కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 11/1 పేజీలు 10-15
  • ఒక “దుష్టతరము” నుండి రక్షింపబడుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒక “దుష్టతరము” నుండి రక్షింపబడుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “అంతము”—ఎప్పుడు?
  • “ఈ తరము”—అది ఏమిటి?
  • “యీ దుష్టతరము”
  • “యీ తరము” గుర్తించబడినది
  • పాఠకుల నుండి ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మెలకువగా ఉండవలసిన సమయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • క్రీస్తు ప్రత్యక్షత—మీరు దానినెలా అర్థం చేసుకుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 11/1 పేజీలు 10-15

ఒక “దుష్టతరము” నుండి రక్షింపబడుట

“విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడ ఉండి మిమ్మును సహింతును?”—లూకా 9:41.

1. (ఎ) మన విపత్కర సమయాలు ఏమి సూచిస్తున్నాయి? (బి) తప్పించుకునే వారిని గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయి?

మనం విపత్కరమైన కాలాల్లో జీవిస్తున్నాము. భూకంపాలు, వరదలు, కరవులు, వ్యాధులు, అక్రమం, బాంబు ప్రేలుళ్లు, భయంకరమైన యుద్ధాలు—ఇవి, ఇంకా మరిన్ని మన 20వ శతాబ్దంలో మానవజాతిని చుట్టుముట్టాయి. అయితే, అన్నింటికంటే గొప్ప విపత్తు మన సమీప భవిష్యత్తులో ఉండి భయపెడుతోంది. అది ఏమిటి? అది “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” (మత్తయి 24:21) అయినప్పటికీ, మనలో అనేకులు ఒక సంతోషకరమైన భవిష్యత్తు కొరకు ఎదురుచూడవచ్చు! ఎందుకు? ఎందుకంటే దేవుని వాక్యము ‘ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చిన, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము’ను గురించి వర్ణిస్తుంది. మరి “వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు . . . వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, . . . దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.”—ప్రకటన 7:1, 9, 14-17.

2. మత్తయి 24, మార్కు 13, మరి లూకా 21 యొక్క ప్రారంభ వచనాలు ఏ తొలి ప్రవచనార్ధక నెరవేర్పును కలిగి ఉన్నాయి?

2 మత్తయి 24:3-22, మార్కు 13:3-20 మరియు లూకా 21:7-24నందలి ప్రేరేపిత రికార్డు, “యుగ సమాప్తి”ని గూర్చిన యేసు ప్రవచనార్థక వివరణను పరిచయం చేస్తుంది.a ఈ ప్రవచనం దాని ప్రారంభ నెరవేర్పును మన సామాన్య శకమునందలి తొలి శతాబ్దంలోని భ్రష్ట యూదా విధానంపై కలిగి ఉండినది, అది యూదులపై అంచనా వేయలేనంత “మహా శ్రమ”ను తెచ్చింది. యెరూషలేము ఆలయంలో కేంద్రీకృతమై ఉన్న యూదా విధానం యొక్క పూర్తి మత రాజకీయ ఆకృతి, మరెన్నటికీ పునరుద్ధరించబడకుండా పడద్రోయబడింది.

3. మనం నేడు యేసు ప్రవచనాన్ని లక్ష్యపెట్టడం ఎందుకు ప్రాముఖ్యం?

3 యేసు ప్రవచనం యొక్క మొదటి నెరవేర్పు చుట్టూ ఉన్న పరిస్థితులను ఇప్పుడు పరిశీలించుదాము. అది నేడు ఉన్న సమాంతర నెరవేర్పును అర్థం చేసుకోడానికి మనకు శ్రేష్ఠంగా సహాయం చేస్తుంది. మానవజాతినంతటినీ భయపెడుతున్న శ్రమలన్నింటిలోకి అతి గొప్ప శ్రమను తప్పించుకోవడానికి మనం ఇప్పుడే అనుకూల చర్యను తీసుకోవడం ఎంత అత్యవసరమో అది మనకు చూపుతుంది.—రోమీయులు 10:9-13; 15:4; 1 కొరింథీయులు 10:11; 15:58.

“అంతము”—ఎప్పుడు?

4, 5. (ఎ) సా.శ. మొదటి శతాబ్దంలోని దైవ భయంగల యూదులు దానియేలు 9:24-27 యొక్క ప్రవచనమందు ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నారు? (బి) ఈ ప్రవచనం ఎలా నెరవేరింది?

4 దాదాపు సా.శ.పూ. 539వ సంవత్సరంలో, “డెభ్బై వారముల” సంవత్సరాల కాలంలోని చివరి “వారము” గడుస్తున్నప్పుడు జరిగే సంగతులను గురించిన దర్శనం దేవుని ప్రవక్తయైన దానియేలుకు ఇవ్వబడింది. (దానియేలు 9:24-27) పారసీక దేశపు రాజైన అర్తహషస్త యెరూషలేము పట్టణము తిరిగి నిర్మింపబడాలని ఆజ్ఞాపించినప్పుడు, అనగా సా.శ.పూ. 455లో ఈ “వారములు” ప్రారంభమయ్యాయి. చివరి “వారము,” మెస్సీయ అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమవ్వడంతో అంటే సా.శ. 29లో బాప్తిస్మం తీసుకుని అభిషేకించబడినప్పుడు ఆరంభమయ్యింది.b దానియేలు ప్రవచనం యొక్క ఈ కాల వివరణను గురించి సా.శ. మొదటి శతాబ్దంలోని దేవునికి భయపడే యూదులకు బాగా తెలుసు. ఉదాహరణకు, సా.శ. 29లో బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క ప్రకటనను వినడానికి గుమికూడిన జనులను గురించి లూకా 3:15 ఇలా చెబుతుంది: “ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచు” ఉండిరి.

5 యూదులకు పొడిగింపబడిన ప్రత్యేక అనుగ్రహ కాలమైన ఏడు సంవత్సరాలే, డెబ్బయ్యవ “వారము,” అవుతుంది. అది సా.శ. 29లో మొదలౌతూ, యేసు బాప్తిస్మం పరిచర్యలు, సా.శ. 33నందు అంటే “అర్థ వారములో” ఆయన బలి మరణం మరి సా.శ. 36 వరకు ఉన్న మరో “అర్థ వారం,” అందులో చేరి ఉన్నాయి. ఈ “వారము”లో, యేసు అభిషక్త శిష్యులు అయ్యే అవకాశం దేవునికి భయపడే యూదులకు మరియు యూదా మత ప్రవిష్టులకు ప్రత్యేకంగా అందించబడింది. తర్వాత, ముందు తెలియబడని ఒక తేదీన అంటే సా.శ. 70లో, టైటస్‌ ఆధిపత్యంలో రోమా సైన్యాలు భ్రష్ట యూదా వ్యవస్థను తుదముట్టించాయి.—దానియేలు 9:26, 27.

6. సా.శ. 66లో “హేయ వస్తువు” చర్యను తీసుకోవడానికి ఏవిధంగా కదిలింది. మరి క్రైస్తవులెలా ప్రతిస్పందించారు?

6 అలా, యెరూషలేము ఆలయాన్ని కలుషితం చేసి, దేవుని స్వంత కుమారుని హత్య విషయంలో కుట్ర పన్నిన యూదా యాజకత్వం నిర్మూలం కావించబడింది. దానితోపాటు, జాతీయ మరియు తెగలకు సంబంధించిన రికార్డులు కూడా నిర్మూలమయ్యాయి. దాని తర్వాత, ఏ యూదుడూ కూడా యాజకత్వ లేక రాజరిక హక్కు కలిగి ఉన్నానని చట్టబద్ధంగా చెప్పుకోలేడు. అయితే అభిషేకించబడిన ఆత్మీయ యూదులు యెహోవా దేవుని “గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము,” రాజరిక యాజకత్వం కొరకు వేర్పర్చబడ్డారన్నది సంతోషకరమైన విషయం. (1 పేతురు 2:9) సా.శ. 66లో రోమా సైన్యాలు మొదట యెరూషలేమును చుట్టుముట్టి ఆలయ ప్రాంతం అడుగున సొరంగం త్రవ్వినప్పుడు, ఆ సైనిక బలగాన్ని “ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట” అని క్రైస్తవులు గుర్తించారు. యేసు యొక్క ప్రవచనార్ధక ఆజ్ఞకు లోబడుతూ, యెరూషలేము మరియు యూదయలోని క్రైస్తవులు రక్షణ కొరకు కొండ ప్రాంతాలకు పారిపోయారు.—మత్తయి 24:15, 16; లూకా 21:20, 21.

7, 8. క్రైస్తవులు ఏ “సూచనను” గమనించారు, కానీ వారికి ఏమి తెలియదు?

7 ఆ నమ్మకమైన యూదా క్రైస్తవులు దానియేలు ప్రవచన నెరవేర్పును గమనించారు మరి ‘ఈ విధానాంత ముగింపు యొక్క . . . సూచన’లో భాగమని యేసు ముందే చెప్పిన భయంకరమైన యుద్ధాలు, కరవులు, రోగాలు, భూకంపాలు మరియు అక్రమానికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. (మత్తయి 24:3) ఆ కుళ్లిన వ్యవస్థపై తన తీర్పును యెహోవా ఎప్పుడు అమలు చేస్తాడో యేసు వారికి చెప్పాడా? లేదు. ఆయన భవిష్యత్‌ రాజరిక ప్రత్యక్షత యొక్క ముగింపును గురించి ఆయన ప్రవచించినది మొదటి శతాబ్దపు ‘మహా శ్రమకు’ కూడా తప్పకుండా అన్వయింపబడింది: “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.”—మత్తయి 24:36.

8 యేసు మెస్సీయగా కనిపించే సమయాన్ని, దానియేలు ప్రవచనంనుండి యూదులు లెక్కించి ఉండవచ్చు. (దానియేలు 9:25) అయినప్పటికీ, భ్రష్ట యూదా వ్యవస్థను తుదకు నిర్మూలం చేసిన ‘మహా శ్రమను’ గురించిన తేదీ వారికి ఇవ్వబడలేదు. యెరూషలేము మరియు దాని ఆలయం నాశనం అయిన తర్వాతనే ఆ తేదీ సా.శ. 70 అని వారు గుర్తించారు. అయితే, వారికి యేసు ప్రవచనార్థక మాటలను గురించి తెలుసు: ‘ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు.’ (మత్తయి 24:34) ఇక్కడ “తరము” యొక్క అన్వయింపు ఒక కాలవ్యవధిలో వచ్చి పోయే క్రమమైన తరాలను గురించి మాట్లాడుతున్న ప్రసంగి 1:4నందు ఉన్న దానినుండి ఇది వేరన్న విషయం స్పష్టం.

“ఈ తరము”—అది ఏమిటి?

9. జీ·ని·యాʹ అనే గ్రీకు పదాన్ని నిఘంటువులు ఎలా నిర్వచిస్తున్నాయి?

9 యేసుతో పాటు ఒలీవల కొండపై కూర్చుని ఉన్న నలుగురు అపొస్తలులు ‘ఈ యుగసమాప్తిని’ గూర్చిన ఆయన ప్రవచనాన్ని విన్నప్పుడు, “ఈ తరము” అనే పదాన్ని వారు ఎలా అర్థం చేసుకుని ఉంటారు? సువార్తల్లో “తరము” అనే పదం జీ·ని·యాʹ అనే గ్రీకు పదంనుండి అనువదించబడింది, దాన్ని ఇటీవలి నిఘంటువులు ఈ పదాల్లో నిర్వచించారు: “అక్ష[రార్థముగా] ఒకే పూర్వికుని నుండి వచ్చినవారు.” (వాల్టర్‌ బవుర్‌ రచించిన క్రొత్త నిబంధన యొక్క గ్రీకు ఆంగ్ల ఆకారాది నిఘంటువు) “జన్మించినవారు, ఒక కుటుంబం; . . . ఒకే వంశంలో వరుసగా వచ్చిన సభ్యులు . . . లేక ప్రజల జాతి . . . లేక ఒకే కాలంలో జీవిస్తున్న మనుష్యుల యావత్‌ గుంపు, మత్త. 24:34; మార్కు 13:30; లూకా 1:48; 21:32; ఫిలి. 2:15 మరి ప్రాముఖ్యంగా ఒకే కాలంలో జీవించిన యూదుల వంశానుక్రమం.” (డబ్ల్యు. ఇ. వైన్‌ రచించిన క్రొత్త నిబంధన యొక్క పదముల వివరమైన నిఘంటువు) “జన్మించినట్టి, అదే వంశానికి చెందిన ప్రజలు, ఒకే కుటుంబం; . . . ఒకే కాలంలో జీవిస్తున్న మనుష్యుల యావత్‌ సమూహం: మత్త. xxiv. 34; మార్కు xiii. 30; లూకా i. 48 . . . ప్రా[ముఖ్యంగా], అదే ఆ ఒకే కాలంలోనే జీవిస్తున్న యూదుల వంశానుక్రమానికి ఉపయోగింపబడుతుంది.”—జె. హెచ్‌. థేయర్‌ రచించిన క్రొత్త నిబంధన యొక్క గ్రీకు ఆంగ్ల ఆకారాది నిఘంటువు.

10. (ఎ) మత్తయి 24:34ను సూచించడంలో రెండు అధికారిక గ్రంథమూలాలు ఏ ఒకేలాంటి నిర్వచనాన్ని ఇచ్చాయి? (బి) ఒక వేదాంతపర నిఘంటువు, కొన్ని బైబిలు అనువాదాలు ఈ నిర్వచనానికి ఎలా మద్దతు ఇచ్చాయి?

10 అలా వైన్‌ మరియు థేయర్‌ ‘ఈ తరమును’ (హీ జీ·ని·యాʹ హౌʹటె) “ఒకే కాలంలో జీవిస్తున్న మనుష్యుల యావత్‌ సమూహం” అని నిర్వచించడానికి మత్తయి 24:34ను ఉదహరించారు. ఇలా చెబుతూ క్రొత్త నిబంధన యొక్క వేదాంతపర నిఘంటువు (1964) ఈ నిర్వచనానికి మద్దతునిస్తుంది: “యేసు ‘తరమును’ ఉపయోగించడం ఆయన యావత్‌ సంకల్పాన్ని తెలియజేస్తుంది: ఆయన ప్రజలందరిని దృష్టికి తీసుకున్న వానిగా, వారెంతగా పాపమందు కూరుకుపోయారో ఎరిగియున్నాడు.” వాస్తవంగా ‘పాపమందు కూరుకుపోయి ఉండటం’ నేడు లోక విధానంలో ఎక్కువగా ఉన్నట్లే యేసు భూమిపై ఉన్నప్పుడు యూదా జనాంగంలో అది ఉన్నదనే విషయం స్పష్టం.c

11. (ఎ) హీ జీ·ని·యాʹ హౌʹటెను ఎలా అన్వయించాలి అనే విషయాన్ని ఏ అధికారిక గ్రంథమూలం ప్రాథమికంగా నడిపించాలి? (బి) ఈ అధికారిక గ్రంథమూలం ఆ పదాన్ని ఎలా ఉపయోగించింది?

11 నిజమే, ఈ విషయాన్ని అధ్యయనం చేస్తున్న క్రైస్తవులు, యేసు మాటలను నివేదిస్తు హీ జీ·ని·యాʹ హౌʹటె అనే గ్రీకు పదాన్ని లేక “ఈ తరము”ను ప్రేరేపిత సువార్త రచయితలు ఎలా ఉపయోగించారు అనే దాన్ని బట్టే ప్రాథమికంగా తమ ఆలోచనా విధానాన్ని నడిపిస్తారు. ఆ పదం ఎడతెగక ప్రతికూలమైన విధానంలో ఉపయోగించబడింది. అందుకని, యూదా మత నాయకులను యేసు “సర్పములారా, సర్పసంతానమా” అని పిలుస్తూ “ఈ తరము” వారిపై గెహెన్నా తీర్పు అమలు చేయబడుతుందని చెప్పాడు. (మత్తయి 23:33, 36) అయితే, ఈ తీర్పు వేషధారులైన మత నాయకులకు మాత్రమేనా? ఎంత మాత్రం కాదు. అనేక సందర్భాల్లో, “ఈ తరము” అనే పదాన్ని ఎంతో విస్తృత భావంలో అన్వయిస్తూ దాని గురించి యేసు మాట్లాడటం ఆయన శిష్యులు విన్నారు. అది ఏమిటి?

“యీ దుష్టతరము”

12. తన శిష్యులు వింటుండగా, యేసు “జనసమూహమును” “యీ తరము”తో ఎలా ముడిపెట్టాడు?

12 యేసు గలిలయలో చేసిన గొప్ప పరిచర్య సమయంలో మరి పస్కా అయిన వెంటనే సా.శ. 31లో ఆయన “జనసమూహములతో” ఇలా చెప్పడాన్ని ఆయన శిష్యులు విన్నారు: “ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి—మీకు పిల్లనగ్రోవి ఊదితిమిగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. [బాప్తిస్మమిచ్చు] యోహాను తినకయు త్రాగకయువచ్చెను గనుక—వీడు దయ్యముపట్టినవాడని వారనుచున్నారు. మనుష్యకుమారుడు [యేసు] తినుచును త్రాగుచును వచ్చెను గనుక—ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు.” నియమాలు లేని ఆ “జనసమూహము”లను ప్రీతిపర్చడం లేదు!—మత్తయి 11:7, 16-19.

13. తన శిష్యుల సమక్షంలో, “యీ దుష్టతరము” అని యేసు ఎవరిని గుర్తించి, ఖండించాడు?

13 యేసు ఆయన శిష్యులు గలిలయకు తమ రెండవ ప్రచారయాత్ర చేయబోతుండగా సా.శ. 31 చివరి భాగంలో, “శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు” యేసును సూచకక్రియ కొరకు అడిగారు. ఆయన వారికి, అక్కడ ఉన్న “జనసమూహముల”కు ఇలా చెప్పాడు: “వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచకక్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. . . . ఆలాగే యీ దుష్టతరమువారికిని” సంభవించును. (మత్తయి 12:38-46) “యీ దుష్టతరము”లో, యేసు మరణం మరియు పునరుత్థానము విషయంలో నెరవేరిన సూచనను ఎన్నడూ అర్థం చేసుకొనని మత నాయకులు, “జనసమూహములు” కూడా ఇమిడి ఉన్నారు.d

14. సద్దూకయ్యులు మరియు పరిసయ్యులను యేసు ఎలా ఖండించడాన్ని ఆయన శిష్యులు విన్నారు?

14 సా.శ. 32 పస్కా తర్వాత యేసు ఆయన శిష్యులు గలిలయ ప్రాంతమైన మగదానుకు వచ్చినప్పుడు, సద్దూకయ్యులు మరియు పరిసయ్యులు యేసును సూచకక్రియ కొరకు మరల అడిగారు. ఆయన వారికిలా మళ్లీ చెప్పాడు: ‘వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచక క్రియయేగాని మరి ఏ సూచకక్రియయైన వారి కనుగ్రహింపబడదు.’ (మత్తయి 16:1-4) “యీ దుష్టతరము” అని యేసు ఖండించిన అపనమ్మకస్థులైన “జనసమూహము” యొక్క నాయకులుగా ఆ మత వేషధారులు కచ్చితంగా నిందార్హులు.

15. రూపాంతరానికి ముందు మరి దాని వెంటనే, యేసు ఆయన శిష్యులు ‘యీ తరముతో’ ఏమి ఎదుర్కొన్నారు?

15 తన గలిలయనందలి పరిచర్య ముగింపులో, యేసు జనసమూహాన్ని, తన శిష్యులను తన వద్దకు పిలిచి ఇలా చెప్పాడు: ‘వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు . . . సిగ్గుపడును.’ (మార్కు 8:34, 38) ఆ సమయమందలి పశ్చాత్తాపం చెందని యూదులలోని అత్యధికులు “వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో” ఉన్నారన్నది స్పష్టం. యేసు రూపాంతరము జరిగిన కొన్ని దినాల తర్వాత యేసు, ఆయన శిష్యులు “జనసమూహమునొద్దకు” వచ్చారు, మరి ఒక మనుష్యుడు తన కుమారుని బాగు చేయమని ఆయనను అడుగుతాడు. యేసు ఇలా వ్యాఖ్యానించాడు: “విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును?”—మత్తయి 17:14-17; లూకా 9:37-41.

16. (ఎ) “జనసమూహముల”ను యేసు యూదయలో కూడా మరల ఎలా ఖండించాడు? (బి) “యీ తరము” అని నేరాలలోకెల్లా దుష్టమైన దాన్ని ఎలా చేసింది?

16 అది బహుశా యూదయనందు సా.శ. 32లో పర్ణశాలల పండుగ తర్వాత యేసుచుట్టూ “జనులు గుంపులుగా కూడినప్పుడు,” ఆయన మళ్లీ ఇలా అంటూ వారిని ఖండించాడు: “ఈ తరమువారు దుష్టతరము వారై యుండి సూచకక్రియ నడుగుచున్నారు. అయితే యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియయు వీరికి అనుగ్రహింపబడదు.” (లూకా 11:29) తుదకు, మత నాయకులు యేసును న్యాయవిమర్శకు తెచ్చినప్పుడు, పిలాతు ఆయనను విడుదల చేస్తానని అన్నాడు. రికార్డు ఇలా చెబుతుంది: “ప్రధానయాజకులును పెద్దలును, బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. . . . పిలాతు—ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా—సిలువవేయుమని అందరును చెప్పిరి. అధిపతి—ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు—సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి.” ఆ “దుష్టతరము” యేసు రక్తాన్ని ఆశించింది!—మత్తయి 27:20-25.

17. ‘ఈ మూర్ఖ తరములోని’ కొందరు పెంతెకొస్తు నాడు పేతురు చేసిన ప్రచారానికి ఎలా ప్రతిస్పందించారు?

17 దాని మత నాయకులచేత రేపబడిన ఒక “విశ్వాసములేని మూర్ఖతరము” ప్రభువైన యేసుక్రీస్తుకు మరణాన్ని తీసుకురావడంలో ముఖ్యపాత్ర వహించింది. యాభై దినాల తర్వాత, సా.శ. 33 పెంతెకొస్తు నాడు శిష్యులు పరిశుద్ధాత్మను పొంది వేర్వేరు భాషలలో మాట్లాడటం ప్రారంభించారు. శబ్దం విని “జనులు గుంపులుగా కూడి” వచ్చారు, అపొస్తలుడైన పేతురు వారిని “యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా,” అని సంబోధించి ఇలా చెప్పాడు: “యీయనను మీరు దుష్టులచేత సిలువవేయించి చంపితిరి.” ఆ శ్రోతలలోని కొందరు ఎలా ప్రతిస్పందించారు? ‘వారు హృదయములో నొచ్చుకున్నారు.’ పశ్చాత్తాపం చెందమని పేతురు వాళ్లను వేడుకున్నాడు. ఆయన “అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి—మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.” దానికి ప్రతిస్పందనగా, దాదాపు మూడు వేలమంది ‘అతని వాక్యము అంగీకరించి బాప్తిస్మము పొందిరి.’—అపొస్తలుల కార్యములు 2:6, 14, 23, 37, 40, 41.

“యీ తరము” గుర్తించబడినది

18. యేసు “యీ తరము” అని ఉపయోగించడం తదేకంగా దేనికి అన్వయిస్తుంది?

18 యేసు తన శిష్యుల సమక్షంలో తరచుగా ప్రస్తావించిన ఆ “తరము” ఏది? ‘ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు’ అని యేసు చెప్పిన మాటలనుండి వారేమి అర్థం చేసుకున్నారు? యూదా జనాంగంగా తయారైన తన సమకాలీన సామాన్య ప్రజలను వారి ‘గ్రుడ్డి మార్గదర్శకుల’తో కలిపి ఏకరీతిగా తాను అన్వయించిన “ఈ తరము” అనే పదాన్ని తాను స్థిరంగా ఉపయోగించడం నుండి యేసు ప్రక్కకు మళ్లలేదు. (మత్తయి 15:14) “యీ తరము” యేసు ముందే చెప్పిన శ్రమనంతటినీ అనుభవించింది మరి తర్వాత యెరూషలేముపై వచ్చిన తిరుగులేని “మహా శ్రమ”లో గతించిపోయింది.—మత్తయి 24:21, 34.

19. యూదా విధానం యొక్క “ఆకాశమును మరియు భూమియు” ఎప్పుడు మరియు ఎలా గతించాయి?

19 మొదటి శతాబ్దంలో, యెహోవా యూదా ప్రజలకు తీర్పు తీర్చాడు. క్రీస్తు ద్వారా యెహోవా దయగల ఏర్పాటులో విశ్వాసాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టిన పశ్చాత్తాపం చెందిన వారు ఆ ‘మహా శ్రమను’ తప్పించుకున్నారు. యేసు ముందే చెప్పినట్లుగా, ప్రవచింపబడినవన్ని జరిగాయి, మరి యూదా విధానం యొక్క “ఆకాశమును భూమియు”—దాని మత నాయకులు మరియు దుష్ట ప్రజల వ్యవస్థ అయిన పూర్తి జనాంగము—గతించి పోయింది. యెహోవా తీర్పు అమలు చేశాడు!—మత్తయి 24:35; 2 పేతురు 3:7ను పోల్చండి.

20. ఏ సమయోచితమైన సలహా, అందరు క్రైస్తవులకు అత్యవసరంగా అన్వయిస్తుంది?

20 యేసు ప్రవచనార్థక మాటలపై అవధానం నిలిపిన యూదులు, తమ రక్షణ “తరము” లేక కొన్ని తారీఖులుగల “సమయాలు లేక కాలాలను” లెక్కించేందుకు ప్రయత్నించడంపై కాక తమ సమకాలీన దుష్ట తరము నుండి వేరుగా ఉండి దేవుని చిత్తాన్ని ఆసక్తితో చేయడంపై ఆధారపడి ఉందని గుర్తించారు. యేసు ప్రవచనం యొక్క చివరి మాటలు మన దినంలోని పెద్ద నెరవేర్పుకు అన్వయిస్తున్నప్పటికీ, మొదటి శతాబ్దంలోని యూదా క్రైస్తవులు కూడా ఈ సలహాను లక్ష్యపెట్టవలసి ఉండిరి: ‘మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.’—లూకా 21:32-36; అపొస్తలుల కార్యములు 1:6-8.

21. మన సమీప భవిష్యత్తులో మనం ఏ ఆకస్మిక పరిణామాన్ని అపేక్షించవచ్చు?

21 నేడు, “యెహోవా మహా దినము . . . సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది.” (జెఫన్యా 1:14-18; యెషయా 13:9, 13) అకస్మాత్తుగా, యెహోవా ముందే నిర్ణయించిన ‘దినము మరియు గడియలో,’ ఆయన ఉగ్రత ఈ లోక మత, రాజకీయ మరియు వాణిజ్య వర్గాలపై అలాగే ఈ సమకాలీన ‘వ్యభిచారులైన చెడ్డ తరమగు’ దారితప్పిన ప్రజలపై కుమ్మరింపబడుతుంది. (మత్తయి 12:39; 24:36; ప్రకటన 7:1-3, 9, 14) మీరు ఆ ‘మహా శ్రమ’ నుండి ఎలా తప్పించుకుంటారు? మా తదుపరి శీర్షిక భవిష్యత్తు కొరకున్న మహిమాన్విత నిరీక్షణను గురించి చెబుతుంది.

[అధస్సూచీలు]

a ఈ ప్రవచనం యొక్క సంపూర్ణ వివరణ కొరకు, ఫిబ్రవరి 15, 1994 కావలికోట 14, 15 పేజీలయందలి చార్టును దయచేసి చూడండి.

b “వారముల” సంవత్సరాలను గురించిన అదనపు సమాచారం కొరకు, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌ ఇన్‌కార్పొరేటెడ్‌ వారు ప్రచురించిన బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంలోని 130-2 పేజీలను చూడండి.

c మత్తయి 24:34 నందలి హీ జీ·ని·యాʹ హౌʹటెను కొన్ని బైబిళ్లు ఇలా అనువదించాయి: “ఈ ప్రజలు” (నేటి భాషలో పరిశుద్ధ బైబిలు [1976], డబ్ల్యు. ఎఫ్‌. బెక్‌ అనువదించినది); “ఈ జనాంగం” (క్రొత్త నిబంధన—ఒక సవివరమైన అనువాదం [1961], కె. ఎస్‌. వెస్ట్‌ అనువదించినది); “ఈ ప్రజలు” (యూదా క్రొత్త నిబంధన [1979], డి. హెచ్‌. స్టర్న్‌ అనువదించినది).

d అమ్‌-హ·’అʹరేట్‌లు లేక “మంటి ప్రజలే,” అపనమ్మకస్థులైన ఈ “జనసమూహములు” అని అనుకోరాదు. అమ్‌-హ·’అʹరేట్‌లతో సహవసించేందుకు గర్విష్ఠులైన మత నాయకులు నిరాకరించారు, అయితే యేసు మాత్రం వారిపై “జాలి చూపాడు.”—మత్తయి 9:36; యోహాను 7:49.

మీరు ఎలా జవాబిస్తారు?

◻ దానియేలు 9:24-27 యొక్క నెరవేర్పు నుండి మనము ఏమి నేర్చుకుంటాము?

◻ బైబిలులో ఉపయోగింపబడిన రీతిగా “యీ తరము” అనే పదాన్ని ఇటీవలి నిఘంటువులు ఎలా నిర్వచిస్తున్నాయి?

◻ “తరము” అనే పదాన్ని యేసు తదేకంగా ఎలా ఉపయోగించాడు?

◻ మత్తయి 24:34, 35 మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరింది?

[12వ పేజీలోని చిత్రం]

యేసు “యీ తరమును” అవిధేయులైన పిల్లల గుంపుకు పోల్చాడు

[15వ పేజీలోని చిత్రం]

దుష్ట యూదా వ్యవస్థపై తీర్పు అమలు చేయవలసిన గడియ కేవలం యెహోవాకు మాత్రమే ముందు తెలుసు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి