-
హానిచేసే స్నేహితుడుతేజరిల్లు!: సిగరెట్ తాగే అలవాటును ఎలా మానుకోవచ్చు?
-
-
హానిచేసే స్నేహితుడు
మీరు యౌవనంలో ఉన్నప్పుడు మీకు ఒక “స్నేహితుడు” పరిచయమయ్యాడు. మీరు అందరిముందు పెద్ద మనిషిలా కనిపించడానికి, తోటివాళ్లతో కలిసిపోవడానికి అతను మీకు సహాయం చేశాడు. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడల్లా, “ఉపశమనం” కోసం అతని వైపే చూశారు. చెప్పాలంటే, చాలా సందర్భాల్లో మీరు అతని మీద ఆధారపడ్డారు.
కానీ రోజులు గడుస్తుండగా, అతని నిజస్వరూపం మీకు తెలిసింది. అతను ఎప్పుడూ మీతోనే ఉంటాడు కాబట్టి, కొన్ని చోట్లకు మీరు వెళ్లలేరు. అందరిముందు మీరు పెద్ద మనిషిలా కనిపించడానికి అతను మీకు సహాయం చేసుండొచ్చేమో గానీ, దానికి మూల్యంగా అతనికి మీ ఆరోగ్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. అంతకుమించి, అతను మీ జేబుకి చిల్లు పెట్టాడు.
ఈ మధ్య కాలంలో, మీరు అతనితో స్నేహాన్ని తెంచుకోవడానికి ప్రయత్నించారు కానీ, అతను మాత్రం మిమ్మల్ని వదల్లేదు. ఒకరకంగా చెప్పాలంటే, అతను మీ నెత్తిమీద కూర్చుని మీ మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. అసలు అతన్ని కలవకపోయుంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు.
పొగతాగే చాలామందికి సిగరెట్‌తో ఉన్న బంధం అలాంటిది. 50 ఏళ్ల పాటు సిగరెట్ తాగిన ఎర్లిన్ అనే ఆమె ఇలా గుర్తుచేసుకుంటుంది: “సిగరెట్ నాతో ఉంటే ఒక మనిషి నాకు తోడు ఉన్నట్టే, చెప్పాలంటే అంతకంటే ఎక్కువ. కొన్నిసార్లు ఇదే నా ఒక్కగానొక్క ఫ్రెండ్.” కానీ ఆ తర్వాత సిగరెట్ ఒక హానిచేసే స్నేహితుడని, చాలా ప్రమాదకరమని ఎర్లిన్ గుర్తించింది. ఈ ఆర్టికల్ మొదట్లో చెప్పిన మాటలు ఆమె గురించి చెప్పినట్టుగానే ఉన్నాయి, కాకపోతే ఒక తేడా ఉంది. అదేంటంటే, పొగతాగడం దేవునికి ఇష్టం ఉండదని, దేవుడిచ్చిన శరీరానికి అది హాని చేస్తుందని తెలుసుకున్నప్పుడు ఆమె ఆ అలవాటును మానేసింది.—2 కొరింథీయులు 7:1.
ఫ్రాంక్ అనే అతను కూడా దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం సిగరెట్ మానేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తను మానేయాలనుకున్న ఒకట్రెండు రోజులకే, అంతకుముందు కాల్చి పారేసిన సిగరెట్ ముక్కల కోసం ఇల్లంతా వెదకడం మొదలుపెట్టాడు. ఫ్రాంక్ ఇలా అన్నాడు: “ఆ క్షణం నా మీద నాకే అసహ్యం వేసింది. ఛీ! నేను ఇంతగా దిగజారిపోయి, కాళ్లూచేతులతో పాకుతూ మట్టిలో సిగరెట్ ముక్కల కోసం వెతుకుతున్నానేంటి అనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ దాని జోలికి పోలేదు.”
పొగతాగే అలవాటును మానుకోవడం ఎందుకు కష్టం? పరిశోధకులు దానికి చాలా కారణాల్ని కనిపెట్టారు: (1) డ్రగ్స్ ఎలాగైతే వ్యసనంగా మారతాయో పొగాకు ఉత్పత్తులు కూడా వ్యసనంగా మారే అవకాశముంది. (2) సిగరెట్‌లో ఉన్న నికోటిన్‌ని పీల్చినప్పుడు అది కేవలం ఏడు సెకన్లలోనే మెదడుకు చేరగలదు. (3) ఒక వ్యక్తి తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా ఏ పని చేస్తున్నా సిగరెట్ తాగుతూ చేయడం వల్ల అది అతని జీవితంలో భాగమైపోతుంది.
అయినప్పటికీ, ఈ హానికరమైన వ్యసనం నుండి బయటపడడం సాధ్యమే అని ఎర్లిన్, ఫ్రాంక్ అనుభవాలు చూపిస్తున్నాయి. మీకు పొగతాగే అలవాటు ఉండి, దాన్ని మానుకోవాలి అనుకుంటుంటే, దీని తర్వాత వచ్చే ఆర్టికల్స్‌ని చదివి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టవచ్చు.
-
-
మానేయాలని గట్టిగా కోరుకోండితేజరిల్లు!: సిగరెట్ తాగే అలవాటును ఎలా మానుకోవచ్చు?
-
-
మానేయాలని గట్టిగా కోరుకోండి
“సిగరెట్ మానేయాలి అని చేసే ప్రయత్నానికి కట్టుబడి ఉండడమే, దాన్ని విజయవంతంగా మానుకోవడానికి తొలిమెట్టు.”—“స్టాప్ స్మోకింగ్ నవ్!” అనే పుస్తకం.
ఒక్కమాటలో చెప్పాలంటే, మీరు పొగతాగడం మానేయాలి అనుకుంటుంటే, ముందు దాన్ని మానేయాలని గట్టిగా కోరుకోవాలి. ఆ కోరికను మీరు ఎలా పెంచుకోవచ్చు? ఒక మార్గం ఏంటంటే, పొగతాగడం ఆపేస్తే జీవితం ఎంత బావుంటుందో ఆలోచించండి.
మీ డబ్బు ఆదా అవుతుంది. రోజుకు ఒక ప్యాకెట్ కాలిస్తే, సంవత్సరం తిరిగేసరికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. “పొగాకు మీద నేను ఎంత డబ్బు తగలేస్తున్నానో అస్సలు ఆలోచించలేదు.”—గ్యాను, నేపాల్.
మీ జీవితాన్ని ఇంకా ఆనందిస్తారు. “పొగతాగడం మానేసినప్పటి నుంచి నా జీవితం మొదలైంది. చెప్పాలంటే, అది రోజురోజుకు మెరుగౌతుంది.” (రెజీనా, దక్షిణాఫ్రికా) పొగతాగడం మానేసినవాళ్లకు వాసన చూసే, రుచి చూసే సామర్థ్యాలు అంతకుముందు కన్నా మెరుగౌతాయి. అంతేకాదు, వాళ్లకు సాధారణంగా ఎక్కువ బలం ఉంటుంది, చూడడానికి కూడా ఆరోగ్యంగా కనిపిస్తారు.
మీ ఆరోగ్యం మెరుగవ్వవచ్చు. “పొగతాగడం మానేస్తే అన్ని వయసుల వాళ్లకు అంటే మగవాళ్లకైనా, ఆడవాళ్లకైనా ఆరోగ్యంలో చాలా మంచి మార్పులు వస్తాయి. అది కూడా వెంటనే కనిపిస్తాయి.”—ద యు.ఎస్. సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్.
మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. “పొగతాగడం నేనెందుకు మానేశానంటే, నా జీవితం మీద హక్కు నాకే ఉండాలి. అంతేగానీ, పొగాకు నా మీద పెత్తనం చెలాయించడం నాకు ఇష్టంలేదు.”—హెన్నింగ్, డెన్మార్క్.
మీ ఇంట్లోవాళ్లు, స్నేహితులు ప్రయోజనం పొందుతారు. “పొగతాగడం . . . మీ చుట్టూ ఉన్నవాళ్లకు కూడా హాని చేస్తుంది. . . . ప్రతీ సంవత్సరం, వేరేవాళ్లు వదిలిన పొగ పీల్చడం వల్ల కొన్ని వేలమంది బ్లడ్ క్యాన్సర్‌తో, గుండె జబ్బులతో చనిపోతున్నారని పరిశోధనలు చెప్తున్నాయి.”—అమెరికన్ క్యాన్సర్ సొసైటీ.
మీ సృష్టికర్త సంతోషిస్తాడు. ‘ప్రియ సహోదరులారా, శరీరానికి ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం.’ (2 కొరింథీయులు 7:1) “మీ శరీరాల్ని . . . పవిత్రమైన, దేవునికి ఇష్టమైన బలిగా అప్పగించండి.”—రోమీయులు 12:1.
“శరీరానికి హానిచేసే వాటిని దేవుడు అంగీకరించడని నేను అర్థం చేసుకున్నప్పుడు, పొగతాగడం మానేయాలని నిర్ణయించుకున్నాను.”—సిల్వియా, స్పెయిన్.
కానీ చాలావరకు, పొగతాగడం మానేయాలనే కోరిక ఒక్కటే సరిపోదు. బహుశా మనకు వేరేవాళ్ల సహాయం, అంటే కుటుంబ సభ్యుల, స్నేహితుల సహాయం అవసరం అవ్వవచ్చు. వాళ్లు ఎలా సహాయం చేస్తారు?
-
-
సహాయం తీసుకోండితేజరిల్లు!: సిగరెట్ తాగే అలవాటును ఎలా మానుకోవచ్చు?
-
-
సహాయం తీసుకోండి
“ఒంటరివాడి మీద ఎవరైనా పైచేయి సాధించగలరు; కానీ ఇద్దరుంటే, ఇద్దరు కలిసి వాణ్ణి ఎదిరించగలరు.”—ప్రసంగి 4:12.
మనం వేరేవాళ్ల సహాయం తీసుకున్నప్పుడు, ఒక శత్రువు మీద విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ శత్రువు ఎవరైనా కావచ్చు లేక ఏదైనా కావచ్చు. కాబట్టి, మీరు పొగతాగే అలవాటు మీద విజయం సాధించాలి అనుకుంటే మీ కుటుంబ సభ్యుల, స్నేహితుల, లేదా మీకు నిజంగా ఓపిగ్గా సహాయం చేసేవాళ్ల వైపు చూడడం తెలివైన పని.
అంతకుముందు పొగతాగే అలవాటు ఉండి, దాన్ని మానుకున్నవాళ్ల సహాయం తీసుకోవడం గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే, వాళ్లయితే మీ పరిస్థితిని అర్థం చేసుకోగలరు అలాగే మీకు సహాయం చేయగలరు. డెన్మార్క్‌లో ఉంటున్న టోర్బెన్ అనే క్రైస్తవుడు ఇలా అంటున్నాడు: “వేరేవాళ్లు నాకు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.” ఇండియాలో ఉంటున్న అబ్రహామ్ ఇలా అంటున్నాడు: “నా కుటుంబ సభ్యులు, తోటి క్రైస్తవులు చూపించిన నిజమైన ప్రేమ, నేను ఈ అలవాటును మానుకోవడానికి సహాయం చేసింది.” కానీ కొన్నిసార్లు కుటుంబ సభ్యుల, స్నేహితుల సహాయం ఒక్కటే సరిపోదు.
భగ్వాండాస్ అనే ఆయన ఇలా అంటున్నాడు: “నాకు 27 ఏళ్లుగా పొగతాగే అలవాటు ఉంది. కానీ, చెడు అలవాట్ల గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకున్న తర్వాత నేను దాన్ని మానేయాలి అనుకున్నాను. నేను సిగరెట్లు కాల్చడం కొంచెంకొంచెం తగ్గించుకుంటూ వచ్చాను, నా ఫ్రెండ్స్‌ని మార్చేశాను, కౌన్సెలింగ్ సెంటర్‌కు కూడా వెళ్లాను. కానీ ఏదీ పనిచేయలేదు. చివరికి, ఒకరోజు రాత్రి నేను మనసువిప్పి యెహోవా దేవునికి ప్రార్థిస్తూ, ఈ అలవాటు నుండి బయటపడడానికి సహాయం చేయమని వేడుకున్నాను. అలా, మొత్తానికి నేను దానిమీద విజయం సాధించాను!”
పొగతాగడం మానేయడానికి సహాయం చేసే ఇంకో ముఖ్యమైన విషయం, మీకు ఎదురవ్వగల ఆటంకాలకు ముందే సిద్ధపడి ఉండడం. ఏంటా ఆటంకాలు? తర్వాతి ఆర్టికల్ వివరిస్తుంది.
[బాక్సు]
సిగరెట్లు మానడానికి మందులు వాడవచ్చా?
సిగరెట్లు మాన్పించడానికి మార్కెట్లో నికోటిన్ ప్యాచ్ లాంటి మందులు చాలా వచ్చాయి. అదంతా కోట్ల రూపాయల బిజినెస్. అయితే, ఆ మందులు వాడాలో లేదో నిర్ణయించుకునే ముందు ఈ ప్రశ్నల్ని పరిశీలించండి:
వాటివల్ల వచ్చే ప్రయోజనాలేంటి? సిగరెట్లు మానేసిన తర్వాత వచ్చే శారీరక ఇబ్బందుల్ని (withdrawal symptoms) తగ్గించడానికి ఈ మందులు ఉపయోగపడతాయని చాలామంది అంటుంటారు. కానీ, ఇవి ఎంతబాగా పని చేస్తాయనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.
వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? కొన్ని మందులకు పెద్దపెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఉదాహరణకు, కడుపులో వికారంగా ఉండడం, కృంగుదల, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం వంటివి. అయితే గుర్తుంచుకోండి, ఈ నికోటిన్ థెరపీల వల్ల నికోటిన్‌నే మళ్లీ ఇంకో రూపంలో ఇస్తున్నట్లు అవుతుంది, పైగా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. నిజం చెప్పాలంటే, ఆ వ్యక్తి ఇంకా నికోటిన్‌కు బానిసగానే ఉన్నట్టు.
ఏవైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఒక సర్వేలో, విజయవంతంగా పొగతాగే అలవాటును మానుకున్న 88 శాతం మంది, తాము ఏ మందులూ వాడకుండానే ఉన్నపళంగా పొగతాగే అలవాటును మానుకోగలిగామని చెప్పారు.
-
-
ఆటంకాలకు ముందే సిద్ధపడి ఉండండితేజరిల్లు!: సిగరెట్ తాగే అలవాటును ఎలా మానుకోవచ్చు?
-
-
ఆటంకాలకు ముందే సిద్ధపడి ఉండండి
“పుట్టిన మా పసిబిడ్డ ఆరోగ్యం కోసం నేను సిగరెట్ మానేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే, మా ఇంట్లో ‘నో స్మోకింగ్’ బోర్డ్‌ని తగిలించాను. కానీ ఒక్క గంట కూడా ఆగలేకపోయాను. సిగరెట్ తాగాలని నా నాలుక పీకేసింది. వెంటనే ఒక సిగరెట్ వెలిగించాను.”—యోషిమిట్సు, జపాన్.
సిగరెట్ మానేసేటప్పుడు ఆటంకాలు వస్తాయని యోషిమిట్సు ఉదాహరణ చూపిస్తుంది. అంతేకాదు, కొన్ని అధ్యయనాల ప్రకారం, దాదాపు 90 శాతం మంది, సిగరెట్ మానేసే క్రమంలో విఫలమైతే, ఇక తమ ప్రయత్నాల్ని ఆపేసి మళ్లీ మొదటికి వచ్చేస్తారు. కాబట్టి, మీరు సిగరెట్ మానేయడానికి ప్రయత్నిస్తుంటే, మీకు ఎదురవ్వగల ఆటంకాల కోసం సిద్ధంగా ఉండండి. అలా సిద్ధంగా ఉంటే మీరు విజయం సాధించవచ్చు. ఇంతకీ ఎలాంటి ఆటంకాలు వస్తాయి?
సిగరెట్ తాగాలని నాలుక పీకేయడం: మాములుగా, సిగరెట్ మానేసిన మూడు రోజుల వరకు ఆ కోరిక బలంగా ఉంటుంది, దాదాపు రెండు వారాల తర్వాత అది తగ్గడం మొదలౌతుంది. “ఆ కోరిక అలానే ఉండిపోదు గానీ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది” అని సిగరెట్ మానేసిన ఒకతను అంటున్నాడు. ఆఖరికి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఉన్నట్టుండి సిగరెట్ తాగాలని మీకు నాలుక పీకేయవచ్చు. అలాంటప్పుడు తొందరపడి సిగరెట్ ముట్టించకండి. ఒక్క ఐదు నిమిషాలు ఓర్చుకుంటే, ఆ కోరిక దానంతట అదే పోతుంది.
వేరే ఇబ్బందులు (withdrawal symptoms): సిగరెట్ మానేసిన కొత్తలో చాలామందికి చురుగ్గా ఉండడం, అవధానం నిలపడం కష్టంగా ఉంటుంది. అంతేకాదు వాళ్లు త్వరగా బరువు పెరుగుతారు. వాళ్లకు ఒళ్లు నొప్పులు, దురద, చెమటలు పట్టేయడం, దగ్గు రావచ్చు. అలాగే వెంటవెంటనే మూడ్ మారిపోతూ చిరాకు, కోపం, డిప్రెషన్ రావచ్చు. కానీ చాలావరకు, ఈ లక్షణాలు నాలుగు నుంచి ఆరు వారాల్లో తగ్గుతాయి.
ఈ ఇబ్బందులతో పోరాడుతున్నప్పుడు, మీరు కొన్ని పనులు చేయవచ్చు. ఉదాహరణకు:
● కంటినిండా నిద్రపోండి.
● ఎక్కువగా నీళ్లు, జ్యూస్‌లు తాగండి. పౌష్టిక ఆహారం తీసుకోండి.
● తగినంత వ్యాయామం చేయండి.
● గట్టిగా శ్వాస తీసుకుంటూ, మీ ఊపిరితిత్తుల్ని స్వచ్ఛమైన గాలితో నింపుతున్నట్టు ఊహించుకోండి.
సిగరెట్ మళ్లీ తాగాలనిపించేలా చేసేవి: కొన్ని విషయాలు మీరు మళ్లీ సిగరెట్ తాగాలనిపించేలా చేస్తాయి, అవి పనులు కావచ్చు లేదా మీ ఫీలింగ్స్ కావచ్చు. ఉదాహరణకు మీకు ఇంతకుముందు టీ, కాఫీ, కూల్‌డ్రింక్ లాంటివి తాగుతూ సిగరెట్ కాల్చే అలవాటు ఉంటే, సిగరెట్ మానేయాలి అనుకున్నప్పుడు వాటిని ఎక్కువసేపు తాగుతూ కూర్చోకండి. ఎందుకంటే, మళ్లీ మీకు సిగరెట్ కాల్చాలనిపిస్తుంది. సిగరెట్ అలవాటును పూర్తిగా మానుకున్న తర్వాత, అప్పుడు మీరు నింపాదిగా కూర్చుని వాటిని తాగొచ్చు.
దీన్నిబట్టి, మీ శరీరానికి నికోటిన్ అవసరం లేకపోయినా, కొన్ని పనులు చేస్తున్నప్పుడు సిగరెట్ కాల్చాలనే ఫీలింగ్ కలుగుతుంది. ముందు చెప్పిన టోర్బన్ అనే ఆయన ఇలా ఒప్పుకుంటున్నాడు: “సిగరెట్ మానేసి పంతొమ్మిది ఏళ్లయినా, ఇప్పటికీ నాకు విరామ సమయంలో కాఫీ తాగుతున్నప్పుడు సిగరెట్ కాల్చాలనిపిస్తుంది.” అయితే చాలావరకు, ఇలాంటి ఫీలింగ్ మెల్లమెల్లగా పోతుంది.
అయితే, మందు తాగుతూ సిగరెట్ కాల్చేవాళ్ల పరిస్థితి వేరు. సిగరెట్ మానాలనుకునేవాళ్లు మందును కూడా పూర్తిగా మానేయాలి. దాన్ని తాగే చోట్లకు కూడా వెళ్లకూడదు. ఎందుకంటే, సిగరెట్ మానేసిన చాలామంది, మందు తాగేటప్పుడు ఆ సిగరెట్ అలవాటును తిరిగి మొదలుపెట్టారు. ఎందుకని అలా జరుగుతుంది?
● మందు కొంచెం మోతాదులో తాగినా, నికోటిన్ వల్ల వచ్చే కిక్కు పెరుగుతుంది.
● ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొడుతున్నప్పుడు, వాళ్లు సిగరెట్ కాలుస్తుంటే చూసి మీకు కూడా కాల్చాలని అనిపిస్తుంది.
● మందు తాగినప్పుడు మీరు సరిగ్గా ఆలోచించలేరు, చేయాలనుకున్నవి చేయలేరు. అందుకే బైబిలు ఇలా చెప్తుంది: ‘ద్రాక్షారసం సరైనది చేయాలనే ప్రేరణను అణచివేస్తుంది.’—హోషేయ 4:11.
స్నేహితులు: మీ స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. ఉదాహరణకు, సిగరెట్ తాగేవాళ్లతో గానీ, తాగమని అడిగేవాళ్లతో గానీ అనవసరంగా తిరగకండి. మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీ పట్టుదలను నీరుగార్చేవాళ్లకు కూడా దూరంగా ఉండండి.
ఒత్తిడి లేదా కోపం: ఒక అధ్యయనం ప్రకారం, ఎక్కువశాతం మంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా కోపంలో ఉన్నప్పుడు సిగరెట్ అలవాటును మళ్లీ మొదలుపెట్టారు. మీకు కూడా అలా సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు, మీ మనసును వేరేవైపు మళ్లించండి. బహుశా ఆ సమయంలో మీరు నీళ్లు తాగొచ్చు, బబుల్ గమ్ నమలొచ్చు, లేదా వాకింగ్‌కి వెళ్లొచ్చు. అంతేకాదు దేవునికి ప్రార్థించడం ద్వారా, బైబిల్లోని కొన్ని పేజీలు చదవడం ద్వారా మీ మనసును మంచి విషయాలతో నింపుకోవడానికి ప్రయత్నించండి.—కీర్తన 19:14.
సాకులు చెప్పకండి
● నాకు సిగరెట్ అంతా వద్దు, ఒక్క దమ్ము చాలు.
నిజానికి: ఒక్క దమ్ము, మీ శరీరానికి కావల్సిన నికోటిన్‌లో 50 శాతం ఇచ్చి, మూడు గంటల పాటు సంతృప్తిపరుస్తుంది. ఫలితం? మీరు ఒక్క దమ్ముతో ఆగలేరు.
● ఒత్తిడిలో ఉన్నప్పుడు సిగరెట్ తాగితే హాయిగా అనిపిస్తుంది.
నిజానికి: సిగరెట్‌లో ఉన్న నికోటిన్, ఒత్తిడి కలిగించే హార్మోన్లను పెంచుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. కొంతమంది సిగరెట్ తాగితే హాయిగా ఉంటుందని అనుకుంటారు. వాళ్ల శరీరానికి కావల్సిన నికోటిన్ అందుతుంది కాబట్టి, ఆ కాసేపు వాళ్లకు హాయిగా అనిపిస్తుంది.
● నేను మానేసే స్టేజీ ఎప్పుడో దాటేశాను, ఇక నావల్ల కాదు.
నిజానికి: మీరు అలా నిరుత్సాహపడితే, ఎప్పటికీ మానుకోలేరు. బైబిలు ఇలా చెప్తుంది: “కష్టం వచ్చిన రోజున నిరుత్సాహపడితే నీ శక్తి తగ్గిపోతుంది.” (సామెతలు 24:10) కాబట్టి నెగిటివ్‌గా ఆలోచించకండి. మానేయాలని నిజంగా కోరుకుని, ఈ పత్రికలో చెప్పినలాంటి సలహాల్ని పాటిస్తే ఎవరైనా మానుకోగలుగుతారు.
● మానేయడం వల్ల వచ్చే శారీరక ఇబ్బందులు (withdrawal symptoms) నేను భరించలేను.
నిజానికి: ఒప్పుకుంటాం, మానేస్తే వచ్చే ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి, కానీ అవి కొన్ని వారాల్లోనే తగ్గిపోతాయి. కాబట్టి వెనకడుగు వేయకండి! కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత మళ్లీ సిగరెట్ తాగాలనే కోరిక పుట్టినా, అది కూడా కొద్ది నిమిషాల్లోనే పోవచ్చు. ఎప్పుడంటే, కేవలం మీరు సిగరెట్ వెలిగించనప్పుడు మాత్రమే.
● నాకు మానసిక సమస్య ఉంది.
నిజానికి: మీరు ఒకవేళ డిప్రెషన్, స్కిజోఫ్రీనియా లాంటి మానసిక సమస్యలకు మందులు వాడుతుంటే, సిగరెట్ మానేయడానికి సహాయం చేయమని మీ డాక్టర్‌ని అడగండి. అతను లేదా ఆమె బహుశా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండి, మీరు వాడుతున్న మందుల్ని మార్చవచ్చు.
● సిగరెట్ మానేసే క్రమంలో నేను మళ్లీ మొదలుపెడితే, ఓడిపోయినట్లే అని నాకు అనిపిస్తుంది.
నిజానికి: మీరు ఎప్పుడైనా మళ్లీ సిగరెట్ తాగడం మొదలుపెడితే, ఇక అంతా అయిపోయినట్లే అనుకోకండి. చాలామందికి అలానే జరుగుతూ ఉంటుంది. మీరు పడిపోయినప్పుడు లేవండి, లేచి ముందుకెళ్లండి. పడిపోవడం తప్పు కాదు. ఎలాగూ పడిపోయాం కదా అని మీ ప్రయత్నాలు ఆపేయడం తప్పు. కాబట్టి ప్రయత్నిస్తూ ఉండండి. ఏదోకరోజు విజయం సాధిస్తారు!
రొమాల్డో అనే ఆయన ఉదాహరణ పరిశీలించండి. ఆయన 26 ఏళ్ల పాటు సిగరెట్ తాగాడు. సిగరెట్ మానేసి ఇప్పుడు 30 ఏళ్లు పైనే అవుతుంది. ఆయన ఇలా రాస్తున్నాడు: “నేను ఎన్నిసార్లు మానేద్దాం అనుకుని మళ్లీ మొదలుపెట్టానో లెక్కేలేదు. అలా మొదలుపెట్టిన ప్రతీసారి, ఇక నేను ఈ అలవాటును మానుకోలేనేమో అని చాలా బాధపడేవాణ్ణి. అయితే, యెహోవా దేవునితో మంచి సంబంధం కలిగివుండాలని గట్టిగా తీర్మానించుకుని, సహాయం కోసం పదేపదే ప్రార్థించాను. అలా చివరికి ఈ అలవాటును మానుకోగలిగాను.”
మీరు సిగరెట్ మానేయడానికి ఉపయోగపడే ఇంకొన్ని సలహాలు, ఈ సిరీస్‌లోని చివరి ఆర్టికల్‌లో ఉన్నాయి.
[బాక్సు/చిత్రం]
ఏ రూపంలోనైనా ప్రమాదకరమే
పొగాకును చాలా రకాలుగా వాడతారు. కొన్ని పొగాకు ఉత్పత్తుల్ని ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో సేంద్రీయ పదార్థాల షాపుల్లో, వనమూలికల షాపుల్లో అమ్ముతున్నారు. కానీ నిజానికి, “అన్ని రకాల పొగాకు ఉత్పత్తులు ప్రమాదకరమే” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. పొగాకు వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. తల్లులు పొగతాగడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు కూడా హాని జరగవచ్చు. సాధారణంగా, పొగాకు ఉత్పత్తుల్ని ఏయే విధాలుగా వాడతారు?
బీడీలు: ఇవి చిన్నగా ఉంటాయి. వీటిని చేతితో చుడతారు. వీటిని సాధారణంగా దక్షిణ ఆసియాలో ఉపయోగిస్తారు. సిగరెట్లతో పోలిస్తే బీడీల వల్ల ఎక్కువ నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, తారు శరీరంలోకి వెళ్తాయి.
చుట్ట: పొగాకును గానీ, పొగాకుతో తయారుచేసిన పేపరును గానీ గట్టిగా చుట్టి వీటిని తయారుచేస్తారు. సిగరెట్లలో ఉండే పొగాకు ఆమ్ల స్వభావం (acidic) కలిగి ఉంటుంది, చుట్టలో ఉండే పొగాకు కాస్త క్షార స్వభావం (alkaline) కలిగి ఉంటుంది. కాబట్టి చుట్టను వెలిగించకపోయినా నోట్లో పెట్టుకుంటే, బుగ్గ ద్వారా నికోటిన్ శరీరంలోకి వెళ్తుంది.
లవంగాల సిగరెట్: సాధారణంగా వీటిలో 60 శాతం పొగాకు, 40 శాతం లవంగాలు ఉంటాయి. మామూలు సిగరెట్ల కన్నా వీటివల్ల ఎక్కువ నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, తారు శరీరంలోకి చేరతాయి.
పొగాకు గొట్టాలు: సిగరెట్లు తాగడం కన్నా, గొట్టాల ద్వారా పొగాకును పీల్చడం తక్కువ ప్రమాదమని అనుకోవడానికి లేదు. ఎందుకంటే, ఈ రెండు అలవాట్లు ఎన్నో క్యాన్సర్‌లకు, జబ్బులకు దారితీస్తాయి.
పొగాకు నమలడం, వాసన చూడడం: దక్షిణ ఆసియాలో పొగాకును నమలడం, ముక్కుపొడి పీల్చడం, మసాలా గుట్కాను నమలడం చేస్తుంటారు. నికోటిన్ నోటి ద్వారా నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. పొగాకును ఇలా తీసుకున్నా ప్రమాదకరమే.
నీటి గొట్టాలు (హుక్కా, షీషా): ఈ పరికరాల్లో, పొగాకు కాలినప్పుడు వచ్చే పొగ, నీటి గుండా ప్రవేశించి గొట్టంలోకి వస్తుంది, దాన్ని నోటి ద్వారా పీలుస్తారు. అయితే ఇలా తాగినంత మాత్రాన, ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే హానికరమైన పదార్థాలు, క్యాన్సర్ కారకాలు ఏమీ తగ్గవు.
[బాక్సు/చిత్రం]
ఈ అలవాటును మానుకునేలా వేరేవాళ్లకు సహాయం చేయడం
● మంచిగా మాట్లాడండి. విమర్శించే బదులు, క్లాస్ పీకే బదులు మెచ్చుకోవడం, పొగడడం మంచి ఫలితాల్ని తెస్తాయి. “మళ్లీ మొదలుపెట్టేశావా? నాకు తెలుసు నీవల్ల కాదని” అనే మాట కన్నా, “నువ్వు ప్రయత్నిస్తే తప్పకుండా చేయగలవు” అనే మాటకు ఎక్కువ శక్తి ఉంటుంది.
● క్షమించండి. సిగరెట్ మానేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి మీ మీద కోప్పడవచ్చు, చిరాకు పడవచ్చు. కాబట్టి ఆ వ్యక్తితో ఓపిగ్గా ఉండండి. దయతో ఇలా మాట్లాడండి: ”నీకు ఇది చాలా కష్టమని నాకు తెలుసు, కానీ నువ్వు ప్రయత్నిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది.” అయితే, ఇలా మాత్రం ఎప్పుడూ అనకండి: “నువ్వు సిగరెట్ తాగేటప్పుడే బాగున్నావ్. ఇప్పుడేంటో ఇంతలా చిరాకు పడుతున్నావ్!”
● నిజమైన స్నేహితుడిగా ఉండండి. బైబిలు ఇలా చెప్తుంది: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.” (సామెతలు 17:17) అవును, సిగరెట్ మానేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తితో “ఎల్లప్పుడూ,” అంటే రోజులో ఏ సమయంలోనైనా, ఆ వ్యక్తి ఏ మూడ్‌లో ఉన్నా ఓపిగ్గా, ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి.
-
-
మీరు గెలవవచ్చు!తేజరిల్లు!: సిగరెట్ తాగే అలవాటును ఎలా మానుకోవచ్చు?
-
-
మీరు గెలవవచ్చు!
“ధైర్యంగా” మీరు అనుకున్నది జరిగించడానికి సమయం వచ్చేసింది. (1 దినవృత్తాంతాలు 28:10) గెలవడానికి మీరు చివరిగా ఏం చేయవచ్చు?
ఒకరోజు అనుకోండి. ద యూ.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఏం చెప్తుందంటే, మీరు సిగరెట్ మానేయాలని నిర్ణయించుకున్నాక దాన్ని రెండు వారాల్లోనే అమలులో పెట్టండి. అప్పుడైతేనే సిగరెట్ మానేయాలనే కోరిక మీలో బలంగా ఉంటుంది. మీరు మానేయాలనుకునే రోజును మీ క్యాలెండర్‌లో టిక్ పెట్టుకోండి, ఆ రోజు నుండి సిగరెట్ మానేస్తున్నట్టు మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి, ఆరు నూరైనా సరే ఆ రోజునే మానేయండి.
ఒక కార్డ్ రాసి పెట్టుకోండి. అందులో ఈ కింది విషయాలు రాసుకోవచ్చు, అలాగే సిగరెట్ మానుకోవాలనే కోరికను పెంచే దేన్నైనా రాసుకోవచ్చు:
● సిగరెట్ మానేయడానికి కారణాలు
● సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు, మనసు దానిమీదికి వెళ్లకుండా సహాయం చేసేవాళ్ల ఫోన్ నంబర్లు
● కొన్ని మంచిమాటలు, ఉదాహరణకు గలతీయులు 5:22, 23 వంటి బైబిలు లేఖనాలు
ఆ కార్డ్‌ను ఎప్పుడూ మీతోనే పెట్టుకుని, రోజంతటిలో చాలాసార్లు చదువుకోండి. సిగరెట్ పూర్తిగా మానేసిన తర్వాత కూడా, మళ్లీ ఎప్పుడైనా మీకు సిగరెట్ తాగాలనిపిస్తే, ఆ కార్డ్ తీసి చదువుకోండి.
మీ అలవాట్లు మార్చుకుంటూ రండి. మీరు ఏ రోజు నుండైతే సిగరెట్ మానేయాలని అనుకుంటున్నారో, దానికి ముందు మీరు కొన్ని అలవాట్లు మార్చుకోవచ్చు. ఉదాహరణకు, మీకు ఉదయం లేవగానే సిగరెట్ తాగే అలవాటు ఉంటే, దాన్ని ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు వాయిదా వేయగలరేమో ప్రయత్నించి చూడండి. ఒకవేళ మీకు భోజన సమయంలో గానీ, భోజనం అయిపోయిన వెంటనే గానీ సిగరెట్ తాగే అలవాటు ఉంటే, దాన్ని కూడా మార్చుకోండి. వేరేవాళ్లు సిగరెట్లు తాగే చోట్లకు వెళ్లకండి. అలాగే, ఒంటరిగా ఉన్నప్పుడు బయటికి ఇలా అనడం ప్రాక్టీస్ చేయండి: “వద్దు. నేను సిగరెట్ మానేశాను!” అలాంటి పనులు, మీరు సిగరెట్ మానేయాలనుకున్న తేదీ కోసం మిమ్మల్ని సిద్ధం చేయడమే కాదు, మీరు త్వరలోనే సిగరెట్లు మానేసిన మంచి వ్యక్తిగా అవ్వబోతున్నారని కూడా గుర్తుచేస్తాయి.
రెడీగా ఉండండి. మీరు అనుకున్న తేదీ దగ్గరపడుతుండగా, మీ ఇంట్లో కొన్ని క్యారెట్లు, బబుల్ గమ్, జీడిపప్పు, బాదంపప్పు లాంటివి తెచ్చి పెట్టుకోండి. మీరు అనుకున్న తేదీని ఫ్రెండ్స్‌కి, ఇంట్లోవాళ్లకి గుర్తుచేసి వాళ్ల సహాయం కోరండి. రేపు మానేస్తాం అనగా ఈరోజు యాష్-ట్రే, లైటర్లు పడేయండి. అలాగే మీ ఇంట్లో, కారులో, జేబుల్లో, ఆఫీస్‌లో ఏమైనా సిగరెట్లు మిగిలి ఉన్నాయేమో చూసి, అవి కూడా పడేయండి. ఎందుకంటే, సిగరెట్లు మీకు అందుబాటులో ఉంటే గబుక్కున తీసుకుని తాగుతారు, అదే ఒక ఫ్రెండ్‌ని అడిగో, లేకపోతే షాపుకెళ్లి తెచ్చుకునో తాగాలంటే కొంచెం ఆలోచిస్తారు కదా! దేవుని సహాయం కోసం ప్రార్థిస్తూ ఉండండి. మరిముఖ్యంగా, మీరు చివరి సిగరెట్ తాగేసిన తర్వాత, ఇంకా పట్టుదలగా అలా ప్రార్థించండి.—లూకా 11:13.
చాలామంది ఈ హానికరమైన, ప్రమాదకరమైన స్నేహితుడిని అంటే సిగరెట్‌ని “వదిలించుకున్నారు.” మీరూ అలా చేయగలరు. మంచి ఆరోగ్యం, చెప్పలేనంత స్వేచ్ఛ మీ కోసం ఎదురుచూస్తున్నాయి!
[చిత్రం]
మీరు రాసిపెట్టుకున్న కార్డును ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి, రోజంతటిలో ఎక్కువసార్లు దాన్ని చదువుకుంటూ ఉండండి
-