జ్ఞానమును సంపాదించుకోండి, క్రమశిక్షణను అంగీకరించండి
యెహోవా దేవుడు తన ప్రజలకు గొప్ప ఉపదేశకుడు. ఆయన వారికి తన గురించి మాత్రమేగాక జీవితాన్ని గురించి కూడా బోధిస్తాడు. (యెషయా 30:20; 54:13; కీర్తన 27:11) ఉదాహరణకు, యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి బోధకులుగా ఉండేందుకు ప్రవక్తలను, లేవీయులను—ప్రాముఖ్యంగా యాజకులను—జ్ఞానులైన ఇతర వ్యక్తులను ఇచ్చాడు. (2 దినవృత్తాంతములు 35:3; యిర్మీయా 18:18) ప్రవక్తలు ప్రజలకు దేవుని సంకల్పాల గురించీ, లక్షణాల గురించీ బోధించి, అనుసరించవలసిన సరైన మార్గాన్ని తెలియజేసేవారు. యాజకులకూ లేవీయులకూ యెహోవా ధర్మశాస్త్రం గురించి బోధించే బాధ్యత ఉండేది. జ్ఞానులైన వ్యక్తులు లేక పెద్దలు అనుదిన జీవిత విషయాల్లో మంచి ఉపదేశాన్నిచ్చేవారు.
దావీదు కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలులోని జ్ఞానులలో విశేషమైనవాడు. (1 రాజులు 4:30, 31) ఆయనను సందర్శించటానికి వచ్చిన వారిలో ఎంతో సుప్రసిద్ధమైన షేబ దేశపు రాణి ఆయన ఘనతనూ, ఐశ్వర్యాన్నీ చూసిన తర్వాత, ఇలా అంగీకరించింది: “ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి.” (1 రాజులు 10:7) సొలొమోను జ్ఞాన రహస్యమేమిటి? సా.శ.పూ. 1037లో సొలొమోను ఇశ్రాయేలు రాజైనప్పుడు, తనకు “జ్ఞానమును తెలివిని” దయచేయమని ప్రార్థించాడు. ఆయన విన్నపాన్ని బట్టి ఎంతో సంతోషించి యెహోవా ఆయనకు తెలివిని, జ్ఞానాన్ని, వివేకముగల హృదయమును ఇచ్చాడు. (2 దినవృత్తాంతములు 1:10-12; 1 రాజులు 3:12) సొలొమోను ‘మూడు వేల సామెతలు చెప్పాడంటే’ అందులో ఆశ్చర్యం లేదు ! (1 రాజులు 4:32) “ఆగూరు పలికిన మాటలు,” “రాజైన లెమూయేలు మాటల”తో సహా వీటిలో కొన్ని బైబిలు పుస్తకమైన సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. (సామెతలు 30:1; 31:1) ఈ సామెతల్లో వ్యక్తపర్చబడిన సత్యాలు దేవుని జ్ఞానాన్ని ప్రతిఫలింపజేస్తాయి, అవి శాశ్వతమైనవి. (1 రాజులు 10:23, 24) సంతోషభరితమైన, విజయవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకునే ఎవరికైనా, అవి మొదట చెప్పబడినప్పుడు ఎంత ఆవశ్యకమైనవో నేడూ అంతే ఆవశ్యకమైనవి.
విజయం, నైతిక పరిశుభ్రత—ఎలా?
సామెతల గ్రంథం యొక్క ఉద్దేశం దాని తొలి పలుకుల్లో ఇలా వివరించబడింది: “దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును [“క్రమశిక్షణను,” NW] అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు బుద్ధికుశలత [“అంతర్దృష్టి,” NW] ఇచ్చు ఉపదేశము [“క్రమశిక్షణ,” NW] నొందుటకును, జ్ఞానములేని వారికి బుద్ధి కలిగించుటకును, యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.” (ఇటాలిక్కులు మావి.)—సామెతలు 1:1-4.
“సొలొమోను సామెతలు” ఎంత ఉన్నతమైన సంకల్పాన్ని నెరవేర్చాల్సి ఉందోకదా! అవి ఒకరు “జ్ఞానమును ఉపదేశమును [“క్రమశిక్షణను,” NW] అభ్యసించుటకు” తగినవి. జ్ఞానములో, విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడటం, సమస్యలను పరిష్కరించుకోవటానికీ లక్ష్యాలను సాధించటానికీ, ప్రమాదాలను తప్పించుకోవటానికీ లేక నివారించటానికీ, లేక అలా చేసేందుకు ఇతరులకు సహాయం చేయటానికీ ఆ జ్ఞానమును ఉపయోగించటం ఇమిడి ఉంది. “సామెతల గ్రంథములో ‘జ్ఞానము’ సమర్థవంతంగా జీవించటాన్ని, అంటే జ్ఞానవంతమైన ఎంపికలు చేసుకుని విజయవంతంగా జీవించే సామర్థ్యాన్ని సూచిస్తుంది” అని ఒక పుస్తకం తెలియజేస్తుంది. జ్ఞానమును సంపాదించుకోవటం ఎంత ప్రాముఖ్యమో కదా !—సామెతలు 4:7.
సొలొమోను సామెతలు క్రమశిక్షణను కూడా అందజేస్తాయి. మనకు ఈ విధమైన శిక్షణ అవసరమా? లేఖనాల్లో, క్రమశిక్షణనివ్వటం అంటే సరిదిద్దటం, మందలించటం, లేక శిక్షించటం అనే భావం ఉంది. ఒక బైబిలు పండితుని ఉద్దేశం ప్రకారం, అది “తప్పు చేయాలన్న కోరికను సరిదిద్దటం ఇమిడివున్న నైతిక సంబంధమైన శిక్షణను సూచిస్తుంది.” ఇతరులు ఇచ్చేదైనా లేక మనపై మనం విధించుకున్నదైనా క్రమశిక్షణ, మనల్ని తప్పు చేయటం నుండి తప్పించటమే గాక మంచిగా మారటానికి కూడా మనల్ని పురికొల్పుతుంది. అవును, మనం నైతికంగా పరిశుభ్రంగా ఉండాలంటే మనకు క్రమశిక్షణ తప్పకుండా అవసరం.
కాబట్టి సామెతలు రెండు సంకల్పాలను కలిగివున్నాయి—జ్ఞానాన్నివ్వటం, క్రమశిక్షణనివ్వటం. నైతిక క్రమశిక్షణలోనూ, మానసిక సామర్థ్యంలోనూ అనేకానేక అంశాలున్నాయి. ఉదాహరణకు, నీతి న్యాయం అన్నవి నైతిక లక్షణాలు, అవి మనం యెహోవా ఉన్నతమైన ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉండటానికి సహాయం చేస్తాయి.
జ్ఞానమన్నది అవగాహన, అంతర్దృష్టి, బుద్ధి, వివేచన వంటి అనేక అంశాల మేళవింపు. అవగాహన అంటే, ఒక విషయాన్ని పరిశీలించి దాని భాగాలకూ దాని మొత్తానికి మధ్యనున్న సంబంధాలను గుర్తించటం ద్వారా దాని కూర్పును గ్రహించి, దాని భావాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం. అంతర్దృష్టి కల్గివుండాలంటే, కారణాలను గురించి తెలిసి ఉండటం, ఏదైనా ఒక చర్య ఎందుకు సరైనదో ఎందుకు సరైనది కాదో అర్థం చేసుకోవటం అవసరం. ఉదాహరణకు, అవగాహన ఉన్న వ్యక్తి, ఎవరైనా ఒకరు తప్పు మార్గంలో వెళ్తుంటే గ్రహించగల్గుతాడు, అతడు వెంటనే ప్రమాదం గురించి అతడ్ని హెచ్చరించగల్గుతాడు. అయితే, ఆ వ్యక్తి ఎందుకు ఆ మార్గంలో వెళ్తున్నాడో అర్థం చేసుకోవటానికీ, అతడిని కాపాడటానికి అవసరమైన అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని చూపించటానికీ అతనికి అంతర్దృష్టి అవసరం.
బుద్ధిగల ప్రజలు వివేకం గలవారై ఉంటారు గానీ అమాయకులుగా ఉండరు. (సామెతలు 14:15) వాళ్లు కీడును ముందే గ్రహించి, దాని కోసం సిద్ధం కాగల్గుతారు. జీవితంలో సంకల్పవంతమైన నడిపింపును ఇచ్చే ఆరోగ్యకరమైన ఆలోచనలనూ, తలంపులనూ సూత్రీకరించుకునేందుకు జ్ఞానం మనకు సహాయం చేస్తుంది. బైబిలు సామెతలను అధ్యయనం చేయటం నిజంగా ప్రతిఫలదాయకమైనది; ఎందుకంటే మనం జ్ఞానాన్ని, క్రమశిక్షణను పొందటానికే అవి వ్రాయబడ్డాయి. చివరకు సామెతలకు అవధానాన్నిచ్చే “జ్ఞానములేని” వారు బుద్ధినీ, ‘యౌవనులు’ తెలివినీ, వివేచననూ సంపాదించుకుంటారు.
జ్ఞానవంతుల కోసం సామెతలు
అయితే, బైబిలు సామెతలు కేవలం జ్ఞానములేనివారి కోసం, యౌవనుల కోసం మాత్రమే కాదు. అవి వినగల జ్ఞానం ఉన్న వారందరి కోసం. “జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును, వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు” అని రాజైన సొలొమోను అంటున్నాడు. (ఇటాలిక్కులు మావి.) (సామెతలు 1:5, 6) ఇప్పటికే జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి సామెతలకు అవధానాన్నివ్వటం ద్వారా తన జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకుంటాడు, జ్ఞానము గలవాడు తన జీవితానికి విజయవంతంగా సారథ్యం వహించే సామర్థ్యానికి పదును పెట్టుకుంటాడు.
తరచూ ఒక సామెత ప్రగాఢమైన సత్యాన్ని కేవలం కొన్ని మాటల్లో వ్యక్తం చేస్తుంది. బైబిలు సామెత భావసూచక విషయ రూపాన్ని సంతరించుకోవచ్చు. (సామెతలు 1:17-19) కొన్ని సామెతలు గూఢవాక్యములవంటివి, అంటే అవి వివరణ అవసరమైన సంక్లిష్టమైన చిక్కుముడుల వ్యాఖ్యానాలై ఉంటాయి. సామెతల్లో ఉపమాలంకారాలు, రూపకాలంకారాలు, ఇతర భావరూప వ్యక్తీకరణ శైలులు కూడా ఇమిడి ఉండవచ్చు. వీటిని అర్థం చేసుకోవటానికి సమయం, ధ్యానం అవసరం. ఎన్నో సామెతలను కూర్చిన సొలొమోను, ఒక సామెతను అర్థం చేసుకోవటంలోని వివిధ అంశాలను కచ్చితంగా గ్రహించాడు. సామెతల గ్రంథంలో, ఆయన తన పాఠకులకు ఆ సామర్థ్యాన్ని పంచే కార్యాన్ని చేపట్టాడు, జ్ఞానవంతుడైన వ్యక్తి దానికి అవధానం ఇవ్వాలనుకుంటాడు.
గమ్యానికి చేర్చే ఆరంభం
జ్ఞానాన్ని, క్రమశిక్షణను పొందటానికి చేసే ప్రయాసలను ఒక వ్యక్తి ఎక్కడి నుండి ప్రారంభించవచ్చు? సొలొమోను ఇలా సమాధానమిస్తున్నాడు: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును [“క్రమశిక్షణను,” NW] తిరస్కరించుదురు.” (ఇటాలిక్కులు మావి.) (సామెతలు 1:7) యెహోవా యందలి భయంతో తెలివి ప్రారంభమౌతుంది. తెలివి లేకుండా జ్ఞానము గానీ క్రమశిక్షణ గానీ ఉండవు. కాబట్టి యెహోవా యందలి భయం జ్ఞానానికీ, క్రమశిక్షణకూ ఆరంభం.—సామెతలు 9:10; 15:33.
దేవుని యందలి భయం అంటే ఆయనను గురించిన అనారోగ్యకరమైన భీతి కాదు. బదులుగా అది ప్రగాఢమైన భక్తి, భక్తిపూర్వకమైన భయం. ఈ విధమైన భయం లేకుండా నిజమైన తెలివి ఉండదు. జీవం యెహోవా దేవుడు ప్రసాదించినదే, అయితే ఏ విధమైన తెలివిని సంపాదించుకోవటానికైనా ఆ జీవం అవసరం. (కీర్తన 36:9; అపొస్తలుల కార్యములు 17:25, 28) అంతేగాక, అన్నిటినీ దేవుడు సృష్టించాడు; కాబట్టి మానవ తెలివి అంతా ఆయన చేతి పనులను అధ్యయనం చేయటంపైనే ఆధారపడి ఉంది. (కీర్తన 19:1, 2; ప్రకటన 4:10) దేవుడు తన లిఖిత వాక్యాన్ని కూడా ప్రేరేపించాడు, అది “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది.” (2 తిమోతి 3:16, 17) కాబట్టి, నిజమైన తెలివి అంతటికీ కేంద్ర బిందువు యెహోవాయే, కాబట్టి దాన్ని పొందాలనుకునే వ్యక్తి ఆయనయందు భక్తిపూర్వకమైన భయం కల్గివుండాలి.
దేవుని యందు భయం లేని మానవ తెలివి, లోక జ్ఞానం ఏమాత్రం విలువగలవి? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?” (1 కొరింథీయులు 1:20) దేవుని భయం లేకపోతే, లోకసంబంధమైన జ్ఞానంగల వ్యక్తి తనకు తెలిసిన వాస్తవాల నుండి తప్పుడు ముగింపులకు వచ్చి, చివరికి ‘వెఱ్ఱివానిగా’ తయారౌతాడు.
“నీ కంఠమునకు హారము”
జ్ఞానవంతుడైన రాజు ఆ తర్వాత యౌవనులతో ఇలా చెప్తున్నాడు: “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము [“క్రమశిక్షణ,” NW] ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును.” (ఇటాలిక్కులు మావి.)—సామెతలు 1:8, 9.
ప్రాచీన ఇశ్రాయేలులో, తల్లిదండ్రులకు తమ పిల్లలకు బోధించవలసిన దేవుడిచ్చిన బాధ్యత ఉండేది. మోషే తండ్రులకు ఇలా ఉద్బోధించాడు: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:6, 7) తల్లులు కూడా చెప్పుకోదగినంత ప్రభావాన్ని చూపించేవారు. ఒక హెబ్రీ భార్య తన భర్త అధికార ఏర్పాటుకు లోబడుతూనే, కుటుంబ కట్టడను అమలు చేయగలిగేది.
వాస్తవానికి, బైబిలంతటిలోనూ, విద్య నొసగటానికి కుటుంబం ప్రాథమిక విభాగంగా ఉంది. (ఎఫెసీయులు 6:1-3) పిల్లలు విశ్వాసులైన తమ తల్లిదండ్రులకు విధేయులై ఉండటమన్నది, సూచనార్థకంగా చెప్పాలంటే వారికి అలంకారార్థమైన సొగసైన మాలికగా, ఘనతకు కారణమైన కంఠ హారముగా ఉంటుంది.
“దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును”
ఆసియాలోని ఒక తండ్రి, ఉన్నత విద్యార్జన కోసం 16 ఏళ్ల తన కుమారుడ్ని అమెరికాకు పంపించే ముందు, చెడు ప్రజలతో కలవవద్దని అతడికి ఉపదేశించాడు. ఈ ఉపదేశం సొలొమోను ఇచ్చిన ఈ హెచ్చరికను ప్రతిధ్వనింపజేస్తుంది: “నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము.” (ఇటాలిక్కులు మావి.) (సామెతలు 1:10) అయితే, సొలొమోను వాళ్లు ఉపయోగించే ప్రలోభాన్ని కచ్చితంగా ఇలా గుర్తిస్తున్నాడు: “మాతోకూడ రమ్ము. మనము ప్రాణముతీయుటకై పొంచియుందము. నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము. పాతాళము మనుష్యులను మ్రింగివేయునట్లు వారిని జీవముతోనే మ్రింగివేయుదము. సమాధిలోనికి దిగువారు మ్రింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మ్రింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన యండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై యుండుము. మనకందరికిని సంచి ఒక్కటే యుండును, అని వారు నీతో చెప్పుదురు.” (ఇటాలిక్కులు మావి.)—సామెతలు 1:11-14.
ఆ ప్రలోభం స్పష్టంగా సంపదలే. త్వరగా డబ్బు సంపాదించుకోవటానికి, “పాపులు” తమ దౌర్జన్యపూరితమైన లేక అన్యాయమైన పథకాల్లో ఇతరులు నిమగ్నమయ్యేలా వారిని మోసగిస్తారు. ఈ దుష్టులు వస్తుసంబంధమైన లాభం కోసం రక్తం చిందించటానికి కూడా వెనుకాడరు. సమాధి, మొత్తం శరీరాన్ని తనలోకి తీసుకున్నట్లుగా వాళ్లు తమ బాధితుని వద్దనున్నదంతా అతడి నుండి దోచుకుని, ‘అతడిని పాతాళమువలే జీవముతోనే నిలువునా మింగేస్తారు.’ వాళ్లు ఆహ్వానించేది నేర వృత్తిని చేపట్టటానికి రమ్మని, వాళ్లు ‘తమ ఇళ్లను దోపుడు సొమ్ముతో నింపుకోవాలని చూస్తారు,’ జ్ఞానం లేని వ్యక్తిని ‘తమతో పాలివాడిని’ చేసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ఇది మనకెంత సమయోచితమైన హెచ్చరికో కదా! యూత్ గ్యాంగ్‌లు మాదక ద్రవ్యాల వర్తకులు అలాంటి పద్ధతులనే ఉపయోగించరా? ప్రశ్నించదగిన వ్యాపార ప్రతిపాదనలను చేసే అనేకులు పెట్టే శోధన, త్వరగా ధనవంతులు కావచ్చునన్న వాగ్దానమే కాదా?
జ్ఞానవంతుడైన ఆ రాజు ఇలా ఉపదేశిస్తున్నాడు: “నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.” వారి నాశనకరమైన అంతాన్ని ముందే తెలియజేస్తూ, ఆయనింకా ఇలా అంటున్నాడు: “పక్షి [“రెక్కలు గలది,” NW] చూచుచుండగా వల వేయుట వ్యర్థము. వారు స్వనాశనముకే పొంచియుందురు; తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.” (ఇటాలిక్కులు మావి.)—సామెతలు 1:15-19.
‘ఆశాపాతకులందరు’ తమ స్వంత విధానంలో నశిస్తారు. దుష్టులు ఇతరుల కోసం పొంచి ఉండటం వారికే ఉరి అవుతుంది. ఉద్దేశపూర్వకంగా చెడును చేసేవారు తమ మార్గాన్ని మార్చుకుంటారా? లేదు. వల స్పష్టంగా కనిపిస్తుండవచ్చు అయినా పక్షులు—“రెక్కలు గల” జీవులు—నేరుగా దానిలోకే ఎగురుతూ వెళతాయి. అలాగే దుష్టులు ఎప్పుడో ఒకసారి పట్టుబడినప్పటికీ, వాళ్లు దురాశతో కళ్లు మూసుకుపోయి తమ నేరకృత్యాల్లో ముందుకు కొనసాగుతూనే ఉంటారు.
జ్ఞానం స్వరాన్ని ఎవరు వింటారు?
తమ మార్గాలు నాశనకరమైనవిగా ఉన్నాయని పాపులకు నిజంగా తెలుసా? తమ మార్గాల పర్యవసానం ఏమైవుంటుందో వారిని హెచ్చరించటం జరిగిందా? తెలియదన్నంత మాత్రాన సరిపోదు, ఎందుకంటే బహిరంగ స్థలాల్లో చాలా సూటియైన సందేశం ప్రకటించబడుతోంది.
సొలొమోను ఇలా ప్రకటిస్తున్నాడు: “జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది.” (ఇటాలిక్కులు మావి.) (సామెతలు 1:20, 21) అందరూ వినాలని జ్ఞానం బహిరంగ స్థలాల్లో బిగ్గరగా స్పష్టంగా కేకలు వేస్తోంది. ప్రాచీన ఇశ్రాయేలులో పెద్దలు పురద్వారముల వద్ద జ్ఞానవంతమైన ఉపదేశాన్ని, న్యాయ సంబంధమైన తీర్పులను ఇచ్చేవారు. యెహోవా మన కోసం నిజమైన జ్ఞానాన్ని తన వాక్యమైన బైబిలులో వ్రాయించి ఉంచాడు, అదిప్పుడు విస్తృతంగా అందుబాటులో ఉంది. నేడు ఆయన సేవకులు దాని సందేశాన్ని బహిరంగంగా అంతటా ప్రకటిస్తున్నారు. దేవుడు నిజంగా అందరి ఎదుటా జ్ఞానం ప్రకటించబడేలా చేశాడు.
నిజమైన జ్ఞానం ఏమి చెప్తుంది? ఇది: “జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? . . . నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయచాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయరి.” మూర్ఖులు జ్ఞానము స్వరాన్ని వినిపించుకోరు. తత్ఫలితంగా, “వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు.” వారు తాముగా “మైమరచి నిర్మూలమగుదురు.” (ఇటాలిక్కులు మావి.)—సామెతలు 1:22-32.
జ్ఞానము స్వరాన్ని వినటానికి సమయం తీసుకున్న వ్యక్తి మాటేమిటి? “[అతడు] సురక్షితముగా నివసించును, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.” (ఇటాలిక్కులు మావి.) (సామెతలు 1:33) బైబిలు సామెతలకు అవధానం ఇవ్వటం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుని, క్రమశిక్షణను అంగీకరించేవారిలో మీరూ ఒకరై ఉండాలి.
[15వ పేజీలోని చిత్రం]
నిజమైన జ్ఞానం విరివిగా అందుబాటులో ఉంది