నేడు ఆశావాదానికి సరైన ఆధారం
చరిత్రకారుడూ సమాజశాస్త్రజ్ఞుడూ అయిన, 1866లో జన్మించిన హెచ్. జి. వెల్స్, 20వ శతాబ్దపు ఆలోచనా విధానాన్ని శక్తివంతంగా ప్రభావితం చేశాడు. సహస్రాబ్దికాల ప్రారంభం మరియు విజ్ఞానశాస్త్ర పురోభివృద్ధి ఏకకాలంలో సంభవిస్తాయనే తన దృఢ నమ్మకాన్ని ఆయన తన వ్రాతల ద్వారా వివరించాడు. అలా, తన లక్ష్యాలను ప్రచురపరచేందుకు వెల్స్ అనితర కృషి సలపడంలో ఆయనకుండిన “అవధులు లేని ఆశావాదాన్ని” కోలియర్స్ ఎన్‌సైక్లోపీడియా జ్ఞాపకం చేస్తోంది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఆయనకుండిన ఆశావాదం తునాతునకలైందని కూడా అది పేర్కొంటోంది.
“విజ్ఞానశాస్త్రం మంచికే కాకుండా చెడుకు కూడా దోహదపడగలదనే విషయాన్ని” వెల్స్ గుర్తించినప్పుడు, “ఆయన విశ్వాసం మటుమాయమైంది, ఆయన నిరాశావాదంలోకి జారిపోయాడు” అని చేంబర్స్ బయోగ్రాఫికల్ డిక్షనరీ పేర్కొంటుంది. ఇది ఎందుకు సంభవించింది?
వెల్స్ నమ్మకమూ ఆశావాదమూ మానవ సాఫల్యాలపైనే పూర్తిగా ఆధారపడ్డాయి. తన ఉటోపియాను సాధించడంలో మానవజాతి అసమర్థమైనదని ఆయన గుర్తించినప్పుడు, ఆయనకు ఆశాకిరణం కనిపించలేదు. ఆశాభంగం త్వరలోనే నిరాశావాదమైంది.
నేడు, అనేకమంది ప్రజలకు ఆ కారణాన్ని బట్టే అదే అనుభవం ఎదురౌతుంది. వారు యౌవనంలో ఉన్నప్పుడు ఆశావాదం వారిలో పొంగి పొర్లుతుంటుంది, అయితే వారు పెద్దవారౌతుండగా వారు కృంగిపోయి నిరాశావాదంలో పడిపోతారు. మామూలు జీవిత విధానమని పిలువబడే దాన్ని విడనాడి మాదక ద్రవ్యాల వాడుక, విచక్షణా రహిత ప్రవర్తన మరియు ఇతర వినాశకరమైన జీవిత విధానాలలో కూరుకుపోయే యౌవనులు కూడా ఉన్నారు. దానికి సమాధానం ఏమిటి? బైబిలు కాలాల నుండి లభిస్తున్న ఈ క్రింది ఉదాహరణలను పరిశీలించి, గతంలోనే కాకుండా వర్తమానంలోనూ అలాగే భవిష్యత్తులోనూ ఆశాభావం కల్గి ఉండేందుకు గల ఆధారాన్ని చూడండి.
అబ్రాహాముకుండిన ఆశావాదం ప్రతిఫలాన్ని పొందింది
సా.శ.పూ. 1943 సంవత్సరంలో, అబ్రాహాము హారాను నుండి వచ్చి యూఫ్రటీసు నదిని దాటి కనాను దేశంలోకి ప్రవేశించాడు. అబ్రాహాము ‘నమ్మినవారికందరికి తండ్రి’ అని వర్ణించబడ్డాడు, ఆయన ఎంత చక్కని మాదిరినుంచాడో కదా!—రోమీయులు 4:11.
అబ్రాహాము వెంట అబ్రాహాము సహోదరుని అనాథ కుమారుడైన లోతు మరియు లోతు కుటుంబం కూడా ఉన్నారు. తర్వాత, ఆ దేశాన్ని కరవు పీడించినప్పుడు ఈ రెండు కుటుంబాలూ ఐగుప్తుకు తరలి వెళ్లాయి, కొంత కాలానికి అవి కలిసి వెనక్కి వచ్చాయి. ఈపాటికి, అబ్రాహాము లోతు ఇరువురూ కూడా ఎంతో సంపదను అలాగే పశువులనూ మందలనూ సమకూర్చుకున్నారు. వారి పశువుల కాపరుల మధ్య గొడవ ప్రారంభమైనప్పుడు, అబ్రాహాము చొరవ తీసుకుని ఇలా అన్నాడు: “మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన యెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదు[ను].”—ఆదికాండము 13:8, 9.
వయస్సులో పెద్దవాడైన అబ్రాహాము విషయాలను తనకు అనుకూలమైన విధంగా జరుపుకోగలిగే వాడే, లోతు తన పినతండ్రి ఎడలగల గౌరవం మూలంగా, ఎంపిక చేసుకునే అవకాశాన్ని అబ్రాహాముకు తప్పకుండా ఇచ్చి ఉండగల్గేవాడే. దానికి బదులుగా, “లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లుపారు దేశమైయుండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొ[నెను].” అలాంటి ఎంపిక చేసుకున్నందు వల్ల లోతు ఆశావాదంగా ఉండేందుకు ప్రతి కారణమూ ఉంది. అబ్రాహాము సంగతేంటి?—ఆదికాండము 13:10, 11.
అబ్రాహాము తన కుటుంబ సంక్షేమాన్ని అపాయంలో పడవేస్తూ వెర్రిసాహసాలు చేస్తున్నాడా? లేదు. అబ్రాహాము యొక్క అనుకూల దృక్పథం, ఉదార స్వభావం ఆయనకు ఎంతో గొప్ప ప్రతిఫలాలను తెచ్చిపెట్టాయి. యెహోవా అబ్రాహాముకు ఇలా చెప్పాడు: “ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము; ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.”—ఆదికాండము 13:14, 15.
అబ్రాహాముకున్న ఆశావాదానికి మంచి ఆధారముంది. “భూమియొక్క సమస్తవంశములు [అబ్రాహాము]యందు ఆశీర్వదించబ[డే]” విధంగా అబ్రాహామును ఒక గొప్ప జనముగా చేస్తానన్న దేవుని వాగ్దానంపై అది ఆధారపడి ఉంది. (ఆదికాండము 12:2-4, 7) “దేవుని ప్రేమించువారికి, . . . మేలుకలుగుటకై సమస్తమును సమకూడి” జరిగేలా దేవుడు చేస్తాడని ఎరిగిన వారమై ధైర్యంగా ఉండేందుకు మనకు కూడా కారణముంది.—రోమీయులు 8:28.
ఆశావాదులైన ఇద్దరు వేగులు
400 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత, “పాలు తేనెలు ప్రవహించు దేశ[మైన]” కనానులోకి ప్రవేశించేందుకు ఇశ్రాయేలు జనాంగం సిద్ధపడి ఉంది. (నిర్గమకాండము 3:8; ద్వితీయోపదేశకాండము 6:3) ‘ఆ దేశమును వేగు చూచి, తిరిగి వచ్చి అందులోనికి వారు వెళ్లవలసిన త్రోవను గూర్చియు, వారు చేరవలసిన పురములను గూర్చియు వారికి వర్తమానము చెప్పుటకు’ మోషే 12 మంది ప్రధానులను నియమించాడు. (ద్వితీయోపదేశకాండము 1:22; సంఖ్యాకాండము 13:2) ఆ దేశ సంపన్నత గురించి 12 మంది వేగులవారూ ఒకే విధమైన వర్ణననిచ్చారు, అయితే 10 మంది నిరాశావాదులిచ్చిన నివేదిక ప్రజల హృదయాల్లో భయాన్ని పుట్టించింది.—సంఖ్యాకాండము 13:31-33.
అయితే మరో వైపు యెహోషువ, కాలేబులు ప్రజలకు ఆశావాద వర్తమానాన్ని అందజేసి, వారి భయాలను తొలగించేందుకు తమకు వీలైనదంతా చేశారు. వారి దృక్పథం మరియు నివేదిక, వారిని వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తానని తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చగల యెహోవా సామర్థ్యంపై వారికున్న పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశాయి, కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. బదులుగా, “ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెన[నిరి.]”—సంఖ్యాకాండము 13:30; 14:6-10.
యెహోవా యందు నమ్మకముంచమని మోషే ప్రజలను పురికొల్పాడు కానీ వారు వినడానికి నిరాకరించారు. వారు తమ నిరాశావాద దృక్పథంలో కొనసాగినందుకు, పూర్తి జనాంగం 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించవలసి వచ్చింది. 12 మంది వేగుల వారిలో కేవలం యెహోషువ, కాలేబులు మాత్రమే తమ ఆశావాదాన్ని బట్టి ప్రతిఫలాన్ని అనుభవించారు. మూల సమస్య ఏమై ఉండింది? విశ్వాస లోపమే, ఎందుకంటే ప్రజలు తమ స్వంత జ్ఞానంపై ఆధారపడ్డారు.—సంఖ్యాకాండము 14:26-30; హెబ్రీయులు 3:7-12.
యోనా సంశయం
యోనా సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో జీవించాడు. ఆయన రెండవ యరొబాము పరిపాలనా సమయంలో ఏదోసమయంలో, ఇశ్రాయేలు యొక్క పది గోత్రాల రాజ్యానికి యెహోవా యొక్క యథార్థమైన ప్రవక్తగా ఉన్నాడని బైబిలు సూచిస్తుంది. అయినప్పటికీ, ప్రజలకు హెచ్చరికనిచ్చేందుకు గాను నీనెవె పట్టణానికి వెళ్ళవలసిన నియామకాన్ని ఆయన నిరాకరించాడు. యోనా “అక్కడనుండి పారిపోయి యొప్పేకు వెళ్లిపోవడం శ్రేష్ఠమని భావించాడని” చరిత్రకారుడైన జోసీఫస్ చెబుతున్నాడు. అక్కడ బహుశ ఆధునిక దిన స్పెయిన్ అయిన తర్షీషుకు వెళ్లే ఓడను ఆయన ఎక్కాడు. (యోనా 1:1-3) యోనా తన నియామకాన్ని గురించి అటువంటి నిరాశావాద అభిప్రాయాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడనే విషయం యోనా 4:2 నందు వివరించబడింది.
యోనా చివరికి తన నియామకాన్ని తుదముట్టించేందుకు అంగీకరించాడు, అయితే నీనెవె ప్రజలు పశ్చాత్తాపం చెందినప్పుడు ఆయన ఆగ్రహించాడు. యోనాకు నీడనిస్తున్న సొరచెట్టు ఎండిపోయేలా చేయడం ద్వారా యెహోవా ఆయనకు దయాగుణాన్ని గురించి చక్కని పాఠం నేర్పాడు. (యోనా 4:1-8) ఆ చెట్టు ఎండిపోయినప్పుడు యోనాకు కలిగిన దుఃఖాన్ని, తమ “కుడియెడమలు ఎరుగని,” నీనెవె నందున్న 1,20,000 మంది పురుషుల ఎడల ప్రదర్శించడమే మరింత సరైన విషయమై ఉంది.—యోనా 4:11.
యోనా అనుభవం నుండి మనమేమి నేర్చుకోగలం? పవిత్ర సేవ నిరాశావాదానికి తావివ్వదు. మనం యెహోవా నడిపింపును గుర్తించి దాన్ని పూర్తి నమ్మకంతో అనుసరిస్తే, మనం విజయాన్ని సాధిస్తాం.—సామెతలు 3:5, 6.
కష్టాల నడుమ ఆశావాదం
“చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము” అని రాజైన దావీదు ప్రకటించాడు. (కీర్తన 37:1) అది వాస్తవంగానే జ్ఞానవంతమైన సలహా, ఎందుకంటే నేడు అన్యాయం మరియు వంచన మన చుట్టూ వ్యాపించి ఉన్నాయి.—ప్రసంగి 8:11.
అయితే, మనం చెడ్డవారిని చూచి మత్సరపడకపోయినప్పటికీ, అమాయకులైన ప్రజలు దుష్టుల చేతుల్లో బాధలనుభవించడాన్ని మనం చూసినప్పుడు లేక మన ఎడల అన్యాయంగా ప్రవర్తించడం జరిగినప్పుడు విముఖతకు గురికావడం సులభమే. అలాంటి అనుభవాలు మనం నిస్పృహనూ లేక నిరాశావాద దృక్పథాన్నీ వృద్ధి చేసుకునేలా కూడా చేయవచ్చు. మనం అలా భావించినప్పుడు, మనమేమి చేయాలి? మొదట, తమకు శిక్షా దండన ఎన్నడూ రాదని దుష్టులు మనశ్శాంతిగా ఉండలేరనే విషయాన్ని మనం మనస్సులో ఉంచుకోవచ్చు. “వారు [దుష్టులు] గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు. పచ్చని కూరవలెనే వాడిపోవుదురు” అని 2వ వచనంలో కీర్తన 37 మనకు నిశ్చయతనిస్తోంది.
దానికి తోడు, మనం మంచి చేయడంలో కొనసాగి, ఆశావాదంతో ఉండి, యెహోవా కొరకు ఎదురు చూడగలం. “కీడు చేయుట మాని మేలు చేయుము. అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు” అని కీర్తనల గ్రంథకర్త చెబుతున్నాడు.—కీర్తన 37:27, 28.
నిజమైన ఆశావాదం నిలుస్తుంది!
మరి మన భవిష్యత్తు సంగతేమిటి? ‘త్వరలో సంభవింపనైయున్న సంగతులను’ గురించి బైబిలు పుస్తకమైన ప్రకటన గ్రంథం మనకు చెబుతోంది. వాటిలో, యుద్ధాన్ని సూచిస్తున్న ఎఱ్ఱని గుఱ్ఱంపై కూర్చున్న వ్యక్తి “భూలోకములో సమాధానము లేకుండ” చేస్తున్నట్లుగా బయల్పర్చబడ్డాడు.—ప్రకటన 1:1; 6:4.
మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, అదే చివరి పెద్ద యుద్ధం అవుతుందనేది బ్రిటన్‌నందు బాగా ప్రఖ్యాతి గాంచిన మరియు ఆశావాదంతో కూడిన ఉన్న అభిప్రాయం. అయితే 1916లో బ్రిటీష్ రాజనీతిజ్ఞుడైన డేవిడ్ లాయిడ్ జార్జ్ మాత్రం మరింత వాస్తవికంగా ఉన్నాడు. ఆయనిలా అన్నాడు: “రాబోయే యుద్ధం వలెనే, ఈ యుద్ధం కూడా యుద్ధాన్ని అంతమొందించేందుకు జరుగుతున్న యుద్ధం.” (ఇటాలిక్కులు మావి.) ఆయన సరిగ్గానే చెప్పాడు. రెండవ ప్రపంచ యుద్ధం, సామూహిక విధ్వంసానికి వీలుపడే మరింత భీకరమైన యంత్రాలను ఉత్పత్తి చేయడాన్నే అధికం చేసింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత కూడా, యుద్ధం అంతమౌతుందనే సూచనలు అసలు లేవు.
అదే ప్రకటన గ్రంథంలో, కరవును, రోగాన్ని మరియు మరణాన్ని సూచించే—గుఱ్ఱపు స్వారీ చేస్తున్న మరొక వ్యక్తిని గురించి మనం చదువుతాము. (ప్రకటన 6:5-8) అవి కాలముల సూచన యొక్క అదనపు అంశాలు.—మత్తయి 24:3-8.
ఇవి నిరాశావాదాన్ని కలిగించాలా? ఎంత మాత్రం కాదు, ఎందుకంటే “ఒక తెల్లనిగుఱ్ఱము . . . మీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలువెళ్లెను” అని కూడా దర్శనం వివరిస్తుంది. (ప్రకటన 6:2) యేసుక్రీస్తు పరలోక రాజుగా దుష్టత్వాన్ని అంతటినీ తీసివేస్తూ, ప్రపంచ వ్యాప్తంగా శాంతినీ సామరస్యాన్నీ స్థాపించేందుకు స్వారీ చేయడాన్ని మనమిక్కడ చూస్తున్నాము.a
రాజుగా నియుక్తుడైన యేసుక్రీస్తు, తాను భూమిపై ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని గురించి ప్రార్థించడాన్ని తన శిష్యులకు నేర్పించాడు. బహుశ మీకు కూడా “పరలోక ప్రార్థన” లేదా ప్రభువు ప్రార్థన నేర్పించబడి ఉండవచ్చు. అందులో మనం దేవుని రాజ్యం రావాలనీ, ఆయన చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లుగా భూమిమీద కూడా నెరవేరాలనీ ప్రార్థిస్తాం.—మత్తయి 6:9-13.
ప్రస్తుత విధానానికి అతుకులేసి దాన్ని అతికించేందుకు ప్రయత్నించే బదులు, తన మెస్సీయ రాజైన యేసుక్రీస్తు ద్వారా చర్య తీసుకుంటూ యెహోవా దాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తాడు. దాని స్థానంలో, “నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు” అని యెహోవా చెబుతున్నాడు. పరలోక రాజ్య ప్రభుత్వం క్రింద, భూమి మానవజాతి కొరకు శాంతియుతమైన మరియు ఆనందకరమైన గృహంగా మారుతుంది, అక్కడ జీవించడమే కాకుండా పని చేయడం కూడా ఎల్లవేళలా ఆనందదాయకంగా ఉంటుంది. “నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి” అని యెహోవా చెబుతున్నాడు. “నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.” (యెషయా 65:17-22) భవిష్యత్తును గురించిన మీ నిరీక్షణను, విఫలంకాని ఆ వాగ్దానంపై మీరు ఆధారితం చేసుకుంటే, ఇప్పుడూ మరి ఎల్లప్పుడూ ఆశావాదంగా ఉండేందుకు మీకు ప్రతి కారణమూ ఉంటుంది!
[అధస్సూచి]
a ఈ దర్శనం యొక్క వివరమైన చర్చ కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకం యొక్క 16వ అధ్యాయాన్ని దయచేసి చూడండి.
[4వ పేజీలోని చిత్రం]
హెచ్. జి. వెల్స్
[క్రెడిట్ లైను]
Corbis-Bettmann