న్యాయము దేవుని మార్గములన్నింటిని గుర్తించుచున్నది
“ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దొషియై నమ్ముకొనదగిన దేవుడు; ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.”—ద్వితీయోపదేశకాండము 32:4.
1. మరణించుటకు ముందు తన కీర్తనలో మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా ఏ లక్షణములను నొక్కితెలియపరచెను, మరియు ఆయన ఆ విధముగా మాట్లాడుటకు ఎందుకు అర్హుడైయుండెను?
యెహోవా, సర్వోన్నత న్యాయాధిపతి, శాసనకర్త, రాజు, మరియు “ఆయన నీతిని, న్యాయమును ప్రేమించుచున్నా.” (కీర్తన 33:5; యెషయా 33:22) ధర్మశాస్త్రమునకు మధ్యవర్తి, ప్రవక్త, మరియు “యెహోవా ముఖాముఖిగా ఎరిగియున్న” మోషే, యెహోవాయొక్క న్యాయ చర్యలన్నింటిని బహుగా ఎరిగియుండెను. (ద్వితీయోపదేశకాండము 34:10; యోహాను 1:12) మరణించుటకు కొద్దికాలము ముందు మోషే, యెహోవా సర్వాతిశయమైన న్యాయలక్షణమును నొక్కితెలియపరచెను. ఇశ్రాయేలీయుల సర్వసమాజముయొక్క వినికిడిలో కీర్తనలోని ఈ మాటలను ఆయన పలికెను: “ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును, భూమండలమా, నానోటిమాట వినుము. . .నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహాత్యమును కొనియాడుడి! ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దొషియై నమ్ముకొనదగిన దేవుడు; ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.”—ద్వితీయోపదేశకాండము 32:1, 3, 4.
2. దేవుని కార్యములన్నింటిలో న్యాయము అన్ని సమయములలో ఎట్లు గుర్తింపదగినదై యుండెను, మరియు యిది ఎందుకు ప్రాముఖ్యమైయున్నది?
2 యెహోవా కార్యములన్నింటిలో న్యాయము గుర్తింపదగినదై యున్నది, మరియు అన్ని సమయములలో అది ఆయన జ్ఞానము, ప్రేమ, శక్తులతో సంపూర్ణ పొందికగా సమతూకమందు అమలుచేయబడినది. యోబు 37:23 నందు దేవుని సేవకుడగు ఎలీహు యోబుకు యిలా గుర్తుచేసెను: “సర్వశక్తుడగు దేవుడు, మహాత్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరుపడు.” మరియు రాజైన దావీదు యిలా వ్రాసెను: “యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు.” (కీర్తన 37:28) ఎంత ఆదరమైన అభయము! దేవుని మార్గములన్నింటిలో ఒక క్షణకాలమైనను ఆయన తన భక్తులను ఎన్నటికిని విడువడు. దేవుని న్యాయము దీనికి హామినిచ్చుచున్నది!
న్యాయమెందుకు కొరతగా యున్నది
3. ఈనాడు మానవులమధ్య ఏది కొరతగా ఉన్నది, మరియు యిది దేవునితో మానవుని సంబంధమును ఎట్లు ప్రభావపరచినది?
3 యెహోవా న్యాయమునకు దేవుడును, న్యాయమును ప్రేమించువాడును, “భూదిగంతములను సృజించినవాడునై” యుండగా, ఈనాడు మానవులమధ్య న్యాయకొరత యింతగా ఎందుకున్నది? (యెషయా 40:28) దానికి ద్వితీయోపదేశకాండము 32:5లో మోషే యిలా జవాబిచ్చుచున్నాడు: “వారు తమ్మును చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు, మూర్ఖతగల వక్రవంశము.” మానవుని నాశనకర కార్యము అతని సృష్టికర్తనుండి ఎంతగా వేరుపరచినదంటే, దేవుని తలంపులు మానవుల తలంపులకంటే, అనగా “ఆకాశములు భూమికి ఎంత యెత్తుగా ఉన్నవో” అంతకంటె అవి ఎంతో ఉన్నతముగా వర్ణింపబడినవి.—యెషయా 55:8, 9.
4. మానవుడు ఏ విధానమును అవలంభించెను, మరియు యిది అతనిని ఎక్కడికి నడిపినది?
4 తన సృష్టికర్తనుండి వేరుగా స్వతంత్రముగా ప్రవర్తించుటకు మానవుడు రూపింపబడలేదను సంగతిని ఎన్నటికిని మరచిపోకుము. “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును” అని అంటూ యిర్మీయా పరిస్థితిని సరిగా చెప్పెను. (యిర్మీయా 10:23) దేవుని న్యాయ మార్గములను, పరిపాలనను మానవుడు త్యజించుట అతనిని పూర్తిగా భిన్నమైన మరియు అతి శక్తివంతమైన అదృశ్యశక్తులు, అనగా అపవాదియగు సాతాను అతని అనుచరులగు దయ్యముల ప్రభావము క్రిందికి తెచ్చెను. అపొస్తలుడగు యోహాను స్థిరముగా యిట్లు చెప్పుచున్నాడు: “లోకమంతయు దుష్టునియందున్నది.” మానవుల మధ్య న్యాయమును పైకెత్తి పట్టుకొనుటకు ఈ దయ్యముల సమూహములకు ఎంతమాత్రము శ్రద్ధలేదు.—1 యోహాను 5:19.
5. ఈనాటి లోకములోని న్యాయకొరతనుగూర్చిన ఉదాహరణలనిమ్ము.
5 అమెరికా న్యాయశాఖాధికారియైన విలియం ఫ్రెంచ్ స్మిత్ 1984లో ఈ విధానాంత ముగింపు దినములలోని న్యాయకొరతనుగూర్చిన ఒక ఉదాహరణమును నొక్కితెలిపెను. అమెరికాలోని 12 రాష్ట్రములలో 1977, 1983 మధ్య విధింపబడిన జైలుశిక్షలనుగూర్చిన సర్వేమీద వ్యాఖ్యానించుచు స్మిత్ చెప్పినదేమనగా: “ఘోర నేరస్థులు—హంతకులు, రేపిస్టులు, మాదకద్రవ్య వ్యాపారులు—మాత్రమే చెప్పుకోదగినంతగా శిక్షింపబడుచున్నారని ప్రజలు ఆరోపించుచున్నారు. వందలాదిమంది యితర నేరస్థులు క్రొత్తనేరములు చేయుటకు మరలా వీధులలో ప్రవేశించుట ఎంత సులభముగా ఉన్నదో ప్రభుత్వశాఖ అధ్యయనము. . .చూపించుచున్నది.” “న్యాయ విధానము బహు తరచుగా సడలిపోవుచున్నది” అని వాషింగ్టన్ లీగల్ ఫౌండేషన్‌కు చెందిన పాల్ కెమెనార్ అనుటలో ఆశ్చర్యము లేదు.
6. (ఎ) చెరకొనిపోబడుటకు ముందు యూదా నైతిక పరిస్థితి ఏమైయుండెను? (బి) హబక్కూకు ఎలాంటి ప్రశ్నలను అడిగెను, అవి మరి ఈనాడును అన్వయించునా?
6 సా.శ.పూ. 607లో బబులోను సైనికుల చేతిలో పడుటకు ముందు యూదా జనాంగమంతటియందు న్యాయము ఎంతగానో సడలియుండెను. అందునుబట్టి, దైవప్రేరణతో దేవుని ప్రవక్తయైన హబక్కూకు యిలా ప్రకటించెను: “ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులువచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.” (హబక్కూకు 1:4) ఈ అన్యాయ పరిస్థితి, ప్రవక్త యెహోవాను యిట్లు ప్రశ్నించుటకు కారణమాయెను: “కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?” (హబక్కూకు 1:13) ఈనాడును, మానవకార్యమంతటిలో పేరుకుపోయిన అన్యాయముద్వారా ప్రభావితులైన ప్రజలు సహితము యిట్లు ప్రశ్నించవచ్చును: భూమిమీద జరుగుచున్న అన్యాయమును న్యాయమునకు దేవుడైనవాడు ఎందుకు అలాచూస్తునేవున్నాడు? ఆయనెందుకు ‘న్యాయమును చెడిపోనిచ్చుచున్నాడు’? ఆయనెందుకు “ఊరకున్నాడు”? ఇవి ప్రాముఖ్యమైన ప్రశ్నలైయున్నవి, కాగా దేవుని ప్రశస్తమైన వాక్యమగు బైబిలు మాత్రమే వీటికి నిజమైన మరియు సంతృప్తికరమైన జవాబులనిచ్చుచున్నది.
అన్యాయమును దేవుడెందుకు అనుమతించెను
7. (ఎ) దేవుడు తనకిచ్చిన పరదైసును మానవుడెందుకు పోగొట్టుకొనెను? (బి) ఏదెనులో ఏ వివాదాంశములు లేవదీయబడెను, మరియు వీటికి దేవుని న్యాయము ఎట్లు ప్రత్యుత్తరమిచ్చెను?
7 దేవుని కార్యము సంపూర్ణమని మోషే ధృవపరచెను. పరదైసగు ఏదెనులో దేవుడు పరిపూర్ణ మానవ జంటనుంచుట విషయములో యిది సత్యమైయుండెను. (ఆదికాండము 1:26, 27; 2:7) మానవజాతి సంక్షేమముకొరకు, ధన్యతకొరకు చేయబడిన ఏర్పాటంతయు పరిపూర్ణమైయుండెను. దైవిక వ్రాతచరిత్ర మనకు యిలా తెలియజేయుచున్నది: “దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలామంచిదిగ నుండెను.” (ఆదికాండము 1:31) అయితే ఏదెను ప్రశాంతత ఎక్కువకాలము నిలువలేదు. తిరుగుబాటుదారుడైన ఒక ఆత్మీయ ప్రాణి ప్రభావము క్రింద, హవ్వ మరియు ఆమె భర్తయగు ఆదాము వారిమీది యెహోవా పరిపాలనా విధానమును వ్యతిరేకించిరి. కాగా యిప్పుడు వారికొరకు ఆజ్ఞలనిచ్చు దేవునిహక్కు ప్రశ్నింపబడెను. (ఆదికాండము 3:1-6) దేవుని న్యాయపాలననుగూర్చిన ఈ సవాలు ప్రాముఖ్యమైన నైతిక వివాదాంశములను లేవనెత్తెను. యిప్పుడు దేవుని సృష్టిప్రాణులందరి యథార్థతకూడా ప్రశ్నింపబడుచున్నదని యథార్థపరుడైన యోబు చారిత్రిక వృత్తాంతము సూచించుచున్నది. విశ్వ ప్రాముఖ్యమైన ఈ వివాదాంశములను పరిష్కరించుటకు న్యాయము సమయమును కోరెను.—యోబు 1:6-11; 2:1-5; లూకా 22:31 కూడా చూడుము.
8. (ఎ) మానవుడు యిప్పుడు ఏ విపత్కర పరిస్థితియందున్నాడు? (బి) మోషే కీర్తనయందు ఏ ఆశాకిరణమును చూడవచ్చును?
8 దేవుని న్యాయమార్గమునుండి వైదొలగుట కారణముగా మానవజాతికి కల్గిన విపత్కర పరిస్థితినిగూర్చి పౌలు రోమీయులు 8:22లో క్లుప్తముగా తెలియజేయుచున్నాడు. అక్కడ, “సృష్టియావత్తు యిదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నది,” అని అపొస్తలుడు వ్రాసెను. “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొను”టతో, న్యాయమునకు కొదువ ఏర్పడినందున మానవుల మధ్య ఎంతో “మూలుగుట” మరియు “ప్రసవవేదనము” ఉన్నది. (ప్రసంగి 8:9) అయితే సర్వశక్తిగల దేవుడు అట్టి అన్యాయమును అనిశ్చయకాలముల వరకు కొనసాగనియ్యబోవడం లేదనుటకు కృతజ్ఞతలు. ఈ విషయమై ద్వితీయోపదేశకాండము 32:40, 41లో తన కీర్తనయందు మోషే యింకా ఏమిచెప్పెనో గమనించుము: “నేను [యెహోవా] తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొనినయెడల, నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను, నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను.. . .‘నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను.’”
9. మానవుడు తిరుగుబాటు చేసినప్పుడు యెహోవా హస్తము ఎట్లు “న్యాయమును పట్టుకొనెనో” వివరింపుము.
9 పూర్వము ఏదెనులో యెహోవా హస్తము “న్యాయమును పట్టుకొనెను.” తన ఆజ్ఞలకు ఉద్దేశ్యపూర్వకముగా లోబడనందుకు దేవుడు ఏమాత్రము ఆలస్యముచేయకుండా న్యాయముగా మానవునికి మరణదండన విధించెను. ఆయన ఆదాముతో యిట్లనెను: “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.” (ఆదికాండము 3:19) శతాబ్దముల తర్వాత, అపొస్తలుడైన పౌలు, ఆదాము పాప విధానమువలన మానవ కుటుంబమునకు కలిగిన తీవ్ర పరిణామములను క్లుప్తీకరించి చెప్పెను. ఆయనిట్లు వ్రాసెను: “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”—రోమీయులు 5:12.
10. ఆదాము తిరుగుబాటు కాలమునుండి ఏ రెండుసంతానములు క్రమావిర్భావము చెందెను, మరియు యెహోవా ఎట్లు ప్రతిస్పందించెను?
10 మానవుని తిరుగుబాటు జరిగిన వెంటనే దేవుడు యిలాకూడా ప్రకటించెను: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువు.” (ఆదికాండము 3:15, 17-19) ఈ రెండు సంతానముల క్రమావిర్భావము 6,000 సంవత్సరములు కొనసాగెను, అలాగే వారిమధ్య “విరోధము” ఎల్లప్పుడు ఉండెను. భూమిమీద పరిస్థితులు మారుచున్న కాలమంతటిలో, యెహోవా న్యాయమైన మార్గములు మాత్రము మారలేదు. తన ప్రవక్తయైన మలాకీద్వారా, ఆయనిట్లు చెప్పుచున్నాడు: “యెహోవానైన నేను మార్పులేనివాడను.” (మలాకీ 3:6) అసంపూర్ణ మరియు తిరుగుబాటు మానవజాతితో దేవుని వ్యవహారములయందు, అన్నిసమయములలో న్యాయము గుర్తింపదగినదిగా యుండెనని యిది నిశ్చయపరచుచున్నది. తన ఉన్నతమైన, నీతి సూత్రములను తన అద్భుత లక్షణములైన జ్ఞానము, ప్రేమ, శక్తితో అనుగుణ్యపరచు సమయమందు ఎన్నడును ఒక్కసారైనను, యెహోవా వాటినుండి తొలగిపోలేదు.
దేవుడు మానవుని రక్షించుటకు వచ్చుట
11, 12. మానవుని దీనావస్థను కీర్తన 49 ఎట్లు చక్కగా వర్ణించుచున్నది?
11 ఆక్టొపసు పొడవైన తొండములవలె, మానవకుటుంబమంతటిని చుట్టివచ్చునంతగా సాతాను దుష్టప్రభావము అలుముకొనిపోయినది. వారిమీద నిలిచియున్న విధింపబడిన మరణశిక్షనుండియే కాకుండా, అసంపూర్ణ మానవపరిపాలనయొక్క అన్యాయ విధానములనుండియు మానవులు ఎంతగా విడిపింపబడవలసి యున్నారు!
12 మరణదండన విధింపబడిన దగ్గరనుండి మానవునికి కలిగిన భయంకరమైన దీనావస్థ కోరహు కుమారుల ఈ క్రింది కీర్తనలో చక్కగా చెప్పబడినది: “సర్వ జనులారా ఆలకించుడి. సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్లుచూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.” (కీర్తన 49:1, 2, 7-9) దేవుడు వ్యక్తపరచిన న్యాయము దృష్ట్యానే యిదంతయు వచ్చెను.
13, 14. (ఎ) మానవుని ఎవరు మాత్రమే రక్షింపగలరు, మరియు దేవుడు ఎంపికచేసిన వ్యక్తి ఎందుకు సరియైనవాడై యున్నాడు? (బి) దేవుని వాగ్ధానములన్నింటికి యేసు ఎట్లు “అవునన్నట్టుగా” తయారయ్యెను?
13 మరి ఎక్కడనుండి సహాయము వచ్చును? మరణపాశమునుండి మానవుని ఎవరు రక్షింపగలరు? కీర్తన దీనికి జవాబిచ్చుచున్నది: “షియోల్ బలములోనుండి దేవుడు తానుగా నా ప్రాణమును విమోచించును.” (కీర్తన 49:15 NW) దేవుని న్యాయమునకనుగుణ్యముగా పనిచేయుచు, ఆయన ప్రేమ మాత్రమే మానవుని “షియోల్ బలమునుండి” రక్షించగలదు. విషయజాగ్రత్తగల పరిసయ్యుడగు నీకొదేముతో యేసు రాత్రివేళ జరిపిన సంభాషణయందు మన ప్రశ్నలకు మరిన్ని సమాధానములు లభించును. యేసు ఆయనతో యిట్లనెను: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) దేవుని కుమారుడు భూమిమీదకు రాకమునుపు ఆయన తండ్రియొద్ద పరలోకమందు జీవించుచుండెను. మానవపూర్వ ఉనికినందు ‘ఆయన నరులను చూచి ఆనందించుచుండెనని’ చెప్పబడెను. (సామెతలు 8:31) కాబట్టి, మానవజాతిని విమోచించుటకు యెహోవా ఈ ప్రత్యేక ఆత్మీయ ప్రాణిని—తన అద్వితీయ కుమారుని—ఎంపిక చేయుట ఎంతగా సరియైయున్నది!
14 యేసునుగూర్చి పౌలు యిట్లు చెప్పెను: “దేవుని వాగ్ధానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి.” (2 కొరింథీయులు 1:20) ప్రవక్తయైన యెషయాద్వారా వ్రాయబడిన యిందలి ప్రవచనములలో ఒకటి మత్తయి 12:18, 21లో పేర్కొనబడినది. అక్కడ యేసునుగూర్చి మనమిట్లు చదువుదుము: “ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు! ఈయనమీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు.”—యెషయా 42:1-4 చూడుము.
15, 16. ఆదాము సంతానమునకు యేసు “నిత్యుడగు తండ్రిగా” తయారగుట ఎట్లు సాధ్యమయ్యెను?
15 తన భూపరిచర్య కాలములో, యేసు అన్ని జనాంగముల మనుష్యులు చివరకు తన నామమందు నిరీక్షించెదరని, అలా వారు దేవుని న్యాయమునుండి ప్రయోజనముల ననుభవింతురని స్పష్టముచేసెను. యేసు యిట్లనెను: “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.” (మత్తయి 20:28) ఇశ్రాయేలు జనాంగమునకివ్వబడిన పరిపూర్ణ ధర్మశాస్త్రము యిట్లు సెలవిచ్చినది: “ప్రాణమునకు ప్రాణము.” (ద్వితీయోపదేశకాండము 19:21) అందువలన, మరణమందు తన పరిపూర్ణ ప్రాణమును ధారపోసి ఆ పిదప దేవుని శక్తిమూలముగా మరలా పరలోకమునకు ఎక్కిపోయినప్పుడు, ఆయన ఆదాము ప్రాణహక్కులకు ప్రతిగా యెహోవాకు తన మానవ పరిపూర్ణ ప్రాణవిలువను అర్పించు స్థానమున ఉండెను. ఈ విధముగా, యేసు “కడపటి [లేక రెండవ] ఆదాముగా” తయారై, ఆదాము సంతానమందలి విశ్వాసులందరి విషయములో “నిత్యుడగు తండ్రిగా” పనిచేయుటకు యిప్పుడు శక్తిమంతుడాయెను.—1 కొరింథీయులు 15:45; యెషయా 9:6.
16 ఆ విధముగా, తన కుమారుడైన యేసు క్రీస్తు విమోచన బలియొక్క ప్రేమపూర్వక ఏర్పాటుద్వారా దేవుని రక్షణ మార్గము ‘అన్యజనులకు స్పష్టము చేయబడెను.’ మరియు అది నిజముగా దైవిక న్యాయముద్వారా గుర్తింపబడెను. ‘మన ప్రాణములను షియోల్ బలమునుండి విమోచించుటకు’ దేవుడు మార్గమును దయచేసినందుకు మనమెంతగా కృతజ్ఞతగలవారమై యుండవలెను!
విమోచనను పైకెత్తిపట్టుకొనుట
17, 18. 1870వ దశాబ్దములో సి. టి. రస్సెల్ ఏ భాగస్వామ్యమందు ప్రవేశించెను, అయితే 1878లో బార్బర్ ఆయనను ఎట్లు ఆశ్చర్యపరచెను?
17 మొదటి శతాబ్ద క్రైస్తవులవలెనే ఆధునిక కాలములలో యెహోవా సాక్షులు యేసు క్రీస్తు బలినిగూర్చిన బోధను అన్ని సమయములలో పెకెత్తిపట్టుకొనిరి. ది హెరాల్డ్ ఆఫ్ మార్నింగ్ అను మత పత్రికకు ఒకప్పుడు వాచ్‌టవర్ సొసైటి మొదటి అధ్యక్షుడు సహసంపాదకుడుగాను, ఆర్ధికమద్దతుదారుగాను ఉండుటను గుర్తుతెచ్చుకొనుట శ్రద్ధ కల్గించునదిగా యుండును. ఆ పత్రిక మొదట అమెరికా, న్యూయార్కు, రోచెష్టర్ నివాసియు ఎడ్వెంటిస్టు అయిన, ఎన్. హెచ్. బార్బర్చే ప్రచురించబడెను. రస్సెల్ 20 సంవత్సరములు పైబడినవాడును, బార్బర్ ఎంతో వయస్సు గలవాడునైయుండెను.
18 1878వరకు వారి భాగస్వామ్యము బాగానే నడిచినట్లుండెను, అయితే ఆశ్చర్యము కలిగించు విధముగా బార్బర్ విమోచనను నిరాకరించుచు ఒక శీర్షికను ప్రచురించెను. ఆపైన జరిగిన దానిని వివరించుచు రస్సెల్ యిట్లు చెప్పెను: “మిస్టర్. బార్బర్ విమోచనా సిద్ధాంతమును నిరాకరించుచు—భూసంబంధమైన ఒక తండ్రి తనపిల్లవాని దుష్ప్రవర్తనకొక పరిష్కారమన్నట్లుగా ఒక ఈగకు సూదిగుచ్చి అది బాధపడి చచ్చునట్లుగా చేయుటకంటే మానవుని పాపముల కొరకు చెల్లించిన మనప్రభువు మరణము ఏమంత ఎక్కువ ప్రయోజనకరము కాదనిచెప్పుచు, ఆదాము అతని సంతానము కొరకు యివ్వబడిన క్రీస్తు మరణ విమోచన ధనమును నిరాకరించుచు,—ది హెరాల్డ్ కొరకు ఒక శీర్షికను వ్రాసెను.”
19. (ఎ) విమోచన విషయములో బార్బర్ కలిగియున్న దృష్టికి రస్సెల్ ప్రతిస్పందన ఏమైయుండెను? (బి) ది వాచ్‌టవర్ విషయములో రస్సెల్ అభిలాష నిజమాయెనా?
19 రస్సెల్ తన భాగస్వామితో కలిసి అటునిటు కానట్టుండవచ్చును, కాని ఆయన అట్లుండలేదు. బార్బర్ విమోచనకు వ్యతిరేకముగా, రస్సెల్ విమోచన పక్షముగా, యిలా అనేక నెలలు పత్రిక పుటలయందు ఈ వివాదము కొనసాగినది. చివరకు, రస్సెల్ బార్బర్‌తో సమస్తసహవాసమును వదిలి, ఆ కాలమందు జయన్స్ వాచ్‌టవర్ అండ్ హెరాల్డ్ ఆఫ్ క్రైస్ట్స్ ప్రెసెన్స్ అని పిలువబడిన ఈ పత్రికను ప్రచురించుటకు ఆరంభించెను. ఈ క్రొత్త పత్రికయెడల తన భావములను సి. టి. రస్సెల్ ఈ విధముగా వ్యక్తపరచెను: “మొదటినుండి యిది విమోచన పక్షముగా వాదించుటలో ప్రత్యేకముగా ఉన్నది; మరియు దేవుని కృపవలన, యిది యిలానే తుదివరకు చేయునని ఆశించుచున్నాము.” సంపాదకుడైన రస్సెల్ ఆశించినట్లుగానే జరిగినదా? తప్పకుండా! ఈ సంచికలోని 2వ పేజీలోని వివరణయందు పత్రిక యిలా చెప్పుచున్నది, “నిత్యజీవమును పొందు మార్గమును తెరచుటకు రక్తము చిందించి ఇప్పుడు రాజుగా పరిపాలించుచున్న యేసు క్రీస్తునందు అది విశ్వాసమును ప్రోత్సహించుచున్నది.”
20. జవాబు లభించకుండానే ఏ ప్రశ్నలు యింకను నిలిచియున్నవి?
20 యిప్పటివరకు సాగిన చర్చయందు, మనము మానవ కుటుంబముమీద నిలిచియున్న పాప మరణముల స్థితినుండి మానవజాతిని రక్షించుటకు అవసరమైన మాధ్యమమునకై దేవుని న్యాయమును అనుసరించి వెళ్లాము. ప్రేమ ఆ మాధ్యమమును దయచేసెను. అయినను, యిలాంటి ప్రశ్నలు యింకను జవాబు లభించకుండానే నిలిచియుండును: యేసు క్రీస్తు విమోచన బలి ప్రయోజనములు ఎట్లు లభ్యమగును? వాటినుండి మీరెట్లు ప్రయోజనము పొందగలరు, మరియు ఎంత త్వరలో? న్యాయము దేవుని మార్గమున్నింటిని గుర్తించుచున్నదను మీ నమ్మకమును నిశ్చయముగా వృద్ధిచేయు జవాబులను దీనితర్వాతి సంచిక యిచ్చును. (w89 3/1)
మీరెట్లు జవాబిచ్చెదరు?
◻ న్యాయము విషయములో దేవుడు ఏ ప్రాముఖ్యతనుంచెను?
◻ మానవజాతియందు యింత అన్యాయము ఎందుకున్నది?
◻ మానవుడు మరణమునుండి తప్పించుకొనుటకు దేవుడెట్లు ఏర్పాటుచేసెను?
◻ ఎంత విస్తారముగా ది వాచ్‌టవర్ విమోచనను పైకెత్తిపట్టుకొనినది?
[25వ పేజీలోని చిత్రాలు]
మోషే మోయాబు మైదానమందు తన కీర్తనలోని మాటలను మాట్లాడుచుండెను
[28వ పేజీలోని చిత్రాలు]
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయకుమారుని యిచ్చెను