రపంచవ్యాప్త రాజకీయ వ్యవస్థ కూడా నాశనం చేయబడుతుంది.—ప్రకటన 19:19-21.
మహాశ్రమ తర్వాత జరిగే సంఘటనలు
సాతానును, చెడ్డదూతలను బంధించడం. ఏమీ చేయడం కుదరని మరణం లాంటి స్థితికి సూచనగా ఉన్న “అగాధంలో” ఒక దేవదూత సాతాన్ని, చెడ్డదూతల్ని పడేస్తాడు. (ప్రకటన 20:1-3) అగాధంలో సాతాను పరిస్థితి అతన్ని జైల్లో పెట్టినట్టు ఉంటుంది; అతను ఇక దేనిమీద ప్రభావం చూపించలేడు.—ప్రకటన 20:7.
వెయ్యేండ్లు మొదలౌతాయి. దేవుని రాజ్య 1,000 సంవత్సరాల పరిపాలన మొదలౌతుంది. దానిలో మనుషులందరూ గొప్ప ఆశీర్వాదాలను పొందుతారు. (ప్రకటన 5:9, 10; 20:4, 6) భూమ్మీద మొదలయ్యే ఆ వెయ్యేండ్ల పరిపాలనను చూడడానికి లెక్కపెట్టలేని “ఒక గొప్పసమూహం” “మహాశ్రమను దాటి” వస్తుంది.—ప్రకటన 7:9, 14; కీర్తన 37:9-11.
a ప్రకటన పుస్తకంలో, “గొప్ప వేశ్య” అయిన మహాబబులోను అబద్ధమతానికి సూచనగా ఉంది. (ప్రకటన 17:1, 5) మహాబబులోనును నాశనం చేసే ఎర్రని క్రూరమృగం, ప్రపంచంలోని దేశాలను ఒకటిచేసి, వాటికి ప్రాతినిథ్యంగా ఉండాలనుకునే సంస్థకు సూచనగా ఉంది. ఆ సంస్థ ముందు నానాజాతి సమితిగా ఏర్పడింది. ఇప్పుడు ఆ సంస్థ ఐక్యరాజ్య సమితిగా ఉంది.