నా కోపమా లేక నా ఆరోగ్యమా?
ఎవరికి కోపం రాదు? అది మనందరికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంత కోప్పడడం న్యాయమే. కానీ, యథార్థంగా చెప్పాలంటే, చాలాసార్లు మన కోపం (లేక దాని తీవ్రత) మరీ అన్యాయంగా ఉండదా?
బైబిలు మనకిలా చెబుతోంది: “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము.” (కీర్తన 37:8) అటువంటి సలహా ఎంత జ్ఞానయుక్తంగా ఉంది? అది మీ దీర్ఘకాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలదా?
ది న్యూయార్క్ టైమ్స్ దాని “హెల్త్” శీర్షికలో, ఇలా వ్రాసింది:
“తమ కోపాన్ని చాలా తీవ్రంగా, హఠాత్తుగా వ్యక్తపర్చడం లేక ప్రతి చిన్న దానికి కోప్పడి, విసుక్కునే వాళ్లు తమని తాము అసంతోషపర్చుకోవడం కంటే ఎక్కువే చేస్తుండవచ్చు. వాళ్లు తమని తాము చంపుకొంటుండవచ్చు.
“దీర్ఘకాల కోపం శరీరాన్ని ఎంతగా క్షీణింపజేస్తుందంటే, వయస్సుకు ముందే చనిపోవడానికి దారితీసే విపత్తుగా సిగరెట్టు త్రాగడం, లావుకావడం మరియు ఎక్కువ క్రొవ్వు పదార్థాలు గల భోజనం తినడం వంటి వాటికి సరిసమానం అవుతుంది లేక మించి పోతుందికూడా అని తెలియజేసే విలువైన సమాచారాన్ని పరిశోధకులు ఈమధ్యే సేకరించారు.
“‘ప్రతికూలమైన, అనుమానంతో కూడిన కోపం మనకు తెలిసిన ఆరోగ్య ఆపదలతో సమానమని మన పఠనాలు సూచిస్తున్నాయి’ అని డ్యూక్ విశ్వవిద్యాలయంలోని వైద్య కేంద్రంలో ప్రవర్తనా సంబంధ వైద్యంలో పరిశోధకుడైన డా. రెడ్‌ఫర్డ్ విలియమ్స్ చెప్పాడు.”
జీవన గమనంలోని సర్వసాధారణ ఒడుదుడుకులకు అతిగా ప్రతిస్పందించే వారు ఎక్కువగా ఒత్తిడిగల హార్మోనులను ఉత్పత్తి చేస్తారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వారు తరచూ విరుచుకుపడడం, వాళ్లను హృద్రోగాల ప్రమాదానికి గురిచేస్తూ, రక్షణకర మరియు ప్రమాదకర కొలెస్ట్రాల్ రకాల మధ్య సమతుల్యాన్ని పోగొట్టవచ్చు.
‘కానీ నేనెప్పుడూ అంతే’ లేక, ‘నేను అలాగే పెరిగాను’ అని కొందరు అన వచ్చు. ఏమైననూ, దేవుని సలహాను అన్వయించుకోడానికి నిజాయితీగా ప్రయత్నించడం ద్వారా మీరు మారలేరని దాని అర్థం కాదు. మీ స్వంత బైబిలులో, కోపము మరియు మత్సరముల విషయమై సామెతలు 14:29, 30; 22:24, 25; ఎఫెసీయులు 4:26; యాకోబు 1:19, 20లో వ్రాయబడిన ఆయన సలహాను పరిశీలించండి.
ఆ దైవిక జ్ఞానాన్ని అన్వయించడం మీ ఆరోగ్యాన్ని బాగుపరచి, మీ జీవితాన్ని పెంచవచ్చును. టైమ్స్ యిలా వ్రాసింది: “విసుగూ, ప్రతికూల ప్రతిస్పందనలను మార్చుకోవడం ద్వారా కోపిష్టులైన ప్రజలు త్వరగా చనిపోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చని చాలామంది పరిశోధకులు చెప్పారు.”