మహాశ్రమల నుండి సజీవంగా రక్షించబడుట
“వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి.”—ప్రకటన 7:14.
1. భూ పునరుత్థానంలో పునరుత్థానం చేయబడేవారికి ఎవరు స్వాగతం పలుకుతారు?
లెక్కలేనన్ని లక్షలమంది ‘నీతిమంతులు అనీతిమంతుల పునరుత్థానంలో’ లేపబడినప్పుడు, వారు తిరిగి లేపబడేది ఖాళీగా ఉండే భూమి మీదికి కాదు. (అపొస్తలుల కార్యములు 24:15) సుందరంగా మెరుగుపర్చబడిన పరిసరాలలోకి లేపబడి, నివాసం, వస్త్రాలు, పుష్కలమైన ఆహారం తమ కొరకు సిద్ధం చేయబడి ఉండడం కనుగొంటారు. ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తారు? స్పష్టంగా, భూ పునరుత్థానం జరుగకముందే నూతన లోకంలో ప్రజలు నివసిస్తుంటారు. ఎవరు? వారు, రానైయున్న మహాశ్రమలను తప్పించుకొని జీవించేవారని బైబిలు సూచిస్తుంది. కొంతమంది విశ్వాసులైనవారు మహాశ్రమలను తప్పించుకొని సజీవంగా రక్షించబడి మరెన్నడూ వారు మరణించ నవసరం లేదన్నది బైబిలు బోధలన్నిటిలోకి అత్యంత ఆశ్చర్యకరమైనది. ఈ నిరీక్షణ పరిశుద్ధ లేఖనాలలో చక్కగా ధృవీకరించబడింది.
నోవహు దినముల వలె
2, 3. (ఎ) నోవహు దినాలకు మరియు మన కాలానికి మధ్య ఏ సారూప్యాలున్నాయి? (బి) నోవహు మరియు ఆయన కుటుంబం జలప్రళయాన్ని తప్పించుకోవడం దేన్ని సూచిస్తుంది?
2 మత్తయి 24:37-39నందు యేసుక్రీస్తు, నోవహు దినాలతో మనం ఇప్పుడు జీవిస్తున్న అంత్య దినాలను పోల్చాడు. ఆయనిలా చెప్పాడు: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.”
3 దేవుని హెచ్చరికా వర్తమానానికి శ్రద్ధనివ్వని వారంతా విశ్వవ్యాప్త జలప్రళయంచే కొట్టుకొనిపోబడ్డారు. అయితే, నోవహును అతని కుటుంబాన్ని అది ముంచివేయలేదు. యేసు చెప్పినట్లుగా, వారు “ఓడలోనికి” వెళ్లారు. వారి దైవభక్తి మూలంగా, యెహోవా వారికి తప్పించుకోడానికి ఒక మార్గం ఏర్పరచాడు. రెండవ పేతురు 2:5, 9 ఇలా చెబుతూ నోవహు మరియు అతని కుటుంబం తప్పించుకోడాన్ని సూచిస్తుంది: ‘ఆయన [దేవుడు] . . . భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను. . . . భక్తులను శోధనలోనుండి ఎలా తప్పించాలో యెహోవాకు తెలుసు.’ సామాన్యంగా ప్రజలు దేవుని హెచ్చరికా వర్తమానాన్ని వినరని చూపించడానికి యేసు అంత్య దినాలను నోవహు దినాలతో పోల్చాడు. అయినప్పటికీ, అలా చేయడంలో ఆయన, నోవహు అతని కుటుంబం యెహోవా దేవునికి విధేయత చూపించి ఓడలోకి వెళ్లి, గొప్ప జలప్రళయాన్ని తప్పించుకున్నారని కూడా ధృవపర్చాడు. నోవహు అతని కుటుంబం తప్పించుకోవడం, ఈ లోకాంతమున దేవుని నమ్మకమైన సేవకులు తప్పించుకుంటారని సూచిస్తుంది.
మొదటి శతాబ్దపు మాదిరి
4. యేసు మాటల నెరవేర్పులో, సా.శ. 70లో యెరూషలేము నాశనానికి ఏ సంఘటనలు దారితీసాయి?
4 ఈ లోక అంతంలో జరుగబోయే సంఘటనల గురించి కూడా యేసు మాట్లాడాడు. మత్తయి 24:21, 22నందు మనమిలా చదువుతాము: “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.” ఈ మాటలు మన సామాన్య శకము యొక్క మొదటి శతాబ్దములో మొదటి నెరవేర్పును కలిగి ఉన్నాయి. సా.శ. 66లో సెస్టియస్ గాలస్ నాయకత్వం క్రింద రోమా సైన్యాలు యెరూషలేము పట్టణాన్ని చుట్టుముట్టాయి. రోమా సైన్యాలు దేవాలయ గోడను పడగొట్టేవరకు వచ్చాయి, అనేకమంది యూదులు లొంగిపోడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, అనుకోనిరీతిగా, పెద్ద కారణమేమి లేకుండానే, సెస్టియస్ గాలస్ తన సైన్యాలను వెనక్కి తీసుకువెళ్లాడు. రోమీయులు వెనక్కి వెళ్లడం చూసి క్రైస్తవులు, యేసు అనేక సంవత్సరాల క్రితం చెప్పిన ఈ మాటల ప్రకారం ప్రవర్తించారు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.” (లూకా 21:20, 21) క్రైస్తవులుగా మారిన యూదులు, ఏర్పరచబడినవారు, నాశనం చేయబడేందుకు సిద్ధంగా ఉన్న యెరూషలేమును వెంటనే విడిచి వెళ్లి, ఆ తర్వాత త్వరలోనే దాని మీదికి వచ్చిన భయంకరమైన నాశనాన్ని తప్పించుకున్నారు. సా.శ. 70లో సైన్యాధిపతి టైటస్ నాయకత్వం క్రింద రోమా సైన్యాలు తిరిగివచ్చాయి. వారు యెరూషలేమును చుట్టుముట్టి, పట్టణాన్ని లోబరచుకొని, దాన్ని నాశనం చేశారు.
5. సా.శ. 70లో యెరూషలేముపైకి వచ్చిన శ్రమ ఏ భావంలో తగ్గించబడింది?
5 యూదా చరిత్రకారుడైన జోసిఫస్, 11,00,000 మంది యూదులు మరణించారని, తప్పించుకున్న 97,000 మంది బానిసలుగా తీసుకొని పోబడ్డారని తెలియజేస్తున్నాడు. తప్పించుకున్న క్రైస్తవులుకాని ఆ యూదులు కచ్చితంగా యేసు ప్రవచనంలోని ‘ఏర్పరచబడినవారు’ కాదు. తిరుగుబాటుదారులైన యూదా జనాంగముతో మాట్లాడుతూ, యేసు ఇలా చెప్పాడు: “ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది. ఇది మొదలుకొని—ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.” (మత్తయి 23:38, 39) యెరూషలేములో ఉండిపోయిన ఆ యూదులు చివరి క్షణంలో యేసును మెస్సీయగా అంగీకరించి, క్రైస్తవులై యెహోవా అనుగ్రహాన్ని పొందారనే ఏ దాఖలా లేదు. అయినప్పటికీ, సా.శ. 70లో యెరూషలేము మీదికి వచ్చిన శ్రమ తగ్గించబడింది. రోమా సైన్యాల చివరి ముట్టడి ఎక్కువకాలం ఉండలేదు. ఇది, రోమా సామ్రాజ్యమందలి అనేకభాగాలకు బానిసలుగా పంపివేయబడడానికి మాత్రమే కొందరు యూదులు తప్పించుకోడానికి అవకాశమిచ్చింది.
తప్పించుకొనేవారి ఒక గొప్ప సమూహము
6, 7. (ఎ) ఏ గొప్ప మతసంబంధమైన పట్టణం నాశనం చేయబడవలసి ఉంది, ఏ అసమానమైన శ్రమలో భాగంగా? (బి) ఈ లోకంపైకి రానైయున్న మహాశ్రమను గూర్చి యోహాను ఏమి ప్రవచించాడు?
6 సా.శ. 70లో యెరూషలేము యొక్క నాశనం, ఆ మతసంబంధమైన పట్టణంపైకి వాస్తవంగా “మహా శ్రమ”ను తెచ్చినప్పటికీ, యేసు మాటల యొక్క విస్తృతమైన నెరవేర్పు ఇంకా జరుగవలసివుంది. గొప్ప మతసంబంధ పట్టణమైన ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమగు మహా బబులోను మరణకరమైన మహాశ్రమను ఎదుర్కోవలసి ఉంది, దాని తర్వాత వెంటనే సాతాను విధానపు మిగిలిన భాగంపై సాటిలేని శ్రమ ఉంటుంది. (మత్తయి 24:29, 30; ప్రకటన 18:21) యెరూషలేము నాశనం చేయబడిన దాదాపు 26 సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన యోహాను ప్రకటన 7:9-14నందు ప్రపంచమంతటిపైకి వచ్చే ఈ మహాశ్రమను గూర్చి వ్రాశాడు. ప్రజల గొప్ప సమూహం దాన్ని తప్పించుకుంటుందని ఆయన చూపించాడు.
7 “గొప్ప సమూహం” అని పిలువబడే ఈ తప్పించుకొనేవారు, తాము తీసుకునే కొన్ని నిర్ణయాత్మక చర్యల ద్వారా గుర్తింపబడతారు. ప్రకటన 7:14 ప్రకారం పరలోకంలో ఉన్న 24 మంది పెద్దలలో ఒకరు యోహానుకు ఇలా చెప్పారు: “వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి.” అవును, తమ రక్షణకు మూలం యెహోవా అని గొప్పసమూహం ఆయనను స్తుతిస్తుంది. వారు యేసు చిందించిన రక్తమందు విశ్వాసముంచి, తమ సృష్టికర్తయెదుట, ఆయన నియమిత రాజైన యేసుక్రీస్తు యెదుట నీతియుక్తమైన స్థానం కలిగివుంటారు.
8. “గొప్ప సమూహం” మరియు యేసు అభిషక్త సహోదరులలోని మిగిలినవారికి మధ్య ఏ మంచి సంబంధం ఉంటుంది?
8 నేడు, గొప్పసమూహంలోని దాదాపు 50 లక్షలమంది పరలోక రాజైన యేసుక్రీస్తు యొక్క చురుకైన నాయకత్వం క్రింద జీవిస్తున్నారు. వారు క్రీస్తుకు లోబడి, ఇంకా భూమిపై మిగిలివున్న ఆయన అభిషక్త సహోదరులతో సన్నిహిత సంబంధం కలిగివున్నారు. ఈ అభిషక్తులకు గొప్ప సమూహం వారు ఇచ్చే ఆతిథ్యాన్ని గూర్చి యేసు ఇలా చెబుతున్నాడు: “మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” (మత్తయి 25:40) వారు క్రీస్తు యొక్క అభిషక్త సహోదరులకు నిస్వార్థంగా సహాయం చేస్తారు గనుక, గొప్ప సమూహపువారు యేసుకే మంచి చేసినట్లుగా తీర్చబడతారు. యేసుక్రీస్తుతో, యెహోవా దేవునితో సురక్షితమైన సంబంధం కలిగివుండేందుకు ఇది వారికి సహాయం చేస్తుంది. దేవునికి సాక్షులవ్వడంలో, ఆయన నామానికి ప్రాతినిధ్యం వహించడంలో అభిషక్త శేషముతో పాటు భాగం వహించే ఆధిక్యత వారికి ఇవ్వబడింది.—యెషయా 43:10, 11; యోవేలు 2:31, 32.
మెలకువగా ఉడుట
9, 10. (ఎ) మనుష్యకుమారుని యెదుట మన నీతియుక్తమైన స్థానాన్ని కాపాడుకోడానికి మనం ఏమి చేయాలి? (బి) “మెలకువ కలిగి” ఉండడానికి మనం ఎలా ప్రవర్తించాలి?
9 గొప్ప సమూహపు వారు తమ నీతియుక్తమైన స్థానాన్ని మనుష్యకుమారుని యెదుట విడువక కాపాడుకోవాలి, దానికొరకు వారు అంతము వరకు మెలకువ కలిగివుండడం అవసరం. యేసు “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని” చెప్పినప్పుడు, అది స్పష్టంగా తెలియజేశాడు.—లూకా 21:34-36.
10 మనుష్యకుమారుని యెదుట నిలువబడుటలో విజయం సాధించడానికి, మనకు ఆయన అంగీకారం ఉండాలి, ఒకవేళ మనం ఈ లోక ఆలోచనా విధానంచే మనల్ని మనం ప్రభావితం కానిస్తే, అది మనకు లభించదు. లోక ఆలోచనావిధానం మోసకరమైనది, అది ఒక వ్యక్తిని శరీరసంబంధమైన ఆనందాలలో ఎక్కువగా నిమగ్నమయ్యేలా లేక అతడు రాజ్యాసక్తులను ముందుంచలేనంతగా జీవిత సమస్యలతో అలసిపోయేలా ప్రేరేపించగలదు. (మత్తయి 6:33) అలాంటి మార్గం ఒక వ్యక్తి ఆత్మీయతను బలహీనపర్చి, దేవుని యెడల మరియు ఇతరుల యెడల తన బాధ్యతలను గూర్చి అతడు నిరాసక్తిగా తయారయ్యేలా మార్చగలదు. అతడు నిష్క్రియుడుగా తయారవుతాడు లేక గంభీరమైన పాపం చేసి బహుశా పశ్చాత్తాపం లేని దృక్పథాన్ని కూడా కనబరుస్తూ, సంఘంలో తన స్థానాన్ని ప్రమాదంలో పడవేసుకుంటాడు. గొప్ప సమూహంలోని ప్రతి వ్యక్తి తన గురించి తాను శ్రద్ధ కలిగివుండాలి. అతడు ఈ దైవభక్తి లేని లోకం నుండి, దాని ఆచారాల నుండి తనను తాను వేరుగా ఉంచుకోవాలి.—యోహాను 17:16.
11. అర్మగిద్దోనును తప్పించుకోడానికి ఏ లేఖనాధార సూత్రాలను అన్వయించుకోవడం మనకు సహాయం చేస్తుంది?
11 ఆమేరకు, యెహోవా తన వాక్యం ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా, తన దృశ్య సంస్థ ద్వారా మనకు కావలసినది అనుగ్రహించాడు. వీటి నుండి మనం పూర్తి ప్రయోజనం పొందాలి. అంతేగాక, మనం దేవుని అనుగ్రహం పొందాలనుకుంటే మనం ప్రార్థనాపూర్వకంగా, దేవునికి విధేయులమై ఉండాలి. ఒక విషయం ఏమిటంటే, మనం చెడు యెడల తీవ్రమైన అసహ్యతను పెంచుకోవాలి. కీర్తనల గ్రంథకర్త ఇలా చెప్పాడు: “పనికిమాలినవారితో నేను సాంగత్యముచేయను వేషధారులతో పొందుచేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.” (కీర్తన 26:4, 5, 9) క్రైస్తవ సంఘములో, యౌవనులు వృద్ధులు అందరూ యెహోవాకు సమర్పించుకోని వారితో తమ సహవాసాన్ని పరిమితంగా ఉంచుకోవాలి. దేవుని అనుగ్రహం పొందాలంటే, మనం నిర్దోషంగా, ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలి. (కీర్తన 26:1-5; యాకోబు 1:27; 4:4) అలా, అర్మగిద్దోనునందు యెహోవా మనల్ని దైవభక్తి లేనివారితో పాటు మరణించేలా చేయడని మనం నమ్మకం కలిగివుండవచ్చు.
కొందరు “మరెన్నడూ మరణించరు”
12, 13. (ఎ) లాజరును పునరుత్థానం చేయకముందు, మార్త పూర్తిగా గ్రహించలేకపోయిన ఏ మాటలు యేసు చెప్పాడు? (బి) కొందరు ‘ఎన్నడూ మరణించరు’ అనే దాన్ని గూర్చిన యేసు మాటలు దేనిని సూచించాయి?
12 ఈ విధానాంతాన్ని తప్పించుకోవడం, ఇక మరెన్నడూ మరణించకుండా ఉండే సాధ్యతను గురించి ఆలోచించడం ఉత్తేజకరంగా ఉంటుంది. ఈ ఉత్తరాపేక్ష మనకు యేసు ఇచ్చింది. మరణించిన తన స్నేహితుడైన లాజరును పునరుత్థానం చేయడానికి కొంత సమయం ముందు, లాజరు సహోదరియైన మార్తతో యేసు ఇలా చెప్పాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా?” మార్త పునరుత్థానమందు విశ్వసించింది, కాని యేసు చెప్పినదంతా ఆమెకు అర్థం కాలేదు.—యోహాను 11:25, 26.
13 తన నమ్మకమైన అపొస్తలులు శరీరమందు జీవిస్తూ, మరెన్నడూ మరణించరని యేసు భావం కాదు. బదులుగా, తన శిష్యులు మరణిస్తారని ఆయన తర్వాత సూచించాడు. (యోహాను 21:16-23) వాస్తవానికి, సా.శ. 33 పెంతెకొస్తునందు వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడడం, రాజులుగా, యాజకులుగా తమ పరలోక వారసత్వాన్ని పొందడానికి వారు మరణించవలసి ఉంటుందని తెలియజేసింది. (ప్రకటన 20:4, 6) అలా, సమయం గడుస్తుండగా, మొదటి శతాబ్దపు క్రైస్తవులందరు గతించిపోయారు. అయితే, యేసు తాను ఒక సంకల్పం కొరకు చేశానని చెప్పాడు. ఎన్నడూ మరణించకుండా జీవించడాన్ని గూర్చిన ఆయన మాటలు నెరవేర్చబడతాయి.
14, 15. (ఎ) ‘మరెన్నడూ మరణించని’ కొందరిని గూర్చిన యేసు మాటలు ఎలా నెరవేరుతాయి? (బి) ఈ లోక పరిస్థితి ఏమిటి, కాని నీతిమంతులకు ఏ నిరీక్షణ ఉంది?
14 ఒక విషయమేమిటంటే, విశ్వాసులైన అభిషక్త క్రైస్తవులు ఎన్నడూ నిత్య మరణాన్ని అనుభవించరు. (ప్రకటన 20:6) నోవహు దినములలో చేసినట్లుగానే, దేవుడు మానవుల విషయాల్లో జోక్యం చేసుకుని భూమిపైనుండి దుష్టత్వాన్ని నిర్మూలించే ఒక నిర్దిష్టమైన కాలాన్ని యేసు మాటలు సూచిస్తున్నాయి. ఆ సమయంలో దేవుని చిత్తాన్ని చేస్తూ కనుగొనబడే నమ్మకమైనవారు దేవుని తీర్పు చర్యల మూలంగా మరణించవలసిన అవసరం ఉండదు. బదులుగా, నోవహు మరియు అతని కుటుంబం వలె, వారికి లోక నాశనాన్ని తప్పించుకొనే అవకాశం లభిస్తుంది. బైబిలు బోధలపై ఆధారపడిన మరియు ఉదాహరణలతో ఉదాహరింపబడిన అలాంటి నిరీక్షణ దృఢమైనది. (హెబ్రీయులు 6:19; 2 పేతురు 2:4-9 పోల్చండి.) అవినీతిపరులైన మానవ సమాజంతో కూడిన ప్రస్తుత ప్రపంచం త్వరలోనే నాశనాన్ని ఎదుర్కొనబోతున్నదని బైబిలు ప్రవచన నెరవేర్పు చూపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి మార్చలేనిది, ఎందుకంటే ప్రపంచం మార్చలేనంత చెడ్డగా ఉంది. నోవహు దినాలను గూర్చి దేవుడు చెప్పినది నేటి ప్రపంచం విషయంలో కూడా వాస్తవమైయున్నది. ఎక్కువ శాతంమంది మానవుల హృదయాలలో దుష్టత్వం నిండివుంది, వారి తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడుగా ఉన్నాయి.—ఆదికాండము 6:5.
15 దైవిక జోక్యం లేకుండా మానవులు భూమిని పరిపాలించడానికి యెహోవా శతాబ్దాల సమయాన్ని అనుమతించాడు, కాని వారి సమయం దాదాపు అయిపోయింది. బైబిలు చెబుతున్నట్లుగానే, యెహోవా త్వరలోనే భూమిపైనుండి దుష్టత్వాన్నంతటినీ నిర్మూలిస్తాడు. (కీర్తన 145:20; సామెతలు 2:21, 22) అయితే, ఆయన దుష్టులతోపాటు నీతిమంతులను నాశనం చేయడు. దేవుడు ఎన్నడూ అలాంటి పని చేయలేదు! (ఆదికాండము 18:22, 23, 26 పోల్చండి.) ఆయనను నమ్మకంగా, దైవభయంతో సేవించడానికి ప్రయాస పడుతున్నవారిని ఆయన ఎందుకు నాశనం చేస్తాడు? మహాశ్రమలు ప్రారంభమైనప్పుడు జీవించివుండే యెహోవా యొక్క నమ్మకమైన ఆరాధికులు ఆయన దృష్టిలో అనుగ్రహం పొందడం కారణసహితం. నోవహు దినముల నాటి దుష్టలోకం జలప్రళయం ద్వారా నాశనం చేయబడినప్పటికీ ఆయన మరియు ఆయన కుటుంబం నాశనం చేయబడనట్లుగానే వారు నాశనం చేయబడరు. (ఆదికాండము 7:23) వారికి దైవిక భద్రత ఉంటుంది, వారు ఈ లోక అంతాన్ని తప్పించుకుంటారు.
16. నూతన లోకంలో ఏ అద్భుతమైన సంగతులు జరుగుతాయి, తప్పించుకొనేవారికి దాని భావమేమిటి?
16 అప్పుడేం జరుగుతుంది? నూతన లోకంలో, యేసు విమోచన క్రయధన బలి ప్రయోజనాలు పూర్తిగా అన్వయించబడడంతో స్వస్థపర్చే ఆశీర్వాదాలు మానవజాతికి ప్రవాహంలా వస్తాయి. బైబిలు సూచనార్థకంగా, “స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును” అని చెబుతుంది. (ప్రకటన 22:1, 2) అద్భుతమైనదేమిటంటే, ఆ “స్వస్థపరచడంలో” ఆదాము ద్వారా వచ్చిన మరణంపై విజయం సాధించడం కూడా ఇమిడివుంది! “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును.” (యెషయా 25:8) అలా, మహాశ్రమలను తప్పించుకొని నూతన లోకంలోకి ప్రవేశించేవారు ఎన్నడూ మరణాన్ని ఎదుర్కోనవసరం లేదు!
ఒక కచ్చితమైన నిరీక్షణ
17. కొందరు అర్మగిద్దోనును తప్పించుకొని “మరెన్నడూ మరణించరనే” నిరీక్షణ ఎంత కచ్చితమైనది?
17 ఈ అద్భుతమైన నిరీక్షణయందు మనం పూర్తి నమ్మకం కలిగివుండవచ్చా? తప్పకుండా! ప్రజలు ఎన్నడూ మరణించకుండా జీవించే కాలం ఉంటుందని యేసు మార్తకు సూచించాడు. (యోహాను 11:26) అంతేగాక, యేసు యోహానుకిచ్చిన ప్రకటన గ్రంథంలోని 7వ అధ్యాయంలో, ఒక గొప్ప సమూహం మహాశ్రమలను దాటి, తప్పించుకొని బయటికి వస్తుందని తెలియజేయబడింది. యేసు క్రీస్తును మరియు నోవహు దినాలనాటి జలప్రళయాన్ని గూర్చిన చారిత్రక వృత్తాంతాన్ని మనం నమ్మవచ్చా? నిస్సందేహంగా! అంతేగాక, తీర్పుకాలాలలో, దేశాలు కూలిపోయిన సమయాల్లో దేవుడు తన సేవకులను కాపాడిన సందర్భాలను గూర్చిన ఇతర వృత్తాంతాలు బైబిలునందున్నాయి. ఈ అంత్యకాలంలో ఆయన నుండి ఏమైనా తక్కువ అపేక్షించవచ్చా? సృష్టికర్తకు ఏదైనా అసాధ్యమా?—మత్తయి 19:26 పోల్చండి.
18. యెహోవా యొక్క నీతియుక్తమైన నూతన లోకంలో జీవాన్ని గూర్చి మనం ఎలా నమ్మకం కలిగివుండవచ్చు?
18 యెహోవాను ఇప్పుడు నమ్మకంగా సేవించడం ద్వారా, ఆయన నూతన లోకంలో నిత్యజీవం పొందే వాగ్దానం మనకుంది. లెక్కలేనన్ని లక్షల మందికి, ఆ నూతన లోకంలో జీవం పునరుత్థానం ద్వారా లభిస్తుంది. అయినా, మన దినాల్లో, లక్షలాదిమంది యెహోవా ప్రజలకు, అవును, ఏ మానవుడు లెక్కించలేనంత లేక పరిమితం చేయలేనంత గొప్ప సమూహానికి, మహాశ్రమల నుండి సజీవంగా రక్షించబడే విశేషమైన ఆధిక్యత ఉంటుంది. వారు ఇక ఎన్నటికీ మరణించనవసరం లేదు.
దయచేసి వివరించండి
◻ అర్మగిద్దోనును తప్పించుకోవడం నోవహు దినాలలో ఎలా ముంగుర్తుగా చూపబడింది?
◻ యెహోవా తీర్పులు అమలుచేయడానికి యేసు వచ్చినప్పుడు మనం నిలువబడి ఉండగలుగుటకు మనం ఏమి చేయాలి?
◻ అర్మగిద్దోనును తప్పించుకొనేవారు “మరెన్నడూ మరణించ” నవసరం లేదని మనమెందుకు చెప్పగలం?
[15వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులు యెరూషలేము శ్రమను తప్పించుకున్నారు