కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • “సకల జనములకు” సాక్ష్యమిచ్చుట
    కావలికోట—1994 | ఆగస్టు 15
    • “సకల జనములకు” సాక్ష్యమిచ్చుట

      “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14.

      1. మత్తయి 24:14 నందు వ్రాయబడిన యేసు మాటలు ఆయన అనుచరులకు ఎందుకు ఆశ్చర్యాన్ని కలిగించి యుండవచ్చు?

      యేసు యొక్క పైమాటలు యూదులైన ఆయన శిష్యులకు ఎంతటి ఆశ్చర్యాన్ని కలిగించి యుండవచ్చు! పరిశుద్ధపర్చబడిన యూదులు “అపవిత్రులైన” అన్యులతో, “అన్యజాతివారితో” మాట్లాడడానికి వెళ్లడమన్న తలంపే యూదునికి అసంబంధమైనది, హేయమైనది కూడా.a అంతెందుకు మనస్సాక్షికి లోబడే యూదుడు అన్యుల గృహంలోకి ప్రవేశించడాన్ని గురించి కూడా ఆలోచించడు. యూదులైన ఆ శిష్యులు యేసు గురించి, ఆయన ప్రేమ మరియు పని గురించి యింకా ఎంతో తెలుసుకొన వలసియుండిరి. యెహోవా నిష్పక్షపాతాన్ని గురించి కూడా వారు యింకా తెలుసుకొన వలసియుండిరి.—అపొస్తలుల కార్యములు 10:28, 34, 35, 45.

      2. (ఎ) సాక్షుల పరిచర్య ఎంత విస్తృతంగా ఉంది? (బి) సాక్షుల అభివృద్ధికి ఏ మూడు ప్రాథమిక కారణాలు దోహదపడ్డాయి?

      2 యెహోవాసాక్షులు సువార్తను ఆధునిక దిన ఇశ్రాయేలుతో సహా జనాంగాలన్నిటికీ ప్రకటించారు, మునుపెన్నటికంటే ఎక్కువ దేశాల్లో యిప్పుడు ప్రకటిస్తున్నారు. నలభై అయిదు లక్షల కంటే ఎక్కువమంది సాక్షులు 1994లో 230 కంటే ఎక్కువ దేశాల్లో ప్రకటిస్తున్నారు. ఆసక్తిగల ప్రజలతో వారు దాదాపు 45 లక్షల గృహ బైబిలు పఠనాలు నిర్వహిస్తున్నారు. సాక్షుల బోధలు, ఉద్దేశాలను గూర్చిన అవగాహన లోపం వలన ప్రపంచవ్యాప్త దురభిమానం ఉన్నప్పటికీ యిది జరుగుతూనే వున్నది. తొలి క్రైస్తవులను గూర్చి “ఈ మత భేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు యింతమట్టుకు మాకు తెలియునని” చెప్పబడినట్లుగానే వీరి పరిస్థితి వుందని చెప్పవచ్చు. (అపొస్తలుల కార్యములు 28:22) అయితే వారి విజయవంతమైన పరిచర్యకు కారణం ఏదని మనం చెప్పవచ్చు? వారి అభివృద్ధికి దోహదపడే కారణాలు కనీసం మూడు ఉన్నాయి—యెహోవా ఆత్మ నడిపింపును అనుసరించడం, క్రీస్తు యొక్క ఆచరణాత్మక విధానాలను అనుకరించడం, ప్రభావవంతమైన సంభాషణ కొరకు సరైన ఉపకరణాలను ఉపయోగించడం.

      యెహోవా ఆత్మ మరియు సువార్త

      3. సాధించబడినదాన్ని బట్టి మనం ఎందుకు అతిశయించలేము?

      3 యెహోవాసాక్షులు తమ విజయాన్ని గురించి అది వారికున్న ప్రత్యేకమైన సామర్థ్యాల మూలంగా సాధించబడిందని అతిశయిస్తారా? లేదు, ఎందుకంటే, “అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత—మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడి” అనే యేసు మాటలు వారికి అన్వయిస్తాయి. సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులుగా యెహోవాసాక్షులు తమ పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ, దేవున్ని సేవించే బాధ్యతను స్వచ్ఛందంగా అంగీకరించారు. అది కొంతమందికి మిషనరీలుగా, బ్రాంచి కార్యాలయాల్లో మరియు క్రైస్తవ సాహిత్యాలను ముద్రించే స్థలాల్లో స్వచ్ఛంద సేవకులుగా పూర్తికాల సేవలో పనిచేసే అవకాశాన్నిచ్చింది. ఇతరులకు అలాంటి క్రైస్తవ సుముఖత వారు మతసంబంధ కట్టడాలపై నిర్మాణ పనిలో పాల్గొనటానికి, లేక పయినీరు పరిచారకులుగా పూర్తికాల ప్రకటనా పనికి, లేక స్థానిక సంఘాల్లో కొద్ది సమయం సువార్త ప్రకటించే ప్రచారకులుగా ఉండటానికి తోడ్పడింది. “చేయవలసినవే చేసియున్నాము” గనుక మన విధిని నిర్వహించినందుకు మనలో ఎవ్వరము సరైన విధంగా దాని గురించి గొప్పలు చెప్పుకోలేము.—లూకా 17:10; 1 కొరింథీయులు 9:16.

      4. క్రైస్తవ పరిచర్యకు ఎదురైన ప్రపంచ వ్యాప్త వ్యతిరేకత ఎలా అధిగమించబడింది?

      4 మనం కలిగియున్న ఏ విజయానికైనా కారణం యెహోవా ఆత్మ, లేక చురుకైన శక్తి అనవచ్చు. ప్రవక్త అయిన జెకర్యా దినాల్లో అలా చెప్పడం ఎంత విలువైనదో నేడు కూడా అంతే విలువైనది: “జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు యిదే; శక్తిచేతనైనను బలము చేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.” అలా, సాక్షుల ప్రకటనా పనికి వస్తున్న ప్రపంచవ్యాప్త వ్యతిరేకత మానవ ప్రయత్నంతో కాదుగాని, యెహోవా నడిపింపు మరియు రక్షణతోనే అధిగమించబడింది.—జెకర్యా 4:6.

      5. రాజ్య వర్తమానాన్ని వ్యాపింపజేయడంలో యెహోవా ఏ పాత్ర వహించాడు?

      5 రాజ్య వర్తమానానికి ప్రతిస్పందించేవారిని గూర్చి యేసు యిలా అన్నాడు: “వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును. . . . తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు.” (యోహాను 6:45, 65) యెహోవా హృదయాలను, మనస్సులను చదవగలడు, గనుక ఆయనను యింకా ఎరగనప్పటికీ, ఆయన ప్రేమకు ప్రతిస్పందించేవారెవరో ఆయనకు తెలుసు. ఈ సాటిలేని పరిచర్యకు నడిపింపు నివ్వడానికి ఆయన దూతలను కూడా ఉపయోగిస్తాడు. అందుకే యోహాను దర్శనంలో దూతలు పాల్గొనడాన్ని చూసి యిలా వ్రాశాడు: “అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను.”—ప్రకటన 14:6.

      ఆత్మీయ అవసరతను గూర్చి శ్రద్ధ కలిగివుండుట

      6. ఒక వ్యక్తి సువార్తకు ప్రతిస్పందించడానికి ఏ ప్రాథమిక దృక్పథం అవసరము?

      6 ఒక వ్యక్తి సువార్తను అంగీకరించుటకు యెహోవా అవకాశాన్ని యివ్వడానికి మరో కారణాన్ని యేసు యిలా వ్యక్తపర్చాడు: “తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగలవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.” (మత్తయి 5:3, NW.) స్వయం సంతృప్తిగల వ్యక్తి లేదా సత్యాన్ని వెదకని వ్యక్తి ఆత్మీయ అవసరత గురించి శ్రద్ధ కలిగివుండడు. అతడు లేక ఆమె కేవలం వస్తు సంబంధంగా, శరీరరీతిగా మాత్రమే ఆలోచిస్తారు. స్వయం సంతృప్తి అడ్డంకుగా తయారౌతుంది. కాబట్టి, మనం యింటింటికి వెళ్లినప్పుడు మనం కలిసే అనేకులు సందేశాన్ని నిరాకరిస్తే, ప్రజలు నిరాకరించడానికిగల వివిధ కారణాలను మనం పరిగణలోకి తీసుకోవాలి.

      7. అనేకులు సత్యానికి ఎందుకు ప్రతిస్పందించరు?

      7 అనేకులు తాము వారసత్వంగా పొందిన మతాన్ని మూర్ఖంగా అంటిపెట్టుకుని ఉండి, చర్చించడానికి యిష్టపడరు కాబట్టి వినడానికి నిరాకరిస్తారు. యితరులు తమ వ్యక్తిత్వానికి తగిన మతం వైపుకు ఆకర్షింపబడ్డారు—కొందరికి మర్మంగా కనపడే మతం కావాలి, యితరులు భావోద్రేకపూరితమైన దానికి స్పందిస్తారు, మరితరులు తమ చర్చి సాంఘిక కార్యకలాపాలు నిర్వహించేదై ఉండాలని అనుకుంటారు. నేడు అనేకులు దేవుని కట్టడలకు వ్యతిరేకమైన జీవన విధానాన్ని ఎంచుకున్నారు. బహుశా వారు అవినీతికరమైన జీవితాన్ని గడుపుతుండవచ్చు. అంతేగాక, “నాకు ఆసక్తి లేదు” అని చెప్పడానికి కూడా అదే కారణం కావచ్చు. యింకా యితరులు, అంటే విద్యావంతులమని, విజ్ఞానవేత్తలమని చెప్పుకునేవారు బైబిలు చాలా సామాన్యమైంది అని దాన్ని నిరాకరిస్తారు.—1 కొరింథీయులు 6:9-11; 2 కొరింథీయులు 4:3, 4.

      8. నిరాకరణ మన ఆసక్తిని ఎందుకు తగ్గించకూడదు? (యోహాను 15:18-20)

      8 ఎక్కువమంది నిరాకరించడం, ప్రాణాన్ని రక్షించే పరిచర్య యందలి మన విశ్వాసాన్ని, ఆసక్తిని తగ్గించాలా? పౌలు రోమీయులకు వ్రాసిన మాటల నుండి మనం ఓదార్పు పొందవచ్చు: “కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.”—రోమీయులు 3:3, 4.

      9, 10. అనేక దేశాల్లో వ్యతిరేకత అధిగమించబడిందని చూపించే ఏ నిదర్శనం ఉంది?

      9 ప్రపంచవ్యాప్తంగా అసలు ప్రతిస్పందన లేనట్లుగా కనపడిన దేశాలు కొంత కాలం తర్వాత దానికి పూర్తి విరుద్ధంగా తయారైన ఉదాహరణల నుండి మనం ప్రోత్సాహాన్ని పొందవచ్చు. కనుగొనబడవలసిన సహృదయులైన వారు ఉన్నారని యెహోవా మరియు దూతలు తెలుసుకున్నారు—కాని యెహోవాసాక్షులు పట్టుదలతో తమ పరిచర్య యందు సహనం కలిగి వుండవలసిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకు, అర్జెంటీనా, ఇటలీ, ఐర్లాండ్‌, కొలంబియా, పోర్చుగల్‌, బ్రెజిల్‌, మెక్సికో, స్పెయిన్‌ వంటి కొన్ని దేశాలను తీసుకోండి, వాటిలో 50 ఏళ్ల క్రితం కాథోలిక్‌ మతం అసాధ్యమైన అవరోధాలను కలిగిస్తున్నట్లు ఉండేది. పూర్వం 1943లో సాక్షులు కొద్దిమందే అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,26,000 మందే ఉండేవారు, వారిలో 72,000 మంది అమెరికాలోనే ఉండేవారు. సాక్షులకు వ్యతిరేకంగా నెలకొనివున్న అజ్ఞానము, దురభిమాన ధోరణి ఛేదించలేని ఇటుకల గోడలా అనిపించేది. అయినా, నేడు ప్రకటనా పని యొక్క అత్యంత విజయవంతమైన ఫలితాలు ఈ దేశాలలోనే కలిగాయి. మునుపు కమ్యూనిస్టు దేశాలుగా ఉన్న అనేక దేశాల్లో కూడా యిదే పరిస్థితి నిజమయ్యింది. యుక్రేయిన్‌ నందలి కీవ్‌లో 1993లో ఒక సమావేశమందు 7,402 మంది బాప్తిస్మం తీసుకోవడం దీనికి నిదర్శనంగా ఉంది.

      10 తమ పొరుగువారికి సువార్త అందజేయడానికి సాక్షులు ఏ పద్ధతులను ఉపయోగించారు? కొందరు ఆరోపించినట్లుగా, మార్చడానికి వారు వస్తు సంబంధ ప్రేరణలను ఉపయోగించారా? యితరులు ఆరోపించినట్లుగా, వారు కేవలం పేద వారిని, చదువుకోని వారినే దర్శించారా?

      సువార్తను అందించుటకు విజయవంతమైన పద్ధతులు

      11. యేసు తన పరిచర్యలో ఏ మంచి మాదిరిని ఉంచాడు? (యోహాను 4:6-26 చూడండి.)

      11 శిష్యులను చేసే పనిలో సాక్షులు నేటివరకు అనుసరిస్తున్న పద్ధతిని యేసు మరియు ఆయన శిష్యులు ఏర్పరచారు. యేసు ధనవంతులైనా లేక పేదవారైనా, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడికి—యింటింటికి, బహిరంగ స్థలాలకు, సరస్సు ప్రాంతాలకు, పర్వతప్రాంతాలకు, చివరికి సమాజమందిరాలకు కూడా వెళ్లాడు.—మత్తయి 5:1, 2; 8:14; మార్కు 1:16; లూకా 4:15.

      12, 13. (ఎ) పౌలు క్రైస్తవుల కొరకు ఏ మాదిరి నుంచాడు? (బి) యెహోవాసాక్షులు పౌలు మాదిరిని ఎలా అనుసరించారు?

      12 తన స్వంత పరిచర్యను గూర్చి అపొస్తలుడైన పౌలు సరైన విధంగా యిలా చెప్పగలిగాడు: “నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి, ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగుదురు. . . . ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు . . . నుంటినో యిదంతయు మీకు తెలియును.”—అపొస్తలుల కార్యములు 20:18-20.

      13 అపొస్తలుల మాదిరిగా ఇంటింటి పరిచర్యను చేయుటలో యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందారు. ఖరీదైన, మిడి మిడి జ్ఞానం గల, భావరహితమైన టి.వి. పరిచర్యపై కేంద్రీకరించడానికి బదులు, సాక్షులు ప్రజల యొద్దకు వెళ్లి ధనికులైనా, పేదవారైనా ముఖాముఖిగా కలుస్తారు. వారు దేవుని గురించి, ఆయన వాక్యం గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.b ఉచితంగా వస్తువులు యివ్వడం ద్వారా బియ్యపు క్రైస్తవులను తయారు చేయడానికి వారు ప్రయత్నించరు. తర్కించడానికి ఇష్టపడేవారికి, మన భూమిపై పరిస్థితులను మంచిగా మార్చివేసే దేవుని రాజ్య పరిపాలనే మానవజాతి సమస్యలకు కేవలం నిజమైన పరిష్కారమని వారు తెలియజేస్తారు.—యెషయా 65:17, 21-25; 2 పేతురు 3:13; ప్రకటన 21:1-4.

      14. (ఎ) అనేకమంది మిషనరీలు, పయినీర్లు ఎలా ఒక గట్టిపునాదిని వేశారు? (బి) జపాన్‌లోని యెహోవాసాక్షుల అనుభవం నుండి మనం ఏమి నేర్చుకుంటాము?

      14 సాధ్యమైనన్ని దేశాల్లో పని జరిగేలా చూడడానికి, మిషనరీలు, పయినీర్లు అనేక దేశాల్లో చొరవ తీసుకుని మార్గం సుగమం చేశారు. వారు పునాది వేశారు, తర్వాత స్థానిక సాక్షులు నాయకత్వం వహించారు. తద్వారా, ప్రకటన పని కొనసాగేలా చూడడానికి, దాన్ని చక్కగా సంస్థీకరించడానికి విదేశీ సాక్షులు ఎక్కువ సంఖ్యలో అవసరం కాలేదు. అందులో జపాన్‌ దేశానిది ఒక విశేషమైన ఉదాహరణ. పూర్వం 1940 దశకం చివరి భాగంలో, ఆస్ట్రేల్యేసియా మరియు బ్రిటీష్‌ మిషనరీలు అక్కడికి వెళ్లి, భాష నేర్చుకుని, ఆ యుద్ధానంతర శకం యొక్క ఒకవిధమైన పరిస్థితులకు అలవాటుపడి, ఇంటింటికి సాక్ష్యమిచ్చే పనిని ప్రారంభించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్‌లో సాక్షులు నిషేధింపబడి, హింసింపబడ్డారు. కాబట్టి మిషనరీలు వచ్చి చురుకుగావున్న జపాన్‌ సాక్షులు కేవలం కొద్దిమందే ఉండడాన్ని కనుగొన్నారు. కాని నేడు వారు 3,000 కంటే ఎక్కువ సంఘాలలో 1,87,000 కంటే ఎక్కువమందికి పెరిగారు! వారి తొలి విజయానికి రహస్యం ఏమైయుండెను? ఇరవై ఐదుకంటే ఎక్కువ సంవత్సరాలు అక్కడ సేవచేసిన ఒక మిషనరీ యిలా చెప్పాడు: “ప్రజలతో మాట్లాడడం నేర్చుకొనుట చాలా ప్రాముఖ్యమై యుండేది. వారి భాష తెలుసుకోవడం ద్వారా మేము వారికి మానసికంగా సన్నిహితమై, వారి జీవన విధానాన్ని అర్థం చేసుకుని, మెచ్చుకోగలిగాము. మేము జపానీయులను ప్రేమిస్తున్నామని చూపించాల్సి ఉండేది. మా క్రైస్తవ విలువలతో రాజీపడకుండానే, వారి స్థానిక సమాజంలో ఒక భాగం కావడానికి మేము దీనంగా ప్రయత్నించాము.”

      క్రైస్తవ ప్రవర్తన కూడా ఒక సాక్ష్యమే

      15. సాక్షులు క్రైస్తవ ప్రవర్తనను ఎలా ప్రదర్శించారు?

      15 అయితే, ప్రజలు కేవలం బైబిలు సందేశానికి మాత్రమే ప్రతిస్పందించలేదు. వారు క్రైస్తవత్వాన్ని క్రియలలో కూడా చూశారు. అంతర్యుద్ధాలు, జాతి పోరాటం, జాతి శత్రుత్వం వంటి అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో కూడా సాక్షుల మధ్యనున్న ప్రేమ, సామరస్యం, ఐక్యతలను వారు గమనించారు. సాక్షులు అన్ని వివాదాలలో స్పష్టమైన క్రైస్తవ తటస్థతను కలిగివుండి, “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరియెడల ఒకరు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అనే యేసు మాటలను నెరవేర్చారు.—యోహాను 13:34, 35.

      16. ఏ అనుభవం ఆచరణాత్మకమైన క్రైస్తవ ప్రేమను వివరిస్తుంది?

      16 “శ్రీమతి మరియు శ్రీ మంచివాళ్లు” అని సంబోధించిన వారిని గురించి స్థానిక వార్తాపత్రికకు ఒక పెద్ద వయస్సు గల వ్యక్తి వ్రాసిన విషయంలో పొరుగువారి యెడల చూపు ప్రేమ వివరించబడింది. తన భార్య మరణించే స్థితిలో ఉండగా పొరుగువారు తన యెడల దయగా ప్రవర్తించారని ఆయన వివరించాడు. ఆయనిలా వ్రాశాడు: “ఆమె చనిపోయినప్పటి నుండి . . . వారు ఎంతో బాగా మెలిగారు. అన్ని రకాల పనులు చేస్తూ, 74 సంవత్సరాలు గల్గి, ఉద్యోగ విరమణ పొందిన వాన్నైన నా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ . . . అప్పటి నుండి నన్ను ‘దత్తత తీసుకున్నారు.’ దీనినంతటినీ మరీ అసాధారణమైందిగా చేసేదేమిటంటే, వారు నల్లజాతివారు, నేను తెల్లజాతివాడిని. వారు యెహోవాసాక్షులు, నేను చర్చికి వెళ్లడం మానివేసిన కాథోలిక్‌ను.”

      17. మనం ఏ విధానాన్ని విసర్జించాలి?

      17 ఈ అనుభవం మనం మన అనుదిన ప్రవర్తనతో సహా, ఎన్ని విధాలుగానో సాక్ష్యం యివ్వవచ్చునని చూపిస్తుంది. వాస్తవానికి, మన ప్రవర్తన క్రీస్తునుపోలి లేకపోతే, మన పరిచర్య వేషధారణతో కూడిన స్వనీతి గలదిగా, ప్రభావహీనంగా ఉంటుంది. “వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు” అని యేసు వర్ణించిన వారి వలె ఉండుటకు మనం యిష్టపడము.—మత్తయి 22:37-39; 23:3.

      దాసుని తరగతి సరైన ఉపకరణాలను అందజేస్తుంది

      18. యథార్థ హృదయంగల ప్రజలకు సహాయం చేయడానికి బైబిలు సాహిత్యం మనలనెలా ఆయత్తపరుస్తుంది?

      18 సువార్త అన్ని జనాంగాలకు ప్రకటించడానికి మరో ప్రాముఖ్యమైన కారణం వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ప్రచురించిన బైబిలు సాహిత్యాలు లభ్యం కావడము. యథార్థతతో ప్రశ్నించే దాదాపు ప్రతి వ్యక్తిని సంతృప్తిపర్చే పుస్తకాలు, బ్రోషూర్లు, కరపత్రాలు, పత్రికలు మనకున్నాయి. మనం ఒక ముస్లింను, హిందువును, బౌద్ధున్ని, తోయిస్ట్‌ను, లేదా యూదున్ని కలిస్తే, వారితో సంభాషణ మరియు వీలైతే బైబిలు పఠనం మొదలు పెట్టడానికి, మ్యాన్‌కైండ్స్‌ సర్చ్‌ ఫర్‌ గాడ్‌ అనే పుస్తకాన్ని లేదా రకరకాలైన కరపత్రాలను, చిన్న పుస్తకాలను మనం ఉపయోగించవచ్చు. ఒక పరిణామ సిద్ధాంతికుడు సృష్టి గురించి అడిగితే, లైఫ్‌—హౌ డిడ్‌ ఇట్‌ గెట్‌ హియర్‌? బై ఎవల్యూషన్‌ ఆర్‌ బై క్రియేషన్‌? అనే పుస్తకాన్ని మనం ఉపయోగించవచ్చు. ‘జీవిత సంకల్పం ఏమిటి?’ అని ఒక యౌవనస్థుడు అడిగితే, క్వశ్చన్స్‌ యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌—ఆన్సర్స్‌ దట్‌ వర్క్‌ అనే పుస్తకాన్ని అతనికి చూపించవచ్చు. ఎవరైనా దుఃఖం, భయం, అత్యాచారము, విడాకులు వంటి వ్యక్తిగత సమస్యలకు తీవ్రంగా గురైవుంటే, అలాంటి విషయాలతో ఆచరణాత్మకంగా వ్యవహరించిన పత్రికలు మనకున్నాయి. నిజంగా, “తగిన వేళ అన్నము” అందజేస్తుందని యేసు ప్రవచించిన నమ్మకమైన దాసుని తరగతి తన పాత్రను నిర్వహిస్తుంది.—మత్తయి 24:45-47.

      19, 20. అల్బేనియాలో రాజ్యపని ఎలా వేగం పుంజుకుంది?

      19 కాని, జనాంగాలకు చేరడానికి ఈ సాహిత్యాన్ని అనేక భాషలలో తయారు చేయడం అవసరమైంది. బైబిల్‌ మరియు లేఖనాధార సాహిత్యం 200 కంటే ఎక్కువ భాషలలోకి అనువదించడం ఎలా సాధ్యమైంది? ఒక ఉదాహరణగా, అల్బేనియాను గూర్చిన క్లుప్త పరిశీలన గొప్ప కష్టాలు ఉన్నప్పటికీ, తక్షణమే భాషలను యివ్వగల ఆధునిక పెంతెకొస్తు లేకపోయినప్పటికీ నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని తరగతి సువార్తను ఎలా వ్యాప్తి చేస్తుందో చూపిస్తుంది.—అపొస్తలుల కార్యములు 2:1-11.

      20 కేవలం కొన్ని సంవత్సరాల క్రితం అల్బేనియా యింకా మిగిలివున్న ఏకైక నిజమైన నాస్తిక కమ్యూనిస్టు దేశంగా చూడబడింది. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ అనే పత్రిక 1980లో యిలా తెలియజేసింది: “అల్బేనియా 1967లో తన గురించి తాను ‘ప్రపంచంలో మొదటి నాస్తిక దేశం’ అని చెప్పుకుంటూ [మతాన్ని] నిషేధించింది. . . . అల్బేనియా క్రొత్త తరానికి కేవలం నాస్తికత్వమే తెలుసు.” అయితే యిప్పుడు కమ్యూనిజం తగ్గిపోయిన తర్వాత, తమ ఆత్మీయ అవసరతను గుర్తించే అల్బేనియా వాసులు యెహోవాసాక్షులచే చేయబడుతున్న ప్రకటనపనికి స్పందిస్తున్నారు. ఇటలీ మరియు ఆంగ్ల భాషా జ్ఞానం గల యౌవన సాక్షుల చిన్న అనువాదకుల జట్టు 1992లో టైరేన్‌లో ఏర్పర్చబడింది. ఇతర దేశాలనుండి సందర్శించడానికి వచ్చిన అర్హులైన సహోదరులు అల్బేనియా భాషలో లాప్‌టాప్‌ కంప్యూటర్లపై సమాచారాన్ని టైపు చేయడం వారికి నేర్పారు. వారు కరపత్రాలను, కావలికోట పత్రికను అనువదించడం ప్రారంభించారు. వారు అనుభవం పొందిన తర్వాత, యితర విలువైన బైబిలు సాహిత్యాలను అనువదిస్తారు. ఆ చిన్న దేశంలో (32,62,000 జనాబా) ప్రస్తుతం దాదాపు 200 మంది చురుకైన సాక్షులు ఉన్నారు, 1994లో 1,984 మంది జ్ఞాపకార్థదినానికి హాజరయ్యారు.

      మనందరిపై ఒక బాధ్యత ఉంది

      21. మనం ఎలాంటి సమయంలో జీవిస్తున్నాము?

      21 ప్రపంచ సంఘటనలు వాటి శిఖరాగ్రానికి చేరుకుంటున్నాయి. నేరం, దౌర్జన్యం, స్థానిక పోరాటాల్లో వధ, అత్యాచారము, పెరిగిపోతున్న అవినీతి, దాని ఫలితంగా వ్యాప్తి చెందే లైంగిక వ్యాధులు, న్యాయమైన అధికారం యెడల అగౌరవం వంటివి పెరిగిపోవడంతో ప్రపంచం అరాజకంగా, అదుపు చేయలేనిదిగా తయారైనట్లు కనిపిస్తుంది. ఆదికాండములో జలప్రళయానికి మునుపటి కాలాలను గూర్చి వర్ణించబడిన దానికి సమాంతరంగా ఉన్న సమయంలో మనమున్నాము: “నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను.”—ఆదికాండము 6:5, 6; మత్తయి 24:37-39.

      22. యెహోవాసాక్షులందరిపై ఏ క్రైస్తవ బాధ్యత ఉంది?

      22 నోవహు దినాల్లోవలెనే యెహోవా చర్య తీసుకొంటాడు. అయితే ఆయన తన న్యాయము, ప్రేమలను బట్టి సువార్త మరియు హెచ్చరిక సందేశం జనాంగాలన్నిటికీ మొదట ప్రకటించబడాలని కోరుతున్నాడు. (మార్కు 13:10) ఈ విషయంలో, దేవుని సమాధానానికి తగినవారిని కనుగొని వారికి ఆయన సమాధాన మార్గాలను గూర్చి బోధించవలసిన ఒక బాధ్యత యెహోవాసాక్షులపై ఉన్నది. త్వరలోనే, దేవుని నిర్ణీత సమయంలో, ప్రకటించే పని విజయవంతంగా ముగించబడుతుంది. “అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 10:12, 13; 24:14; 28:19, 20.

      [అధస్సూచీలు]

      a అన్యులను గూర్చిన మరింత వివరణ కొరకు, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆఫ్‌ న్యూయార్క్‌, యిన్‌కార్పొరేటెడ్‌ ప్రచురించిన ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్క్రిప్చర్స్‌, సంపుటి II, 472-4 పేజీలలో “నేషన్స్‌” అనే అంశాన్ని చూడండి.

      b క్రైస్తవ పరిచర్యను గూర్చిన ఆచరణాత్మకమైన సలహాల కొరకు, 1984 ఆగష్టు 15, ది వాచ్‌టవర్‌ నందలి 15వ పేజీ లోనున్న “హౌ టు బికమ్‌ ఎఫెక్టివ్‌ మినిస్టర్స్‌” మరియు 21వ పేజీలోనున్న “ఎఫెక్టివ్‌ మినిస్ట్రీ లీడింగ్‌ టు మోర్‌ డిసైపుల్స్‌” చూడండి.

  • “సకల జనములకు” సాక్ష్యమిచ్చుట
    కావలికోట—1994 | ఆగస్టు 15
    • [19వ పేజీలోని బాక్సు]

      దేశము — చురుకుగావున్న సాక్షులు 1943లో — 1993లో

      అర్జెంటీనా — 374 — 1,02,043

      బ్రెజిల్‌ — 430 — 3,66,297

      చిలీ — 72 — 44,668

      కొలంబియా — ?? — 60,854

      ఫ్రాన్స్‌ — రెండవ ప్రపంచ యుద్ధం-రికార్డు లేదు — 1,22,254

      ఐర్లాండ్‌ — 150? — 4,224

      ఇటలీ — రెండవ ప్రపంచ యుద్ధం-రికార్డు లేదు — 2,01,440

      మెక్సికో — 1,565 — 3,80,201

      పెరూ — పరిచర్య రికార్డు లేదు — 45,363

      ఫిలిప్పైన్స్‌ — రెండవ ప్రపంచ యుద్ధం-రికార్డు లేదు — 1,16,576

      పోలాండ్‌ — రెండవ ప్రపంచ యుద్ధం-రికార్డు లేదు — 1,13,551

      పోర్చుగల్‌ — పరిచర్య రికార్డు లేదు — 41,842

      స్పెయిన్‌ — పరిచర్య రికార్డు లేదు — 97,595

      ఉరుగ్వే — 22 — 9,144

      వెనుజ్యులా — పరిచర్య రికార్డు లేదు — 64,081

      [17వ పేజీలోని చిత్రం]

      స్పెయిన్‌ వంటి అనేక కాథోలిక్‌ దేశాల్లో యెహోవాసాక్షులు అభివృద్ధి చెందుతున్నారు

      [18వ పేజీలోని చిత్రాలు]

      భూవ్యాప్తంగా ఉన్న దేశాల్లో యెహోవాసాక్షులు చురుకుగా ఉన్నారు

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి