దేవుని ప్రేరేపిత వాక్యాన్ని యథార్థంగా హత్తుకొనడం
“కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా [“కల్తీచేసి,” NW] బోధింపకయు . . . అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము.”—2 కొరింథీయులు 4:2.
1. (ఎ) మత్తయి 24:14; 28:19, 20 వచనాల్లో చెప్పబడిన పనిని నెరవేర్చేందుకు ఏది అవసరమైంది? (బి) అంత్యదినాలు ఆరంభమైనప్పుడు ప్రజలు మాట్లాడే భాషల్లో ఎంత మేరకు బైబిలు లభ్యమైంది?
రాజరిక సంబంధమైన తన ప్రత్యక్షతా కాలాన్ని గూర్చిన, ఈ పాత విధాన ముగింపును గూర్చిన తన గొప్ప ప్రవచనంలో యేసుక్రీస్తు ఇలా ప్రవచించాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” ఆయన తన అనుచరులకు ఇంకా ఇలా ఉపదేశించాడు: “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి 24:14; 28:19, 20) ఆ ప్రవచనాల నెరవేర్పు బైబిల్ని అనువదించి ముద్రించడంలోనూ, దాని భావాన్ని ప్రజలకు బోధించడంలోనూ, మరి దాన్ని వారి జీవితాల్లో అన్వయించుకునేందుకు సహాయపడడంలోనూ ఎంతో పనిని చేరుస్తాయి. అలాంటి కార్యశీలతలో భాగంవహించడం ఎంత ఆధిక్యతో కదా! 1914 నాటికి అప్పటికే బైబిలు లేక దానిలోని కొన్ని భాగాలు 570 భాషల్లో ముద్రించబడ్డాయి. అయితే అప్పటినుండీ వందలాది అనేక భాషలూ, మాండలికాలూ చేర్చబడ్డాయి, అలాగే అనేక భాషల్లో ఒకటికన్నా ఎక్కువ అనువాదాలు అందుబాటులోకి వచ్చాయి.a
2. బైబిలు అనువాదకుల, ప్రచురణకర్తల పనిని ఏ వివిధ దృక్పథాలు ప్రభావితం చేశాయి?
2 ఓ భాషలోవున్న విషయాన్ని మరో భాషను చదివే, వినే వారికి అర్థమయ్యేలా దాన్ని అనువదించడం ఏ అనువాదకునికైనా ఓ పెద్దసవాలే. తాము అనువదిస్తున్నది దేవుని వాక్యమని బాగా ఎరిగినవారై కొంతమంది అనువాదకులు తమ పనిని చేశారు. ఆ ప్రణాళిక పాండిత్య విషయక సమస్య కారణంగా ఇతరులు ఆకర్షించబడ్డారు. వాళ్లు బహుశా కేవలం ఓ అమూల్య సాంస్కృతిక వారసత్వంగా బైబిల్లోని విషయాల్ని దృష్టించి ఉండొచ్చు. కొంతమందికైతే, మతమే వాళ్ల వ్యాపారం. అనువాదకునిగానో లేక ప్రచురణకర్తగానో తమ పేరిట ఓ గ్రంథాన్ని ముద్రించడమనేది వారి బ్రతుకుతెరువులో ఓ భాగమైంది. తమ అనువాదపు పనిని వాళ్లెలా చేయాలనే దాన్ని వాళ్ల దృక్పథాలు స్పష్టంగా ప్రభావితం చేస్తాయి.
3. నూతనలోక అనువాద కమిటీ దాని అనువాదపు పనిని ఎలా దృష్టించింది?
3 నూతనలోక బైబిలు అనువాద కమిటీ చేసిన ఈ వ్యాఖ్యానం గమనార్హమైంది: “పరిశుద్ధ లేఖనాల్ని అనువదించడం అంటే యెహోవా దేవుని ఆలోచనల్నీ, మాటల్నీ మరో భాషలోనికి అనువదించడమే . . . అది ఎంతో గంభీరమైన ఆలోచన. పరిశుద్ధ లేఖనాల దైవిక గ్రంథకర్తకు భయపడే, ఆయన్ని ప్రేమించే, సాధ్యమైనంత కచ్చితంగా ఆయన ఆలోచనా ప్రకటనలను ప్రసరింపచేసేందుకు ఓ ప్రత్యేకమైన బాధ్యతతో ఆయన ఎడల అవ్యక్తానుభూతి కలిగివుండే వారే ఈ గ్రంథానువాదకులు. తమ నిత్యరక్షణ కోసం సర్వోన్నత దేవుని ప్రేరేపిత వాక్య అనువాదంపై ఆధారపడ్డ పరిశోధాత్మక పాఠకుల ఎడల కూడా వారు బాధ్యతకల్గివున్నట్టు భావిస్తారు. అంకితభావంగల పురుషులతో కూడిన ఈ కమిటీ అనేక సంవత్సరాల కాలంలో అలాంటి గంభీరమైన బాధ్యతా భావంతో పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదమును (ఆంగ్లం) తయారు చేశారు.” కచ్చితమైన జ్ఞానంలో ఎడతెగని పురోభివృద్ధి కొరకు ఓ పునాదిని వేసే స్పష్టంగానూ, అర్థవంతంగానూ, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలకు అతి సన్నిహితంగానూ ఉండే బైబిలు అనువాదాన్ని కల్గివుండడమే ఈ కమిటీ లక్ష్యం.
దేవుని నామానికి ఏమి సంభవించింది?
4. బైబిల్లోని దేవుని నామము ఎంత ప్రాముఖ్యం?
4 బైబిలు ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి, సత్యదేవున్ని గురించి తెల్సుకునేందుకు ప్రజలకు సహాయపడడం. (నిర్గమకాండము 20:2-7; 34:1-7; యెషయా 52:6) తన తండ్రి నామం ‘పరిశుద్ధపర్చబడాలనీ’ పునీతంగా ఉంచబడాలనీ లేక పవిత్రంగా చూడబడాలనీ ప్రార్థించమని తన అనుచరులకు యేసుక్రీస్తు బోధించాడు. (మత్తయి 6:9) బైబిల్లో 7,000 కన్నా ఎక్కువసార్లు తన స్వకీయ నామాన్ని దేవుడు చేర్చాడు. ఆ నామాన్నీ, దాన్ని ధరించినవాని లక్షణాల్నీ ప్రజలు తెల్సుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.—మలాకీ 1:11.
5. వివిధ అనువాదకులు దైవికనామాన్ని ఎలా అనువదించారు?
5 అనేకమంది బైబిలు అనువాదకులు ఆ దైవిక నామం ఎడల యథార్ధమైన గౌరవాన్ని చూపించారు, తమ అనువాదపనిలో దాన్ని సంగతంగా ఉపయోగించారు. కొంతమంది అనువాదకులు యహ్వహ్పై మక్కువ చూపారు. హెబ్రీ మూలపాఠంలో ఉన్న రూపంతో స్పష్టంగా గుర్తించబడినప్పటికీ, తమ స్వంత భాషలోనికి చేర్చబడ్డ దైవిక నామం యొక్క ఓ ఉచ్ఛారణా విధానాన్ని, బహుశా ఎంతో కాలంనుండి ఉపయోగించడం ద్వారా సుపరిచితమైన ఓ ఉచ్ఛారణా విధానాన్ని ఇతరులు ఎంచుకున్నారు. పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదము (ఆంగ్లం) దాని ప్రధాన గ్రంథపాఠంలో 7,210 సార్లు జెహోవా అని ఉపయోగించింది.
6. (ఎ) ఇటీవల సంవత్సరాల్లో, దైవికనామానికి సంబంధించిన లేఖనాలతో అనువాదకులు ఏమి చేశారు? (బి) ఇదెంత విస్తృతంగావుంది?
6 ఇటీవల సంవత్సరాల్లో, బయలు, మోలెకు వంటి అన్య దేవుళ్ల పేర్లను బైబిలు అనువాదకులు ఉంచినా, సత్యదేవుని ప్రేరేపిత వాక్యం యొక్క అనువాదాల నుండి తన స్వకీయ నామాన్ని ఉద్ధృతస్థాయిలో వాళ్లు తొలగిస్తున్నారు. (నిర్గమకాండము 3:15; యిర్మీయా 32:35) మత్తయి 6:9, యోహాను 17:6, 26 వంటి ప్రకరణాల్లో, “నీ నామము” (అంటే, దేవుని నామము) కొరకు ఉపయోగించబడిన గ్రీకు పదబంధాన్ని, ఆ వచనాల్లో నామమును గూర్చిన ప్రస్తావనలేనే లేదన్నంత తేలికగా “నీవు” అని, విస్తృతంగా పంచిపెట్టబడిన అల్బేనియన్ భాషాంతరం అనువదించింది. ది న్యూ ఇంగ్లీష్ బైబిల్, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్లు కీర్తన 83:18లో దేవుని వ్యక్తిగత నామాన్నీ, దేవుడు ఓ నామాన్ని కల్గివున్నాడనే వాస్తవానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ తొలగించాయి. అనేక భాషల్లో హెబ్రీ లేఖనాల పాత అనువాదాల్లో దైవిక నామం కన్పించినా, కొత్త అనువాదాలు తరచూ దాన్ని తొలగిస్తాయి లేక మార్జినల్ వ్యాఖ్యానాల్లోనికి దాన్ని నెట్టివేస్తాయి. ఆంగ్లభాషలోనూ, అలాగే యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండియా మరితర పసిఫిక్ ద్వీపాలకు చెందిన అనేక భాషల్లోనూ విషయమిదే.
7. (ఎ) కొన్ని ఆఫ్రికా భాషా బైబిళ్ల అనువాదకులు దైవిక నామంతో ఎలా వ్యవహరిస్తున్నారు? (బి) దాన్ని గురించి మీరెలా భావిస్తారు?
7 కొన్ని ఆఫ్రికా భాషల్లోనికి అనువదించిన బైబిలు అనువాదకులు మరో అడుగు ముందుకు వేశారు. దేవుడు లేక ప్రభువు వంటి లేఖనాధారిత బిరుదుతో దైవికనామాన్ని మాత్రమే మార్చడానికి బదులుగా, వారు స్థానిక మత నమ్మకాల నుండి గైకొన్న పేర్లను చేరుస్తున్నారు. ది న్యూ టెస్ట్‌మెంట్ అండ్ సామ్స్ ఇన్ జులు (1986 భాషాంతరం)లో దేవుడు (ఉన్కులున్కులు) అనే బిరుదు, ‘మానవ పూర్వికుల ద్వారా ఆరాధించబడ్డ మహా పూర్వికున్ని’ సూచిస్తుందని జులు ప్రజలు అర్థంచేసుకునే (ఉమ్వెలిన్గాన్గి) ఓ వ్యక్తిగత నామంతో పరస్పరంమార్పిడి చేసి ఉపయోగించబడింది. బూకూ లొయెరా అని పిలువబడిన చెచవా బైబిలును సిద్ధపర్చడంలో అనువాదకులు యెహోవా స్థానే ఓ వ్యక్తిగత నామంగా చౌటా ఉపయోగిస్తున్నారని అక్టోబరు 1992 నాటి ది బైబిల్ ట్రాన్స్‌లేటర్ అనే పత్రికలోని ఓ శీర్షిక నివేదించింది. చౌటా అనేది “వాళ్లెప్పుడూ ఎరిగిన, ఆరాధించిన దేవుడు” అని ఆ శీర్షిక వివరించింది. కానీ, ఈ ప్రజల్లో అనేకమంది తాము మరణించినవారి ఆత్మలని వేటిని విశ్వసిస్తారో వాటిని కూడా ఆరాధిస్తారు. ప్రజలు “సర్వోన్నతునికి” విజ్ఞాపనలుచేస్తూ పిదప ఆ “సర్వోన్నతునికే” ఏదొక వ్యక్తిగత నామాన్ని వారు ఉపయోగించినట్లైతే అది, తమ ఆరాధనలో ఏమి చేరివున్నప్పటికీ యెహోవా వ్యక్తిగత నామానికి తగ్గ పర్యాయపదం అవుతుందనే విషయం నిజమేనా? కచ్చితంగా కానేకాదు! (యెషయా 42:8; 1 కొరింథీయులు 10:20) తమ పారంపర్య నమ్మకాలు వాస్తవికంగా సరియైనవని ప్రజలు భావించేలా చేసే ఏదొక నామంతో దేవుని వ్యక్తిగత నామాన్ని మార్చడం, సత్యదేవునికి చేరువయ్యేలా వారికి సహాయపడదు.
8. తన నామం తెలియబడాలనే దేవుని సంకల్పం ఎందుకు నిష్ఫలంకాలేదు?
8 ఇదంతా, ఆయన నామం తెలియబడాలనే యెహోవా సంకల్పాన్ని మార్చలేకపోయింది లేదా నిష్పలం చేయలేకపోయింది. యూరోపియన్, ఆఫ్రికా, అమెరికా ఖండాల, తూర్పు దేశాల, సముద్ర ద్వీపాల భాషల్లో, దైవిక నామాన్ని కల్గివున్న అనేక బైబిళ్లు ఇంకా వ్యాప్తిలో ఉన్నాయి. సత్యదేవుని నామాన్ని గురించీ, సంకల్పాన్ని గురించీ ఇతరులకు చెప్పేందుకు సంవత్సరానికి 100 కోట్లకన్నా ఎక్కువ గంటల్ని సామూహికంగా వెచ్చిస్తున్న 54,00,000 కన్నా ఎక్కువ మంది యెహోవాసాక్షులు 233 దేశాల్లోనూ, ప్రాంతాల్లోనూ ఉన్నారు. ఆంగ్లం, చైనీస్, రష్యన్, స్పానిష్, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్ భాషలతోపాటూ భూమ్మీది జనాభాలో దాదాపు 360 కోట్లమంది మాట్లాడే భాషల్లో దైవిక నామాన్ని ఉపయోగిస్తున్న బైబిళ్లను వారు ముద్రించి, పంచిపెడుతున్నారు. భూ జనాభాలో అత్యధిక శాతం మందికి తెలిసిన భాషల్లో వాళ్లు బైబిలు అధ్యయనానికి తోడ్పడే సహాయకాల్ని కూడా ముద్రిస్తున్నారు. ‘ఆయనే యెహోవాయై ఉన్నాడని జనులు తెలిసికొనేలా’ తన ప్రకటనను నిస్సంశయంగా నెరవేర్చేవిధంగా త్వరలో దేవుడు తానే చర్యతీసుకుంటాడు.—యెహెజ్కేలు 38:23.
వ్యక్తిగత నమ్మకాలు అనువాదాన్ని ప్రభావితం చేసినప్పుడు
9. దేవుని వాక్యంతో వ్యవహరిచే వారిపై ఉన్న గంభీరమైన బాధ్యతను బైబిలు ఎలా సూచిస్తుంది?
9 దేవుని వాక్యాన్ని అనువదించే వారిపైనా అలాగే దాన్ని బోధించే వారిపైనా ఓ గంభీరమైన బాధ్యత ఉంది. తన పరిచర్యను గురించీ, తన సహవాసుల పరిచర్యను గురించీ అపొస్తలుడైన పౌలు ఇలా తెలియజేశాడు: “కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా [“కల్తీచేసి,” NW] బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము.” (2 కొరింథీయులు 4:2) కల్తీ చేయడం అంటే దానికి చెందనిదాన్నో లేక హీనమైన దాన్నో కలపడం ద్వారా మార్పులకు గురిచేయడం అని అర్థం. అపొస్తలుడైన పౌలు, యిర్మీయా కాలంలో దేవుడు తెలియజేసిన దానికి బదులు తమ స్వంత అభిప్రాయాల్ని ప్రకటించినందున యెహోవాచే గద్దించబడిన అవిశ్వాసులైన ఇశ్రాయేలు కాపరుల వంటివాడు కాడు. (యిర్మీయా 23:16, 22) అయితే ఆధునిక కాలాల్లో ఏమి జరిగింది?
10. (ఎ)ఆధునిక కాలంలో కొంతమంది అనువాదకులను దేవుని ఎడల యథార్థంగా ఉండడంగాక ఇతర దృక్పథాలు ఎలా ప్రభావితం చేశాయి? (బి) వాళ్లు ఏ పాత్రను అయుక్తంగా తమపై వేసుకున్నారు?
10 రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, యూదులకు అనుకూలంగావున్న ఉల్లేఖనాలన్నింటినీ, యేసుక్రీస్తు యొక్క యూదా వంశావళికి సంబంధించిన జాడలన్నిటినీ తొలగించిన ఓ “క్రొత్త నిబంధన”ను తయారుచేసేందుకు కొంతమంది మతగురువులూ పాస్టర్లతోకూడిన కమిటీ జర్మనీలోని నాజీ ప్రభుత్వంతో చేతులుకలిపింది. ఇటీవలనే, న్యూ టెస్ట్‌మెంట్ అండ్ సామ్స్: ఏన్ ఇన్‌క్లూసివ్ వర్షన్‌ను అనువదించిన అనువాదకులు యేసు మరణానికి సంబంధించి యూదులను బాధ్యులుగా చేసే జాడలన్నిటినీ తొలగించేందుకు ప్రయత్నిస్తూ, భిన్నమైన దిశవైపు మ్రొగ్గు చూపించారు. దేవున్ని తండ్రియనిగాక మాతా-పితా అని పిలిచినట్లైతే, యేసును గురించి దేవుని కుమారుడని గాక ఆయన బిడ్డ అని చెబితే స్త్రీవాద పాఠకులు సంతోషిస్తారని కూడా ఆ అనువాదకులు భావించారు. (మత్తయి 11:27) వారు ఆ స్త్రీవాదంలోనే నిమగ్నులై, భార్యలు భర్తలకు లోబడాలనే, పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలనే సూత్రాన్ని తొలగించారు. (కొలొస్సయులు 3:18, 20) ఆ అనువాదాల్ని అనువదించిన వాళ్లు, ‘దేవుని వాక్యాన్ని కల్తీ’ చేయకూడదనే అపొస్తలుడైన పౌలు నిర్ణయంలో పాలివారు కాదనే విషయం సుస్పష్టం. గ్రంథకర్త స్థానాన్ని తీసుకోవడం ద్వారా అనువాదకుని పాత్రనే వాళ్లు మర్చిపోయి, తమ స్వంత అభిప్రాయాల్ని ప్రచారం చేయడానికొక మాధ్యమంగా బైబిలుకున్న ఖ్యాతిని ఉపయోగించుకొన్న పుస్తకాల్ని ఉత్పన్నంచేస్తున్నారు.
11. ప్రాణము, మరణము గురించి బైబిలు చెబుతున్న దానితో క్రైస్తవమత సామ్రాజ్య బోధలు ఎలా విరుద్ధంగా ఉన్నాయి?
11 క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు సాధారణంగా ప్రాణము అని అనువదించబడ్డ ఆదిమ భాషా పదాలను, మరణమందు శరీరాన్ని విడిచిపెట్టే ఏదొక భాగమైన ఆత్మను సూచిస్తూ అది అమర్త్యమైనదని బోధిస్తాయి. దానికి భిన్నంగా, మానవులు ప్రాణములనీ, జంతువులు ప్రాణములనీ, మరి ఆ ప్రాణము మరణిస్తుందనీ అనేక భాషల్లోని బైబిలు యొక్క పాత అనువాదాలు స్పష్టంగా తెలియజేశాయి. (ఆదికాండము 12:5; 36:6; సంఖ్యాకాండము 31:28; యాకోబు 5:20) అది మతగురువుల్ని కలవరపర్చింది.
12. బైబిలు ప్రాథమిక సత్యాల్ని ఇటీవలి భాషాంతరాలు కొన్ని ఏ విధంగా అస్పష్టం చేశాయి?
12 ఇప్పుడు కొన్ని క్రొత్త భాషాంతరాలు ఆ సత్యాల్ని అస్పష్టం చేశాయి. ఎలా? కొన్ని వచనాల్లో హెబ్రీ నామవాచకమైన నెఫెష్ను (ప్రాణము) వాళ్లు సూటిగా అనువదించడాన్ని పరిహరించారు. ఆదికాండము 2:7లో, వాళ్లు మొదటి మనుష్యుడు (“జీవించు ప్రాణము ఆయెను” అనడానికి బదులుగా) “జీవించనారంభించెను” అని చెప్పవచ్చు. లేదా జంతు జీవానికి సంబంధించి వాళ్లు “ప్రాణము” అని సూచించడానికి బదులు “ప్రాణి” అని సూచించవచ్చు. (ఆదికాండము 1:21) యెహెజ్కేలు 18:4, 20 వంటి వచనాల్లో మరణమునొందుతున్న (“ప్రాణము” అని చెప్పడానికి బదులు) ఒక “మనిషి” అనీ లేదా “వ్యక్తి” అనీ వాళ్లు సూచిస్తారు. బహుశా అలాంటి అనువాదాలు అనువాదకునికి సమర్థనీయమైనవై ఉండొచ్చు. కానీ క్రైస్తవమత సామ్రాజ్యపు లేఖనవిరుద్ధ బోధల ద్వారా ఎవరి ఆలోచనాసరళి అప్పటికే మార్పుచేయబడిందో ఆ యథార్థవంతులైన సత్యాన్వేషకులకు వాళ్లెంత మేరకు సహాయం చేసినవారౌతారు?b
13. భూమిని గురించిన దైవిక సంకల్పాన్ని దేనిద్వారా కొన్ని బైబిలు భాషాంతరాలు మరుగుపర్చాయి?
13 మంచి వారందరూ పరలోకానికి వెళతారనే తమ నమ్మకాన్ని బలపర్చే ప్రయత్నంలో, అనువాదకులు—లేక వారి పనిని పునఃపరిశీలనచేసే క్రైస్తవ మత పండితులు—భూమి ఎడల దేవుని సంకల్పాన్ని గురించి బైబిలు చెబుతున్న దాన్ని మరుగుచేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. కీర్తన 37:11లో, దీనులు “దేశమును” స్వతంత్రించుకుంటారని అనేక భాషాంతరాలు చదువబడతాయి. హెబ్రీ గ్రంథపాఠంలో ఉపయోగించబడిన (ఎరెట్స్) పదానికి సాధ్యమైన అనువాదం “దేశము.” అయితే, (అనేక ఇతర భాషల అనువాదాలకు ఓ ఆధారంగా ఉన్న) టుడేస్ ఇంగ్లీష్ వర్షన్ దాని అనువాదంలో తీవ్రమైన మార్పుల్ని చేస్తుంది. జి అనే గ్రీకు పదాన్ని “భూమి” అని మత్తయి సువార్తలో 17 సార్లు ఈ భాషాంతరం అనువదించినప్పటికీ, మత్తయి 5:5వ వచనంలో అది “భూమి” అనే పదాన్ని “దేవుడు వాగ్దానం చేసిన దాన్ని” అనే పదబంధానికి మార్చింది. చర్చి సభ్యులు సహజంగానే పరలోకం గురించేనని ఆలోచిస్తారు. సాత్వికులు, దీనులు, లేక వినయవంతులు “భూమిని స్వతంత్రించు”కుంటారు అని యేసు తాను కొండమీద చేసిన ప్రసంగంలో చెప్పిన విషయం వాళ్లకి యథార్థంగా తెలియజేయబడలేదు.
14. కొన్ని బైబిలు భాషాంతరాల్లో ఏ స్వార్థపూరిత దృక్పథం స్పష్టమైంది?
14 మంచి జీతాలు పొందేలా ప్రచారకులకు సహాయపడాలనే ఉద్దేశంతోనే లేఖనాల కొన్ని అనువాదాలు వారికనువైన ప్రస్ఫుటమైన పదజాలాన్ని ఉపయోగించాయి. “పనివాడు తన జీతమునకు పాత్రుడు” అని బైబిలు చెప్పడం వాస్తవమే. (1 తిమోతి 5:18) అయితే బాగుగా పాలనచేయు పెద్దలను “రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను” అని 1 తిమోతి 5:17లో చెబుతుండగా, అక్కడ ప్రస్తావించ అర్హమైందిగా వాళ్లలో కొందరు దృష్టించే ఏకైక సన్మానం డబ్బే. (1 పేతురు 5:2 పోల్చండి.) ఆ విధంగా, ఈ పెద్దలను “రెట్టింపు స్టైపెండ్ పాత్రులనుగా ఎంచాలి” అని ది న్యూ ఇంగ్లీష్ బైబిల్ చెబుతోంది, అలాగే వాళ్లు “రెండింతలు చెల్లింపబడడానికి అర్హులు” అని కంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్ చెబుతోంది.
దేవుని వాక్యాన్ని యథార్థంగా హత్తుకొనడం
15. ఏ బైబిలు అనువాదాన్ని ఉపయోగించవచ్చో మనమెలా నిర్థారించగలం?
15 బైబిల్ని చదివే వ్యక్తికీ, ఇతరులకు బోధించడానికి బైబిల్ని ఉపయోగించేవారికీ దీనంతటి భావమేమిటి? ఎంపిక చేసుకునేలా, విస్తృతంగా ఉపయోగమందున్న అనేక భాషల్లో ఒకటికన్నా ఎక్కువే బైబిలు అనువాదాలున్నాయి. మీరు ఉపయోగించే బైబిల్ భాషాంతరాన్ని ఎంపికచేసుకోవడంలో వివేచనను చూపించండి. (సామెతలు 19:8) ఏ మిషతోనైనా ఆయన ప్రేరేపిత వాక్యంనుండి ఆయన నామాన్ని తొలగిస్తూ దేవుని గుర్తింపు విషయంలో గనుక ఓ అనువాదం యథార్థమైనది కాకపోతే, బైబిలు మూల పాఠంలోని ఇతర భాగాలను కూడా అనువాదకులు మార్చకుండా ఉంటారా? ఓ అనువాదపు విలువను గురించి సందేహం ఉన్నప్పుడు, దాన్ని పాత అనువాదాలతో పోల్చిచూడడానికి ప్రయత్నించండి. మీరు దేవుని వాక్య బోధకులైతే, ఆదిమ హెబ్రీ గ్రీకు గ్రంథపాఠాల్లో ఉన్నదాన్ని సన్నిహితంగా అంటిపెట్టుకున్న భాషాంతరాలపై మక్కువ కల్గివుండండి.
16. దేవుని ప్రేరేపిత వాక్యాన్ని ఉపయోగించడంలో మనం వ్యక్తిగతంగా యథార్థతను ఎలా చూపించగలం?
16 వ్యక్తిగతంగా మనమంతా దేవుని వాక్యం ఎడల యథార్థంగా ఉండాలి. సాధ్యమైతే బైబిల్ని అనుదినమూ చదవడానికి కొంత సమయాన్ని వెచ్చించేలా దానిలో ఉన్నదాన్ని గురించి తగినంత శ్రద్ధ తీసుకోడం ద్వారా మనమలా చేయగలం. (కీర్తన 1:1-3) మంచి నిర్ణయాల్ని తీసుకోడానికి ఆధారంగా దాని సూత్రాల్నీ, మాదిరుల్నీ ఉపయోగించడం నేర్చుకుంటూ, అది చెబుతున్న వాటిని మన స్వంత జీవితాల్లో పూర్తిగా అన్వయించుకోవడం ద్వారా మనం దాన్ని చేయగలం. (రోమీయులు 12:2; హెబ్రీయులు 5:14) ఇతరులకు దాన్ని ఆసక్తిదాయకంగా ప్రకటించడం ద్వారా మనం దేవుని వాక్య యథార్థ ప్రచారకులమని చూపించుకుంటాం. అది చెబుతున్న వాటిని మన అభిప్రాయాలకు సరిపడేలా ఎన్నడూ వక్రీకరించకుండా లేక సాగదీయకుండా, బైబిల్ని జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉండడం ద్వారా బోధకులుగా మనమలా చేస్తాం. (2 తిమోతి 2:15) దేవుడు ప్రవచించినవన్నీ తప్పక నెరవేరుతాయి. తన వాక్యాన్ని నెరవేర్చడంలో ఆయన యథార్థవంతుడు. దాన్ని హత్తుకోవడంలో మనమూ యథార్థవంతులముగా ఉందాం.
[అధస్సూచీలు]
a 1997 నాటికి 2,167 భాషల్లో బైబిలు పూర్తిగాగానీ లేక పాక్షికంగాగానీ ప్రచురించబడిందని యునైటెడ్ బైబిల్ సొసైటీలు తెలియజేశాయి. ఈ సంఖ్యలో కొన్ని భాషలకు సంబంధించిన అనేక మాండలికాలు చేరివున్నాయి.
b ప్రాణము, ఆత్మలను గూర్చిన ఆ వివాదాన్ని స్పష్టంచేయగల్గే సామర్థ్యాన్ని కల్గివున్నా అలా చేయడానికి అనువాదకులు ఎంపిక చేసుకొనని భాషలపై ఈ చర్చ దృష్టి నిల్పుతుంది. లభ్యమవుతున్న శబ్దావళి, కొన్ని భాషల్లో అనువాదకులు చేయగల్గేదాన్ని పరిమితం చేస్తుంది. అయితే, ఆదిమ భాషా పదమైన నెఫెష్కు అనువాదకుడు విభిన్నమైన పదాల్నో లేదా అతడు లేఖనరహిత భావమున్న ఓ పదాన్నో ఉపయోగించినప్పటికీ, నెఫెష్ మానవులకూ జంతువులకూ అన్వయించబడుతుందనీ అలాగే ఊపిరిపీల్చగల్గే, తినగల్గే, మరణించే వాటికి ప్రాతినిధ్యం వహిస్తుందనీ యథార్థమైన మత ఉపదేశకులు వివరిస్తారు.
మీకు జ్ఞాపకం ఉన్నాయా?
◻ ఆధునిక కాలాల్లోని బైబిలు అనువాదకుల పనిని ఏ దృక్పథాలు ప్రభావితం చేశాయి?
◻ ఆధునిక అనువాదపు ఒరవళ్లు, ఆయన స్వంత నామానికి సంబంధించిన దేవుని సంకల్పాన్ని ఎందుకు నిష్పలం చేయలేకపోయాయి?
◻ ప్రాణమును గూర్చిన, మరణమును గూర్చిన, భూమిని గూర్చిన బైబిలు సత్యాల్ని కొన్ని బైబిలు అనువాదాలు ఎలా అస్పష్టం చేశాయి?
◻ మనం దేవుని వాక్యాన్ని యథార్థంగా హత్తుకొని ఉన్నామని ఏయే మార్గాల్లో మనం చూపించగలం?
[16వ పేజీలోని చిత్రం]
ఏ బైబిలు అనువాదాన్ని మనం ఉపయోగించాలి?