కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 3/1 పేజీలు 8-13
  • “నా కొరకు కనిపెట్టుడి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నా కొరకు కనిపెట్టుడి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జెఫన్యా—ధైర్యవంతుడైన సాక్షి
  • యెహోవా కోపాగ్నికిగల కారణాలు
  • యెహోవా దినాన్ని గురించిన సందేహాలు
  • ‘యెహోవా మహా దినము సమీపించింది’
  • ఇతర దేశాలు తీర్పుతీర్చబడ్డాయి
  • “కనిపెట్టుడి”
  • “మీ చేతుల్ని దించకండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యెహోవా తీర్పుదినం ఆసన్నమైంది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యెహోవా ఉగ్రత దినం రాకముందే ఆయనను వెదకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—జెఫన్యా
    మన రాజ్య పరిచర్య—2014
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 3/1 పేజీలు 8-13

“నా కొరకు కనిపెట్టుడి”

“కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా—నా కొరకు కనిపెట్టుడి.”—జెఫన్యా 3:8.

1. ప్రవక్తయైన జెఫన్యాచే ఏ హెచ్చరిక ఇవ్వబడింది, మరి నేడు జీవిస్తున్న ప్రజలకు ఇది ఏ ఆసక్తిని కల్గిస్తుంది?

“యెహోవా మహా దినము సమీపమాయెను.” ఇది సా.శ.పూ. ఏడవ శతాబ్ద మధ్య భాగంలో ప్రవక్తయైన జెఫన్యాచే తెలియజేయబడిన హెచ్చరిక. (జెఫన్యా 1:14) 40 లేక 50 సంవత్సరాల్లో అంటే యెరూషలేముపైకి, తన ప్రజలతో సరిగా వ్యవహరించకపోవడం ద్వారా తన సర్వాధిపత్యాన్ని తిరస్కరించిన దేశాలపైకి యెహోవా తీర్పులు అమలు చేయబడినప్పుడు ఆ ప్రవచనం నెరవేరింది. 20వ శతాబ్ద ముగింపులో జీవిస్తున్న ప్రజలకు ఇది ఎందుకు ఆసక్తికరమైనది? యెహోవా చివరి “మహా దినము” త్వరగా సమీపిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. జెఫన్యా కాలంలో వలెనే, యెరూషలేమునకు ఆధునిక కాల సమాంతరమైన క్రైస్తవమత సామ్రాజ్యానికి, యెహోవా ప్రజలతో సరిగా వ్యవహరించని మరియు తన విశ్వాధిపత్యాన్ని తిరస్కరించిన దేశాలన్నింటికీ వ్యతిరేకంగా యెహోవా యొక్క “కోపాగ్ని” రగులు కొనబోతుంది.—జెఫన్యా 1:4; 2:4, 8, 12, 13; 3:8; 2 పేతురు 3:12, 13.

జెఫన్యా—ధైర్యవంతుడైన సాక్షి

2, 3. (ఎ) జెఫన్యా గురించి మనకేమి తెలుసు, ఆయన యెహోవా యొక్క ధైర్యవంతుడైన సాక్షియని ఏది సూచిస్తుంది? (బి) జెఫన్యా ప్రవచించిన కాలాన్ని, స్థలాన్ని కనుగొనడానికి మనకు ఏ వాస్తవాలు సహాయపడతాయి?

2 “యెహోవా మరుగుపర్చాడు (భద్రపర్చాడు),” అనే అర్థమిచ్చే (హీబ్రూ సెఫన్‌ʹ) పేరుగల ప్రవక్తయైన జెఫన్యా గురించి తెల్సింది తక్కువే. అయితే, ఇతర ప్రవక్తలకు భిన్నంగా “హిజ్కియా” వరకూ అంటే నాల్గు తరాల వెనుకటి వరకూ తన వంశావళిని గురించి జెఫన్యా తెలియజేశాడు. (జెఫన్యా 1:1; యెషయా 1:1, పోల్చండి; యిర్మీయా 1:1; యెహెజ్కేలు 1:3.) ఇది అతి అసాధారణమైన విషయమైనందున, ఆయన ముత్తాతగా నమ్మకమైన రాజగు హిజ్కియాను అనేకమంది వ్యాఖ్యాన కర్తలు గుర్తించారు. ఆయనే ముత్తాతయైతే, అప్పుడు, జెఫన్యా రాజ వంశానికి చెందినవాడౌతాడు, ఇది యూదా అధిపతులను ఆయన తీవ్రంగా ఖండించడాన్ని మరింత విలువైందిగానూ ప్రభావవంతమైనదిగానూ చేసి ఉంటుంది, ఆయన యెహోవా యొక్క ధైర్యవంతుడైన ఓ సాక్షియని మరియు ప్రవక్తయని చూపి ఉంటుంది. యెరూషలేము స్థలవర్ణనను గూర్చి మరియు రాజస్థానంలో జరుగుతున్న దానిని గూర్చి ఆయనకున్న నిశితమైన జ్ఞానం ఆయన రాజధానిలోనే యెహోవా న్యాయ తీర్పుల్ని ప్రకటించి ఉండవచ్చని తెలియజేస్తున్నాయి.—జెఫన్యా 1:8-11, అథఃస్సూచి, (NW) చూడండి.

3 యూదాలోని పుర “అధిపతుల”కు (సంస్థానాధిపతులు లేక గోత్రాధిపతులు) మరియు “రాజకుమారుల”కు వ్యతిరేకంగా జెఫన్యా దైవిక తీర్పుల్ని ప్రకటించినప్పటికీ తన విమర్శలో ఆయన రాజును ఎప్పుడూ ప్రస్తావించలేదనే వాస్తవం గమనార్హమైన విషయం.a (జెఫన్యా 1:8; 3:3) జెఫన్యాచే బలంగా తిరస్కరింపబడిన పరిస్థితి దృష్ట్యా యౌవనస్థుడైన రాజగు యోషీయా తన మత సంస్కరణలను ఇంకా ప్రారంభించలేదన్నది స్పష్టమవుతునప్పటికీ ఆయన పరిశుద్ధ ఆరాధన ఎడల మక్కువను అప్పటికే చూపించాడని ఇది సూచిస్తుంది. సా.శ.పూ. 659 నుండి 629 వరకూ పరిపాలించిన యోషీయా పరిపాలన యొక్క తొలి సంవత్సరాల్లో యూదానందు జెఫన్యా ప్రవచించాడని ఇదంతా సూచిస్తుంది. జెఫన్యా దృఢంగా ప్రవచిస్తుండడం నిశ్చయంగా ఆకాలమందు యూదాలో వ్యాపించిన విగ్రహారాధన, దౌర్జన్యం మరియు అవినీతిని గురించి యౌవనుడైన యోషీయా ఎక్కువగా తెలుసుకోవడానికి దోహదపడి, విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఆయన తరువాతి దాడిని చేయడానికి ప్రోత్సహించింది.—2 దినవృత్తాంతములు 34:1-3.

యెహోవా కోపాగ్నికిగల కారణాలు

4. యూదా యెరూషలేములకు వ్యతిరేకంగా తన కోపాన్ని యెహోవా ఏ మాటల్లో వ్యక్తపర్చాడు?

4 యూదా మరియు దాని ముఖ్య పట్టణమైన యెరూషలేములోని నాయకులు మరియు నివాసులపై కోపించడానికి యెహోవాకు మంచి కారణమే ఉంది. తన ప్రవక్తయైన జెఫన్యా ద్వారా ఆయనిలా తెలియజేశాడు: “నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవత యొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను. మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలు దేవత [“మిల్కోము,” NW] తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.”—జెఫన్యా 1:4, 5.

5, 6. (ఎ) జెఫన్యా కాలంలో యూదానందలి మతపరిస్థితి ఏమిటి? (బి) యూదా పుర నాయకులు మరి వారి క్రింది నాయకుల పరిస్థితి ఏమిటి?

5 బయలు ఆరాధన, దయ్యాల సంబంధమైన జ్యోతిశ్శాస్త్రం మరియు అన్యదేవతయైన మిల్కోము ఆరాధనల యొక్క నీచమైన ఫలదీకరణా ఆచారకర్మలతో యూదా మలినపర్చబడింది. కొంతమంది సూచిస్తున్నట్లుగా మిల్కోము, మొలెకు ఒకటే అయినట్లయితే యూదా అబద్ధ ఆరాధనలో పిల్లలను బల్యర్పించే అసహ్యమైన క్రియ చేరివుంటుంది. అలాంటి మతాచారాలు యెహోవా దృష్టికి హేయమైనవి. (1 రాజులు 11:5, 7; 14:23, 24; 2 రాజులు 17:16, 17) విగ్రహారాధికులు యెహోవా నామాన్నిబట్టి ఇంకా ప్రమాణాలు చేస్తున్నారు గనుక వారు ఆయన తీవ్రమైన ఉగ్రతకు పాత్రులు. అటువంటి మతపరమైన అపవిత్రతను ఆయన ఇక సహించడు, అన్యులైన మరియు మత భ్రష్టులైన యాజకుల్ని ఒకేలా నిర్మూలిస్తాడు.

6 అంతేకాకుండా, యూదా పుర నాయకులు అవినీతిపరులు. దాని అధిపతులు క్రూరమైన “గర్జనచేయు సింహముల”కు, దాని న్యాయాధిపతులు తీక్షణమైన “తోడేళ్ల”కు పోల్చదగినవారి వలె ఉన్నారు. (జెఫన్యా 3:3) “యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపు”వారని, వారి క్రింది అధికారులు నిందింపబడిరి. (జెఫన్యా 1:9) ఐశ్వర్యాసక్తి అంతటా వ్యాపించింది. అనేకులు సంపదను కూడబెట్టుకొనేందుకు పరిస్థితిని ఉపయోగించుకున్నారు.—జెఫన్యా 1:13.

యెహోవా దినాన్ని గురించిన సందేహాలు

7. “యెహోవా మహా దినము”నకు మునుపు ఎంత కాలం జెఫన్యా ప్రవచించాడు మరి అనేకమంది యూదుల ఆత్మీయ పరిస్థితి ఏమిటి?

7 మనం ఇప్పటికే చూసినట్లుగా, జెఫన్యా కాలంలో వ్యాపించివున్న విపత్కరమైన మత పరిస్థితి, సుమారు సా.శ.పూ. 648లో విగ్రహారాధనకు వ్యతిరేకంగా రాజైన హోషీయా తన దాడిని ప్రారంభించక మునుపే ఓ సాక్షిగా మరియు ప్రవక్తగా ఆయన తన పనిని నిర్వహించాడని సూచిస్తుంది. (2 దినవృత్తాంతములు 34:4, 5) ఆవిధంగా యూదా రాజ్యంపైకి “యెహోవా మహా దినము” రాకమునుపు కనీసం 40 సంవత్సరాలు జెఫన్యా ప్రవచించాడు. ఈ మధ్య కాలంలో అనేకమంది యూదులు సందేహాల్ని మనస్సులో ఉంచుకొని, ఉదాసీనంగా తయారవుతూ యెహోవాను సేవించడాన్నుండి ‘వెనుకంజ’ వేశారు. “యెహోవాను . . . విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని” గూర్చి జెఫన్యా మాట్లాడుతున్నాడు. (జెఫన్యా 1:6) స్పష్టంగా, యూదాలోని వ్యక్తులు నిశ్చింతభావం కల్గినవారు మరియు వారు దేవుని విషయంలో శ్రద్ధ తీసుకోలేదు.

8, 9. (ఎ) “మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటి” వారిని యెహోవా ఎందుకు పరిశోధిస్తాడు? (బి) యూదా నివాసులు మరి వారి పుర, మత నాయకులకు యెహోవా ఏయే రీతుల్లో అవధానాన్ని ఇస్తాడు?

8 తన ప్రజలని చెప్పుకొనే వారిని పరిశోధిస్తాననే తన సంకల్పాన్ని యెహోవా తెలియజేశాడు. తన ఆరాధికులమని చెప్పుకొనే వారిలో ఎవరు, మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే ఆయన సామర్థ్యానికి లేక ఉద్దేశానికి సంబంధించి తమ హృదయాలయందు సందేహాల్ని కల్గివుంటారో వారిని ఆయన వెతికి పట్టుకుంటాడు. ఆయన ఇలా తెలియజేశాడు: “ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై—యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును.” (జెఫన్యా 1:12) “మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటి” మనుష్యులు అనే పదబంధం (ద్రాక్షారసం తయారు చేయడానికి సంబంధించిన ఉల్లేఖనం) తొట్టి అడుగునచేరే మడ్డివలె స్థిరపడిన వారిని మరియు మానవజాతి వ్యవహారాల్లో జరుగబోయే దైవిక జోక్యాన్ని గూర్చిన ఏ ప్రకటన ద్వారానైనా కలతపర్చబడకూడదని అనుకొనే వారిని సూచిస్తుంది.

9 యూదా, యెరూషలేము నివాసుల్ని మరియు తన ఆరాధనను అన్యమతంతో మిళితం చేసిన వారి యాజకులవైపు యెహోవా దృష్టిని సారిస్తాడు. యెరూషలేము ప్రాకారాల లోపల గాఢాంధకారమందు వారు సురక్షితంగా ఉన్నట్టు భావిస్తే, వారు ఆశ్రయం పొందిన ఆత్మీయ అంధకారాన్ని పారద్రోలే ప్రకాశవంతమైన దీపములతో వారిని ఆయన వెదకి కనుగొంటాడు. మొదట భయానకమైన తీర్పు వర్తమానాల ద్వారా, తర్వాత ఆ తీర్పుల్ని అమలు చేయడం ద్వారా వారి మతపరమైన ఉదాసీనత నుండి ఆయన వారిని కదల్చివేస్తాడు.

‘యెహోవా మహా దినము సమీపించింది’

10. ‘యెహోవా మహా దినాన్ని’ జెఫన్యా ఎలా వర్ణించాడు?

10 జెఫన్యా ఇలా ప్రకటించడానికి యెహోవా ప్రేరేపించాడు: “యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. [“యెహోవా దినపు ఘోష కఠినమైనది” NW]” (జెఫన్యా 1:14) హెచ్చరికను లక్ష్యపెట్టడాన్ని మరియు పరిశుద్ధ ఆరాధనవైపు మరలడాన్ని తిరస్కరించిన ప్రతి ఒక్కరికీ అంటే యాజకులకు, అధిపతులకు, ప్రజలకు నిశ్చయంగా కఠినమైన దినాలు ముందున్నాయి. తీర్పు అమలు జరిగే దినాన్ని గురించి వర్ణిస్తూ ప్రవచనం ఇలా కొనసాగుతున్నది: “ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధకారమును కమ్ముదినము. ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.”—జెఫన్యా 1:15, 16.

11, 12. (ఎ) యెరూషలేముకు వ్యతిరేకంగా ఏ తీర్పు వర్తమానం ప్రకటింపబడింది? (బి) వస్తు సమృద్ధి యూదుల్ని కాపాడుతుందా?

11 త్వరగా గతించిపోయినట్లనిపించే కొన్ని దశాబ్దాల్లోనే బబులోను సైన్యాలు యూదాపై దాడి చేస్తాయి. యెరూషలేము తప్పించుకోలేదు. దాని నివాసిత మరియు వ్యాపార ప్రాంతాలు నాశనం చేయబడతాయి. “ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదనశబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు. . . . ద్రవ్యము సమకూర్చుకొనిన వారందరును నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ [యెరూషలేములోని ఓ ప్రాంతం] నివాసులారా, అంగలార్చుడి.”—జెఫన్యా 1:10, 11, అథఃస్సూచి, NW.

12 యెహోవా దినం సమీపమైందని విశ్వసించటాన్ని తిరస్కరించి అనేకమంది యూదులు లాభార్జిత వ్యాపార సాహసాల్లో పూర్తిగా మునిగిపోయారు. కాని తన నమ్మకమైన ప్రవక్తయైన జెఫన్యా ద్వారా వారి సంపద “దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును” అని యెహోవా ప్రవచించాడు. వారు తయారు చేసిన ద్రాక్షారసాన్ని వారు త్రాగరు మరియు “యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలే”వు.—జెఫన్యా 1:13, 18.

ఇతర దేశాలు తీర్పుతీర్చబడ్డాయి

13. మోయాబు, అమ్మోను మరియు అష్షూరు దేశాలకు వ్యతిరేకంగా ఏ తీర్పు వర్తమానాన్ని జెఫన్యా ప్రకటించాడు?

13 తన ప్రవక్తయైన జెఫన్యా ద్వారా, తన ప్రజలతో సరిగా వ్యవహారించని దేశాలకు వ్యతిరేకంగా కూడా యెహోవా తన కోపాన్ని వ్యక్తపర్చాడు. ఆయన ఇలా ప్రకటించాడు: “మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణమాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; . . . ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును; నీనెవె పట్టణమును పాడుచేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.”—జెఫన్యా 2:8, 9, 13.

14. ఇశ్రాయేలీయులకు మరి వారి దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా అన్య దేశాలు ‘అతిశయించాయని’ చెప్పడానికి ఉన్న రుజువు ఏది?

14 మోయాబు అమ్మోను దేశాలు ఇశ్రాయేలీయుల దీర్ఘకాలిక శత్రువులు. (న్యాయాధిపతులు 3:12-14, పోల్చండి.) మోయాబీయుల రాజైన మేషా చేసిన డంబమైన వ్యాఖ్యానం లిఖింపబడిన శిలాశాసనం, మోయాబైట్‌ శిల పారిస్‌లోని లౌర్‌ ప్రదర్శనశాలలో ఉంది. తన దేవతయైన కెమోషు సహాయంతో అనేక ఇశ్రాయేలీయ పురాల్ని తాను పట్టుకోవడం గురించి అతడు గర్వంగా తెలియజేశాడు. (2 రాజులు 1:1) జెఫన్యాకు సమకాలికుడైన యిర్మీయా, అమ్మోనీయులు తమ దేవతయైన మల్కోము పేరున ఇశ్రాయేలీయ ప్రాంతమైన గాదును ఆక్రమించడాన్ని గురించి మాట్లాడాడు. (యిర్మీయా 49:1) అష్షూరునకు సంబంధించినంత వరకూ రాజైన షల్మనేసెరు V జెఫన్యా కాలానికి సుమారు ఓ శతాబ్దం ముందు షోమ్రోనును ముట్టడించి పట్టుకున్నాడు. (2 రాజులు 17:1-6) అటు తరువాత కొంత కాలానికి, రాజైన సన్హెరీబు యూదాపై దాడిచేసి దాని పటిష్టమైన పురాలను అనేకం పట్టుకొన్నాడు, యెరూషలేమును సహితం భయపెట్టాడు. (యెషయా 36:1, 2) యెరూషలేమును లోబడిపొమ్మని అధికారపూర్వకంగా అడిగినప్పుడు అష్షూరు రాజు యొక్క వాగ్దూత నిశ్చయంగా యెహోవాకు వ్యతిరేకంగా అతిశయించాడు.—యెషయా 36:4-20.

15. తన ప్రజలకు వ్యతిరేకంగా అతిశయించిన దేశాల దేవతల్ని ఏవిధంగా యెహోవా గర్వభంగం చేస్తాడు?

15 “ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని” చెప్పుకొనిన మరియు ఇశ్రాయేలునకు వ్యతిరేకంగా అతిశయించిన మోయాబు అమ్మోను మరియు అష్షూరులతోపాటు అనేక దేశాల్ని గురించి కీర్తన 83 ప్రస్తావిస్తోంది. (కీర్తన 83:4) గర్వంగల ఈ దేశాలు మరి వాటి దేవతలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాచే గర్వభంగం చేయబడతాయని ప్రవక్తయైన జెఫన్యా ధైర్యంగా ప్రకటించాడు. “వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును. జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవా వారికి భయంకరుడుగా ఉండును.”—జెఫన్యా 2:10, 11.

“కనిపెట్టుడి”

16. (ఎ) యెహోవా దినం సమీపించడం ఎవరి ఆనందానికి మూలం మరియు ఎందుకు? (బి) ఈ నమ్మకమైన శేషానికి ఏ ఆజ్ఞ వెలువడింది?

16 యూదా, యెరూషలేము నాయకుల్లోనూ అనేకమంది నివాసుల్లోనూ ఆత్మీయ ఉదాసీనత, శంఖావాదం, విగ్రహారాధన, అవినీతి, ఐశ్వర్యాసక్తి వ్యాపించి ఉన్నా కొంతమంది నమ్మకమైన యూదులు జెఫన్యా హెచ్చరికా ప్రవచనాల్ని ఆలకించినట్లు కనబడ్తుంది. యూదా అధిపతులు, న్యాయాధిపతులు, యాజకుల నీచమైన ఆచారాల్నిబట్టి వారు విచారించారు. జెఫన్యా ప్రకటనలు, ఈ యథార్థపరుల ఓదార్పుకొక మూలంగా ఉన్నాయి. అది అటువంటి అసహ్యమైన ఆచారాల్ని నిలిపివేస్తుంది గనుక యెహోవా దినం సమీపించడం కలతకు కారణమవ్వడానికి బదులుగా వారి ఆనందానికొక మూలంగా ఉంది. ఈ నమ్మకమైన శేషం యెహోవా ఆజ్ఞను లక్ష్యపెట్టింది: “నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగుచేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్నిచేత భూమియంతయు కాలిపోవును.”—జెఫన్యా 3:8.

17. జెఫన్యా తీర్పు వర్తమానాలు ఎప్పుడు మరియు ఏవిధంగా దేశాలపై నెరవేరనారంభించాయి?

17 ఆ హెచ్చరికను వినిన వారు ఆశ్చర్యపోలేదు. జెఫన్యా ప్రవచన నెరవేర్పును చూసేందుకు అనేకులు జీవించారు. సా.శ.పూ. 632లో బబులోనీయులు, మాదీయులు మరియు ఉత్తరాన్నుండి వచ్చిన, బహుశా స్కైతినీయుల సైన్యాల యొక్క రాజకీయ సమ్మేళనముచే నీనెవె పట్టుకొనబడి నాశనం చేయబడింది. చరిత్రకారుడైన విల్‌ డురన్ట్‌ ఇలా తెలియజేస్తున్నాడు: “నబొపొలస్సార్‌ నడిపింపు క్రిందనున్న బబులోనీయ సైన్యం, సైరస్‌ నడిపింపు క్రిందనున్న మాదీయ సైన్యంతోనూ కౌకసస్‌ నుండి వచ్చిన స్కైతినీయుల సైన్యంతోనూ కలిసి ఉత్తర దుర్గాల్ని చాలా సులభంగానూ వేగంగానూ స్వాధీనపర్చుకున్నాయి. . . ఒక్క దెబ్బకే అష్షూరు చరిత్రలో నుండి కనుమరుగైపోయింది.” జెఫన్యా ప్రవచించింది సరిగ్గా ఇదే.—జెఫన్యా 2:13-15.

18. (ఎ) యెరూషలేముపై దైవిక తీర్పు ఎలా అమలుచేయబడింది మరియు ఎందుకు? (బి) మోయాబు, అమ్మోనులకు సంబంధించిన జెఫన్యా ప్రవచనం ఎలా నెరవేరింది?

18 యెహోవా కొరకు కనిపెట్టిన యూదులు, యూదా యెరూషలేములపై ఆయన తీర్పులు అమలు చేయబడడాన్ని కూడా చూసేందుకు జీవించారు. యెరూషలేమునకు సంబంధించి జెఫన్యా ఇలా ప్రవచించాడు: “ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవునియొద్దకు రాదు.” (జెఫన్యా 3:1, 2) దాని అవిశ్వాస్యతనుబట్టి, యెరూషలేము బబులోనీయులచే రెండుసార్లు చుట్టుముట్టబడి, చివరకు సా.శ.పూ. 607లో చెరపట్టబడి నాశనం చేయబడింది. (2 దినవృత్తాంతములు 36:5, 6, 11-21) యూదా చరిత్రకారుడైన జోసిఫస్‌ ప్రకారంగా, మోయాబు అమ్మోనులకు సంబంధించినంత వరకూ యెరూషలేము కూలిపోయిన తర్వాత ఐదవ సంవత్సరంలో, బబులోనీయులు యుద్ధంచేసి వాటిని జయించారు. ప్రవచించబడినట్లుగానే ఆ తర్వాత అవి ఉనికిలో లేకుండా పోయాయి.

19, 20. (ఎ) తన కొరకు కనిపెట్టిన వారికి యెహోవా ఎలా ప్రతిఫలం ఇచ్చాడు? (బి) ఈ సంఘటనలు మనకు ఎందుకు శ్రద్ధ కల్గిస్తాయి మరియు తరువాత శీర్షికలో ఏమి పరిశీలించబడ్తుంది?

19 జెఫన్యా ప్రవచనంలోని వీటి నెరవేర్పు మరితర వివరాలు, యెహోవా కొరకు కనిపెట్టుటలో జాగ్రత్తగా ఉన్న యూదులు మరి యూదాయేతరులకు విశ్వాసాన్ని బలపర్చే అనుభవం. యూదా యెరూషలేములకు తటస్థించిన నాశనం నుండి తప్పించుకొనిన వారిలో యిర్మీయా, ఐతీయోపియుడైన ఎబెద్మెలకు మరియు రేకాబీయుడైన యెహోనాదాబు ఇంటివారు ఉన్నారు. (యిర్మీయా 35:18, 19; 39:11, 12, 16-18) యెహోవా కొరకు వేచివుండుటలో కొనసాగిన చెరలోవున్న నమ్మకమైన యూదులు మరి వారి సంతతి, సా.శ.పూ. 537లో బబులోను నుండి విడుదలై, పరిశుద్ధ ఆరాధనను పునరుద్ధరించడానికి యూదాకు తిరిగి వచ్చిన సంతోషవంతులైన శేషంలో ఓ భాగమయ్యారు.—ఎజ్రా 2:1; జెఫన్యా 3:14, 15, 20.

20 మనకాలానికి దీనియంతటి భావం ఏమిటి? జెఫన్యా కాలంలోని పరిస్థితికి క్రైస్తవమత సామ్రాజ్యంలో నేడు జరుగుతున్న హేయమైన విషయాలకు అనేక రీతుల్లో సామ్యంవుంది. అంతేకాకుండా, ఆ కాలాల్లోని యూదుల విభిన్నమైన వైఖర్లు నేడు కనుగొనబడే వైఖర్లను పోలివున్నాయి, అవి కొన్నిసార్లు యెహోవా ప్రజల్లో సహితం కన్పిస్తాయి. ఈ విషయాలు తర్వాత శీర్షికలో చర్చించబడతాయి.

[అధస్సూచీలు]

a యోషీయా కుమారులు అప్పటికి చిన్న పిల్లలుగా ఉన్నందున “రాజ కుమారులు” అనే మాట, రాజరికపు అధిపతులందరినీ సూచిస్తున్నట్లు కనబడుతుంది.

పునఃసమీక్ష చేయడం రా

◻ జెఫన్యా కాలంలో యూదానందలి మత పరిస్థితి ఏమిటి?

◻ పుర నాయకుల్లో ఏ పరిస్థితులు వ్యాపించి ఉన్నాయి మరి అనేకమంది ప్రజల దృక్పథం ఏమిటి?

◻ యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా దేశాలు ఎలా అతిశయించాయి?

◻ యూదా మరితర దేశాలకు జెఫన్యా ఏ హెచ్చరికను ఇచ్చాడు?

◻ యెహోవా కొరకు కనిపెట్టినవారికి ఎలా ప్రతిఫలం ఇవ్వబడింది?

[9వ పేజీలోని చిత్రం]

ప్రాచీనకాల ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా మోయాబీయుల రాజైన మేషాడంబమైన మాటల్ని మాట్లాడాడని మోయాబైట్‌ శిల ధ్రువపరుస్తోంది

[క్రెడిట్‌ లైను]

Moabite Stone: Musée du Louvre, Paris

[10వ పేజీలోని చిత్రం]

జెఫన్యా ప్రవచనాన్ని బలపరుస్తూ, బబులోనీయ వృత్తాంతాన్ని కల్గివున్న ఈ శరాకారలిపి పలక రాజకీయ సైన్యాలచే నీనెవే నాశనం చేయడాన్ని గూర్చి తెలియజేస్తుంది

[క్రెడిట్‌ లైను]

Cuneiform tablet: Courtesy of The British Museum

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి