“మహాశ్రమ”కు ముందే సురక్షితమైన చోటుకి పారిపోవుట
“యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు . . . యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.”—లూకా 21:20, 21.
1. ఇప్పటికీ లోకసంబంధులైనవారు పారిపోవడం ఎందుకు అత్యవసరం?
సాతాను లోకంలో భాగస్తులుగా ఉన్న వారందరూ పారిపోవడం అత్యవసరం. భూమిపై నుండి ప్రస్తుత విధానం తుడిచి వేయబడినప్పుడు వారు భద్రపర్చబడాలంటే యెహోవా పక్షంగా తమ స్థానాన్ని తీసుకున్నామని సాతాను పరిపాలకుడుగాగల ఈ లోకంలో భాగస్తులంకామని నమ్మదగిన రుజువును ఇవ్వాలి.—యాకోబు 4:4; 1 యోహాను 2:17.
2, 3. మత్తయి 24:15-22లో వ్రాయబడిన యేసు మాటలకు సంబంధించి ఏ ప్రశ్నలను మనం ఇప్పుడు చర్చించబోతున్నాం?
2 ఈ విధాన ముగింపును గురించిన తన గొప్ప ప్రవచనంలో, అలా పారిపోవడంలోని ప్రాముఖ్యతను యేసు ఉద్ఘాటించాడు. మత్తయి 24:4-14లో వ్రాయబడిన వాటిని మనం తరచుగా చర్చించినా, వాటి తరువాతవున్న వచనాలు తక్కువ ప్రాముఖ్యతను కలిగినవేమీకావు. మత్తయి 15-22 వచనాలను మీరు మీ బైబిలుతీసి చదవాలని మేము ప్రోత్సహిస్తున్నాం.
3 ఈ ప్రవచన భావమేమిటి? మొదటి శతాబ్దంలో, “నాశనకరమైన హేయవస్తువు” ఏది? అది “పరిశుద్ధస్థలమందు” కన్పించడం దేనికి ముంగుర్తుగా ఉంది? అది మనకు ఏ ప్రాముఖ్యతకల్గివుంది?
“చదువువాడు గ్రహించుగాక”
4. (ఎ) దానియేలు 9:27 యూదులు మెస్సీయాను తిరస్కరించిన తరువాత ఏం జరుగుతుందని తెలియజేసింది? (బి) దీనిని సూచిస్తూ మాట్లాడినప్పుడు “చదువువాడు గ్రహించుగాక” అని యేసు ఎందుకు చెప్పాడు?
4 యేసు దానియేలు గ్రంథంలో వ్రాయబడిన వాటిని తెలియజేస్తున్నాడని గమనించండి. ఆ పుస్తకంలో దానియేలు 9వ అధ్యాయమందు మెస్సీయ రాకడను, ఆయనను తిరస్కరించినందున యూదా జనాంగంపై అమలుచేయబోయే తీర్పులను ప్రవచించిన ప్రవచనంవుంది. దానియేలు ఇరవైఏడవ వచనంలోని చివరి భాగం ఇలా చెబుతోంది: “హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును.” (ఇటాలిక్కులు మావి.) తొలి యూదా సాంప్రదాయం దానియేలు ప్రవచనంలోని ఆ భాగాన్ని సా.శ.పూ. రెండవ శతాబ్దంలో అంటియొకస్ IV యెరూషలేములోని యెహోవా ఆలయం అపవిత్రం చేయడానికి అన్వయించింది. అయితే యేసు “చదువువాడు గ్రహించును గాక” అని హెచ్చరించాడు. అంటియొకస్ IV అపవిత్రపర్చిన ఆలయం కచ్చితంగా హేయమైనదైనా, దాని ఫలితంగా యెరూషలేము ఆలయం లేక యూదా జనాంగం నాశనం కాలేదు. దీని నెరవేర్పు గతించిపోలేదుగాని భవిష్యత్తులో జరగనైవుందని గుర్తించేలా తన శ్రోతలను సాక్ష్యాధారంగా యేసు హెచ్చరిస్తున్నాడు.
5. (ఎ) సువార్త వృత్తాంతాలను పోల్చిచూడడం మొదటి శతాబ్ద “హేయవస్తువు”ను గుర్తించడానికి మనకెలా సహయపడుతుంది? (బి) సా.శ. 66లో యెరూషలేములోనికి రోమా సైన్యాలను సెస్టియస్ గ్యాలస్ ఎందుకు నడిపించాడు?
5 వారు గమనించాల్సిన “హేయ వస్తువు” ఏది? “నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే”నని మత్తయి వృత్తాంతం తెలియజేయడం గమనించదగ్గ విషయం. (ఇటాలిక్కులు మావి.) అయితే దానికి సమాంతర వృత్తాంతమైన లూకా 21:20 (ఇటాలిక్కులు మావి.), “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలుసుకొనుడి” అని చదువబడుతోంది. సా.శ. 66లో యెరూషలేములో జీవిస్తున్న క్రైస్తవులు యేసు ప్రవచించిన వాటి నెరవేర్పును చూశారు. రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా యెరూషలేము ఉద్రిక్తమైన తిరుగుబాటు స్థలంగా మారడానికి యూదులకు రోమా అధికారులకు మధ్య పోరాటం చేరివున్న సంఘటనల పరంపర నడిపించింది. తత్ఫలితంగా, యూదయ, సమరయ, గలిలయ, దెకపొలి, ఫోనీసియా అలాగే ఉత్తరాన సిరియాలో, దక్షిణాన ఐగుప్తులోని హింస చెలరేగింది. రోమా సామ్రాజ్యంలోని ఆ ప్రాంతాలలో శాంతిని పునఃస్థాపించడానికి సెస్టియస్ గ్యాలస్ సైనిక శక్తులను సిరియానుండి, యూదులు తమ “పరిశుద్ధ పట్టణము” అని పిలిచిన యెరూషలేమునకు నడిపించాడు.—నెహెమ్యా 11:1; యెషయా 52:1.
6. నాశనానికి కారణమయ్యే హేయవస్తువు ‘పరిశుద్ధ స్థలంలో నిలువబడడం’ ఎలా వాస్తవమైంది?
6 పతాకాలను ధ్వజాలను తీసుకు వెళ్లడం రోమా పటాలాల వాడుక, వాటిని వారు పవిత్రమైనవిగా దృష్టించగా, యూదులు వాటిని విగ్రహాలుగా దృష్టించారు. ఆసక్తికరమైన విషయమేమంటే, దానియేలు గ్రంథములో “హేయ వస్తువు”గా అనువదింపబడిన హెబ్రీ పదం ప్రధానంగా విగ్రహాలు, విగ్రహారాధనకు ఉపయోగింపబడింది.a (ద్వితీయోపదేశకాండము 29:17) యూదులు ఎదుర్కొన్నను, రోమా సైన్యాలు విగ్రహారాధిత ధ్వజాలను తీసికొని సా.శ. 66 నవంబరులో యెరూషలేములోనికి చొరబడి, ఉత్తరాన ఆలయ గోడక్రింద సొరంగమార్గం త్రవ్వారు. యెరూషలేము పూర్తిగా నాశనంకావడానికి కారణమైన “హేయ వస్తువు” నిస్సందేహంగా “పరిశుద్ధస్థలమందు నిలు”వబడింది! అయితే ఎవడైనా ఎలా పారిపోగలడు?
పారిపోవడం అత్యవసరం!
7. అనుకోకుండా రోమాసైన్యం ఏమిచేసింది?
7 ఆకస్మికంగా, మానవ దృష్ట్యా ఆలోచిస్తే కారణమేమీ లేకుండానే యెరూషలేము సులభంగా జయింపబడుతున్నట్లు కన్పించినప్పుడు రోమా సైన్యం ఉపసంహరించుకొంది. యూదా తిరుగుబాటుదారులు తిరోగమిస్తున్న రోమా సైన్యాలను అంతిపత్రి వరకు మాత్రమే అంటే సుమారు యెరూషలేము నుండి 50 కిలోమీటర్ల వరకు వెంబడించి తరువాత వెనుదిరిగారు. తిరిగి యెరూషలేమునకు వచ్చిన తరువాత వారు తమ యుద్ధ వ్యూహ ప్రణాళికను వేయడానికి ఆలయంలో సమావేశమయ్యారు. రక్షణస్థలాలను బలపర్చడానికి సైనిక సేవ నిమిత్తము యౌవనులు నియమింపబడ్డారు. ఈ కార్యక్రమాలలో క్రైస్తవులు నిమగ్నమైపోయారా? వారు ఈ పనులను విడనాడినా రోమా సైన్యాలు తిరిగివచ్చినప్పుడు వారింకా అపాయకరమైన ప్రాంతంలోనే ఉంటారా?
8. యేసు ప్రవచనాత్మక మాటలకు విధేయత చూపించడంలో క్రైస్తవులు ఏ అత్యవసరమైన చర్యను తీసుకున్నారు?
8 యెరూషలేములోను, యూదయ అంతటావున్న క్రైస్తవులు యేసుక్రీస్తు ఇచ్చిన ప్రవచనాత్మకమైన హెచ్చరికకు అనుగుణ్యంగా చర్య తీసుకొని అపాయకరమైన ఆ ప్రాంతం నుండి పారిపోయారు. పారిపోవడం అత్యవసరం! యుక్తకాలంలోనే వారు పర్వత ప్రాంతాలకు ప్రయాణించారు. కొందరు పెరియా రాష్ట్రములోని పెల్లానందు స్థిరపడ్డారు. యేసు హెచ్చరికను హృదయంలోనికి తీసుకున్నవారు తమ వస్తుదాయకమైన ఆస్తులను కాపాడుకొనేందుకు మూర్ఖంగా వెనుకకు రాలేదు. (లూకా 14:33 పోల్చండి.) ఈ పరిస్థితులలోనున్న గర్భిణీ స్త్రీలు, పాలిచ్చు తల్లులు నడిచి ప్రయాణించడం నిజంగా ఒక క్లిష్టమైన ప్రయాణమే. సమీపంలోనేవున్న చలి కాలంగాని విశ్రాంతి దిన కట్టుబాట్లుగాని పారిపోకుండా వారిని ఆటంకపర్చలేదు. యేసు హెచ్చరికను లక్ష్యపెట్టిన వారందరూ యెరూషలేము యూదయ ప్రాంతాలకు వెలుపల సురక్షితంగా ఉండడానికి వెంటనే పారిపోయారు. దీన్ని లక్ష్యపెట్టడడంపై వారి జీవితాలు ఆధారపడి ఉన్నాయి.—యాకోబు 3:17 పోల్చండి.
9. రోమా సైన్యాలు ఎంత త్వరగా వెనుతిరిగాయి, ఏ ఫలితంతో?
9 ఆ మరుసటి సంవత్సరమే అంటే సా. శ. 67లో రోమన్లు యూదులకు వ్యతిరేకంగా యుద్ధ చర్యల్ని పునరుద్ధరించారు. మొదటిగా గలిలయ లొంగిపోయింది. అటుతరువాతి సంవత్సరంలో, యూదయ ఛిన్నాభిన్నం చేయబడింది. సా.శ. 70 నాటికి రోమా సైనిక శక్తులు యెరూషలేమును చుట్టుముట్టాయి. (లూకా 19:43) క్షామం ఎంతో తీవ్రమైంది. పట్టణంలో చిక్కుకున్న వారు ఒకరిపై మరొకరు దాడిచేసుకున్నారు. అక్కడ నుండి తప్పించుకోవాలని ప్రయత్నించిన వారు వధింపబడ్డారు. వారు అనుభవించింది యేసు చెప్పిన “మహా శ్రమ”వలె ఉన్నది.—మత్తయి 24:21.
10. మనం గ్రహింపుతో చదివితే మనం దేనిని కూడా గమనిస్తాం?
10 అయితే యేసు ప్రవచించినది పూర్తిగా నెరవేరిందా? లేదు, ఇంకా జరగాల్సి ఉంది. యేసు హెచ్చరించినట్లుగా లేఖనాలను గ్రహింపుతో చదివితే, మనం జరగబోయే దానిని గుర్తించడంలో విఫలులం కాము. మన జీవితాలలో దాని భావాలను గూర్చి కూడా మనం తీవ్రంగా ఆలోచిస్తాము.
ఆధునికదిన “హేయవస్తువు”
11. మరే రెండు ప్రకరణాల్లో దానియేలు “హేయవస్తువు”ను సూచించాడు, ఏ కాలం గురించి అక్కడ చర్చించబడింది?
11 దానియేలు 9:27లో మనం చూసిన దానితోపాటు దానియేలు 11:31, దానియేలు 12:11లలో “నాశనకరమైన హేయవస్తువు”ను గురించిన ఇతర రిఫరెన్సులు ఉన్నాయని గమనించండి. ఆ తరువాత సందర్భాలలో వేటిలో కూడా యెరూషలేము నాశనాన్ని గురించి చర్చించబడలేదు. నిజానికి, దానియేలు 12:11లో చెప్పబడినది “అంత్యకాలము”ను గూర్చిన వచనం తరువాత రెండువచనాలలో కనబడుతుంది. (దానియేలు 12:9) మనం 1914 నుండి అలాంటి కాలంలో జీవిస్తున్నాము. కాబట్టి ఆధునిక దిన “నాశనకరమైన హేయవస్తువు”ను గుర్తించడానికి, అటుతరువాత మనం అపాయకరమైన ప్రాంతంనుండి బయటకొచ్చే విషయాన్ని నిశ్చయపర్చుకోవడానికి మనం మెలకువగా ఉండాల్సిన అవసరముంది.
12, 13. ఆధునికదిన “హేయవస్తువు”గా నానాజాతి సమితిని వర్ణించడం ఎందుకు సముచితం?
12 ఆధునికదిన “హేయమైన వస్తువు” ఏమిటి? అది, ప్రపంచం అంత్యకాలములో ప్రవేశించిన తరువాత అనతికాలంలోనే అంటే 1920లో పనిచేయనారంభించిన నానాజాతి సమితేనని రుజువులు సూచించాయి. అయితే అది “నాశనకరమైన హేయవస్తువు” ఎలా కాగల్గింది?
13 బైబిలులో “హేయవస్తువు” కొరకు ఉపయోగించిన హెబ్రీ పదం ప్రధానంగా విగ్రహాలకు, విగ్రహారాధన సంబంధమైన ఆచరణలకు సంబంధించినదని జ్ఞాపకం తెచ్చుకోండి. సమితి విగ్రహంగా ఆరాధింపబడినదా? నిశ్చయంగా అది ఆరాధింపబడింది! మతగురువులు దానిని “పరిశుద్ధ స్థలము”లో పెట్టారు. వారిని అనుచరులు దానికి అనితర భక్తిని చెల్లించారు. నానాజాతి సమితి “భూమిపై దేవుని రాజ్య రాజకీయ ప్రతిరూపం” కాబోతుందని అమెరికాలోని ఫెడరల్ కౌన్సిల్ ఆఫ్ చర్చస్ ఆఫ్ క్రైస్ట్ ప్రకటించింది. నానాజాతి సమితి ఒడంబడికను ధ్రువపర్చడానికి అమెరికా శాసనసభను తొందరపెడుతూ మత గుంపుల నుండి కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు వచ్చిపడ్డాయి. బాప్టిస్టుల జనరల్ బాడీ, కాంగ్రిగేషనలిస్టులు బ్రిటన్‌లోని ప్రెస్బిటేరియన్లు “[భూమిపై శాంతిని] సాధించడానికి లభ్యమౌతున్న ఏకైక ఉపకరణం”గా దానిని శ్లాఘించారు.—ప్రకటన 13:14, 15 చూడండి.
14, 15. ఏయే రీతుల్లో నానాజాతి సమితి, తరువాత ఐక్యరాజ్య సమితి ‘పరిశుద్ధ స్థలంలో’నికి వచ్చాయి?
14 దేవుని మెస్సీయ రాజ్యం 1914లో పరలోకమందు స్థాపించబడిందిగాని దేశాలు తమ సార్వభౌమాధిపత్యం కొరకు పోరాడడానికి ముందుకు కదిలాయి. (కీర్తన 2:1-6) నానాజాతి సమితిని ప్రతిపాదించినప్పుడు, అంతకుముందే మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన దేశాలు అలాగే తమ సైన్యాలను ఆశీర్వదించిన మతగురువులు తాము దేవుని నియమాన్ని పెడచెవిన పెట్టామని చూపించుకున్నాయి. వారు రాజుగా క్రీస్తును దృష్టించలేదు. ఆవిధంగా దేవుని రాజ్య పాత్రను ఓ మానవ సంస్థకు ఇచ్చారు; వారు నానాజాతి సమితిని అది ఉండకూడని స్థలమైన “పరిశుద్ధ స్థలము”లో ఉంచారు.
15 నానాజాతి సమితి స్థానంలో వచ్చిన ఐక్యరాజ్య సమితి అక్టోబరు 24, 1945లో ఉనికిలోనికి వచ్చింది. తరువాత రోమ్‌లోని పోపులు ఐక్యరాజ్య సమితిని “శాంతి సంఘీభావనల చివరి నిరీక్షణ”యని “శాంతి న్యాయాల అత్యున్నత చర్చాస్థల”మని కొనియాడారు. అవును, నానాజాతి సమితి, దాని స్థానంలో వచ్చిన ఐక్యరాజ్య సమితి నిజంగా ఒక విగ్రహమైంది, దేవుని దృష్టిలోనూ ఆయన ప్రజల దృష్టిలోను హేయమైనదిగా అయ్యింది.
దేనినుండి పారిపోవాలి?
16. నీతిని ప్రేమించేవారు నేడు దేనిని నుండి పారిపోవాలి?
16 దీనిని ‘చూడగానే’ అంటే ఆ అంతర్జాతీయ సంస్థ ఏమైవున్నది, అది ఎలా విగ్రహంగా ఆరాధింపబడుతున్నదో గుర్తించగానే నీతిని ప్రేమించువారు సురక్షితమైన స్థలానికి పారిపోవాల్సిన అవసరంవుంది. దేని నుండి పారిపోవాలి? అవిశ్వాస యెరూషలేమునకు ఆధునికదిన సాదృశ్యమైన క్రైస్తవమత సామ్రాజ్యం నుండి, ప్రపంచ అబద్ధమత విధానమైన మహా బబులోనులోను నుండి వారు పారిపోవాలి.—ప్రకటన 18:4.
17, 18. ఆధునికదిన “హేయవస్తువు” ఏ నాశనానికి కారణమౌతుంది?
17 మొదటి శతాబ్దంలో రోమా సైన్యం దాని విగ్రహాపూరిత పతాకాలతో యూదుల పరిశుద్ధ పట్టణమైన “పరిశుద్ధ స్థలము”లోనికి ప్రవేశించినప్పుడు, యెరూషలేముకు దాని ఆరాధనా విధానానికి అది నాశనం తెచ్చిందని కూడా జ్ఞాపకం చేసుకోండి. మన కాలంలో నాశనం ఒక పట్టణంపైనో క్రైస్తవమత సామ్రాజ్యంపైనో మాత్రమే గాక ప్రపంచవ్యాప్త అబద్ధ మత విధానంపైకి రాబోతుంది.—ప్రకటన 18:5-8.
18 ప్రకటన 17:16లో అలంకారిక ఎఱ్ఱని క్రూరమృగంగా నిరూపించుకొనిన ఐక్యరాజ్య సమితి, వేశ్యలాంటి మహాబబులోనుకు విరోధియై దానిని క్రూరంగా నాశనం చేస్తుంది. స్పష్టమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ అదిలా చెబుతోంది: “నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” దీని భావాన్ని ఆలోచించడమే భయాన్ని కల్గిస్తుంది. దాని పర్యవసానం భూమియంతటవున్న అన్నిరకాలైన అబద్ధమతం అంతమౌతుంది. ఇది నిశ్చయంగా మహా శ్రమ ఆరంభమయ్యిందని తెలియజేస్తుంది.
19. ఐక్యరాజ్య సమితి రూపొందింపబడినప్పటి నుండి ప్రధానమైనవేవి దానిలో భాగమయ్యాయి, ఇది ఎందుకు ప్రాముఖ్యం?
19 గమనించదగ్గ విషయమేమంటే 1945లో ఐక్యరాజ్య సమితి అమలులోనికి వచ్చినప్పటినుండి నాస్తికత్వం, మత వ్యతిరేక శక్తులు దాని సభ్యత్వంలో ప్రముఖ స్థానాన్ని పొందుతూ వచ్చాయి. ప్రపంచమంతటా అనేక ప్రాంతాలలో వేర్వేరు సమయాలలో, అలాంటి రాడికల్ శక్తులు మతపరమైన ఆచరణలను తీవ్రంగా నిర్బంధించడంలోగాని పూర్తిగా నిషేధించడంలోగాని ఉపకరణంగా పనిచేస్తున్నాయి. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా అనేక ప్రాంతాలలో మత సంబంధమైన గుంపులపై ప్రభుత్వ ఒత్తిడి అంతగా లేదు. కొంతమంది ప్రజల దృష్టిలో మతసంబంధమైన ఏ అపాయమైనా గతించిపోయినట్టు కనబడవచ్చు.
20. ఏ రకమైన పేరును ప్రపంచ మతాలు తమంతటతాము కల్గివున్నాయి?
20 అయితే, మహా బబులోను మతాలు ప్రపంచంలో క్రూరమైన విచ్ఛిన్నకర శక్తిగా కొనసాగుతూనేవున్నాయి. ముఠా పోరాటాలు, తీవ్రవాద గుంపులతో సంబంధమున్న మతాల పేర్లను వార్తా శీర్షికలు తరచుగా గుర్తిస్తున్నాయి. ప్రత్యర్థి మత ముఠాల మధ్య హింసను నిలిపివేయడానికి ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసులు, సైనికులు ఆలయ ప్రవేశం చేస్తున్నారు. మతవర్గాలు రాజకీయ తిరుగుబాటుకు ఆర్థిక మద్దతునిస్తున్నాయి. జాతుల మధ్య స్థిరమైన సంబంధాలను కాపాడడానికి ఐక్యరాజ్య సమితి చేసిన ప్రయత్నాలను మతపరమైన విద్వేషం విఫలం చేసింది. శాంతి భద్రతల గమ్యాన్ని వెంబడించడంలో ఐక్యరాజ్య సమితిలోని శక్తులు తమ స్థానాన్ని ఆటంకపర్చే ఏ మత ప్రభావాన్నయినా తుడిచివేసేలా చూసేందుకు ఇష్టపడుతున్నాయి.
21. (ఎ) మహాబబులోను ఎప్పుడు నాశనమవ్వాలో నిర్ణయించేది ఎవరు? (బి) దానికి ముందు అత్యవసరంగా చేయాల్సినదేమిటి?
21 పరిశీలించాల్సిన మరొక ప్రాముఖ్యమైన భాగం కూడావుంది. ఐక్యరాజ్య సమితిలోని సైనిక కొమ్ములు మహాబబులోనును నాశనం చేసేందుకు ఉపయోగింపబడుతున్నను ఆ నాశనం నిజంగా దైవ తీర్పుల ఫలితమే అయివుంటుంది. దేవుని నియమిత కాలంలో ఆ తీర్పు అమలుచేయబడుతుంది. (ప్రకటన 17:17) ఈలోగా మనమేమి చేయాలి? “దానిని విడిచి రండి”—మహాబబులోనును విడిచి రమ్మని—బైబిలు సమాధానమిచ్చింది.—ప్రకటన 18:4.
22, 23. అలా పారిపోవడంలో ఏం చేరివుంది?
22 సురక్షితమైన చోటుకి పారిపోవుడమనేది యెరూషలేమును యూదయను విడిచి యూదా క్రైస్తవులు కొండలకు పారిపోయినటువంటి భౌగోళిక ప్రయాణం కాదు. ఇది క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతముల నుండి పారిపోవడం, అవును మహాబబులోనులోని ఏ భాగాన్నుండైనా పారిపోవడం. ఒకడు అబద్ధమత సంస్థల నుండి మాత్రమే కాదుగాని వాటి ఆచారాలు, అవి ఉత్పన్నం చేసిన స్వభావంనుండి పూర్తిగా వేరైయుండడం అని భావం. అది యెహోవా దైవపరిపాలనా సంస్థలోని సురక్షితమైన స్థలానికి పారిపోవడం.—ఎఫెసీయులు 5:7-11.
23 యెహోవా అభిషిక్త సేవకులు మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆధునిక దిన హేయవస్తువైన నానాజాతి సమితిని మొదట గుర్తించినప్పుడు సాక్షులెలా ప్రతిస్పందించారు? వారు క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలలోని తమ సభ్యత్వాన్ని అప్పటికే విడిచిపెట్టారు. అయినా వారు సిలువను ఉపయోగించడం క్రిస్టమస్‌ను మరితర అన్య సెలవుదినాలను ఆచరించడంవంటి కొన్ని క్రైస్తవమత సామ్రాజ్య ఆచారాలకు, అభ్యాసాలకు ఇంకా అంటిపెట్టుకొని ఉన్నామని క్రమేణా గ్రహించారు. వీటిని గురించిన సత్యాన్ని వారు తెలుసుకొనినప్పుడు, దానికి అనుగుణంగా పనిచేశారు. వారు యెషయా 52:11లోని సలహాను హృదయంలోనికి తీసుకున్నారు: “పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి.”
24. విశేషంగా 1935 నుండి పారిపోవడంలో ఎవరు చేరారు?
24 విశేషంగా 1935 నుండి, పరదైసు భూమిపై నిరంతర జీవిత ఉత్తరాపేక్ష కల్గివున్న ప్రజలు అంటే పెరుగుతున్న మరో గుంపు ఇలాంటి చర్యనే తీసికొననారంభించింది. వారు కూడా ‘పరిశుద్ధ స్థలంలో హేయవస్తువు నిలబడడాన్ని చూశారు,’ వారు దాని భావమేమిటో గుర్తించారు. తాము పారిపోవాలని నిర్ణయం తీసుకున్న తరువాత వారు మహాబబులోనులోని సభ్యసంస్థల సభ్యత్వాల నుండి తమ పేర్లను తొలగించుకున్నారు.—2 కొరింథీయులు 6:14-17.
25. అబద్ధమతంతో ఒకవ్యక్తి కల్గివున్న ఏ సంబంధాల్నైనా త్రెంచుకోవడానికి ఏదవసరం?
25 అయితే, మహాబబులోనునుండి పారిపోవడంలో అబద్ధ మతాన్ని విడనాడడం కన్నా మరెంతో ఇమిడివుంది. రాజ్యమందిరంలో జరిగే కొన్ని కూటాలకు హాజరవ్వడంకన్నా లేక నెలలో ఒకటిరెండు సార్లు ప్రాంతీయ సేవలో గడపడంకన్నా మరెంతో ఇమిడివుంది. ఓ వ్యక్తి భౌతికంగా మహాబబులోనుకు వెలుపల ఉండవచ్చు గాని అతను పూర్తిగా దానిని విసర్జించాడా? అతడు తనను తాను ప్రధాన భాగముగానున్న మహాబబులోను ప్రపంచాన్నుండి వేరుచేసుకున్నాడా? అతడు ఇంకా మహాబబులోను స్వభావాన్ని—అంటే దేవుని నీతియుక్త ప్రమాణాలను పరిహసించే స్వభావాన్ని ప్రతిబింబించే విషయాలకు ఇంకా అంటిపెట్టుకొనివున్నాడా? అతడు లైంగిక దుర్నీతిని, వివాహబంధంలోని నమ్మకత్వాన్ని తేలికగా దృష్టిస్తున్నాడా? అతడు ఆత్మీయ ఆసక్తికన్నా ఎక్కువగా వ్యక్తిగత వస్తుదాయక ఆసక్తిని గట్టిగా పట్టుకున్నాడా? అతడు తననుతాను ఈ లోక విధానాన్ని అనుసరించడానికి అనుమతించుకోకూడదు.—మత్తయి 6:24; 1 పేతురు 4:3, 4.
మీరు పారిపోవడాన్ని ఏదీ ఆటంకపర్చనివ్వకండి!
26. కేవలం పారిపోవడాన్ని ప్రారంభించడమేగాక దానిని విజయవంతంగా తుదముట్టడించడానికి మనకేది సహాయపడుతుంది?
26 సురక్షితమైన చోటుకి మనం పారిపోవడంలో, మనం వెనుకనున్న వాటివైపు చూడకూడదనేది నిర్ధ్వంధమైన విషయం. (లూకా 9:62) మనం మన మనస్సులను హృదయాలను దేవుని రాజ్యం, ఆయన నీతిపై స్థిరంగా కేంద్రీకరించాల్సిన అవసరంవుంది. అట్టి నమ్మకమైన విధానాన్ని యెహోవా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో మనం వీటిని మొదట వెదకడంద్వారా మన విశ్వాసాన్ని చూపించుకోవడానికి నిశ్చయించుకొన్నామా? (మత్తయి 6:31-33) మనం లేఖనాధారంగా ఒప్పింపబడిన విషయాలు బయల్పర్చబడిన భావసూచకమైన పరిణామాలు, లోకపుతెరపై జరగడం కొరకు ఆతృతతో ఎదురుచూస్తుండగా, చివరి వరకు మనమాపనిని వెంబడించేలా ప్రేరేపిస్తాయి.
27. ఇక్కడ అడగబడిన ప్రశ్నలను గురించి గంభీరంగా ఆలోచించడం ఎందుకు ప్రాముఖ్యం?
27 దైవిక తీర్పు అమలుచేయబడడం మహాబబులోను నాశనంతో ప్రారంభమౌతుంది. వేశ్యలాంటి అబద్ధమత సామ్రాజ్యం ఎన్నడూ ఉనికిలో లేకుండా తుడిచివేయబడుతుంది. ఆ సమయం అత్యంత సమీపంలోనే ఉంది! అవశ్యకమైన ఆ సమయం ఆసన్నమైనప్పుడు వ్యక్తులుగా మన స్థానమేమౌతుంది? మహాశ్రమల అంతంలో మిగిలియున్న సాతాను దుష్ట విధానం నాశనం చేయబడినప్పుడు మనమే పక్షంగా ఉంటాము? అవసరమైన చర్యను ఇప్పుడు తీసుకొంటే, మనం సురక్షితంగా ఉంటాము. యెహోవా మనకు ఇలా చెబుతున్నాడు: “నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును.” (సామెతలు 1:33) ఈ విధాన ముగింపు కాలంలో యెహోవాను నమ్మకంగానూ ఆనందంగానూ సేవించడంద్వారా యెహోవాను నిత్యమూ సేవించడానికి అర్హులంకాగలం.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే పుస్తకం సంపుటి 1, పేజీలు 634-5 చూడండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ ఆధునికకాల “హేయవస్తువు” ఏది?
◻ ఏ భావంలో “హేయవస్తువు . . . పరిశుద్ధ స్థలంలో”వుంది?
◻ ఇప్పటి సురక్షిత స్థలంలోనికి పారిపోవడంలో ఏం చేరివుంది?
◻ అటువంటిచర్య ఎందుకు అత్యవసరం?
[16వ పేజీలోని చిత్రం]
రక్షించుకునేందుకు యేసు అనుచరులు ఆలస్యంకాకుండా పారిపోవాల్సి వచ్చింది