క్రైస్తవ జీవితం పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ రెఫరెన్సులు
మే 1-7
దేవుని వాక్యంలో ఉన్న సంపద|యిర్మీయా 32-34
“ఇశ్రాయేలు మళ్లీ ముందున్న స్థితికి వస్తుంది అనడానికి ఒక గుర్తు”
(యిర్మీయా 32:6-9) అంతట యిర్మీయా ఇట్లనెను—యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 7 —నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి—అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే. దాని కొనుక్కొనుమని చెప్పును. 8 కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చి—బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని 9 నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమును కొని, పదియేడు తులముల వెండి తూచి అతనికిచ్చితిని.
(యిర్మీయా 32:15) ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఇండ్లును పొలములును ద్రాక్షతోటలును ఇంక ఈ దేశములో కొనబడును.
it-1 105 ¶2
అనాతోతు
యిర్మీయా అనాతోతు కాపురస్థుడు. సొంత ప్రజల గౌరవానికి నోచుకోని ఒక ప్రవక్త. యెహోవా దేవుని నుండి వచ్చిన నిజమైన సందేశాన్ని ప్రకటించినందుకు ప్రజలు అతన్ని చంపుతామని బెదిరించారు. (యిర్మీ 1:1; 11:21-23; 29:27) దాంతో యెహోవా ఆ నగరాన్ని నాశనం చేస్తానని ప్రవచించాడు. బబులోను ఆ దేశాన్ని ఆక్రమించినప్పుడు ఆ ప్రవచనం నెరవేరింది. (యిర్మీ 11:21-23) యెరూషలేము నాశనం అవ్వకముందు, సోదరుని ఆస్తిని పొందే విషయంలో చట్టపరంగా తనకున్న హక్కులను ఉపయోగించుకుని యిర్మీయా అనాతోతులోని ఒక స్థలాన్ని కొన్నాడు. ఆ నగరం మళ్లీ యథాస్థితికి వస్తుందని అనడానికి అది ఒక గుర్తుగా పనిచేసింది. (యిర్మీ 32:7-9) చెర నుండి విడుదలై వచ్చిన మొదటి గుంపులో జెరుబ్బాబెలుతో పాటు అనాతోతుకు చెందిన 128 మంది ఉన్నారు. చెర నుండి విడుదలైన ప్రజలు మళ్లీ నివాసమున్న ప్రాంతాల్లో అనాతోతు కూడా ఉంది. అలా యిర్మీయా ప్రవచనం నెరవేరింది.—ఎజ్రా 2:23; నెహె 7:27; 11:32.
(యిర్మీయా 32:10-12) నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి 11 క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని. 12 అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలుచేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరియెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని.
w07 3/15 11 ¶3
యిర్మీయా గ్రంథములోని ముఖ్యాంశాలు
32:10-15—ఒకే ఒడంబడికకు సంబంధించిన రెండు క్రయపత్రములు తయారుచేయడం యొక్క సంకల్పమేమిటి? ముద్రవేయబడని క్రయపత్రం సంప్రదించడానికి ఉంటుంది. అవసరమైతే దీని ఖచ్చితత్వాన్ని సరిచూడడానికి ముద్రవేయబడిన క్రయపత్రం ఉపయోగపడుతుంది. బంధువులతో లేక తోటి విశ్వాసులతో వ్యవహరించేటప్పుడు కూడా సహేతుకమైన చట్టబద్ధ విధానాలు అవలంబించడం ద్వారా యిర్మీయా మనకు మాదిరి ఉంచాడు.
(యిర్మీయా 33:7, 8) చెరలోనుండిన యూదావారిని ఇశ్రాయేలువారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. 8 వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలువకుండ వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని తిరుగుబాటులన్నిటిని క్షమించెదను.
jr 152 ¶22-23
“ఆలాగున చేయుటే నన్ను తెలిసికొనుట కాదా?”
22 ఎవరైనా అనాలోచితమైన మాటలతో లేదా పనులతో మిమ్మల్ని బాధపెడితే మీరు యెహోవాలా ప్రవర్తిస్తారా? ప్రాచీనకాలంలోని యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను క్షమించినవాళ్లను ‘పవిత్రపరుస్తానని’ దేవుడు అన్నాడు. (యిర్మీయా 33:8 చదవండి.) దేవుడు పశ్చాత్తాపపడిన వాళ్లను పవిత్రపర్చడం ద్వారా వాళ్లు చేసిన తప్పులన్నిటినీ మర్చిపోతున్నాడు. తన సేవను మళ్లీ కొత్తగా ప్రారంభించే అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుని క్షమాపణను పొందడమంటే, దానర్థం వారసత్వంగా వచ్చిన పాపం నుండి పవత్రపర్చబడ్డామని కాదు. అయితే దేవుడు మనుషుల్ని పవిత్రపర్చడం నుండి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. అదేమిటంటే, మనం కూడా ఇతరుల పొరపాట్లని లేదా తప్పుల్ని మర్చిపోవాలి. మరో మాటలో చెప్పాలంటే, మనల్ని బాధపెట్టిన వ్యక్తిపై మనకున్న అభిప్రాయాన్ని పవిత్రపర్చుకోవాలి. ఎలా?
23 ఒక వ్యక్తి మీకు, వారసత్వంగా వస్తున్న ఒక వస్తువును లేదా గాజు పాత్రను బహుమానంగా ఇచ్చారని ఊహించుకోండి. ఒకవేళ దానిమీద ఏదైనా మరకపడితే లేదా దుమ్ముచేరితే వెంటనే పడేస్తారా? అలా పడేయరు కదా! మీరు దానిపై ఉన్న మరకను, దుమ్మును తుడిచి శుభ్రం చేయడానికి చాలా కృషిచేస్తారు. మీరు దాని అందాన్ని, సూర్యకాంతి పడినప్పుడు దానిలో కనిపించే మెరుపును అలానే ఉంచాలనుకుంటారు. అదేవిధంగా మిమ్మల్ని బాధపెట్టిన సహోదరుడు లేదా సహోదరిపై మీకున్న ఎలాంటి కోపాన్నైనా ద్వేషాన్నైనా తీసేసుకోవడానికి అంతే కృషిచేయాలి. మిమ్మల్ని బాధపెట్టిన మాటల్ని లేదా ప్రవర్తనను గుర్తుచేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలా చేసినప్పుడు, మీరు క్షమించిన వ్యక్తిపై మీకున్న అభిప్రాయాన్ని, వాళ్లతో మీకున్న జ్ఞాపకాల్ని పవిత్రపర్చుకుంటారు. ఆ వ్యక్తిపై మీకున్న కోపం తాలూకు భావాల్ని ఎప్పుడైతే పూర్తిగా తీసేసుకుంటారో, తెగిపోయిన మీ స్నేహబంధాన్ని బాగుచేసుకుని మళ్లీ ఒకప్పటిలా చక్కని స్నేహితుల్లా ఉండగలుగుతారు.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(యిర్మీయా 33:15) ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతిచిగురును మొలిపించెదను; అతడు భూమిమీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును.
jr 173 ¶10
కొత్త ఒప్పందం నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు
10 యిర్మీయా రాబోతున్న మెస్సీయను దావీదు ‘చిగురుతో’ పోల్చాడు. అలా పోల్చడం సరైనదే. యిర్మీయా ఇంకా ప్రవక్తగా ఉన్నప్పుడే దావీదు రాజవంశం ఆగిపోయింది. అయితే మొద్దు పూర్తిగా చచ్చిపోలేదు. దావీదు రాజు వంశంలోనే యేసు పుట్టాడు. “యెహోవా మనకు నీతి” అనే పేరు అతనికి పెట్టబడింది. యెహోవా ఆ లక్షణాన్ని ఎంత ప్రాముఖ్యంగా ఎంచుతాడో ఆ పేరు సూచిస్తుంది. (యిర్మీయా 23:5, 6 చదవండి.) తన ఒక్కగానొక్క కుమారుడు ఈ భూమిపై కష్టాల్ని అనుభవించి చనిపోయేందుకు యెహోవా అనుమతిచ్చాడు. అప్పుడు యెహోవా తన న్యాయప్రమాణాల్ని అనుసరిస్తూ, దావీదు “చిగురు” రక్తం ఆధారంగా మనుషుల పాపాల్ని క్షమిస్తాడు. (యిర్మీ. 33:15) ఆ రక్తం ఆధారంగానే కొంతమంది మనుషులు “నీతిమంతులుగా” తీర్పుతీర్చబడి పవిత్రశక్తితో అభిషేకించబడతారు. అంతేకాదు కొత్త ఒప్పందంలో భాగమౌతారు. ఆ ఒప్పందంతో నేరుగా సంబంధంలేని ఇతరులు కూడా ఆ ఒప్పందం నుండి ప్రయోజనం పొందవచ్చు. అది యెహోవా నీతికి ఒక నిదర్శనం.—రోమా. 5:18.
(యిర్మీయా 33:23, 24) మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 24 తాను ఏర్పరచుకొనిన రెండు కుటుంబములను యెహోవా విసర్జించెననియు, నా ప్రజలు ఇకమీదట తమ యెదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది గదా.
w07 3/15 11 ¶4
యిర్మీయా గ్రంథములోని ముఖ్యాంశాలు
33:23, 24—ఇక్కడ ప్రస్తావించబడిన “రెండు కుటుంబములు” ఏవి? ఒకటి, రాజైన దావీదు వంశం నుండి వచ్చే రాజ కుటుంబం, మరొకటి అహరోను సంతానపు యాజక కుటుంబం. యెరూషలేము, యెహోవా ఆలయము నాశనం చేయబడడంతో, యెహోవా ఈ రెండు కుటుంబాలను తిరస్కరించినట్లు, ఇక భూమిపై ఒక రాజ్యం ఉండదన్నట్లు, ఆయన ఆరాధన తిరిగి స్థాపించబడదన్నట్లు కనిపించింది.
చదవాల్సిన బైబిలు భాగం
(యిర్మీయా 32:1-12) యూదారాజైన సిద్కియా యేలుబడి పదియవ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి పదునెనిమిదవ సంవత్సరమున యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. 2 ఆ కాలమున బబులోనురాజుదండు యెరూషలేమునకు ముట్టడివేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా—యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోనురాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాని పట్టుకొనును, 3 యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలోనుండి తప్పించుకొనక బబులోనురాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును, సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులార అతని చూచును, 4 అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును, నేను అతని దర్శించువరకు అతడక్కడనే యుండును; ఇదే యెహోవా వాక్కు; 5 మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు, అను మాటలు నీవేల ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించి యుండెను; కాగా ప్రవక్తయైన యిర్మీయా యూదా రాజు మందిరములోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను. 6 అంతట యిర్మీయా ఇట్లనెను—యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 7 —నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి—అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే. దాని కొనుక్కొనుమని చెప్పును. 8 కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చి—బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని 9 నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమును కొని, పదియేడు తులముల వెండి తూచి అతనికిచ్చితిని. 10 నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి 11 క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని. 12 అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలుచేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదులందరియెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని.
మే 8-14
దేవుని వాక్యంలో ఉన్న సంపద|యిర్మీయా 35-38
“ఎబెద్మెలెకు ధైర్యానికి, దయకు మంచి ఉదాహరణ”
(యిర్మీయా 38:3-6) 3-4మత్తాను కుమారుడైన షెఫట్యయును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా—ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడేగాని క్షేమము కోరువాడుకాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. 5 అందుకు రాజైన సిద్కియా—అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా 6 వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతి లోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.
it-2 1228 ¶3
సిద్కియా
యిర్మీయా ప్రజల నమ్మకాన్ని నీరుగారుస్తున్నాడనే నెపంతో సిద్కియా అతన్ని చంపమనే ఆజ్ఞ జారీచేశాడు. దీన్నిబట్టి సిద్కియా చాలా బలహీనమైన పరిపాలకుడని తెలుస్తోంది. సిద్కియా రాజు ఇలా చెప్పాడు, ‘అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడు.’ కానీ ఆ తర్వాత ఎబెద్మెలెకు చేసుకున్న విన్నపం మేరకు, 30 మంది పురుషులను తీసుకెళ్లి యిర్మీయాను రక్షించడానికి అనుమతించాడు. ఆ తర్వాత సిద్కియా యిర్మీయాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఇకపై ఎన్నడూ అతనిని చంపనని లేదా అతని చావును కోరుకునే మనుషులకు అప్పగించనని యిర్మీయాకు మాటిచ్చాడు. కానీ కల్దీయుల పక్షాన ఉన్న యూదులు తనను అపహాస్యం చేస్తారోమోనని సిద్కియా భయపడ్డాడు. దాంతో బబులోను రాజుకు లొంగిపొమ్మని యిర్మీయా ఇచ్చిన సలహాను సిద్కియా పట్టించుకోలేదు. అయితే తాను, యిర్మీయా మధ్య జరిగిన సంభాషణను ఎవ్వరికీ చెప్పొద్దని యిర్మీయాను అడగడం ద్వారా తన భయాన్ని సిద్కియా మరోసారి బయటపెట్టాడు.—యిర్మీ 38:1-28.
(యిర్మీయా 38:7-10) 7-8 రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు, వారు యిర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులో నుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను. 9 రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము, అతడున్న చోటను అతడు ఆకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టెలేమియు లేవు. 10 అందుకు రాజు—నీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్తయైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా
w12 5/1 31 ¶2-3
తనను సేవించే వాళ్లందరికీ ఆయన ప్రతిఫలమిస్తాడు
ఎబెద్మెలెకు ఎవరు? యూదా రాజైన సిద్కియా ఆస్థానంలో అతను ఒక అధికారి. నమ్మకంగాలేని యూదా రాజ్యానికి రాబోయే నాశనాన్ని ప్రకటించడానికి దేవుడు పంపించిన యిర్మీయా జీవించిన కాలంలోనే ఎబెద్మెలెకు జీవించాడు. తాను ఎవరి కిందైతే పనిచేస్తున్నాడో ఆ ప్రధానులు దైవభయం లేకపోయినా, ఎబెద్మెలెకు మాత్రం దైవభయం కలిగివున్నాడు, యిర్మీయాను కూడా చాలా గౌరవించాడు. దుష్టులైన ప్రధానులు యిర్మీయా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడనే నిందవేసి అతన్ని చంపడానికి బురద గోతిలో పడేయించాడు. ఇప్పుడు ఎబెద్మెలెకు లక్షణాలు పరీక్షకు గురౌతాయి. (యిర్మీయా 38:4-6) ఎబెద్మెలెకు ఏమి చేస్తాడు?
రాజు కోపానికి గురౌతాననే భయాన్ని పక్కకుపెట్టి, ఎబెద్మెలెకు ధైర్యంగా, వివేచనతో చర్య తీసుకున్నాడు. అతను అందరు చూస్తుండగానే రాజు దగ్గరికి వెళ్లి, యిర్మీయాపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్న రాజు తీరును ఖండించాడు. బహుశా నిందితులవైపు చూపిస్తూ అతను రాజుతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా యెడల ఈ మనుష్యులు చేసినది అన్యాయము.’ (యిర్మీయా 38:9) ఎబెద్మెలెకు మాట నెగ్గింది, సిద్కియా ఆజ్ఞ మేరకు అతను 30 మంది పురుషులను తీసుకుని యిర్మీయాను రక్షించడానికి వెళ్లాడు.
(యిర్మీయా 38:11-13) 11-12 ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి, అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొని పోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపి—పాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను. 13 యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.
w12 5/1 31 ¶4
తనను సేవించే వాళ్లందరికీ ఆయన ప్రతిఫలమిస్తాడు
ఎబెద్మెలెకు ఇప్పుడు మరో మంచి లక్షణాన్ని చూపించాడు, అదే దయ. అతను “పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొని పోయి, యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపారు.” ఎందుకు? ఎందుకంటే యిర్మీయాను గోతిలో నుండి పైకి లాగుతున్నప్పుడు అతని చర్మం తాళ్ల రాపిడికి గాయపడకుండా ఉండేలా చంకల కింద ఆ గుడ్డలను పెట్టుకునేందుకు వీలుగా వాటిని ఇచ్చాడు.—యిర్మీయా 38:11-13.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(యిర్మీయా 35:19) ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా—నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడునుండక మానడు.
it-2 759
రేకాబీయులు
వాళ్లు చూపించిన గౌరవం, విధేయత యెహోవాకు నచ్చాయి. వాళ్లు తమ మానవ తండ్రి చెప్పిన మాటను ఏమాత్రం జవదాటలేదు. అందుకు భిన్నంగా యూదులు మాత్రం తమ సృష్టికర్తకు పూర్తి అవిధేయతను చూపించారు. (యిర్మీ 35:12-16) దానికి ప్రతిఫలంగా దేవుడు రేకాబీయులకు ఇలా మాటిచ్చాడు, “నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడునుండక మానడు.”—యిర్మీ 35:19.
(యిర్మీయా 37:21) కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహశాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.
w98 1/15 18 ¶16-17
దేవునితో కూడ నడవడంలో కొనసాగండి
16 మెస్సీయా రాజ్యం క్రింద మనం అనుభవించే ఉపశమనం గురించి ప్రేమపూర్వకంగా యెహోవా మనకు చెబుతున్నాడు. (కీర్తన 72:1-4, 16; యెషయా 25:7, 8) మన జీవిత ప్రాధాన్యతలను ఎలా సరిచేసుకోవచ్చో సలహా ఇవ్వడం ద్వారా నేటి జీవిత ఒత్తిళ్లను ఎదుర్కోవడం ఎలాగో కూడా ఆయన మనకు నేర్పిస్తున్నాడు. (మత్తయి 4:4; 6:25-34) గతకాలంలో తాను తన సేవకులకు ఎలా సహాయం చేశాడో వాటి వివరణల నివేదికల ద్వారా యెహోవా మనకు హామీనిస్తున్నాడు. (యిర్మీయా 37:21; యాకోబు 5:11) మనపైకి ఎటువంటి దుస్థితి వచ్చిపడినా తన యథార్థ సేవకులపట్ల తన ప్రేమ నిరంతరమూ ఉంటుందన్న జ్ఞానముతో ఆయన మనల్ని దృఢపరుస్తున్నాడు. (రోమీయులు 8:35-39) యెహోవాపై తమ నమ్మకాన్ని ఉంచేవారికి ఆయనిలా ప్రకటిస్తున్నాడు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.”—హెబ్రీయులు 13:5.
17 ఈ జ్ఞానము మూలంగా బలపర్చబడిన నిజ క్రైస్తవులు లోకస్థుల మార్గాల్లోకి మళ్లడానికి బదులుగా దేవునితోకూడ నడవడంలో కొనసాగుతారు. ఒకరు తమ కుటుంబాన్ని పోషించడానికి, ఉన్నవాళ్ల దగ్గరినుండి తీసుకోవడం దొంగతనం కాదు అనేది చాలా దేశాల్లోని బీద ప్రజల్లో సాధారణంగా ఉన్న ఇహలోక తత్వం. కానీ విశ్వాసంవలననే నడుచుకునేవారు ఆ దృక్కోణాన్ని విసర్జిస్తారు. అన్నింటికీ మించి దేవుని అంగీకారం అమూల్యమైనదిగా వారు ఎంచుతారు, నిజాయితీతో కూడిన తమ ప్రవర్తనకు ప్రతిఫలం కొరకు వారు ఆయనవైపుకి చూస్తారు. (సామెతలు 30:8, 9; 1 కొరింథీయులు 10:13; హెబ్రీయులు 13:18) ఇండియాలోని ఒక విధవరాలు పనిచేయడానికి ఇష్టపడడమూ, దానితోపాటు సాధనోపాయాల్ని కొనుగొనడమూ తనకు సహాయపడ్డాయని తెలుసుకుంది. జీవితంలో తన పరిస్థితిపట్ల ఉక్రోషంతో ఉండడానికి బదులుగా, దేవుని రాజ్యాన్నీ ఆయన నీతిని తన జీవితంలో మొదట ఉంచితే, తనకు తన కుమారునికి అవసరమయ్యే జీవితావసరాలను తీర్చుకునేందుకు తాను చేసే ప్రయత్నాల్ని యెహోవా ఆశీర్వదిస్తాడని ఆమెకు తెలుసు. (మత్తయి 6:33, 34) తాము అనుభవించే దుస్థితి ఎటువంటిదైనప్పటికీ భూవ్యాప్తంగా వేలాదిమంది యెహోవా తమ ఆశ్రయమని తమ కోట అని ప్రదర్శించి చూపిస్తున్నారు. (కీర్తన 91:2) అది మీ విషయంలోనూ వాస్తవమేనా?
w95 8/1 5 ¶5-6
మంచికాలాలు ముందున్నాయి
తర్వాత, మతభ్రష్టమైన యెరూషలేమును బబులోను రాజు ముట్టడించినప్పుడు, ప్రజలు “తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె” భుజించాల్సి వచ్చింది. (యెహెజ్కేలు 4:16) వారి పరిస్థితి ఎంతగా విషమించిందంటే, కొందరు స్త్రీలు తమ స్వంత బిడ్డల మాంసాన్నే భక్షించారు. (విలాపవాక్యములు 2:20) అయినా, ప్రచారంచేయడం వల్ల ప్రవక్తైన యిర్మీయా ఖైదు చేయబడినప్పటికీ, “పట్టణములో రొట్టెలున్నంతవరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె [యిర్మీయాకు] అతనికిచ్చుచు” ఉండేలా యెహోవా చూశాడు.—యిర్మీయా 37:21.
రొట్టెలు అయిపోయినప్పుడు యెహోవా యిర్మీయాను మర్చిపోయాడా? లేదని స్పష్టమౌతోంది, ఎందుకంటే ఆ పట్టణం బబులోను వారిచేతుల్లో పడినప్పుడు, యిర్మీయాకు ‘బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనం’పడం జరిగింది.—యిర్మీయా 40:5, 6; కీర్తన 37:25 కూడా చూడండి.
చదవాల్సిన బైబిలు భాగం
(యిర్మీయా 36:27-37:2) యిర్మీయా నోటిమాటనుబట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 28 —నీవు మరియొక గ్రంథము తీసికొని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము. 29 మరియు యూదా రాజైన యెహోయాకీమునుగూర్చి నీవీమాట చెప్పవలెను—యెహోవా సెలవిచ్చునదేమనగా—బబులోనురాజు నిశ్చయముగా వచ్చి యీ దేశమును పాడుచేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండ చేయునని ఇందులో నీవేల వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే; 30 అందుచేతను యూదారాజైన యెహోయాకీమునుగూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు—దావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలునగును. 31 నేను వారి దోషమునుబట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారినిగూర్చి చెప్పిన కీడంతయు వారిమీదికిని యెరూషలేము నివాసులమీదికిని యూదా జనులమీదికిని రప్పించుచున్నాను; అయినను వారు వినినవారుకారు. 32 యిర్మీయా యింకొక గ్రంథమును తీసికొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకుచేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటిమాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని వ్రాసెను; మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను.
37 బబులోనురాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను. 2 అతడైనను అతని సేవకులైనను దేశప్రజలైనను యెహోవా ప్రవక్తయైన యిర్మీయాచేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు.
మే 15-21
దేవుని వాక్యంలో ఉన్న సంపద|యిర్మీయా 39-43
“ప్రతి ఒక్కరికి వాళ్ల పనులను బట్టి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు”
(యిర్మీయా 39:4-7) యూదులరాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను. 5 అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోనురాజైన నెబుకద్రెజరునొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి. 6 బబులోనురాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను. 7 అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.
it-2 1228 ¶4
సిద్కియా
యెరూషలేము నాశనం. చివరిగా (సా.శ.పూ. 607), “సిద్కియా పరిపాలనలోని 11వ సంవత్సరం,” “నాలుగో నెల తొమ్మిదో రోజున” యెరూషలేము మీద ముట్టడి జరిగింది. రాత్రికిరాత్రే సిద్కియా అలాగే సైనికులు పారిపోయారు. యెరికో దగ్గరున్న మైదానంలో సిద్కియా పట్టుబడ్డాడు. అతన్ని రిబ్లాలో ఉన్న నెబుకద్నెజరు దగ్గరకు తీసుకెళ్లారు. సిద్కియా కళ్లముందే అతని కొడుకులను చంపేశారు. అప్పటికి సిద్కియా వయసు దాదాపు 32 ఏళ్లే కాబట్టి అతని కొడుకులు చాలా చిన్నవాళ్లు అయ్యుంటారు. తన కొడుకుల చావును చూసిన తర్వాత సిద్కియా కళ్లు పీకేసి, రాగి సంకెళ్లు వేసి, బబులోనుకు తీసుకెళ్లారు. అతను చనిపోయే వరకు అక్కడే ఒక ఇంట్లో ఖైదీగా బంధించారు.—2 రాజు 25:2-7; యిర్మీ 39:2-7; 44:30; 52:6-11; యిర్మీ 24:8-10 పోల్చండి; యెహె 12:11-16; 21:25-27.
(యిర్మీయా 39:15-18) యిర్మీయా బందీగృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 16 —నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము—ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—మేలుచేయుటకై కాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను; నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. 17 ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గముచేత పడవు, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు; ఇదే యెహోవా వాక్కు.
w12 5/1 31 ¶5
తనను సేవించే వాళ్లందరికీ ఆయన ప్రతిఫలమిస్తాడు
ఎబెద్మెలెకుకు చేసినదాన్ని యెహోవా చూశాడు. మరి ఆయన ఎబెద్మెలెకును మెచ్చుకున్నాడా? యూదా త్వరలోనే ఖచ్చితంగా నాశనం చేయబడుతుందని యెహోవా యిర్మీయా ద్వారా ఎబెద్మెలెకుకు తెలియజేశాడు. తర్వాత యెహోవా ఎబెద్మెలెకును కాపాడాడు. దేవుడు ఇచ్చిన ఆ రక్షణను ఒక విద్వాంసుడు “ఐదింతల రక్షణ హామీ” అని పిలుస్తున్నాడు. యెహోవా ఇలా చెప్పాడు, “నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని . . . నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గముచేత పడవు, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు.” యెహోవా ఎబెద్మెలెకును కాపాడతానని ఎందుకు మాటిచ్చాడు? ఎందుకంటే “నీవు నన్ను నమ్ముకొంటివి గనుక” అని యెహోవా చెప్పాడు. (యిర్మీయా 39:16-18) ఎబెద్మెలెకు అలా ప్రవర్తించడానికి కారణం అతనికి యిర్మీయా మీదున్న గౌరవం ఒక్కటే కాదుగానీ అతనికి దేవుని మీదున్న నమ్మకం, విశ్వాసం బట్టి కూడా.
(యిర్మీయా 40:1-6) రాజదేహసంరక్షకుల కధిపతియైన నెబూజరదాను యెరూషలేములో నుండియు యూదాలోనుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలోనుండి, సంకెళ్లచేత కట్టబడియున్న యిర్మీయాను తీసికొని రామాలో నుండి పంపివేయగా, యెహోవాయొద్దనుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. 2 రాజదేహసంరక్షకుల కధిపతి యిర్మీయాను అవతలికి తీసికొనిపోయి అతనితో ఈలాగు మాటలాడెను—ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసెదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా. 3 తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపముచేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీగతి పట్టినది. 4 ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను, నాతో కూడ బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచినయెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను; అయితే బబులోనునకు నాతో కూడ వచ్చుట మంచిదికాదని నీకు తోచినయెడల రావద్దు, దేశమంతట నీకేమియు అడ్డములేదు, ఎక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో, యెక్కడికి వెళ్లుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్లుము. 5 ఇంకను అతడు తిరిగి వెళ్లక తడవు చేయగా రాజదేహసంరక్షకుల కధిపతి అతనితో ఈలాగు చెప్పెను—బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదాపట్టణములమీద నియమించి యున్నాడు, అతని యొద్దకు వెళ్లుము; అతని యొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకుల కధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా 6 యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితోకూడ దేశములో మిగిలిన ప్రజలమధ్య కాపురముండెను.
it-2 482
నెబూజరదాను
నెబూజరదాను రాజైన నెబుకద్నెజరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, యిర్మీయాను విడుదల చేసి అతనితో దయగా మాట్లాడాడు. తనకు ఇష్టమొచ్చినది చేసే స్వేచ్ఛను యిర్మీయాకు ఇచ్చి, అతని బాగోగులు చూసుకుంటానని చెప్తూ అతనికి కొంత ఆహారాన్ని ఇచ్చాడు. నెబూజరదాను బబులోను రాజుకు ప్రతినిధి కూడా. అతనే మిగిలిన జనులందరిమీద గెదల్యాను అధిపతిగా నియమించాడు. (2 రాజు 25:22; యిర్మీ 39:11-14; 40:1-7; 41:10) దాదాపు ఐదు సంవత్సరాలైన తర్వాత, సా.శ.పూ. 602లో నెబూజరదాను ఇతర యూదుల్ని చెరగా తీసుకెళ్లాడు. బహుశా వాళ్లు చుట్టుపక్కల ఉన్న ఊళ్లకు పారిపోయినవాళ్లు అయ్యుండవచ్చు.—యిర్మీ 52:30.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(యిర్మీయా 42:1-3) అంతలో సేనాధిపతులందరును కారేహ కుమారుడైన యోహానానును హోషేయా కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరును ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి 2 —మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థనచేయుము. 3 మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక
(యిర్మీయా 43:2) హోషేయా కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును యిర్మీయాతో ఇట్లనిరి—నీవు అబద్ధము పలుకుచున్నావు—ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్లకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.
(యిర్మీయా 43:4) కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనల యధిపతులందరును ప్రజలందరును యూదాదేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి.
w03 5/1 10 ¶10
‘యెహోవా ఎక్కడ ఉన్నాడు’ అని మీరు అడుగుతారా?
10 యెరూషలేమును నాశనం చేసి, యూదులను చెరబట్టి బబులోను సైన్యం వెళ్ళిపోయిన తర్వాత, యూదాలో మిగిలిపోయిన చిన్న గుంపు యూదులను ఐగుప్తుకు తీసుకువెళ్ళడానికి యోహానాను సిద్ధమయ్యాడు. పథకాలన్నీ సిద్ధమయ్యాయి, కానీ బయలుదేరడానికి ముందు వారు తమ తరఫున ప్రార్థించి యెహోవా మార్గనిర్దేశం కోసం అర్థించమని యిర్మీయాను అడిగారు. అయితే తమకు కావలసిన సమాధానం వారికి లభించనప్పుడు వాళ్ళు అలాగే ముందుకు కొనసాగి తాము వేసుకున్న పథకం ప్రకారమే చేశారు. (యిర్మీయా 41:16-43:7) మీరు యెహోవా కోసం వెదకినప్పుడు ఆయనను మీరు కనుగొనగలిగేలా మీకు ప్రయోజనం చేకూర్చగల పాఠాలను మీరు పైన ప్రస్తావించబడిన సంఘటనల్లో చూడగలుగుతున్నారా?
(యిర్మీయా 43:5-7) 5-6 మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల యధిపతులందరును యెహోవా మాట విననివారై, యూదాదేశములో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశములనుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజ దేహసంరక్షకుల కధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు యిర్మీయాను నేరీయా కుమారుడగు బారూకును తోడుకొనిపోయి 7 ఐగుప్తుదేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా
it-1 463 ¶4
కాలవృత్తాంతం
సిద్కియా పరిపాలనలోని తొమ్మిదవ సంవత్సరంలో యెరూషలేము చివరిసారిగా ముట్టడి వేయబడింది (సా.శ.పూ. 609), అతని పరిపాలనలోని 11వ సంవత్సరంలో నగరం నాశనం చేయబడింది (సా.శ.పూ. 607), అప్పటికి నెబుకద్నెజరు పరిపాలన మొదలుపెట్టి 19వ సంవత్సరం (అతను సింహాసనం అధిష్ఠించిన సంవత్సరం నుండి అంటే సా.శ.పూ. 625 నుండి లెక్కిస్తే). (2 రాజు 25:1-8) ఆ సంవత్సరంలోని ఐదవ నెలలో (జూలై/ఆగస్టు నెలలకు సరిసమానమైన అబ్ నెలలో) యెరూషలేమును కాల్చేశారు, గోడలను నేలమట్టం చేశారు, చాలామంది ప్రజల్ని బంధీలుగా తీసుకెళ్లారు. అయితే “దేశపు బీదజనములో కొందరిని” మాత్రం ఉండనిచ్చారు. అయితే నెబుకద్నెజరు నియమించిన అధిపతైన గెదల్యా చనిపోయేంత వరకు మాత్రమే వాళ్లు అక్కడ ఉండగలిగారు. ఆ తర్వాత వాళ్లు ఈజిప్టుకు పారిపోయారు. అలా యూదా దేశం నిర్జనం ప్రదేశంగా మారిపోయింది. (2రాజు 25:9-12, 22-26) అది ఏడవ నెల అయిన ఏతనీములో జరిగింది (లేదా సెప్టెంబరు/అక్టోబరు నెలలకు సరిసమానమైన తిష్రీ నెలలో). కాబట్టి బబులోను 70 సంవత్సరాల వరకు నిర్జనంగా ఉంటుందనే ప్రవచనం సా.శ.పూ. 607 అక్టోబరు 1న మొదలయ్యి సా.శ.పూ. 537లో ముగిసి ఉండాలి. సా.శ.పూ. 537లోని ఏడవ నెలలో యూదులు తమ స్వదేశమైన యూదాకు తిరిగొచ్చారు. ఆ ప్రదేశం నిర్జనంగా మారిన 70 ఏళ్ల తర్వాత వాళ్లు మళ్లీ అక్కడికి వచ్చారు—2 దిన 36:21-23; ఎజ్రా 3:1.
చదవాల్సిన బైబిలు భాగం
(యిర్మీయా 40:11-41:3) మోయాబులోనేమి అమ్మోనీయుల మధ్యనేమి ఎదోములో నేమి యే యే ప్రదేశములలో నేమి యున్న యూదులందరు బబులోనురాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారిమీద నియమించెననియు వినినప్పుడు 12 అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యాయొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి. 13 మరియు కారేహ కుమారుడైన యోహానానును, అచ్చటచ్చటనున్న సేనల యధిపతులందరును మిస్పాలోనున్న గెదల్యాయొద్దకు వచ్చి 14 —నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. 15 కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను—నీయొద్దకు కూడివచ్చిన యూదులందరు చెదరిపోవునట్లును, యూదా జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేల? దయచేసి నన్ను వెళ్లనిమ్ము, ఎవనికి తెలియకుండ నేను వానిని చంపెదను. 16 అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతో—ఇష్మాయేలునుగూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవాకార్యము చేయకూడదనెను.
41 ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పది మంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి. 2 అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబులోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి. 3 మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదుల నందరిని, అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను.
మే 22-28
దేవుని వాక్యంలో ఉన్న సంపద|యిర్మీయా 44-48
“నీ నిమిత్తము నీవు గొప్పవాటిని’ వెదకవద్దు”
(యిర్మీయా 45:2, 3) బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు 3 కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొనుచున్నావు.’
jr 104-105 ¶4-6
“‘నీ నిమిత్తము నీవు గొప్పవాటిని’ వెదకవద్దు”
4 బారూకు గొప్పవాటిగా ఎంచుతున్న వాటిలో ఒహుశా పేరుప్రఖ్యాతలు, పలుకుబడి సంపాదించడం ఉండివుండవచ్చు. బారూకు యిర్మీయా దగ్గర లేఖికునిగా పనిచేసినప్పటికీ, అతను యిర్మీయా సొంత కార్యదర్శి మాత్రమే అయ్యుండకపోవచ్చు. యిర్మీయా 36:32లో ‘లేఖికుడగు బారూకు’ అని చెప్పబడింది. పురావస్తు ఆధారాల ప్రకారం బారూకు రాజగృహంలో ఒక పెద్ద స్థానంలో ఉండేవాడని తెలుస్తోంది. నిజానికి యూదా ప్రధానుల్లో ఒకడైన ‘లేఖికుడైన ఎలీషామాకు’ ఉపయోగించిన బిరుదునే బారుకుకు కూడా ఉపయోగించారు. దీన్నిబట్టి “రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి” ఎలీషామా తోటివాడిగా వెళ్లే అవకాశం బారూకుకు కూడా ఉందని అర్థమౌతుంది. (యిర్మీ. 36:11, 12, 14) అయితే, బారూకు రాజగృహంలో విద్యావంతుడైన అధికారి అయ్యుంటాడు. అతని తమ్ముడైన శెరాయా రాజైన సిద్కియా దగ్గర దండు భోజనసామగ్రికి అధికారిగా పనిచేస్తున్నాడు. ఒక ప్రాముఖ్యమైన పనిమీద సిద్కియా రాజు బబులోనుకు వెళ్తున్నప్పుడు శెరాయా కూడా వెళ్లాడు. (యిర్మీయా 51:59 చదవండి.) దండు భోజనసామగ్రికి అధికారిగా శెరాయాకు, బహుశా రాజు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మార్గంలో అతనికి కావాల్సినవి అలాగే ఉండడానికి ఆశ్రయాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉండివుంటుంది. కాబట్టి అతనికి పెద్ద స్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు.
5 రాజగృహంలో పనిచేయడానికి అలవాటుపడిన ఒక వ్యక్తిని, యూదా నాశనానికి సంబంధించిన సందేశాలను ఒకదాని తర్వాత ఒకటి రాయమన్నప్పుడు అతనికి ఎంత అలసటగా అనిపించి ఉంటుందో మీరు ఊహించవచ్చు. నిజానికి, దేవుని ప్రవక్తకు మద్దతివ్వడం వల్ల బారూకు స్థానం, ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. యిర్మీయా 45:4 చెప్తున్నట్లు, యెహోవా తాను కట్టినదానినే పడగొట్టినప్పుడు పర్యావసానాలు ఎలా ఉంటాయో ఊహించండి. బారూకు మనసులో ఉన్న గొప్పవి అంటే రాజగృహంలో మరింత గొప్ప స్థానాన్ని పొందడం కావచ్చు లేదా వస్తుసంపదలు కావచ్చు అవి ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ఒకవేళ బారూకు నాశనం కాబోతున్న అప్పటి యూదా వ్యవస్థలో భద్రతనిచ్చే ఒక స్థానం గురించి వెతుకుతూ ఉండివుంటే, యెహోవా అతని ఆలోచనను సరిదిద్దడానికి చర్య తీసుకోవడం సరైనదే.
6 మరోవైపు, బారూకు వెతుకుతున్న ‘గొప్పవాటిలో’ వస్తుసంపదలు కూడా ఉండవచ్చు. యూదా చుట్టూ ఉన్న జనాంగాలు ఎక్కువగా వస్తుసంపదలమీదే ఆధారపడేవి. మోయాబు దాని ‘క్రియలపై, నిధులపై’ నమ్మకం పెట్టుకుంది. అమ్మోను కూడా అలాగే చేసింది. యెహోవా బబులోను గురించి మాట్లాడుతూ “నిధుల సమృద్ధిగలదానా” అని వర్ణించాడు. (యిర్మీ. 48:1, 7; 49:1, 4; 51:1, 13) కానీ నిజమేమిటంటే, దేవుడు ఈ జనాంగాలను తిరస్కరించాడు.
(యిర్మీయా 45:4, 5ఎ) నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు—నేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించుచున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. 5 నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు;
jr 103 ¶2
“‘నీ నిమిత్తము నీవు గొప్పవాటిని’ వెదకవద్దు”
2 “కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసియున్నాను” అని బారూకు అన్నాడు. బహుశా మీరు కూడా పైకి వినిపించేలా లేదా మనసులో బాధతో మూలిగిన సందర్భాలు ఉండివుంటాయి. బారూకు ఎలా మూలిగినప్పటికీ యెహోవా విన్నాడు. బారూకు ఎందుకు బాధపడుతున్నాడో హృదయ పరిశోధకుడైన యెహోవాకు తెలుసు అందుకే ఆయన యిర్మీయా ద్వారా బారూకును దయగా సరిదిద్దాడు. (యిర్మీయా 45:1-5 చదవండి.) బారూకు ఎందుకు అంతగా బాధపడుతున్నాడోనని మీకు అనిపించవచ్చు. అతనికి ఇచ్చిన నియామకం వల్లా లేదా అతను పనిచేయాల్సిన పరిస్థితులను బట్టా? అతని భావాలు హృదయంలోంచి బయటికి వచ్చాయి. బారూకు “గొప్పవాటిని” వెదికాడు. అవేమిటి? ఒకవేళ బారూకు దేవుని సలహాను, నిర్దేశాన్ని పాటిస్తే ఏమి జరుగుతుందని యెహోవా అభయాన్ని ఇచ్చాడు? మరి బారూకు అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
(యిర్మీయా 45:5బి) నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
w16.07 8 ¶6
వస్తుసంపదల్ని కాదు రాజ్యాన్ని వెదకండి
6 యిర్మీయా కార్యదర్శి అయిన బారూకు గురించి ఓసారి ఆలోచించండి. అతను “గొప్పవాటి” కోసం ప్రాకులాడుతున్నప్పుడు, తాను త్వరలోనే యెరూషలేమును నాశనం చేస్తానని యెహోవా గుర్తుచేశాడు. అయితే అతని ప్రాణాన్ని కాపాడతానని యెహోవా మాటిచ్చాడు. (యిర్మీ. 45:1-5) అంతకన్నా ఎక్కువేదీ బారూకు ఆశించి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణంతోపాటు అందులోని ప్రజల ఆస్తుల్ని కూడా నాశనం చేయబోతున్నాడు. (యిర్మీ. 20:5) నేడు మనం సాతాను లోకం అంతమయ్యే సమయానికి చాలా దగ్గర్లో జీవిస్తున్నాం. మనకోసం ఆస్తుల్ని సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. అంతేకాదు ఇప్పుడు మనకున్న ఆస్తులు ఎంత విలువైనవైనా సరే, అవి మహాశ్రమలు తర్వాత కూడా ఉంటాయని అనుకోకూడదు.—సామె. 11:4; మత్త. 24:21, 22; లూకా 12:15.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(యిర్మీయా 48:13) ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు
it-1 430
కెమోషు
యిర్మీయా ప్రవక్త భవిష్యత్తులో మోయాబుకు రాబోయే ముప్పు గురించి ముందే చెప్తూ దాని ప్రధాన దేవుడైన కెమోషుతోపాటు దాని యాజకులు, అధిపతులు చెరలోకి వెళ్తారని చెప్పాడు. ఇశ్రాయేలీయుల పదిగోత్రాల రాజ్యం బేతేలులో దూడను ఆరాధించారు. వాళ్లు ఆ పనినిబట్టి బేతేలు విషయంలో సిగ్గుపడినట్టే, మోయాబీయులు కూడా కాపాడే శక్తి లేని తమ దేవుని విషయంలో సిగ్గుపడతారని యిర్మీయా చెప్పాడు.—యిర్మీ 48:7, 13, 46.
(యిర్మీయా 48:42) మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండ నిర్మూలమాయెను.
it-2 422 ¶2
మోయాబు
మోయాబుకు సంబంధించిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరాయి, వాటిని మనం కొట్టిపారేయలేం. శతాబ్దాల క్రితమే మోయాబీయులు ఒక జనాంగంగా కనుమరుగైపోయారు. (యిర్మీ 48:42) నేడు మోయాబు పట్టణాలుగా పిలవబడుతున్న నెబో, హెష్బోను, అరోయేరు, బేత్గామూలు, బయల్మెయోను శిథిలావస్థలో ఉన్నాయి. చాలా ఇతర ప్రాంతాలైతే అసలు ఏమైపోయాయో కూడా తెలీదు.
చదవాల్సిన బైబిలు భాగం
(యిర్మీయా 47:1-7) ఫరో గాజాను కొట్టకమునుపు ఫిలిష్తీయులనుగూర్చి ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు 2 —యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లుగాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించువారిమీదను ప్రవహించును. 3 వారి బలమైన గుఱ్ఱముల డెక్కలు నేలతన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుమువంటి ధ్వనికిని తండ్రులు భయపడి బలహీనులై తమ పిల్లలతట్టు తిరిగి చూడరు. 4 ఫిలిష్తీయులనందరిని లయపరచుటకును, తూరు సీదోనులకు సహాయకుడొకడైనను నిలువకుండ అందరిని నిర్మూలము చేయుటకును దినము వచ్చుచున్నది. యెహోవా కఫ్తోరు ద్వీపశేషులైన ఫిలిష్తీయులను నాశనము చేయును, 5 గాజా బోడియాయెను, మైదానములో శేషించిన అష్కెలోను నాశనమాయెను. ఎన్నాళ్లవరకు నిన్ను నీవే గాయపరచుకొందువు? 6 యెహోవా ఖడ్గమా, యెంతవరకు విశ్రమింపక యుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండుము. 7 అష్కెలోనుమీదికిని సముద్ర తీరముమీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా; నీవేలాగు విశ్రమించుదువు? —అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.
మే 29–జూన్ 4
దేవుని వాక్యంలో ఉన్న సంపద|యిర్మీయా 49-50
“వినయం గలవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు, అహంకారులను శిక్షిస్తాడు”
(యిర్మీయా 50:4-7) ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదా వారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు. 5 ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై అచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు. 6 నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱెలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొనిపోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. 7 కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరి వారి శత్రువులు—మేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు.
(యిర్మీయా 50:29-32) బబులోనునకు రండని విలుకాండ్రను పిలువుడి విల్లు త్రొక్కువారలారా, మీరందరు దానిచుట్టు దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది ఇశ్రాయేలు పరిశుద్ధునిమీద గర్వపడినది దానిలో నొకడును తప్పించుకొనకూడదు దాని క్రియలనుబట్టి దానికి ప్రతికారము చేయుడి అది చేసిన పనియంతటినిబట్టి దానికి ప్రతికారము చేయుడి. 30 కావున ఆ దినమున దాని యౌవనస్థులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరు తుడిచివేయబడుదురు ఇదే యెహోవా వాక్కు. 31 ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే—గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై యున్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించుకాలము వచ్చుచున్నది 32 గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును అతని లేవనెత్తువాడెవడును లేకపోవును నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను అది అతని చుట్టుపట్టులన్నిటిని కాల్చివేయును.
it-1 54
శత్రువు
దేవుని ప్రజలు నమ్మకంగా లేనప్పుడు, తమ శత్రువులు వచ్చి వాళ్లను దోచుకొని వాళ్లపై విజయం సాధించేలా దేవుడు అనుమతించాడు. (కీర్త 89:42; విలా 1:5, 7, 10, 17; 2:17; 4:12) అయితే శత్రువులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని, తమ సొంత శక్తివల్లే దేవుని ప్రజలను ఓడించగలిగామని భావిస్తూ, తమ దేవుళ్లను స్తుతించారు. అంతేకాదు దేవుని ప్రజలతో వాళ్లు వ్యవహరించిన తీరు విషయంలో లెక్క అప్పజెప్పాల్సిన అవసరం లేదని అనుకున్నారు. (ద్వితీ 32:27; యిర్మీ 50:7) కాబట్టి గర్వంతో ఉప్పొంగుతున్న శత్రువులకు యెహోవా ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సి వచ్చింది (యెష 1:24; 26:11; 59:18; నహూ 1:2); ఆయన తన పేరును పరిశుద్ధపర్చుకోవడానికి అలా చేశాడు.—యెష 64:2; యెహె 36:21-24.
(యిర్మీయా 50:38, 39) నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు. 39 అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును నిప్పుకోళ్లును దానిలో నివాసముచేయును ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.
jr 161 ¶15
యెహోవా తాను అనుకున్న ప్రకారమే చేశాడు
15 ఐగుప్తును జయించిన, బబులోను పతనం గురించి కూడా యిర్మీయా ప్రవచించాడు. అది జరగడానికి ఒక శతాబ్దం ముందే, బబులోను హఠాత్తుగా నాశనం అవుతుందని యిర్మీయా ఖచ్చితంగా ప్రవచించాడు. ఎలా? దానికి రక్షణలా ఉన్న నీళ్లు ‘ఇంకిపోతాయని,’ బలవంతులైన దాని మనుషులు యుద్ధం చేయలేకపోతారని కూడా దేవుని ప్రవక్త ముందే చెప్పాడు. (యిర్మీ. 50:38; 51:30) మాదీయులు, పారసీకులు యూఫ్రటీసు నదిని పక్కకు మళ్లించి, దాని గుండా నడుచుకుంటూ బబులోను పట్టణాన్ని ప్రవేశించి, బబులోనీయులను ఆశ్చర్యపరచినప్పుడు దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేరాయి. అది ఎవ్వరూ ఉండడానికి పనికిరాని భూమిగా మారుతుందని చెప్పిన ప్రవచనం కూడా అంతే ఖచ్చితంగా నెరవేరిందని మనం నమ్మవచ్చు. (యిర్మీ. 50:39; 51:26) ఈ రోజుకు కూడా ఒకప్పుడు శక్తివంతమైన బబులోను శిథిలావస్థలో ఉండడం, దేవుడు చెప్పింది ఖచ్చితంగా నెరవేరుతుంది అనడానికి రుజువుగా ఉంది.
w98 4/1 20 ¶20
దేవుని నుండి వచ్చిన గ్రంథం
20 నిర్మానుష్యంగా తయారైన బబులోనును చూడ్డానికి యెషయా జీవించిలేడు. కానీ ప్రవచించినట్లుగానే, బబులోను కేవలం “కసవు దిబ్బలుగా” మారింది. (యిర్మీయా 51:37) (సా.శ. నాల్గవ శతాబ్దంలో జన్మించిన) హెబ్రీ పండితుడైన జెరోమ్ అభిప్రాయం ప్రకారం, బబులోను తన కాలానికెల్లా వేటాడే స్థలంగా మారింది. అందులో “సకల మృగాలు” తిరిగేవి. బబులోను ఈనాటి వరకూ నిర్మానుష్యంగానే ఉంది. పర్యటనకు ఆకర్షణీయమైన స్థలంగా బబులోనును తీర్చిదిద్దేందుకు చేసే పునరుద్ధరణలేవైనా సందర్శకుల్ని ఆకట్టుకోవచ్చేమో గానీ యెషయా ప్రవచించినట్లుగానే బబులోను ‘కుమారుడూ మనుమడూ’ శాశ్వతంగా గతించిపోయారు.—యెషయా 14:22.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
(యిర్మీయా 49:1, 2) అమ్మోనీయులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయెనా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు? 2 కాగా—యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు—రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధముయొక్క ధ్వని వినబడజేసెదను; అది పాడుదిబ్బయగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును, దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
it-1 94 ¶6
అమ్మోనీయులు
బహుశా తిగ్లత్పిలేసరు III, అలాగే అతని వారసుల్లో ఒకరు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి చెందినవాళ్లను చెరగా తీసుకెళ్లిన తర్వాత (2 రాజు 15:29; 17:6), అమ్మోనీయులు గాదు గోత్రీకుల ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టి ఉంటారు. వీళ్లు ఒకప్పుడు ఆ ప్రాంతం కోసమే యెఫ్తా మీద యుద్ధం చేసి ఓడిపోయారు. (కీర్త 83:4-8 పోల్చండి) కాబట్టి, యెహోవా యిర్మీయా ద్వారా ప్రవచిస్తూ, గాదీయుల స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకున్నందుకు అమ్మోనీయుల మీద కోప్పడ్డాడు. అంతేకాదు అమ్మోను మీద, దాని దేవుడైన మాల్కోము (మిల్కోమ్) మీద రాబోయే నాశనం గురించి హెచ్చరించాడు. (యిర్మీ 49:1-5) యూదయ రాజ్య పరిపాలన ముగిసే సమయంలో, అమ్మోనీయులు ఒక అడుగు ముందుకేసి యెహోయాకీము పరిపాలిస్తున్న యూదాలోని ప్రజల్ని బాధించడానికి దోపిడీ ముఠాలను పంపించారు.—2 రాజు 24:2, 3.
(యిర్మీయా 49:17, 18) ఎదోము పాడైపోవును, దా మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు. 18 సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.
jr 163 ¶18
యెహోవా తాను అనుకున్న ప్రకారమే చేశాడు
18 మరో ప్రవచనం కూడా మొదటి శతాబ్దంలో నెరవేరింది. బబులోనీయులు జయించే జనాంగాల్లో ఎదోము కూడా ఉంటుందని దేవుడు యిర్మీయా ద్వారా ముందే చెప్పాడు. (యిర్మీ. 25:15-17, 21; 27:1-7) కానీ దానికన్నా ఎక్కువే జరుగుతుందని దేవుని వాక్యం చెప్పింది. ఎదోము సొదోమ-గొమొర్రాలా అవుతుంది. అంటే, ఇక ఎప్పటికీ దానిలో ఎవ్వరూ నివసించరు, అది కనుమరుగైపోతుంది. (యిర్మీ. 49:7-10, 17, 18) సరిగ్గా అదే జరిగింది. ఈరోజు ఎదోము, ఎదోమీయులు అనే పేర్లు ఎక్కడ కనిపిస్తాయి? ఆధునిక కాల మ్యాపుల్లో కనిపిస్తాయా? కనిపించవు. అవి ముఖ్యంగా ప్రాచీన పుస్తకాల్లో, బైబిలు చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో లేదా ఆ కాలంనాటి మ్యాపుల్లో కనిపిస్తాయి. సా.శ.పూ. రెండవ శతాబ్దంలో యూదా మతాన్ని స్వీకరించమని ఎదోమీయులు బలవంతం చేయబడ్డారని ఫ్లేవియస్జోసిఫస్ చెప్పాడు. దాని తర్వాత, సా.శ. 70లో యెరూషలేము నాశనంతో వాళ్లు ఒక జనాంగంగా కనుమరుగైపోయారు.
ip-2 351 ¶6
యెహోవా తనకు ఘనమైన పేరు కలుగజేసుకుంటాడు
6 అయితే, యెహోవా ఎదోములో జరిగిన యుద్ధం నుండి ఎందుకు తిరిగి వస్తున్నాడు? తమ పితరుడైన ఏశావుతో ప్రారంభమైన శత్రుత్వాన్ని కొనసాగిస్తున్న ఎదోమీయులు దేవుని నిబంధన ప్రజలకు ప్రాచీనకాలం నుండి శత్రువులు. (ఆదికాండము 25:24-34; సంఖ్యాకాండము 20:14-21) యూదాపట్ల ఎదోముకు ఎంత ద్వేషం ఉందో, యెరూషలేము నాశనం సమయంలో బబులోను సైనికులను ప్రోత్సహిస్తూ ఎదోమీయులు కేకలు వేసినప్పుడు ప్రాముఖ్యంగా స్పష్టమయ్యింది. (కీర్తన 137:7) యెహోవా అలాంటి శత్రుత్వాన్ని, వ్యక్తిగతంగా తనను బాధపెట్టినట్లుగా పరిగణిస్తాడు. ఆయన ఎదోముపైకి తన ప్రతీకార ఖడ్గాన్ని దూయడానికి నిశ్చయించుకున్నాడంటే అందులో ఆశ్చర్యం లేదు.—యెషయా 34:5-15; యిర్మీయా 49:7-22.
చదవాల్సిన బైబిలు భాగం
(యిర్మీయా 50:1-10) బబులోనును గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్తయైన యిర్మీయాద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు 2 —జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నొందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నొందును దాని బొమ్మలు బోర్లద్రోయబడును 3 ఉత్తరదిక్కునుండి దానిమీదికి ఒక జనము వచ్చుచున్నది ఏ నివాసియు లేకుండ అది దాని దేశమును పాడుచేయును మనుష్యులేమి పశువులేమి అందరును పారిపోవుదురు అందరును తర్లిపోవుదురు. 4 ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలువారును యూదా వారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవాయొద్ద విచారించుటకై వచ్చెదరు. 5 ఎన్నటికిని మరువబడని నిత్యనిబంధన చేసికొని యెహోవాను కలిసికొందము రండని చెప్పుకొనుచు సీయోనుతట్టు అభిముఖులై అచ్చటికి వెళ్లు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యెహోవా వాక్కు. 6 నా ప్రజలు త్రోవతప్పిన గొఱ్ఱెలుగా ఉన్నారు వారి కాపరులు కొండలమీదికి వారిని తోలుకొనిపోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండకొండకు వెళ్లుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. 7 కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరి వారి శత్రువులు—మేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు. 8 బబులోనులోనుండి పారిపోవుడి కల్దీయుల దేశములోనుండి బయలువెళ్లుడి మందలకు ముందు మేకపోతులు నడుచునట్లు ముందర నడువుడి. 9 ఉత్తరదేశమునుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దానిమీదికి యుద్ధపంక్తులు తీర్చుచున్నారు వారి మధ్యనుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడుసొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. 10 కల్దీయుల దేశము దోపుడుసొమ్మగును దాని దోచుకొను వారందరు సంతుష్టి నొందెదరు ఇదే యెహోవా వాక్కు.