కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 4/1 పేజీలు 4-8
  • ఇవి నిజంగా అంత్యదినాలేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇవి నిజంగా అంత్యదినాలేనా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు శిష్యులు అర్థవంతమైన ప్రశ్న అడుగుతారు
  • యెరూషలేము అంతం
  • అంత్య దినాల్లో యుద్ధం
  • సూచన యొక్క ఇతర అంశాలు
  • మన తరాన్ని గురించే ప్రవచించబడిందా?
  • సువార్త
  • మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ‘‘అంత్యదినములలో’’ మనమున్నామని మనకెలాతెలుసు
    దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
  • మీరు అనుకున్నదానికంటే అది ఆలస్యముగా ఉన్నదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనల గురించి యేసు ప్రవచించాడు
    బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 4/1 పేజీలు 4-8

ఇవి నిజంగా అంత్యదినాలేనా?

మీరు పడవలోని ముందుభాగంలో కూర్చుని ఉన్నారు. అది నదిలోని ఒక భయంకరమైన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. ఎగిసిపడుతున్న నీటిలో నుండి, నురగల్లోనుండి గండుశిలలు అస్పష్టంగా కనబడ్తున్నాయి. మీరు వాటిని తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. మీ వెనక కూర్చున్న వ్యక్తి నావను నడపడంలో మీకు సహాయం చేయాలి, కానీ అతనికంత అనుభవంలేదు. సమస్యల్లో సమస్యగా, మీ వద్ద మ్యాపేలేదు, కాబట్టి ఈ ఉద్ధృతమైన ప్రవాహం ప్రశాంతంగా ఉన్న కొలనులోకి నడిపిస్తుందా లేక ఒక జలపాతంలోనుండి క్రిందకు పడేస్తుందా అనే విషయం కూడా మీకు తెలియదు.

అది అంత ఆహ్లాదకరమైన దృశ్యం కాదు కదా? కాబట్టి మరో దృశ్యాన్ని ఊహించుకుందాం. ఈ నదిలోని ప్రతి బండనూ ప్రతి వంపును గురించీ బాగా తెలిసిన ఒక అనుభవజ్ఞుడైన గైడ్‌ మీతోపాటూ ఉన్నాడని ఊహించుకోండి. నురగలతో ప్రవహిస్తున్న నీరున్న ప్రాంతం రాబోతుందని అతనికి ఎంతో ముందే తెలుసు, ఆ నీరు ఎక్కడికి ప్రవహిస్తుందో కూడా అతనికి తెలుసు, అంతేకాదు దానిగుండా ఎలా ప్రయాణించాలో కూడా అతనికి తెలుసు. మీరిప్పుడు మరింత సురక్షితంగా ఉన్నట్లు భావించరా?

వాస్తవానికి, మనందరం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాము. మనం మన తప్పేమీ లేకపోయినా మానవ చరిత్రలోని భయంకరమైన ప్రాంతంలో జీవిస్తున్నాము. పరిస్థితులు ఇలా ఎంతకాలం కొనసాగుతాయో, లేక పరిస్థితులు మెరుగుపడతాయో లేక ఈలోగా మనుగడను ఎలా సాగించాలి అనే విషయాలను గురించి అనేకులకు తెలియదు. అయితే మనం దారి తప్పిపోయినట్లు లేక నిస్సహాయులైన్నట్లు భావించనక్కరలేదు. మన సృష్టికర్త మనకు ఒక గైడ్‌ను ఇచ్చాడు, అది చరిత్రలోని భయంకరమైన ఈ కాలాలను గురించి ముందే ప్రవచించింది, అవెలా ముగుస్తాయో ప్రవచించింది మరియు మనం బ్రతికి ఉండేందుకు అవసరమైన నడిపింపును మనకు అందిస్తుంది. ఆ గైడ్‌ బైబిలు గ్రంథమే. దాని గ్రంథకర్తయైన యెహోవా దేవుడు తనను తానే ఒక మహోపదేశకునిగా చెప్పుకుంటున్నాడు మరియు యెషయా ద్వారా నిశ్చయతనిస్తూ ఇలా చెబుతున్నాడు: “మీరు కుడికిగాని ఎడమకుగాని తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని వెనుకనుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును.” (యెషయా 30:20, 21, NW) మీరు అలాంటి నడిపింపును ఆహ్వానిస్తారా? మన దినాలు ఎలా ఉంటాయనే విషయాన్ని బైబిలు నిజంగా ముందే ప్రవచించిందో లేదో మనం ఇప్పుడు పరిశీలిద్దాము.

యేసు శిష్యులు అర్థవంతమైన ప్రశ్న అడుగుతారు

యేసు అనుచరులు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. యెరూషలేము యొక్క ప్రభావవంతమైన ఆలయ కట్టడాలు సంపూర్ణంగా నాశనమౌతాయని యేసు వారికి ఇంతకు క్రితమే ఎంతో స్పష్టంగా చెప్పాడు! అలాంటి ప్రవచనం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. కొంతసమయం తర్వాతే, వారు ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా, నలుగురు శిష్యులు యేసును ఇలా అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును [“ప్రత్యక్షతకును,” NW] ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుము.” (మత్తయి 24:3; మార్కు 13:1-4) వారు గుర్తించినా గుర్తించకపోయినా, యేసు ఇచ్చిన సమాధానానికి అనేక అన్వయింపులు ఉంటాయి.

యెరూషలేము ఆలయం యొక్క వినాశనమూ యూదా విధానాంతమూ కూడా జరిగిన సమయమూ క్రీస్తు ప్రత్యక్షతా యావత్‌ లోకాంతం జరుగు సమయమూ ఒకటికాదు. అయినప్పటికీ, యేసు తన సుదీర్ఘ సమాధానంలో ప్రశ్న యొక్క ఈ అంశాలన్నింటికీ నైపుణ్యవంతంగా సమాధానమిచ్చాడు. యెరూషలేము వినాశనానికి ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన వారికి చెప్పాడు; అంతే కాకుండా ఆయన ప్రత్యక్షత సమయంలో అంటే ఆయన పరలోకంలో రాజుగా పరిపాలిస్తుండే మరియు సర్వ జగత్తును అంతమొందించేందుకు సిద్ధమౌతుండే సమయంలో ప్రపంచ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ఆయన వారికి చెప్పాడు.

యెరూషలేము అంతం

యెరూషలేమును గురించి దాని ఆలయాన్ని గురించి యేసు ఏమి చెప్పాడో మొదట పరిశీలించండి. దాదాపు మూడు దశాబ్దాలకు ముందే, ప్రపంచంలోని అతి గొప్ప పట్టణాల్లో ఒకదానికి కలిగే భయంకరమైన కష్ట సమయాలను గురించి ఆయన ప్రవచించాడు. లూకా 21:20, 21 నందు రికార్డు చేయబడిన ఆయన మాటలను ప్రత్యేకంగా గమనించండి: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింప కూడదు.” యెరూషలేమును సైన్యం చుట్టు ముట్టితే, “దాని మధ్యనుండువారు” యేసు ఆజ్ఞాపించిన విధంగా ఎలా ‘వెలుపలికి పోగలరు’? ఒక అవకాశ ద్వారం తెరువబడుతుందని యేసు స్పష్టంగా సూచిస్తున్నాడు. అది తెరువబడిందా?

సా.శ. 66లో, సెస్టియస్‌ గాలస్‌ ఆజ్ఞ మేరకు రోమా సైన్యాలు యూదా తిరుగుబాటు గుంపులను వెనక్కి యెరూషలేములోకి తరిమికొట్టి పట్టణంలోనే దిగ్భంధం చేశాయి. రోమా సైన్యం పట్టణంలోకి వెళ్లి దేవాలయ గోడను కూడా చేరుకోగలిగింది. అయితే అప్పుడు గాలస్‌ తన సైన్యాలను వాస్తవంగా ఎంతో ఆశ్చర్యకరమైనది చేయమని నిర్దేశించాడు. వారిని వెనక్కి మరలమని ఆయన ఆజ్ఞాపించాడు! ఆనందభరితులైన యూదా సైనికులు వెంటాడి, పారిపోతున్న తమ రోమా శత్రువులకు హాని కలిగించారు. అలా, యేసు ముందే చెప్పిన అవకాశ ద్వారం తెరుచుకుంది. నిజ క్రైస్తవులు ఆయన హెచ్చరికను విని యెరూషలేము విడిచి వెళ్లిపోయారు. వారలా చేయడం జ్ఞానవంతమైన నిర్ణయమే, ఎందుకంటే కేవలం నాలుగు సంవత్సరాల తర్వాత రోమా సైన్యాలు జనరల్‌ టైటస్‌ నడిపింపు క్రింద వెనక్కి తిరిగి వచ్చాయి. ఈసారి తప్పించుకోవడం సాధ్యం కాలేదు.

రోమా సైన్యాలు మరల యెరూషలేమును చుట్టుముట్టాయి; వారు దాని చుట్టూ మొనదేలిన కర్రలతో కంచెను కట్టారు. యెరూషలేమును గురించి యేసు ప్రవచించాడు: “నీ శత్రువులు నీ చుట్టు [“మొనదేలిన కర్రలతో కంచె కట్టి,” NW] గట్టు కట్టి ముట్టడివేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టు” కాలం వస్తుంది.a (లూకా 19:43) త్వరలోనే, యెరూషలేము వారి చేతుల్లో నాశనమయ్యింది; దాని ఘనమైన ఆలయం కాలిన దిబ్బగా మారింది. యేసు మాటలు అత్యంత సంపూర్ణంగా నెరవేరాయి!

అయినా, యెరూషలేము నాశనానికంటే ఎక్కువ విషయాలను గురించే యేసు ఆలోచిస్తున్నాడు. తన ప్రత్యక్షత యొక్క సూచనను గురించి కూడా ఆయన శిష్యులు ఆయనను అడిగారు. అయితే ఆ విషయం గురించి వారికి అప్పుడు తెలియదు కానీ, ఇది ఆయన పరలోకంలో రాజుగా స్థాపించబడే సమయాన్ని గురించి సూచిస్తుంది. ఆయన ఏమని ప్రవచించాడు?

అంత్య దినాల్లో యుద్ధం

మీరు మత్తయి 24, 25 అధ్యాయాలను, మార్కు 13వ అధ్యాయాన్ని మరియు లూకా 21వ అధ్యాయాన్ని చదివితే యేసు మన కాలాలను గురించి మాట్లాడాడనేందుకు మీరు నిక్కచ్చియైన రుజువును చూస్తారు. మానవచరిత్రను ఎల్లప్పుడూ పీడించిన “యుద్ధములనుగూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు” మాత్రమే కాదు గానీ ‘జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచి’ యుద్ధాలు చేసే సమయాన్ని గురించి అవును, అంతర్జాతీయ మహా యుద్ధాలను గురించి ఆయన ప్రవచించాడు.—మత్తయి 24:6-8.

మన శతాబ్దంలో యుద్ధ పోరాటాలు ఎలా మారిపోయాయో ఒక క్షణం ఆలోచించండి. గతంలో యుద్ధం అంటే రెండు శత్రు రాజ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సైన్యాలు రణరంగంలో ఒకరినొకరు ఖడ్గాలతో నరుక్కోవడం ద్వారానో లేక తుపాకీలతో కాల్చుకోవడం ద్వారానో దాడి చేసుకోవడమే, అదే చాలా భయంకరంగా ఉండేది. అయితే 1914లో మహా యుద్ధం మొదలయ్యింది. డామినో ప్రభావం మూలంగా ఒక దేశం వెంబడి మరో దేశం దహనకాండలోనికి ప్రవేశించాయి, అది మొదటి భౌగోళిక యుద్ధం. వీలైనంత ఎక్కువమంది ప్రజలను, అత్యంత దూర ప్రాంతాలనుండి చంపేందుకు స్వయంచాలక ఆయుధాలు రూపొందించబడ్డాయి. మిషీన్‌ గన్నులు అత్యంత నైపుణ్యవంతంగా తూటాలను వ్రెళ్లగక్కాయి; మస్టర్డ్‌ వాయువు వేల సంఖ్యల్లో సైనికులను కాల్చింది, పీడించింది, అంగహీనులను చేసింది చివరికి చంపింది; యుద్ధ ట్యాంకులు శత్రువర్గ సరిహద్దు ప్రాంతాల్లోకి నిర్దాక్షిణ్యంగా నడిపించబడ్డాయి, వాటి తుపాకీలు తూటాలను వెళ్లగ్రక్కుతూ గర్జించాయి. విమానాలూ జలాంతర్గాములు కూడా ఉపయోగించబడ్డాయి, అయితే అవి రాబోయే వాటికి అగ్రగాములు మాత్రమే.

రెండవ ప్రపంచ యుద్ధం అనూహ్యమైనది చేసింది, అది కోట్లాదిమంది ప్రజలను హతమార్చుతూ వాస్తవానికి మొదటి ప్రపంచ యుద్ధాన్ని స్వల్పమైనదిగా చేసింది. తేలే నగరాల్లా కనిపించే పెద్ద పెద్ద విమానవాహక నౌకలు, సముద్రంలో ప్రయాణిస్తూ ఆకాశంనుండి శత్రువర్గాలపై మరణకరమైన బాంబులను కురిపించేందుకు యుద్ధ విమానాలను విడుదల చేశాయి. జలాంతర్గాములు శత్రువుల ఓడలను ధ్వంసంచేసి ముంచివేశాయి. ఆటంబాంబులు వేయబడ్డాయి, అవి వేయబడిన ప్రతిసారి వేల కొలది ప్రాణాలను బలిగొన్నాయి! యేసు ప్రవచించిన విధంగానే, యుద్ధతృష్ణగల ఈ కాలాన్ని సూచించేందుకు వాస్తవంగానే “మహా భయోత్పాతములు” కలిగాయి.—లూకా 21:11.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలు తగ్గిపోయాయా? ఎంతమాత్రం కాదు. కొన్నిసార్లు ఒక సంవత్సరంలో అక్షరార్థంగానే డజన్ల కొద్దీ యుద్ధాలు జరిగాయి, అవి ఈ 1990వ దశకంలో కూడా లక్షలమంది జీవితాలను బలిగొంటున్నాయి. మరి యుద్ధానికి ప్రథమంగా బలయ్యే వారు ఇప్పుడు మారుతున్నారు. ఇప్పుడు సైనికులే ముఖ్యంగా మరణించడం లేదు. నేడు, నిజానికి యుద్ధంలో హతులౌతున్న వారిలో ఎక్కువమంది అంటే 90 కంటే ఎక్కువ శాతం మంది పౌరులే.

సూచన యొక్క ఇతర అంశాలు

యేసు ప్రస్తావించిన సూచనలో యుద్ధం ఒక అంశం మాత్రమే. “కరవులు” ఉంటాయని కూడా ఆయన హెచ్చరించాడు. (మత్తయి 24:8) పూర్తి భిన్నంగా, మొత్తం మానవజాతికి కావలసిన దానికంటే ఎక్కువ ఆహారాన్ని భూమి పండిస్తున్నప్పటికీ, మానవచరిత్రలో ఎప్పటికంటే కూడా ఇప్పుడు వ్యవసాయ విజ్ఞానం పురోభివృద్ధి చెందినప్పటికీ, ప్రపంచంలో ఎక్కడికైనా ఆహారాన్ని సమర్థవంతంగానూ త్వరగానూ రవాణా చేయగలిగేందుకు రవాణా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కరువులున్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ ప్రపంచ జనాభాలో దాదాపు ఐదవ వంతు ప్రతిరోజు ఆకలితో అలమటిస్తున్నారు.

“అక్కడక్కడ . . . తెగుళ్లు . . . తటస్థించును” అని కూడా యేసు ప్రవచించాడు. (లూకా 21:11) మళ్లీ మన కాలం ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని చూసింది, ఎప్పటికంటే కూడా శ్రేష్ఠమైన వైద్య సంరక్షణా, వైజ్ఞానికంగా పురోభివృద్ధి చెందినా, సామాన్యంగా వచ్చే అనేక వ్యాధులను నివారించేందుకు వ్యాధినిరోధక టీకాలున్నా తెగుళ్ల వంటి వ్యాధులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వెనువెంటనే స్పానిష్‌ ఇన్‌ఫ్లుయెన్‌జా వచ్చి యుద్ధం కంటే ఎక్కువ మందిని బలిగొన్నది. ఈ వ్యాధి ఎంతటి అంటురోగమంటే, న్యూయార్క్‌ వంటి పట్టణాల్లో ప్రజలు కేవలం తుమ్మినందుకే వారికి జరిమానా పడేది లేక వారిని జైలులో వేయడం జరిగేది! నేడు, క్యాన్సర్‌ మరియు హృద్రోగాలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్నాయి—సిసలైన తెగుళ్లే. మరి ఎయిడ్స్‌ అలా జీవితాలను పొట్టనబెట్టుకుంటూనే ఉంది, దానికి వైద్యశాస్త్రం ఇంతవరకు మందును కనుగొనలేదు.

యేసు అంత్యదినాలను గురించి చర్చించినప్పుడు ఆయన ముఖ్యంగా అప్పుడు కలిగే విస్తృతమైన చారిత్రాత్మక మరియు రాజకీయ పరిస్థితులను గురించే చర్చించాడు, అయితే అపొస్తలుడైన పౌలు అంత్యదినాల్లో ఉండే సాంఘిక సమస్యలపై మరియు ప్రబలివుండే దృక్పథాలను గురించి ఎక్కువగా చర్చించాడు. ఆయన కొంతభాగాన్ని ఇలా వ్రాశాడు: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు . . . అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు . . . అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు.”—2 తిమోతి 3:1-5.

ఈ మాటలు మీకు బాగా పరిచయమున్నవిగా అనిపిస్తున్నాయా? నేటి ప్రపంచంలోని సామాజిక క్షీణతల్లో ఒకటైన కుటుంబ విచ్ఛిన్నమనే ఒక అంశాన్ని పరిశీలించండి. విచ్ఛిన్నమైన గృహాలు, భార్యలను కొట్టడం, పిల్లలను పీడించడం, వృద్ధులైన తలిదండ్రులను అలక్ష్యం చేయడంవంటివి, ప్రజలు వెల్లువలా ముంచెత్తడం “అనురాగరహితులు,” “క్రూరులు,” “ద్రోహులు” మరియు “సజ్జనద్వేషులు” అనే విషయాల్ని ఎంతో స్పష్టంగా చూపుతున్నాయ్‌! అవును, ఈ దృక్పథాలు ఒక మహామారిలా ప్రాకిపోవడాన్ని నేడు మనం చూస్తున్నాము.

మన తరాన్ని గురించే ప్రవచించబడిందా?

‘ఈ పరిస్థితులు మానవజాతిని ఎప్పుడూ పీడించేవే కదా? ఈ ప్రాచీన ప్రవచనాల్లో మన ఆధునిక తరాన్ని గురించే ప్రవచించబడిందని మనం ఎలా తెలుసుకోగలం?’ అని బహుశ మీరు ఆలోచించవచ్చు. యేసు మన కాలాన్ని గురించే మాట్లాడాడని రుజువు చేసే మూడు విషయాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము.

మొదటిగా, యెరూషలేము మరియు దాని ఆలయం నాశనం కావడంలో పాక్షికమైన, మొదటి నెరవేర్పు ఉన్నప్పటికీ, యేసు మాటలు ఆ సమయాన్ని గురించి కాక భవిష్యత్తును గురించే కచ్చితంగా సూచించాయి. యెరూషలేమును నాశనం చేసిన విపత్తు సంభవించిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత, ప్రవచింపబడిన సంగతులు అంటే యుద్ధం, కరువు, తెగుళ్లు మరియు వాటి కారణంగా వచ్చే మరణం, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వస్తాయని చూపిస్తూ వృద్ధుడైన అపొస్తలుడైన యోహానుకు యేసు ఒక దర్శనాన్ని కలుగజేశాడు. అవును, ఈ కష్టాలు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాదుగానీ “భూలోకము” అంతటా కలుగుతాయి.—ప్రకటన 6:2-8.

రెండవదిగా, ఈ శతాబ్దంలో యేసు సూచన యొక్క కొన్ని అంశాలు అత్యంత విస్తృతమైన ప్రమాణంలో నెరవేర్చబడుతున్నాయి. ఉదాహరణకు, 1914 నుండి యుద్ధాలు ఎంత ఘోరంగా మారిపోయాయంటే యుద్ధాలు వాటికంటే మహాభయంకరంగా మారే సాధ్యత ఇక ఏమైనా ఉందా? నేటి అణ్వాయుధాల్ని కలిగివున్న దేశాలన్నీ తమ అణ్వస్త్రాలతో ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం చేస్తే, ఈ భూమి చివరకు నిర్జీవంగా మారి, మానవజాతి శలభాల్లా మల మల మాడిపోతుంది. అదే విధంగా, జనాంగములు “కోపగించిన” ఈ దినాల్లో మానవజాతి ‘భూమిని నశింపజేస్తుందని’ ప్రకటన 11:18 ప్రవచించింది. చరిత్రలో మొదటిసారిగా, కాలుష్యం మరియు పర్యావరణ క్షీణత ఈ గ్రహం యొక్క అసలు ఉపయుక్తతనే సవాలు చేస్తున్నాయి! కాబట్టి ఈ అంశం కూడా సంపూర్ణ పరిధిలో లేక దానికి దగ్గరి దగ్గరిలో నెరవేర్పు జరుగుతోంది. మనిషి తనను తానూ ఈ గ్రహాన్నీ నాశనం చేసేంత వరకూ యుద్ధాలూ మరియు కాలుష్యం ఇలా పెరిగిపోతూనే ఉంటాయా? లేదు; భూమి నిత్యం నిలుస్తుందని మరియు యథార్థహృదయులు దానిపై జీవిస్తారని బైబిలే హామీ ఇస్తుంది.—కీర్తన 37:29; మత్తయి 5:5.

మూడవదిగా, అంత్యదినాలను గురించిన సూచనను మొత్తంగా పరిశీలించినప్పుడు అది ప్రాముఖ్యంగా ఒప్పించేదిగా ఉంటుంది. మూడు సువార్తల్లో యేసు చెప్పిన వాటిని, పౌలు వ్రాసిన పత్రికల్లోని వాటినీ, ప్రకటనలోని వాటినన్నిటినీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ సూచనకు అనేకానేక అంశాలున్నాయి. ఒక వ్యక్తి వాటిని గురించి ఒక్కొక్క అంశాన్నే తీసుకుని ఇతర కాలాలు కూడా ఇలాంటి సమస్యలనే అనుభవించాయని వాదిస్తూ గింజులాడవచ్చు, అయితే మనం వాటిని అన్నింటినీ పరిశీలించినప్పుడు, అవి కేవలం ఒక తరం వైపే తమ చూపుడు వేలును గురిపెట్టాయి, అది మన తరమే.

అయితే దీనంతటి అర్థం ఏమిటి? బైబిలు మన కాలాన్ని నిస్సహాయమైన మరియు నిరాశాజనకమైన సమయంగా చిత్రీకరిస్తుందన్న అర్థం మాత్రమే దానికి ఉందా? ఎంతమాత్రం కాదు!

సువార్త

అంత్యదినాల సూచనలోని ఒక అత్యంత ప్రాముఖ్యమైన అంశం మత్తయి 24:14 నందు రికార్డు చేయబడి ఉంది: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” ఈ శతాబ్దంలో, మానవ చరిత్రలోనే అసమానమైన పనిని యెహోవాసాక్షులు చేస్తున్నారు. యెహోవా దేవుని రాజ్యాన్ని గూర్చిన అంటే ఆ రాజ్యం ఏమిటి, అదెలా పరిపాలిస్తుంది మరియు అదేమి సాధిస్తుంది అనే బైబిలు వర్తమానాన్ని అంగీకరించారు మరియు వారు ఆ వర్తమానాన్ని భూవ్యాప్తంగా అందరికీ ప్రకటిస్తున్నారు. వారు 300 కంటే ఎక్కువ భాషల్లో ఈ విషయాన్ని గురించి సాహిత్యాల్ని ప్రచురించారు మరియు భూమిపైనున్న దాదాపు అన్ని దేశాల్లో వాటిని ప్రజల ఇళ్లకు, లేక వీధుల్లో లేక వారి వ్యాపార స్థలాలకు తీసుకెళ్లారు.

అలా చేస్తూ, వారు ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు. అయితే వారు నిరీక్షణను కూడా తెలియజేస్తున్నారు. యేసు దాన్ని “సువార్త” అని పిలిచాడు కానీ దుర్వార్త అని పిలువలేదనే విషయాన్ని గమనించండి. ఈ అంధకార సమయాల్లో అదెలా సాధ్యం? ఎందుకంటే బైబిలు యొక్క ముఖ్య వర్తమానం ఈ పాత ప్రపంచం అంతం కాబోతుండగా పరిస్థితులు ఎంత చెడుగా ఉంటాయనే విషయాన్ని గురించినది కాదు. దాని ముఖ్య వర్తమానం దేవుని రాజ్యాన్ని గురించినది, అది శాంతిని ప్రేమించే ప్రతి మానవుని హృదయానికీ ఎంతో కోరదగిన విషయాన్ని అంటే విమోచనను వాగ్దానం చేస్తుంది.

అయితే ఆ విడుదల అంటే ఏమిటి మరియు అది మీ స్వంతం ఎలా కాగలదు? ఈ అంశాన్ని గురించి ఉన్న ఈ తదుపరి శీర్షికలను దయచేసి చదవండి.

[అధస్సూచీలు]

a టైటస్‌కు ఇక్కడ విజయం తథ్యమే. అయినప్పటికీ, రెండు ప్రాముఖ్యమైన కారణాల్నిబట్టి, ఆయన అనుకున్న దాన్ని సాధించలేకపోయాడు. ఆయన శాంతియుతంగా లొంగిపొమ్మని కోరాడు, అయితే పట్టణ నాయకులు మొండిగా, అతి మూర్ఖంగా నిరాకరించారు. పట్టణ గోడలను తుదకు బ్రద్దలు కొట్టినప్పుడు, ఆలయానికి ఏ హానీ కలిగించవద్దని ఆయన ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ అది పూర్తిగా దహించబడింది! యెరూషలేము నాశనమౌతుందని మరి ఆలయం సంపూర్ణంగా నాశనం చేయబడుతుందని యేసు ప్రవచనం ముందే స్పష్టంగా చెప్పింది.—మార్కు 13:1, 2.

[5వ పేజీలోని చిత్రం]

పరిస్థితులు ఎందుకింత చెడ్డగా ఉన్నాయి? మానవజాతి ఎటు పయనిస్తోంది? వంటి కలతపర్చే ప్రశ్నలకు ప్రజలు జవాబులను వెదుకుతున్నారు

[6వ పేజీలోని చిత్రం]

నేడు యుద్ధంలో హతులౌతున్న వారిలో 90 శాతం కంటే ఎక్కువ మంది పౌరులే

[7వ పేజీలోని చిత్రం]

యెరూషలేమును గురించిన యేసు ప్రవచనం అత్యంత సంపూర్ణంగా నెరవేరింది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి