మెలకువగా ఉండవలసిన సమయం
“సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. . . . అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును.”—మార్కు 13:10, 13.
1. మనము ఎందుకు సహించి, ధైర్యం కలిగి ఉండాలి?
విశ్వాసంలేని మూర్ఖ తరము మధ్య మనం సహించాల్సి ఉంది! యేసు కాలంలో వలెనే, 1914నుండి ఒక తరము ప్రజలు అవినీతిపరులయ్యారు. మరి నేడు ఆ అవినీతి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ “అంత్యదినాల్లో,” అపొస్తలుడైన పౌలు వర్ణించిన ‘వ్యవహరించడానికి కష్టతరమైన కాలములు’ మానవజాతిని పీడిస్తున్నాయి. ‘దుర్జనులును వంచకులును . . . అంతకంతకు చెడిపోవుచున్నారు.’ “లోకమంతయు,” భూమిని నాశనం చేయడానికి తన చివరి ప్రయత్నాలను చేస్తున్న అపవాదియగు సాతానైన “దుష్టునియందు” ఉన్నదనే విషయం స్పష్టం. అయితే ధైర్యంగా ఉండండి! నీతిని ప్రేమించే వారందరికీ శాశ్వత ఉపశమనాన్ని తీసుకువచ్చే ‘మహాశ్రమ’ రాబోతోంది.—2 తిమోతి 3:1-5, 13; 1 యోహాను 5:19; ప్రకటన 7:14.
2. ప్రవచనం 1914లో ఎలా నెరవేరింది?
2 యెహోవా, మానవజాతిని అణచివేసే శత్రువులను తొలగించడానికి సిద్ధంగా ప్రభువైన యేసుక్రీస్తును పరలోకంలో సింహాసనాసీనున్ని చేశాడు. (ప్రకటన 11:15) మెస్సీయ మొదటి ఆగమనం విషయంలో వలెనే, దానియేలు వ్రాసిన ఒక గణనీయమైన ప్రవచనం ఈ శతాబ్దంలో నెరవేరింది. భూమిపై హక్కుగల రాజరికాన్ని “ఏడు కాలముల” వరకు తీసివేయడాన్ని గురించి మనకు దానియేలు 4:16, 17, 32 నందు తెలుపబడింది. వీటి ప్రధాన నెరవేర్పునందు ఈ ఏడు కాలాలు, ప్రతిదీ 360 దినాలుగల ఏడు బైబిలు సంవత్సరాల మొత్తం లేక 2,520 సంవత్సరాల మొత్తం.a సా.శ.పూ. 607లో ఇశ్రాయేలు రాజ్యాన్ని బబులోను అణగ త్రొక్కినప్పటి నుండి మొదలుకొని, మానవజాతిపై హక్కుగల రాజుగా యేసు పరలోకంలో సింహాసనాసీనుడైన సంవత్సరం, అంటే సా.శ. 1914 వరకు అవి కొనసాగాయి. అప్పుడు “అన్యజనముల కాలములు” ముగిశాయి. (లూకా 21:24) అయితే అన్యజనములు రాబోయే మెస్సీయ రాజ్యానికి లోబడేందుకు సమ్మతించలేదు.—కీర్తన 2:1-6, 10-12; 110:1, 2.
3, 4. (ఎ) మొదటి శతాబ్దంలోని సంఘటనలు మన కాలంనాటి వాటితో ఎలా పోల్చవచ్చు? (బి) ఏ యుక్తమైన ప్రశ్నలను అడగవచ్చు?
3 (సా.శ. 29-36) 70వ వారపు సంవత్సరాలు దగ్గరపడినప్పటి వలెనే, మరి మళ్లీ 1914 సంవత్సరం దగ్గర పడినప్పుడు దేవునికి భయపడే ప్రజలు మెస్సీయ వస్తాడని అపేక్షిస్తూ ఉన్నారు. ఆయన అట్లే వచ్చాడు! అయితే, ప్రతి సందర్భంలోను ఆయన కనిపించే పద్ధతి అపేక్షించిన దానికన్నా భిన్నంగా ఉండినది. ప్రతి సందర్భంలోనూ, తూలనాత్మకంగా కొద్ది కాల సమయం తర్వాత, తుదకు ఒక చెడ్డ “తరము” దైవిక ఆజ్ఞ ద్వారా శిక్షను పొందుతుంది.—మత్తయి 24:34.
4 మన ముందు శీర్షికలో, యేసు రక్తాన్ని కోరిన దుష్ట యూదా తరము ఎలా అంతమయ్యిందో మనం పరిశీలించాము. అయితే, ఇప్పుడు కూడా ఆయనను వ్యతిరేకిస్తున్న లేక అలక్ష్యం చేస్తున్న నాశనకరమైన తరము సంగతేమిటి? ఈ విశ్వాసంలేని తరముపై తీర్పు ఎప్పుడు అమలు చేయబడుతుంది?
“జాగరూకంగా ఉండవలసిన సమయం”!
5. (ఎ) యెహోవా ‘దినము మరియు గడియ’ యొక్క సమయాన్ని మనం ఏ మంచి కారణం చేత తెలుసుకోవలసిన అవసరం లేదు? (బి) మార్కు వ్రాసిన దాని ప్రకారం, ఏ మంచి సలహాతో యేసు తన ప్రవచనాన్ని ముగించాడు?
5 ‘మహాశ్రమ’ వచ్చే కాలానికి దారితీసే సంఘటనలను ప్రవచించిన తర్వాత, యేసు ఇంకనూ ఇలా చెప్పాడు: “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.” (మత్తయి 24:3-36; మార్కు 13:3-32) సంఘటనల కచ్చితమైన సమయాన్ని గురించి మనకు తెలియవలసిన అవసరం లేదు. బదులుగా, మన దృష్టి మనం జాగరూకంగా ఉండటంపై, దృఢ విశ్వాసాన్ని వృద్ధిపర్చుకోవడంపై, మరి యెహోవా సేవలో పనిరద్దీ కల్గి ఉండటంపై ఆధారపడి ఉండాలే కానీ—తేదీని లెక్కించడంపై కాదు. ఇలా చెప్పడం ద్వారా యేసు తన గొప్ప ప్రవచనాన్ని ముగించాడు: “ఎదురు చూస్తూ ఉండండి, మెలకువగా ఉండండి, ఎందుకంటే నియమిత సమయం ఎప్పుడో మీకు తెలియదు. . . . జాగరూకంగా ఉండండి . . . నేను మీకు ఏది చెబుతున్నానో అదే అందరికీ చెబుతున్నాను, జాగరూకంగా ఉండండి.” (మార్కు 13:33-37, NW) నేటి ప్రపంచపు నీలినీడల్లో ప్రమాదం పొంచి ఉంది. మనం మెలకువగా ఉండాలి!—రోమీయులు 13:11-13.
6. (ఎ) మన విశ్వాసం దేనిపై దృఢపడి ఉండాలి? (బి) మనం మన ‘దినములను’ ఎలా లెక్కించగలం? (సి) “తరము” అని అన్నప్పుడు యేసు మూల భావం ఏమై ఉంది?
6 మనం ఈ దుష్ట విధానం యొక్క చివరి దినాలను గురించిన ప్రేరేపిత ప్రవచనాలపై అవధానాన్ని నిలపడమే కాక మొదట క్రీస్తు యేసు ప్రశస్తమైన బలిపై అలాగే దానిపై ఆధారపడిన దేవుని మహనీయమైన వాగ్దానాలపై మన విశ్వాసాన్ని దృఢపర్చుకోవాలి. (హెబ్రీయులు 6:17-19; 9:14; 1 పేతురు 1:18, 19; 2 పేతురు 1:16-19) ఈ దుష్ట విధానం యొక్క అంతాన్ని చూడాలన్న ఆతృతతో, యెహోవా ప్రజలు కొన్నిసార్లు ‘మహాశ్రమ’ ఎప్పుడు వస్తుందనే సమయాన్ని అంచనా వేసి, 1914నుండి ఒక తరం జీవిత కాలమెంతో అన్న లెక్కలకు కూడా దాన్ని కలిపారు. అయితే, ఒక తరంలో ఎన్ని సంవత్సరాలు లేక దినాలు ఉంటాయి అని అంచనావేయడం ద్వారా కాక యెహోవాకు ఆనందభరిత స్తుతిని అందించేందుకు మన “దినములు లెక్కించుట” ఎలా అని ఆలోచించడం ద్వారా మనం “జ్ఞానహృదయము” కలిగి ఉండగలము. (కీర్తన 90:12) సమయాన్ని కొలిచేందుకు ఒక నియమాన్ని ఇచ్చే బదులు, “తరము” అనే పదాన్ని యేసు ఉపయోగించిన పద్ధతి ప్రాముఖ్యంగా గుర్తింపదగిన తమవైన గుణలక్షణాలుగల ఒక చారిత్రాత్మక కాలానికి చెందిన సమకాలీన ప్రజలను సూచిస్తుంది.b
7. ఒక చరిత్ర పండితుడు “1914కు చెందిన తరము”ను గురించి ఏమి వ్రాశాడు, మరి అది యేసు ప్రవచనంతో ఎలా ముడిపడింది?
7 పైనున్న విషయాలకు పొందికగా, 1914కు చెందిన తరము అనే తన పుస్తకంలో చరిత్ర పండితుడైన రాబర్ట్ వాల్ ఇలా వ్రాశాడు: “ఒక చారిత్రాత్మక తరము దాని కాలక్రమానుసార అవధులను బట్టి నిర్వచింపబడదు . . . అది తేదీలతో నిర్వచింపబడలేదు.” అయితే మొదటి ప్రపంచ యుద్ధం “గతంతో పూర్తి తెగతెంపులు” చేసిందని ఆయన సూచించి ఇంకనూ ఇలా చెప్పాడు: “యుద్ధం కాలంలో జీవించిన వారు, ఆగష్టు 1914లో ఒక ప్రపంచం అంతమై మరొకటి మొదలైందన్న నమ్మకాన్ని వదులుకోలేరు.” అది ఎంతటి వాస్తవమో కదా! ఇది విషయంలోని ముఖ్యాంశంపై దృష్టిని కేంద్రీకరించింది. మానవజాతి యొక్క “యీ తరము” 1914 నుండి భయంకరమైన మార్పులను అనుభవించింది. కోట్లాదిమంది ప్రజల రక్తంలో భూమి ముంచెత్తబడటాన్ని అది చూసింది. యుద్ధాలు, జాతినిర్మూలన, ఉగ్రవాదం, నేరం మరియు అక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువయ్యాయి. కరవు, వ్యాధి మరియు లైంగిక దుర్నీతి మన భూగోళమంతా వ్యాపించాయి. యేసు ఇలా ప్రవచించాడు: “అటువలె మీరు [ఆయన శిష్యులు] ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి. అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.”—లూకా 21:31, 32.
8. మెలకువగా ఉండవలసిన అవసరతను యెహోవా ప్రవక్తలు ఎలా నొక్కి తెలిపారు?
8 మెస్సీయ రాజ్యము యొక్క పూర్తి విజయం అతి త్వరలో ఉంది! తేదీల కొరకు చూడటం లేక ఒక “తరము” యొక్క అక్షరార్థ జీవిత కాలాన్ని గురించి అంచనా వేయడం ద్వారా ఏమైనా సాధించవచ్చా? ఏమీ సాధించలేము! హబక్కూకు 2:3 స్పష్టంగా ఇలా చెబుతుంది: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” యెహోవా తీర్పు దినము వేగంగా ఎంతో దగ్గరకు వస్తుంది.—యిర్మీయా 25:31-33; మలాకీ 4:1.
9. 1914 నుండి జరిగిన ఏ పరిణామాలు సమయం కొంచెమేనని చూపుతున్నాయి?
9 క్రీస్తు రాజ్య పరిపాలన 1914లో ప్రారంభమైనప్పుడు, సాతాను భూమ్మీదకు పడద్రోయబడ్డాడు. దాని అర్థం ‘భూమి నీకు శ్రమ,’ ఎందుకంటే “అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.” (ప్రకటన 12:12) సాతాను యొక్క వేలాది సంవత్సరాల పరిపాలనతో పోల్చి చూస్తే ఆ సమయం వాస్తవంగా కొంచెమే. రాజ్యము అలాగే ఈ దుష్ట తరముపై తీర్పు అమలు చేయాల్సిన యెహోవా దినము మరియు గడియ కూడా సమీపించాయి!—సామెతలు 3:25; 10:24, 25.
గతించిపోయే “తరము”
10. “యీ తరము” నోవహు దినం నాటిదాని వలె ఎలా ఉంది?
10 మత్తయి 24:34, 35 నందలి యేసు మాటలను మనం అత్యంత సన్నిహితంగా పరిశీలిద్దాం: “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.” ‘ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు ఎవరూ ఎరుగరని’ యేసు తర్వాతి మాటలు చూపిస్తున్నాయి. ఇంకా ఎక్కువ ప్రాముఖ్యంగా, ఈ తరములో మన చుట్టూ ఉన్న ఉరులను మనం తప్పించుకోవాలని ఆయన చూపించాడు. యేసు ఇంకనూ ఇలా చెప్పాడు: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.” (మత్తయి 24:36-39) యేసు ఇక్కడ తన కాలంనాటి తరమును నోవహు దినంనాటి దానితో పోల్చాడు.—ఆదికాండము 6:5, 9.
11. మత్తయి మరియు లూకా ద్వారా నివేదించబడినట్లు ‘తరములను’ యేసు ఎలా పోల్చాడు?
11 యేసు ‘తరములను’ ఇలా పోల్చడం ఆయన అపొస్తలులు విన్నది ఇదే మొదటిసారి కాదు, ఎందుకంటే కొన్నిదినాలకు ముందే తనను గురించి ఆయన ఇలా చెప్పాడు: “మనుష్యకుమారుడు . . . అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను. నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును.” (లూకా 17:24-26) అలా, మత్తయి 24వ అధ్యాయం మరియు లూకా 17వ అధ్యాయం ఒకేలా పోల్చుతున్నాయి. నోవహు కాలంలో “భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి” వారు మరి జలప్రళయంలో నాశనమైన వారు కూడా “యీ తరము” వారే. యేసు కాలంలో ఆయనను నిరాకరించిన భ్రష్ట యూదా ప్రజలు కూడా “యీ తరము” వారే.—ఆదికాండము 6:11, 12; 7:1.
12, 13. (ఎ) నేడు గతించిపోవలసిన “యీ తరము” ఏది? (బి) ఈ “మూర్ఖమైన వక్రజనము”తో యెహోవా ప్రజలు ఇప్పుడెలా తట్టుకొనగల్గుతున్నారు?
12 కాబట్టి, నేడు యేసు ప్రవచనంలోని చివరి దినాల్లో ఉన్న “యీ తరము,” క్రీస్తు ప్రత్యక్షత యొక్క సూచనను చూసినప్పటికీ తమ మార్గాలను సరి చేసుకోడానికి తప్పిపోయే ప్రజలను సూచిస్తుందన్న విషయం స్పష్టం. దానికి భిన్నంగా యేసు శిష్యులుగా మన “యీ తరము” యొక్క జీవన విధానం చేత మలచబడటానికి నిరాకరిస్తాము. “సమయము సమీపించినది గనుక” మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పటికి మనం దానిలో భాగం కాదు. (ప్రకటన 1:3; యోహాను 17:16) అపొస్తలుడైన పౌలు మనకిలా సలహా ఇస్తున్నాడు: “మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు.”—ఫిలిప్పీయులు 2:14, 15; కొలొస్సయులు 3:5-10; 1 యోహాను 2:15-17.
13 మనం ‘జ్యోతులవలె కనబడుటలో’ పరిశుభ్రమైన క్రైస్తవ వ్యక్తిత్వాన్ని కనపర్చడమే కాకుండా, అత్యంత ప్రాముఖ్యంగా, యేసు ప్రవచనార్థక ఆజ్ఞను నెరవేర్చడం కూడా ఇమిడి ఉంది: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) ఆ అంతం ఎప్పుడు వస్తుందో ఏ మానవునికీ తెలియదు, అయితే ఒకసారి దేవునికి సంతృప్తి కలిగేంతగా “భూదిగంతముల వరకు” సాక్ష్యం ఇవ్వబడితే దుష్ట ప్రజల “యీ తరము” అంతానికి వస్తుందని మనకు తెలుసు.—అపొస్తలుల కార్యములు 1:8.
‘ఆ దినము, ఆ గడియ’
14. “సమయములు మరియు కాలములను” గూర్చిన ఏ సలహాను యేసు మరియు పౌలు ఇచ్చారు, మరి మనం ఎలా ప్రతిస్పందించాలి?
14 యెహోవా సంకల్పించినంత మేరకు భూగోళవ్యాప్త సాక్ష్యం ఇవ్వబడిన తర్వాత, ఈ లోక విధానాన్ని అంతం చేయడానికి అది ఆయన ‘దినము మరియు గడియ’ అయి ఉంటుంది. మనం తేదీని ముందే తెలిసికొని ఉండవలసిన అవసరం లేదు. అలా యేసు మాదిరిని అనుకరిస్తూ, అపొస్తలుడైన పౌలు ఇలా సలహా ఇచ్చాడు: “సహోదరులారా, ఆ కాలములనుగూర్చియు ఆ సమయములనుగూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే [“యెహోవా,” NW] ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.” పౌలు దృష్టిని గమనించండి: ‘వారు చెప్పుకొనుచుండగా.’ అవును, “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని” చెప్పుకొంటున్నప్పుడు, అది వస్తుందని ఎంతమాత్రం ఊహించనప్పుడు దేవుని తీర్పు అకస్మాత్తుగా అమలు చేయబడుతుంది. పౌలు సలహా ఎంత సరియైనది: “కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము”!—1 థెస్సలొనీకయులు 5:1-3, 6; 7-11 వచనాలను కూడా చూడండి; అపొస్తలుల కార్యములు 1:7.
15, 16. (ఎ) అర్మగిద్దోను మనం నమ్మిన దానికంటే చాలా దూరాన ఉన్నదని మనం ఎందుకు ఆలోచించకూడదు? (బి) యెహోవా సర్వాధిపత్యం సమీప భవిష్యత్తులో ఎలా మహిమపర్చబడాలి?
15 “యీ తరము”ను గురించిన మన మరింత కచ్చితమైన దృష్టికోణం, అర్మగిద్దోను మనం ఊహించినంతకంటే ఇంకా దూరాన ఉందని అర్థమా? ఎంత మాత్రం కాదు! మనకు ఆ ‘దినము, గడియ’ను గూర్చి ఎప్పుడూ తెలియకపోయినప్పటికీ, యెహోవా దేవునికి అది అన్నివేళలా తెలుసు, మరి ఆయన మార్చడు. (మలాకీ 3:6) లోకం దాని తుది నాశనానికి ఎంతో దగ్గరకు వస్తుందన్నది వాస్తవమే. మెలకువగా ఉండవలసిన అవసరత ముందెన్నటికంటే నేడు ఎక్కువ క్లిష్టతరంగా ఉంది. యెహోవా మనకు ‘త్వరలో సంభవింపనైయున్న సంగతులను’ తెలియజేశాడు, మరి మనం అత్యవసరత యొక్క పూర్తి భావంతో ప్రతిస్పందించాలి.—ప్రకటన 1:1; 11:18; 16:14, 16.
16 సాతాను విధానం మొత్తంపై యెహోవా నాశనం తీసుకు రాబోతున్నాడు గనుక, సమయం దగ్గర పడుతుండగా మెలకువగా ఉండండి! (యిర్మీయా 25:29-31) యెహోవా ఇలా చెబుతున్నాడు: “నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసికొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.” (యెహెజ్కేలు 38:23) నిర్ణయాత్మకమైన ఈ “యెహోవా దినము” దగ్గరకు వస్తుంది!—యోవేలు 1:15; 2:1, 2; ఆమోసు 5:18-20; జెఫన్యా 2:2, 3.
నీతియుక్తమైన “క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి”
17, 18. (ఎ) యేసు మరియు పేతురు చెప్పినదాని ప్రకారం, “యీ తరము” ఎలా గతించిపోతుంది? (బి) ప్రవర్తన మరియు దైవభక్తి క్రియలను గురించి మనం ఎందుకు మెలకువగా ఉండాలి?
17 ‘జరుగ వలసిన వీటన్నిటి’ గురించి యేసు ఇలా చెప్పాడు: “ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.” (మత్తయి 24:34, 35) “యీ తరము” యొక్క ‘ఆకాశము భూమి’—పాలకులు మరియు పాలించబడే వారు—యేసు మనస్సులో ఉన్నారని చెప్పవచ్చు. “భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై” ఉన్నాయని చెప్పిన ‘ఇప్పుడున్న ఆకాశమును భూమిని’ గురించి సూచిస్తున్నప్పుడు అపొస్తలుడైన పేతురు అటువంటి మాటలనే ఉపయోగించాడు. “ప్రభువు [“యెహోవా,” NW] దినము” ఎలా ‘దొంగవచ్చినట్లు వచ్చును,’ అవినీతికరమైన మానవ వ్యవస్థ లేక “భూమి” దాని పాపభరిత కార్యాలతోపాటు “ఆ దినమున [ప్రభుత్వపరమైన] ఆకాశములు,” ఎలా ‘గతించి పోవునో’ ఆయన తర్వాత వివరిస్తున్నాడు. “ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు [మనం కలిగివున్నట్లే] పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను” అని అపొస్తలుడు మనలను ప్రోత్సహిస్తున్నాడు. తర్వాత ఏమిటి? పేతురు మన అవధానాన్ని ‘నీతి నివసించు క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి’ వైపుకు మళ్లిస్తున్నాడు.—2 పేతురు 3:7, 11-13.c
18 క్రీస్తుయేసు మరియు ఆయన తోటి రాజుల రాజ్యపరిపాలన అయిన ఆ “క్రొత్త ఆకాశములు,” నీతియుక్తమైన “క్రొత్త భూమి” అయిన మానవజాతి సమాజంపై దీవెనలను కుమ్మరిస్తాయి. మీరు ఆ సమాజపు బావి సభ్యులా? ఒకవేళ అవునైతే, రాబోవు గొప్ప భవిష్యత్తును గురించి సంతోషించగల కారణం మీకు ఉంది!—యెషయా 65:17-19; ప్రకటన 21:1-5.
19. మనం ఇప్పుడు ఏ గొప్ప ఆధిక్యతను అనుభవించగలము?
19 అవును, మానవజాతి యొక్క ఒక నీతియుక్తమైన “తరము” నేడు కూడా సమకూర్చబడుతుంది. యెహోవా మనకు ఇచ్చే ప్రోత్సాహానికి అనుగుణ్యంగా నేడు అభిషేకించబడిన “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు,” “నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి . . . యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను . . . వారి పిల్లలకు మేము చెప్పెదము” అని అంటున్న కీర్తన 78:1, 4 నందలి మాటలకు అనుగుణ్యంగా దైవీక విద్యాబోధను అందిస్తున్నాడు. (మత్తయి 24:45-47) ఈ సంవత్సరం ఏప్రిల్ 14న, 230 దేశాల్లో 75,500 కంటే ఎక్కువ సంఘాల్లో 1,20,00,000 కంటే ఎక్కువమంది వ్యక్తులు భూవ్యాప్తంగా క్రీస్తు మరణ జ్ఞాపకార్ధ దినానికి హాజరయ్యారు. మీరు వారిలో ఉన్నారా? మీరు మీ విశ్వాసాన్ని క్రీస్తుయేసుపై నిలిపి, ‘రక్షణకొరకు యెహోవా నామమునుబట్టి ప్రార్థనచేయండి.’—రోమీయులు 10:10-13.
20. “కాలము సంకుచితమై యున్నది” గనుక మనం ఎలా మెలకువగా ఉండాలి, మరి ఏ ఉత్తరాపేక్షను మనస్సులో ఉంచుకోవాలి?
20 “కాలము సంకుచితమై యున్నది” అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. మానవజాతి యొక్క దుష్ట తరము చేత వచ్చే కష్టాలూ ద్వేషాన్ని సహిస్తూ, ఎప్పుడూ మెలకువగా ఉంటూ, యెహోవా పనిలో ఎల్లప్పుడూ పని కలిగి ఉండవలసిన సమయమిది. (1 కొరింథీయులు 7:29; మత్తయి 10:22; 24:13, 14) “యీ తరము”పై వస్తాయని బైబిలులో ముందే చెప్పబడిన సంగతులన్నింటినీ గమనిస్తూ, మనం ఎప్పుడూ మెలకువగా ఉందాము. (లూకా 21:31-33) ఈ సంగతులను తప్పించుకోవడం ద్వారా మరి మనుష్యకుమారుని ఎదుట దైవిక అంగీకారంతో నిలబడుట ద్వారా, మనం తుదకు నిత్యజీవమనే బహుమానాన్ని పొందగలం.
[అధస్సూచీలు]
a “ఏడు కాలముల”ను గూర్చిన విస్తృత సమాచారం కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ఇన్‌కార్పొరెటెడ్ వారు ప్రచురించిన “నీ రాజ్యము వచ్చు గాక” (ఆంగ్లం) అనే పుస్తకంలో 127-39, 186-9 పేజీలు చూడండి.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ఇన్‌కార్పొరేటెడ్ వారిచే ప్రచురింపబడిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే సంపుటి 1, పేజీ 918 చూడండి.
c వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ఇన్‌కార్పొరేటెడ్ వారిచేత ప్రచురింపబడిన మన రాబోవు ప్రపంచ ప్రభుత్వం—దేవుని రాజ్యం (ఆంగ్లం) అనే పుస్తకంలో 152-6 మరియు 180-1 పేజీలను కూడా చూడండి.
పునఃసమీక్షా ప్రశ్నలు:
◻ దానియేలు 4:32 యొక్క నెరవేర్పును గమనించిన వారమై మనం ఇప్పుడు ఎలా “మెలకువ కలిగి ఉండాలి”?
◻ మత్తయి మరియు లూకా సువార్తలు “యీ తరము”ను ఎలా గుర్తించారు?
◻ మనం ‘ఆ దినము, ఆ గడియ’ కొరకు ఎదురు చూస్తుండగా, మనం ఏమి గమనిస్తాము, మరి మనం ఎలా ప్రతిస్పందించాలి?
◻ “క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి” యొక్క ఉత్తరాపేక్ష మనమేమి చేయడానికి మనల్ని ప్రోత్సహించాలి?
[17వ పేజీలోని చిత్రాలు]
ఈ దౌర్జన్యపూరితమైన, దుష్ట తరం గతించినప్పుడు బాధను అనుభవిస్తున్న మానవాళి ఉపశమనం పొందుతుంది
[క్రెడిట్ లైను]
Alexandra Boulat/Sipa Press
[క్రెడిట్ లైను]
Left and below: Luc Delahaye/Sipa Press
[18వ పేజీలోని చిత్రం]
మానవజాతిలోని తెగలన్నిటి కొరకు మహిమాన్వితమైన “క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి” సమీపంలో ఉన్నాయి