యెహోవాను ఆయన వాక్యం ద్వారా తెలుసుకోండి
“అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3.
1, 2. (ఎ) లేఖనాలలో ఉపయోగించబడిన రీతిగా “తెలుసుకొనుట,” “ఎరిగియుండుట” అనువాటి భావమేమి? (బి) ఈ భావాన్ని ఏ దృష్టాంతములు స్పష్టీకరిస్తున్నవి?
ఎవనితోనో ముఖపరిచయం కల్గియుండడం లేదా దేనిగూర్చో కేవలం పైపైనే తెలుసుకొనడం అనేవి లేఖనాల్లో వాడబడిన “తెలుసుకొనుట,” “ఎరిగియుండుట” అన్న మాటల భావంతో సాటిరావు. బైబిలులో దీనియందు “అనుభవముతో తెలుసుకొనుట,” “వ్యక్తుల మధ్య నమ్మకముతో కూడిన సంబంధాన్ని” వ్యక్తపర్చగల్గే పరిచయం ఇమిడియుంది. (ది న్యూ ఇంటర్నేషనల్ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్‌మెంట్ థియోలజీ) అనగా ‘నేను యెహోవానైయున్నానని మీరు తెలుసుకొనవలెను’ అని చెప్పి యెహెజ్కేలు గ్రంథములో అనేక పర్యాయములు దేవుడు దుష్టులపై తీర్పుతీర్చినటువంటి ఒక నిర్దిష్టమైన చర్యద్వారా యెహోవాను ఎరిగియుండుట దీనిలో యిమిడియుంది.—యెహెజ్కేలు 38:23.
2 “తెలుసుకొనుట,” “ఎరిగియుండుట” అనువాటిని వాడదగు వివిధ విధానాలను కొన్ని దృష్టాంతములతో స్పష్టీకరించవచ్చు. తన నామమునుబట్టి నడుచుకొంటున్నామని చెప్పుకునే అనేకులతో యేసు “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను” అని చెప్పెను, అంటే వారితో తనకేమి సంబంధము లేదని అర్థం. (మత్తయి 7:23) క్రీస్తు “పాపమెరుగడు” అని 2 కొరింథీయులు 5:21 చెబుతుంది. అంటే పాపమును గూర్చి ఆయనకు తెలియదని కాదుగాని వ్యక్తిగతంగా దానిలో పాలుపొందలేదని దాని అర్థం. ఆలాగే, “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” అని యేసు పల్కినప్పుడు, దేవుని గూర్చి, క్రీస్తును గూర్చి కేవలం తెలుసుకొనుటకంటే యింకెంతో ఇమిడియుంది.—మత్తయి 7:21 పోల్చండి.
3. నిజదేవుడనే గుర్తింపును యెహోవా కల్గియున్నాడని ఏది రుజువు చేస్తున్నది?
3 యెహోవా విశేషలక్షణాలలో అనేకం ఆయన వాక్యమైన బైబిలు ద్వారా తెలుసుకొనవచ్చును. వాటిలో కచ్చితంగా ప్రవచింపగల ఆయన సామర్థ్యం ఒకటి. ఇదే నిజదేవుని గుర్తింపు. “జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి. ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అపుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము.” (యెషయా 41:22, 23) యెహోవా తన వాక్యమందు భూమి సృజించబడుటను గూర్చి, అందలి జీవరాసులను గూర్చిన మొదటి సంగతులను తెలియజేస్తున్నాడు. అటుపిమ్మట జరుగనైయున్న సంగతులను గూర్చి ఎంతో ముందుగానే తెల్పాడు, అవి నెరవేరాయి. ఆలాగే ఆయన యిప్పుడుకూడా “రాగలవాటిని తెలియజెప్పుచున్నాడు,” మరిముఖ్యంగా “అంత్యదినములలో” జరుగబోవు వాటిని ఆయన తెలియజేస్తున్నాడు.—2 తిమోతి 3:1-5, 13; ఆదికాండము 1:1-30; యెషయా 53:1-12; దానియేలు 8:3-21, 20-25; మత్తయి 24:3-21; ప్రకటన 6:1-8; 11:18.
4. బలము అనే లక్షణాన్ని యెహోవా ఎలా ఉపయోగించాడు, ఆయన దానినింకా ఎలా ఉపయోగించనై యున్నాడు?
4 బలము, యెహోవాకున్న మరో విశేషలక్షణం. వెలుతురును వేడిని వెదజల్లుతున్న గొప్ప అణుసమ్మేళన కొలిమిగానున్న నక్షత్రములు గల ఆకాశమందు అది తేటతెల్లమగుచున్నది. తిరుగుబాటు మనుష్యులు లేదా దేవదూతలు యెహోవా విశ్వాధిపత్యాన్ని సవాలుచేసినప్పుడు, తను పేరును, నీతియుక్త నియమాలను నిలువబెట్టుటకు ఆయన తన బలమును “యుద్ధశూరుని” వలె ఉపయోగించును. అట్టి సందర్భాలలో నోవహు దినములలో జలప్రళయము రప్పించినట్లు, సొదొమగొమొర్రాలను నాశనము చేసినట్లు, ఇశ్రాయేలీయులను ఎర్రసముద్రముగుండా తప్పించినట్లు తన బలాన్ని నాశనము చేసేరీతిగా ఉపయోగించ ఆయన వెనుదీయడు. (నిర్గమకాండము 15:3-7; ఆదికాండము 7:11, 12, 24; 19:24, 25) త్వరలోనే, “సాతానును మీకాళ్ల క్రింద చితుక త్రొక్కించుటకు” దేవుడు ఆ శక్తి నుపయోగిస్తాడు.—రోమీయులు 16:20.
5. బలముతోపాటే ఏ లక్షణాన్ని కూడ యెహోవా కల్గియున్నాడు?
5 అంతటి అనంతబలాన్ని కల్గియున్నను, ఆయనలో సాత్వికమున్నది. కీర్తన 18:35, 36 యిట్లంటున్నది: “నీ సాత్వికము నన్ను గొప్పచేసెను. నా పాదములకు చోటు విశాలపరచితివి.” దేవునికున్న సాత్వికమును బట్టి “ఆయన భూమ్యాకాశములను వంగిచూడ ననుగ్రహించుచున్నాడు. ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీదనుండి బీదలను పైకెత్తువాడు.”—కీర్తన 113:6, 8.
6. యెహోవాకున్న ఏ లక్షణాలు జీవాన్ని రక్షించగలవు?
6 యెహోవా, మానవునితో దయాదాక్షిణ్యంగా వ్యవహరించుట జీవమును కాపాడుతుంది. మనష్షే దారుణకృత్యాలు చేసినను, ఆయన క్షమించబడినప్పుడు అట్టి దాక్షిణ్యత అతనికి చూపబడింది. యెహోవా యిట్లనుచున్నాడు: “నిజముగా మరణము నొందుదువని దుర్మార్గునికి నేను సెలవియ్యగా అతడు తన పాపము విడిచి, నీతి న్యాయములను అనుసరించినయెడల, . . . అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు, అతడు నీతి న్యాయములను అనుసరించెను గనుక నిశ్చయముగా అతడు బ్రదుకును.” (యెహెజ్కేలు 33:14, 16; 2 దినవృత్తాంతములు 33:1-6, 10-13) యేసు 77 సార్లు, ఒక దినములో ఏడు సార్ల వరకు కూడ క్షమించుమని చెప్పినప్పుడు, ఆయన యెహోవా లక్షణానికి అద్దం పడుతున్నాడు.—కీర్తన 103:8-14; మత్తయి 18:21, 22; లూకా 17:4.
మనోభావం గల దేవుడు
7. గ్రీకుదేవతలకు యెహోవా ఎలా వ్యత్యాసంగా ఉన్నాడు, ఏ గొప్ప ఆధిక్యత మనకివ్వబడింది?
7 ఎపికూరీయులవంటి గ్రీకు తత్వవేత్తలు దేవతలయందు విశ్వాసముంచారు గాని భూమినుండి వారు ఎంతో దూరములో వుండి మానవునిపై ఎట్టి శ్రద్ధలేకుండ, అతని భావాలనుబట్టి ఏమాత్రం స్పందించనంతటి సుదూరంగా ఉంటారని నమ్మారు. యెహోవాకు ఆయన నమ్మకమైన సాక్షులకుగల సంబంధం ఎంత వ్యత్యాసంగా ఉందో చూడండి. “యెహోవా తన ప్రజల యందు ప్రీతిగలవాడు.” (కీర్తన 149:4) జలప్రళయమునకు ముందున్న దుష్టులు ఆయనకు సంతాపము కల్గించి “హృదయమును నొప్పించారు.” ఇశ్రాయేలీయులు అవిశ్వాసము చేత యెహోవాకు బాధ కల్గించి నొప్పించారు. క్రైస్తవులు తమ అవిధేయతనుబట్టి యెహోవా ఆత్మను దుఃఖపెట్టే ప్రమాదమున్నది. అయితే, తమ విశ్వాస్యతనుబట్టి వారాయనను సంతోషపెట్టగలరు. భూమి మీదున్న అల్పుడైన మానవుడు విశ్వానికే సృష్టికర్తయైనవాన్ని దుఃఖపెట్టగలడు లేదా సంతోష పెట్టగలడనునది ఊహించుట ఎంత అద్భుతం! ఆయన మనకు చేస్తున్న యావత్తునుబట్టి, ఆయనను ప్రీతిపర్చే గొప్ప ఆధిక్యత మనకున్నదనుట ఎంత మనోహరము!—ఆదికాండము 6:6; కీర్తన 78:40, 41; సామెతలు 27:11; యెషయా 63:10; ఎఫెసీయులు 4:30.
8. యెహోవాతో స్వేచ్ఛగా మాట్లాడుటను అబ్రాహాము ఎలా ఉపయోగించాడు?
8 యెహోవా ప్రేమ మనకు బహు “ధైర్యమును” అనుగ్రహిస్తున్నదని దేవుని వాక్యం తెల్పుచున్నది. (1 యోహాను 4:17) యెహోవా సొదొమను నాశనం చేయవచ్చినప్పుడు అబ్రాహాము ఏమి చేశాడో గమనించండి. అబ్రాహాము యెహోవాతో యిట్లనెను: “దుష్టులతో కూడ నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండిన యెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? . . . అది నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పుతీర్చువాడు న్యాయము చేయడా?” దేవునితో అలా మాట్లాడ్డమే! అయినా అక్కడ 50 మంది నీతిమంతులుంటే సొదొమను కాపాడతానని యెహోవా అంగీకరించాడు. అబ్రాహాము సంభాషణను కొనసాగించి ఆ సంఖ్యను 50 నుండి 20కి తగ్గించాడు. తాను అతిగా పట్టుపడుతున్నానేమోనని దిగులు చెందాడు. ఆయనిలా అన్నాడు: “ప్రభువు కోపపడని యెడల నేనింకొక మారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో.” అయినా యెహోవా అంగీకరించి: “ఆ పదిమందిని బట్టి నాశనముచేయక యుందుననెను.”—ఆదికాండము 18:23-33.
9. అబ్రాహామును అలా మాట్లాడుటకు యెహోవా ఎందుకు అనుమతించాడు, దీని నుండి మనమేమి నేర్చుకొనగలము?
9 అబ్రాహాము అలా స్వేచ్ఛగా మాట్లాడేందుకు యెహోవా ఎందుకు అనుమతించాడు? ఒకటేమంటే, అబ్రాహాముకున్న దుఃఖభావనలు యెహోవా అర్థం చేసుకున్నాడు. అబ్రాహాము అన్న కొడుకైన లోతు సొదొమలో నివసిస్తున్నాడని, అబ్రాహాము అతని క్షేమాన్ని గూర్చి తలస్తున్నాడని ఆయనకు తెలుసు. అంతేకాదు, అబ్రాహాము దేవుని స్నేహితుడు కూడా. (యాకోబు 2:23) ఎవరైన మనతో కఠినంగా మాట్లాడితే, ముఖ్యంగా అతడు స్నేహితుడైతే, అతడు ఏదైనా భావోద్రేక వత్తిడితో సతమతమౌతుంటే అతని మాటల ఆంతర్యాన్ని, పరిస్థితులను పరిగణలోనికి తీసుకోడానికి మనం ప్రయత్నిస్తామా? యెహోవా అబ్రాహాముతో వ్యవహరించినట్లే మనమును స్వేచ్ఛగా మాట్లాడితే ఆయన అర్థం చేసుకుంటాడంటే అది ఓదార్పుకరంగా లేదా?
10. స్వేచ్ఛగా మాట్లాడుట ప్రార్థనలో మనకెలా సహాయపడుతుంది?
10 ముఖ్యంగా మనం బహుగా కలత చెంది భావోద్రేకంగా వ్యాకులతతో ఉన్నప్పుడు, “ప్రార్థన ఆలకించు” వానిగా మనమాయనను ఆశ్రయించినపుడు మన ఆత్మను ఆయన యెదుట కుమ్మరించుటకు యిలా స్వేచ్ఛగా మాట్లాడుటకు అపేక్షిస్తుంటాము. (కీర్తన 51:17; 65:2, 3) ఆ సమయంలో మనము మాటల్లో తడబడినా, “ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మతానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు,” వాటిని యెహోవా వినును. మన తలంపులను ఆయన తెలుసుకొన గలడు: “నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది.” అయినను, మనమడుగుతూ, వెదకుచూ, తట్టుచూ ఉండాలి.—రోమీయులు 8:26; కీర్తన 139:2, 4; మత్తయి 7:7, 8.
11. యెహోవా నిజంగా మనయెడల శ్రద్ధ వహిస్తున్నాడని ఎలా చూపబడింది?
11 యెహోవా శ్రద్ధచూపును. ఆయన సృజించిన ప్రాణులకు కావలసిన వాటిని ఆయన దయచేస్తాడు. “సర్వజీవుల కన్నులు నీవైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.” (కీర్తన 145:15, 16) పొదలలో ఉండే పక్షులకు ఆయన ఆహారమెట్లిస్తున్నాడో గమనించుడని మనకు పిలుపివ్వబడింది. పొలములో ఉండే గడ్డిపూలను చూడండి, ఆయన వాటిని ఎంత సౌందర్యంగా తీర్చిదిద్దాడు. దేవుడు వాటికి చేసిన దానికన్నా మరెంతో ఎక్కువ మనకు దయచేస్తాడని యేసు తెల్పాడు. కావున మనమెందుకు చింతించాలి? (ద్వితీయోపదేశకాండము 32:10; మత్తయి 6:26-32; 10:29-31) “ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి,” అని 1 పేతురు 5:7 మిమ్ము నాహ్వానిస్తున్నది.
“ఆయన తత్వము యొక్క మూర్తిమంతము”
12, 13. యెహోవాను ఆయన సృష్టిద్వారా, బైబిలులో వ్రాయబడిన ఆయన కార్యములద్వారా చూడడమే కాకుండా, మరింకే విధముగా మనమాయనను చూడగలము, ఆయన చెప్పేది వినగలము?
12 యెహోవాను ఆయన సృష్టి ద్వారా మనం చూడగలము; ఆయన కార్యాలను బైబిలునందు చదవడం ద్వారా మనమాయనను చూడగలం; యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడిన మాటలు, కార్యాలను బట్టి కూడ మనమాయనను చూడగలము. యేసు తానే యోహాను 12:45 నందు ఇలా చెబుతున్నాడు: “నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.” మరలా, యోహాను 14:9 నందు ఆయనిలా అన్నాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.” కొలొస్సయులు 1:15 యిట్లంటున్నది: “[యేసు] అదృశ్య దేవుని స్వరూపి.” హెబ్రీయులు 1:3 యిట్లంటున్నది: “[యేసు] దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునై యున్నాడు.”
13 యెహోవా తన కుమారుని కేవలం విమోచనను అనుగ్రహించుటకే పంపలేదు గాని, మాటయందు క్రియయందు కూడ అనుసరించదగు మాదిరి చూపుటకు పంపాడు. దేవుని మాటలను యేసు పలికాడు. ఆయన యోహాను 12:50 నందు యిలా చెప్పాడు: “నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను.” ఆయన తన స్వంత ఉద్దేశాలను నెరవేర్చలేదు, గాని దేవుడాయనకు చేయుమని చెప్పిన వాటినే చేశాడు. యోహాను 5:30 నందు ఆయనిలా అన్నాడు: “నా అంతట నేనే ఏమియు చేయలేను.”—యోహాను 6:38.
14. (ఎ) ఏ దృశ్యాలు యేసును కనికరము చూపుటకు నడిపాయి? (బి) యేసు మాట్లాడిన విధము ప్రజలు ఆయన మాటలను వినుటకు ఆయన యొద్దకు ఎందుకు నడిపింది?
14 కుష్టురోగులను, అంగవిహీనులను, చెవిటివారిని, గ్రుడ్డివారిని, దయ్యములు పట్టినవారిని, తమ మృతులకొరకు అంగలార్చు వారిని యేసు చూచాడు. ఆయన కనికరముతో వారిని స్వస్థపరచి, చనిపోయిన వారిని లేపాడు. ఆత్మీయంగా బలహీనులై చెదరగొట్టబడిన జనసమూహాలను ఆయన చూచి, వారికి అనేక సంగతులను బోధింప మొదలుపెట్టెను. సరైన పదాలతో ఆయన వారికి అనేక సంగతులను బోధించడమేకాక, యితరుల హృదయాల్లోకి సూటిగా దూసుకుపోగల మనోహరమైన మాటలను తన హృదయం నుండి బోధించడం వారిని ఆకర్షించింది, అది ఆయన మాటలను వినుటకు వారు దేవాలయానికి పెందలకడనే వచ్చేటట్లు చేసింది. ఆయన చెప్పేది ఉల్లాసముతో వినేందుకు వారు ఆయననే హత్తుకొనేటట్లు చేసింది. ‘ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదని’ చెబుతూ ఆయన చెప్పేది వినేందుకు వారు తండోపతండాలుగా వెళ్లారు. ఆయన బోధనా పద్ధతిని చూసి వారు విస్తుపోయారు. (యోహాను 7:46; మత్తయి 7:28, 29; మార్కు 11:18; 12:37; లూకా 4:22; 19:48; 21:38) ఆయన శత్రువులు ఆయన్ని ప్రశ్నలతో చిక్కుల్లో పడవేయాలని ప్రయత్నించినపుడు, పరిస్థితిని తారుమారు చేసి ఆయన వారినోరు మూయించాడు.—మత్తయి 22:41-46; మార్కు 12:34; లూకా 20:40.
15. యేసు చేసిన ప్రకటన పని మూలాంశమేమిటి, దానిని వ్యాప్తి చేయుటలో ఆయన యితరులను ఎంతమేరకు యిమడ్చాడు?
15 “పరలోకరాజ్యము సమీపించింది” అని ఆయన ప్రకటించి “దేవునిరాజ్యమును . . . మొదట” వెదకుడని వింటున్న వారిని వేడుకున్నాడు. “పరలోకరాజ్యము సమీపించిందని” ప్రకటించుడని, “భూదిగంతముల వరకు” క్రీస్తుకు సాక్షులుగా ఉండేందుకు “సమస్త జనులను శిష్యులనుగా చేయుమని” ఆయన అనేకులను పంపెను. ఆ కార్యాలను చేస్తూ, ఆయన అడుగుజాడలలో పయనిస్తున్న యెహోవాసాక్షులు నేడు దాదాపు 45 లక్షలమంది ఉన్నారు.—మత్తయి 4:17; 6:33; 10:7; 28:19; అపొస్తలుల కార్యములు 1:8.
16. యెహోవా ప్రేమ ఎలా కఠిన పరీక్షకు గురియైంది, అయితే మానవులకు అది ఏమి నెరవేర్చింది?
16 “దేవుడు ప్రేమాస్వరూపి” అని 1 యోహాను 4:8లో మనకు తెల్పబడింది. తన ఏకైక కుమారుని భూమిమీదికి చనిపోయేందుకు ఆయన పంపినప్పుడు ఆయనకున్న సాటిలేని ఈ లక్షణం ఎంత బాధకల్గించే పరీక్షకు గురియాయెనో ఊహించజాలము. తీవ్రమైన పరీక్షకు గురియైనప్పుడు తమ యథార్థతను నిలుపుకునే వారు భూమిమీద ఉండరని యెహోవాకు సాతాను చేసిన సవాలు అబద్ధమని యేసు రుజువుచేసిననూ తన ప్రియకుమారుడు అనుభవించిన మనోవ్యధ, ఆయన తన పరలోకపు తండ్రికి చేసిన విన్నపాలు యెహోవాను నొప్పించి యుండవచ్చు. యేసు చేసిన త్యాగాన్ని కూడ మనం ప్రశంసించాలి, ఎందుకంటే మనకొరకు చనిపోయేందుకు దేవుడాయనను పంపాడు. (యోహాను 3:16) అది తేలికగా, వెంటనే చనిపోయేటటు వంటిదికాదు. అందునుగూర్చి దేవునికి, యేసుకు ఎందుకు అభినందన చెల్లించాలో, వారు మనకొరకు చేసిన త్యాగంయొక్క గొప్పతనమేమిటో గ్రహించేందుకు ఆ ఏర్పాట్లను గూర్చిన బైబిలు వృత్తాంతాన్ని పరిశీలించుదము.
17-19. తన యెదుటనున్న కఠిన పరీక్షను యేసు ఎలా వర్ణించాడు?
17 మున్ముందు ఏమి జరుగనైయున్నదో యేసు తన అపొస్తలులకు కనీసం నాలుగు సార్లు వివరించాడు. ఈ సంఘటన జరుగుటకు కొన్ని రోజుల ముందు ఆయనిలా అన్నాడు: “ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనుల కప్పగించెదరు. వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమ్మివేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు.”—మార్కు 10:33, 34.
18 యేసు రోమనుల శిక్షాదండన ఎంత భయంకరమైనదో అర్థం చేసుకొని తనకు సంభవింపనైయున్న దానిని గూర్చిన వ్యాకులతను అనుభవించాడు. వారు ఉపయోగించిన కొరడాకున్న తోలు చీలికల చివర లోహము, గొర్రె ఎముకల ముక్కలు చొప్పించబడి ఉంటాయి; కొరడాతో కొట్టబడుతుండగా, ఆయన వీపు, కాళ్లపై చర్మం తెగి వ్రేలాడుతూ రక్తం స్రవించాయి. తన ముందున్న కఠిన పరీక్ష తనకు భావోద్రేక వత్తిడిని కల్గిస్తున్నదని యేసు కొన్ని నెలలముందే తెల్పుతూ లూకా 12:50లో యిలా అనడాన్ని మనం చదువుతాము: “అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది; అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను.”
19 సమయము సమీపించే కొలది ఆ వత్తిడి అధికమయ్యింది. అందును గూర్చి ఆయన తన పరలోకపు తండ్రితో మాట్లాడాడు: “ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును? తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని.” (యోహాను 12:27) తన ఏకైక కుమారుని నుండి వచ్చిన ఈ విజ్ఞాపనను బట్టి యెహోవా ఎంతగా చలించిపోయి యుండవచ్చు! తన మరణానికి కొన్ని గంటలముందు గెత్సేమనే నందు యేసు బహుగా కలతచెంది పేతురు, యాకోబు, యోహానులతో యిట్లనెను: “మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగియున్నది.” కొన్ని నిమిషాల తరువాత ఆ అంశాన్ని గూర్చి యెహోవాకు తన అంతిమ ప్రార్థననిలా చేశాడు: “తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము; అయినను నా యిష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక! . . . ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా “ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.” (మత్తయి 26:38; లూకా 22:42, 44) ఇది వైద్యపరంగా స్వేదరక్తమని పేర్కొనబడింది. అది అరుదేగాని భావోద్రేకంగా ఎంతో కృంగిపోతే అలా జరుగవచ్చును.
20. ఈ కఠిన పరీక్షను భరించడానికి యేసుకు ఏది సహాయపడింది?
20 గెత్సేమనేలో గడిపిన ఈ సమయాన్ని గూర్చి హెబ్రీయులు 5:7 యిలా అంటున్నది: “శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.” “తన్ను మరణము నుండి రక్షింపగలవాని” చేత ఆయన మరణము నుండి తప్పించబడలేదు కదా, మరి ఏ భావములో ఆయన ప్రార్థన అంగీకరించబడింది? లూకా 22:43 సమాధానమిస్తున్నది: “అప్పుడు పరలోకము నుండి యొక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.” ఆ కఠినపరీక్షను యేసు భరించునట్లుగా దేవుడు పంపిన దేవదూత ఆయనను బలపర్చిన విధంగా ఆ ప్రార్థనకు ప్రత్యుత్తర మియ్యబడింది.
21. (ఎ) యేసు ఈ కఠిన పరీక్షలో విజయవంతుడైనాడని ఏది చూపుతున్నది? (బి) మన శ్రమలు తీవ్రరూపం దాల్చినపుడు, మనమెలా మాట్లాడ గోరుదుము?
21 జరిగిన దానిని బట్టి యిది స్పష్టమైంది. తనలోని అంతరంగ పోరాటం సమసిపోయినప్పుడు యేసు లేచి, పేతురు, యాకోబు, యోహానుల యొద్దకు వచ్చి యిట్లన్నాడు: “లెండి వెళ్లుదము.” (మార్కు 14:42) నిజానికి ఆయన అనేదేమంటే, ‘ఒక్క ముద్దుతో అప్పగించబడడానికి, మూకచే బందించబడడానికి, అన్యాయంగా ఆరోపించబడి, తీర్పుపొందడానికి నన్ను వెళ్లనీయండి. అవహేళన చేయబడడానికి, ఉమ్మివేయబడడానికి, కొట్టబడడానికి, హింసాకొయ్యకు మేకులతో కొట్టబడటానికి, నన్ను వెళ్లనీయండి.’ ఆయన దానిపై ఆరు గంటలు వ్రేలాడి, మిక్కిలి బాధననుభవించి, చివరి వరకు సహించాడు. ఆయన చనిపోయే ముందు విజయసూచికగా “సమాప్తమాయెను!” అని గొప్ప కేకవేశాడు. (యోహాను 19:30) ఆయన స్థిరముగా ఉండి యెహోవా సర్వాధిపత్యాన్ని నిలువబెట్టుటలో తన యథార్థతను నిరూపించాడు. యెహోవా తనను భూమి మీదికి పంపి చేయుమన్న ప్రతి దానిని ఆయన నెరవేర్చాడు. మనం చనిపోయినప్పుడు లేదా హార్‌మెగిద్దోను తటస్థించినప్పుడు యెహోవా మనకు అప్పగించిన పనిని గూర్చి “సమాప్తమాయెను” అని చెప్పగలమా?
22. యోహోవాను గూర్చిన జ్ఞానము ఎంత విస్తృతంగా ఉంటుందో ఏది చూపుతున్నది?
22 ఏదిఏమైనను, అతివేగంగా సమీపిస్తున్న యెహోవా నిర్ణీత కాలమందు “సముద్రము జలముతో నిండియున్నట్లు, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండునని” మనం నిశ్చయముతో నుండగలము.—యెషయా 11:9.
మీకు జ్ఞాపకమున్నవా?
◻ తెలుసుకొనుట మరియు ఎరిగియుండుట అంటే అర్థమేమిటి?
◻ యెహోవా దయాదాక్షిణ్యత, క్షమించే గుణము ఆయన వాక్యములో మనకెలా చూపబడింది?
◻ అబ్రాహాము యెహోవాతో ఎలా స్వేచ్ఛగా మాట్లాడాడు?
◻ మనము యేసును చూచి ఆయనలో యెహోవా లక్షణాలను ఎందుకు చూడగలము?